జూన్ 5, 2008

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౪

Posted in అనుభవాలు, ట్రెక్, సంగతులు, హిమాలయాలు వద్ద 5:52 సా. ద్వారా Praveen Garlapati

ట్రావెలాగుడు ౩ నుంచి కంటిన్యూ….

రెండో కాంపు “ఫౌలా పానీ” కి చేరుకున్నాము. చలి కొద్దిగా మొదలయింది. నడుస్తున్నప్పుడు, పగలు పూట బానే ఉండేది కానీ కాంపుకి చేరి కొద్దిగా సాయంత్రం అయేసరికి చలి మొదలయేది. చేతులు కడగడానికి పైపు (కుళాయి కాదు. అక్కడ పారే సెలయేటిలో ఓ పైపుంచితే నీళ్ళే నీళ్ళు.) కింద చెయ్యి పెడితే నాలుగైదు నిముషాల వరకూ మళ్ళీ స్వాధీనం లోకి వచ్చేది కాదు.

మనం తిన్న పళ్ళెం, గ్లాసయినా కనీసం కడగాల్సిందేనాయే… (ఒకట్రెండు రోజులు కడక్కుండా అలాగే వాడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి 🙂 )
అదేం చిత్రమో కానీ పైకెళుతున్న కొద్దీ తిండి రుచిగా అనిపించడం మొదలెట్టింది. రోజంతా నడవడం వల్లనేమో.

ఆ రోజు కాంప్ ఫైర్ భలే జరిగింది. పై కాంపులకెళుతున్న కొద్దీ జనాలెవరూ కాంప్ ఫైర్ కి ఇష్టపడలేదు. ఒక్కసారి స్లీపింగు బాగులో దూరితే బయటకొచ్చే కొశ్చెనే లేదన్నమాట. 🙂
కానీ ఆ కాంపు లీడరు పాపం చేసుకుందామంటే మా టెంటు అరువిచ్చాం. ఓ ముప్ఫై మంది దూరారు. ఇక పాటలు రాని వాళ్ళు పాటలు పాడి, డాన్సు రాని వాళ్ళు డాన్సు చేసి కాంపు ఫైరు చేసారు. ఫైరు కోసం మా టెంటులోని టార్చ్ వెలిగించారు లెండి.

మరుసటి రోజు ఉదయం లేచాను. కొద్దిగా సిగ్గుపడి ఓ అరగంట ముందే లేచాను ఓపెన్ డౌన్లోడ్ కోసం.
బాగా చలిగా ఉంది. పొద్దు పొద్దున్నే నేమో చుట్టు పక్కల సీనరీలు అదిరిపోతున్నాయి. తెల తెల వారుతోంది. చుట్టూ చెట్లు, అడవి.
ఇక ప్రకృతి ఆరాధన చేస్తూ ప్రకృతి పిలుపుకి సమాధానమిచ్చాను 🙂 (చెప్పుకోవద్దూ ఊళ్ళలో పొద్దున్నే చెంబట్టుకుని వెళ్ళే జనాలే గుర్తొచ్చారు)

ఇక మళ్ళీ మూడో కాంపు “జిర్మీ” కేసి ట్రెక్కు మొదలెట్టాము.
ఓ చోట పెద్ద గుట్ట మంచుతో కప్పబడి ఉంటే జర్రున జారుతూ కాసేపు ఎంజాయ్ చేసారు జనాలు. తర్వాత ఇంకో చిన్న మంచు ముక్క కనబడితే అందులో టగ్గాఫ్ వారు ఆడారు, జట్లుగా ఏర్పడి మంచుతో ఒకరి మీద ఒకరు యుద్ధాలు ప్రకటించారు.
అరే ఎంత బాగుందో ఇక్కడే ఆడుకుందామనిపించింది జనాలకి. అయ్యరు అప్పటికే చిందులు తొక్కడంతో జనాలు ముందుకు కదిలారు. అయ్యరు వరుణ్ మీద కొరడా ఝళిపిస్తూనే ఉన్నాడు. అలా వెళ్ళకు, అందరి కన్నా ముందుండాలి, గైడు చెయ్యట్టుకు నడవాలి….

దారిలో కొన్ని జంతువులు దర్శనమిచ్చాయి.

మధ్యలో ఓ చిన్న గ్లేషియర్ కనిపిస్తే దాని వెనక నక్కి జనాలందరినీ మంచు కి బలిచేసాము.

సరదాగా సాగింది ప్రయాణం. నెమ్మదిగా “జిర్మీ” కి చేరుకున్నాము. బాగా చలిగా ఉంది.
అక్కడి కాంపు లీడరు మాకు స్వాగతం పలికి టీ రెడీగా ఉంచాడు.

కాసేపయాక మా వాళ్ళు కాస్త దమ్ము లాగుతామంటే సరే కాసిని సీనరీలు చూడచ్చు కదా అని నేనూ బయలుదేరాను. వాళ్ళు ఓ దగ్గర ఆగి దమ్ము లాగడం మొదలుపెట్టారు. నేను అలా చెట్లూ అవీ చూస్తూ కొద్దిగా ముందుకెళ్ళాను. మా వాళ్ళు కాంపు లీడరు గనక వస్తే వారించమన్నారు (కాంపులో దమ్ము కొట్టకూడదు). సరే అని నేను ఓ రెండు ఫోటోలు తీసుకున్నాను.

ఎందుకో మరి ఆ లోపల వాళ్ళు పై నుంచి అరిచారు. నాకు సరిగా వినపడలేదు. వినపడేసరికి చూస్తే అక్కడున్న ఒక ఎద్దు ఒకటి వేగంగా ఎదురొస్తుంది. (ఒక క్షణం ఫోటో తీద్దామా అని ఆగాను 🙂 అంతలో బుద్ధి వెనక్కొచ్చి చటుక్కున పక్కకి తప్పుకున్నాను)

అది కిందకెళ్ళి మిగతా ఎద్దులతో పోట్లాట మొదలెట్టింది. సరే అని ఆ ఫోటోలే తీసుకున్నాను.

ఇక అక్కడుండడం శ్రేయస్కరం కాదని వెనక్కెళ్ళి కాంపు లీడరు చెప్పే కథలు వింటున్నాము. భలే విశేషాలు చెప్పాడు అక్కడి జనాల గురించి. అక్కడి జనాలలో తొంభై శాతం పైన ప్రేమ వివాహాలని, చాలా మంది పదహారేళ్ళు వచ్చేసరికే పెళ్ళి చేసేసుకుంటారనీ తెలిసింది. అక్కడి ప్రజల గురించి, వారి తిండి, పంటలు, ఇళ్ళ నిర్మాణం గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు

అతనితో మాట్లాడుతూ ఉంటే తెలిసింది మరుసటి రోజు పూర్తిగా మంచులో ప్రయాణించాల్సి ఉంటుందని. అదీ కాక ఈ సారి పోయిన నలభయ్యేళ్ళలోనే ఎక్కువ మంచు కురుస్తుందనీ చెప్పాడు.
భలే థ్రిల్లింగుగా అనిపించింది.

అందరమూ గజ గజ వణుకుతూ వచ్చే రోజు కోసం వెయిటింగు.

వచ్చే రోజు ఉదయం చలి చాలా ఎక్కువగా ఉంది. పొద్దున్నే జనాలు ఓ అరగంట లేటుగా లేచి ఇంకా స్లీపింగు బాగులలోనే తొంగుంటున్నారు. అందరూ పక్కనోడి కేసి చూడడం అన్నమాట. ఇంకా వీడు లేవలేదు కదా అని మళ్ళీ వాడు కూడా ముసుగెయ్యడం.
ఎలాగయితే ఓ గంట లేటుగా లేచారు మా టెంటు జనాలు (మమ్మల్నొదిలేసి వెళ్ళిపోతామని బెదిరించడంతో…)

పళ్ళు జిల్లనిపించుకుని, టీ తాగి మళ్ళీ మంచు విషయం గుర్తుకొచ్చి ఉత్సాహంగా బయలుదేరాము. బయలుదేరిన కొద్ది సేపట్లోనే మంచు ముక్కలు ముక్కలుగా చాలా చోట్ల తగిలింది.

వెళుతున్న కొద్దీ పూర్తి మంచు ఎడారిలా అయిపోయింది. ఇక చుట్టుపక్కల నేలన్నది కనిపించడం లేదు. మొత్తం తెల్ల దుప్పటి కప్పినట్టు దట్టంగా మంచు.

అలా మేము నడుస్తుండగానే వర్షం మొదలయింది. అందరూ తడిచిపోయారు మొత్తం తల నుంచి పాదాల దాకా.

కొందరి బూట్లు వాటర్ ప్రూఫ్ కాకపోవడంతో నీళ్ళు లోపలికెళ్ళిపోయాయి. సాక్సులు అన్నీ తడిగా మారాయి.విపరీతమయిన చలి వెన్నులోంచి పుట్టుకొస్తుంది. అందరూ వణికిపోతున్నారు.

కాళ్ళు మంచులో పట్టు జారిపోతున్నాయి. కొంత మేర కొండ ఎక్కాల్సి ఉంది. బురద బురదగా తయారయింది. జారిపోతూ ఉంది. నడుస్తున్నాము.
ఎక్కడయినా ఆగుదామంటే అసలక్కడ కనుచూపు మేరలో కూడా ఏమీ లేదు. అంతా మంచే. ఇక ముందుకు నడవాల్సిందే. గైడేమో అయ్యరు తొందరపెట్టడంతో ముందుకెళ్ళిపోయాడు.

సరే అని దూరంలో కనిపిస్తున్న ఎర్ర బాక్ పాక్ లను ఆనవాలుగా పెట్టుకుని ముందుకి నడుస్తున్నాము ఆ వర్షంలో. ఏదో మంచంటే భలే సరదాపడ్డాము కానీ అంత చలి అసలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. అలా ఓ గంటా గంటన్నర నడిచి ఉంటాము. ఎట్టకేలకు మా లంచ్ కోసం ఉంచబడిన టెంటు కనిపించింది.

హమ్మయ్య అని కూలబడ్డారు జనాలు. చిన్న ప్లాస్టిక్ టెంటులో యాభై మందీ కూలబడ్డారు ఒకరి మీద ఒకరు. చెప్పలేనంత చలి. దానికి తగినంతగా ఎవరూ సిద్ధమయి రాలేదు. నేనేదో పల్చటి జాకెట్ ఒకటి వేసుకుని ఉన్నాను. థెర్మల్స్ అసలే తీయలేదు. అలా ఎంత సేపు గడచిందో కూడా తెలియట్లేదు. వాన బాగా ఎక్కువయిపోయింది. జనాలు చలికి తట్టుకోలేక బీడీలు కూడా బయటకు తీసారు.

మీరు నమ్మరు కానీ చలికి తట్టుకోవడానికి మొదటి సారి సిగరెట్టు, బీడీ తాగిన జనాలున్నారు ఆ రోజున. ఇంకో అంకులు తన బాగులో నుంచి ఓ చిన్న బాటిలు తీసి ఓ పెగ్గేసాడు ఎవరూ చూడకుండా. ఏమీ తాగని మా లాంటి మంచి వాళ్ళు వాళ్లని చూస్తూ నిట్టూర్చారు.

ఎట్టకేలకు ఓ గంటన్నర తరవాత వర్షం నెమ్మదించింది. పూర్తిగా తగ్గకపోయినా ఇక బయలుదేరక తప్పదు. ముందుకెళుతున్న కొద్దీ వర్షం తగ్గింది కానీ మంచు పడడం మొదలయింది. చలి షరా మామూలే…
మంచు అలా పడుతూనే ఉంది మేము నడుస్తున్నాము. ఇక మా కాంపు “తిలాలోట్నీ” దగ్గరలోనే ఉందని చెప్పాడు మా గైడు.

సరే అని మేము నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాము. మా గుంపులో ఒకతనికి తలనొప్పి, కళ్ళు తిరుగుతుండడంతో ఆగాము. అంత త్వరగా నడవలేని వారందరితో కలిసి నెమ్మదిగా నడుస్తున్నాము కాసేపయిన తరువాత. మంచు దట్టంగా మారి తుఫానయింది. విపరీతంగా కురుస్తుంది. కాసేపయే సరికి ఓ కొండ అంచు మీద నుంచి దాటాల్సొచ్చింది.
అసలు ముందు కొన్ని అడుగుల దూరం కూడా కనిపించడం లేదు ఆ దట్టమయిన మంచుకి. వెనకాల మిగిలిన మా అందరికీ గుభేలుమంది కాసేపు. మంచు కూడా కొంత జారుతూ ఉంది. అడుగులో అడుగేస్తూ నెమ్మదిగా నడుస్తున్నాము భయం భయంగా… (నిజం చెప్పాలంటే నాకు పెద్దగా భయం వెయ్యలేదు. కానీ అది చెబితే జనాలెలాగూ నమ్మరుగా :)‌ )

కొద్దిగా వయసయిన వారికి, ఆడవారికి సహాయం చేస్తున్నాము నేనూ, హర్షద్, హర్ష…
మా గైడు మాకోసం వెనక్కొచ్చాడు. చాలా సేపు పట్టేస్తోంది అక్కడ, ఎందుకంటే ఎవరినీ దాటుకుని ముందుకెళ్ళలేము. అసలు ఒక్కరు నడవడానికే కష్టంగా ఉంది. అదీ జనాలు పొద్దున్న, మళ్ళీ ఇప్పుడు అనుభవాలతో కొంత గుబులుగా ఉన్నారు.

మధ్యలో మాతో పాటు వస్తున్న మంగళ అనే డాక్టరు కాస్తా పట్టు తప్పి ఆ అంచు నుంచి ఓ ముప్ఫై అడుగులు జారిపోయారు. గైడు కష్టపడి ఆవిడని పైకి తీసుకొచ్చాడు. ఇక ఎలా దాటామో మాకే తెలీదు. మొత్తానికి ఆవల చేరాము.
అది దాటిన తరువాత ఇంకొద్ది దూరం నడిచిన తరువాత మా కాంపు కనబడింది.

దానిని చేరేంతలో మంచు పడడం బాగా తగ్గిపోయింది (అన్నట్టు అక్కడ వాతావరణం నిముషాల్లో మారిపోతుంది. మంచు పడడం ఇంకాసేపట్లోనే ఎండ. అదీ కాక బాగా సన్ బర్న్ అవుతుంది. నేను అంతగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా నా ముఖం అంతా సన్ బర్న్ అయిపోయింది.).

పూర్తిగా మంచులో కప్పబడి ఉన్న కాంపు ఎంతో అందంగా బాగుంది. మధ్యలో టెంట్లు.

మొత్తానికి బాగా తడచిపోయిన బట్టలు, బూట్లతో ఆ కాంపు చేరి వెంటనే వెచ్చని బట్టల్లోకి మారాము. వులెన్ గ్లోవ్స్, థెర్మల్స్ వేసుకుంటే గానీ శరీరం కొద్దిగా అదుపులోకి రాలేదు. కానీ ఆ రోజు జరిగిందంతా తలచుకుంటే భలే థ్రిల్లింగుగా, ఎక్సైటింగుగా అనిపించింది. జీవితంలో అసలు మరచిపోలేని అనుభవాలవి. కొంత మంది జనాలయితే బాగా భయపడ్డారు కూడా.

ఆ రాత్రంతా ఆ చర్చలతోనే సాగింది. ఒక్కొక్కరి అనుభవాలు చెప్పుకుంటూనే రాత్రి గడచిపోయింది. వచ్చే రోజే “సర్ పాస్” చేరతాము. అది మేము చేరవలసిన ఎత్తయిన మజిలీ అన్నమాట (13800 అడుగుల ఎత్తులో ఉంటుంది). ఇక దాని గురించి కాసేపు చర్చించుకుని నిద్దరోయాము.

వచ్చే టపాతో ఈ ట్రావెలాగుడుని పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను… మీకందరికీ విముక్తి 🙂

ప్రకటనలు

22 వ్యాఖ్యలు »

 1. Kathi Mahesh Kumar said,

  చిన్నప్పుడు తెలుగు పాఠాలలో నాయని కృష్ణకుమారి (అనుకుంటా) గారి ‘కాశ్మీర దేశ యాత్ర’ అనే ఒక ట్రావెలాగ్ బలవంతంగా చదివాను. ఆ తరువాత జీవితంలో వీటి జోలికి పోలేదు. మీ వర్ణనలు చదువుతూ, ఫోటో లు తిలకిస్తూఉంటే, అక్కడక్కాడా మీ పక్కన నడుస్తున్నట్టూ, మరికొన్ని చోట్ల మీరు గైడై మాకు వివరిస్తున్నట్టూ ఉంది.

  బహుశా ఈ ట్రెకింగ్ నేను చెయ్యనేమోగానీ, అనుభవాన్ని మాత్రం మీరు పంచేస్తున్నారు. ధన్యవాదాలు.

 2. చిన్నప్పుడు తెలుగు పాఠాలలో నాయని కృష్ణకుమారి (అనుకుంటా) గారి ‘కాశ్మీర దేశ యాత్ర’ అనే ఒక ట్రావెలాగ్ బలవంతంగా చదివాను. ఆ తరువాత జీవితంలో వీటి జోలికి పోలేదు. మీ వర్ణనలు చదువుతూ, ఫోటో లు తిలకిస్తూఉంటే, అక్కడక్కాడా మీ పక్కన నడుస్తున్నట్టూ, మరికొన్ని చోట్ల మీరు గైడై మాకు వివరిస్తున్నట్టూ ఉంది.బహుశా ఈ ట్రెకింగ్ నేను చెయ్యనేమోగానీ, అనుభవాన్ని మాత్రం మీరు పంచేస్తున్నారు. ధన్యవాదాలు.

 3. మేధ said,

  ఏంటి, అంత తొందరగా పూర్తి చేస్తున్నారా…??!!! నేను ఇంకా కనీసం, ఒక పది టపాలన్నా రాస్తారేమో అనుకున్నాను..! చాలా బాగా వ్రాస్తున్నారు. నాకు మీది చదువుతున్నంతసేపు నేను వెళ్ళలేకపోయానే అని బాధ పీకుతూనే ఉంది.. 😦

 4. మేధ said,

  ఏంటి, అంత తొందరగా పూర్తి చేస్తున్నారా…??!!! నేను ఇంకా కనీసం, ఒక పది టపాలన్నా రాస్తారేమో అనుకున్నాను..! చాలా బాగా వ్రాస్తున్నారు. నాకు మీది చదువుతున్నంతసేపు నేను వెళ్ళలేకపోయానే అని బాధ పీకుతూనే ఉంది.. 😦

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @mahesh గారు:
  కృతజ్ఞతలు. ఆ అనుభవం మీకు కలిగించానంటే నా ఉద్దేశం నెరవేరినట్టే.

  @మేధ గారు:
  మరీ ఎక్కువగా చెబితే ఇంక జనాలు ట్రెక్కుకి వెళ్ళి అనుభవించడానికి ఏం మిగులుతుంది 🙂

  మీరు వచ్చే ఏడాది తప్పక వెళుదురుగాని.

 6. @mahesh గారు:కృతజ్ఞతలు. ఆ అనుభవం మీకు కలిగించానంటే నా ఉద్దేశం నెరవేరినట్టే.@మేధ గారు:మరీ ఎక్కువగా చెబితే ఇంక జనాలు ట్రెక్కుకి వెళ్ళి అనుభవించడానికి ఏం మిగులుతుంది :)మీరు వచ్చే ఏడాది తప్పక వెళుదురుగాని.

 7. రవి said,

  ఓపెన్ డౌన్లోడ్ …ఈ ముక్క చదివి ముందుకెళ్ళి, మళ్ళీ వెనక్కొచ్చి అర్థం చేసుకున్నాను. 🙂

  ఏదో పాత పుస్తకం లో చదివాను. ఆ ఎద్దు పేరు నీల్ గాయ్ అనుకుంటా..

  మీకు ఆ వర్శంలో వేడి పకోడీలు తినాలి అని అనిపించలేదా?

 8. రవి said,

  ఓపెన్ డౌన్లోడ్ …ఈ ముక్క చదివి ముందుకెళ్ళి, మళ్ళీ వెనక్కొచ్చి అర్థం చేసుకున్నాను. :-)ఏదో పాత పుస్తకం లో చదివాను. ఆ ఎద్దు పేరు నీల్ గాయ్ అనుకుంటా..మీకు ఆ వర్శంలో వేడి పకోడీలు తినాలి అని అనిపించలేదా?

 9. meenakshi.a said,

  hi praveen ji.
  ee post chadivaka gattiga narnayinchukunna trecking ki vellalani.
  nice pics……
  adrushtavantulu.mottaniki baane enjoy chesaru.

 10. meenakshi.a said,

  hi praveen ji.ee post chadivaka gattiga narnayinchukunna trecking ki vellalani.nice pics……adrushtavantulu.mottaniki baane enjoy chesaru.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @రవి:
  హహహ…
  ఓ. నీల్ గాయ్ పేరు భలే ఉందే. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  అవును ఇంతకీ నేను చెప్పనేలేదు కదూ, మేము ఆ రోజు బాగా తడిచి, వణుకుతూ ఆ కాంపుకి వెళ్ళామా ? ఆ కాంపు లీడరు మా కోసం నిజంగానే పకోడీలు చేయించిపెట్టాడు 🙂

  @meenakshi:
  ఊ కానీండి… నా టపా ద్వారా ఎంత మందిని ప్రోత్సాహించగలిగితే అంత మంచిది.

 12. @రవి:హహహ…ఓ. నీల్ గాయ్ పేరు భలే ఉందే. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.అవును ఇంతకీ నేను చెప్పనేలేదు కదూ, మేము ఆ రోజు బాగా తడిచి, వణుకుతూ ఆ కాంపుకి వెళ్ళామా ? ఆ కాంపు లీడరు మా కోసం నిజంగానే పకోడీలు చేయించిపెట్టాడు :)@meenakshi:ఊ కానీండి… నా టపా ద్వారా ఎంత మందిని ప్రోత్సాహించగలిగితే అంత మంచిది.

 13. రానారె said,

  భయం లేదంటే నమ్మరు జనాలు నిజమే! 🙂 కానీ నమ్మించేలా చెప్పడమెలాగో ఆ విద్య నువ్వు సాధించినట్లేవుంది. 🙂

  భయపడుతున్నామా లేక దుస్సాహసం చేస్తున్నామా అనిపించిన ఘటనలు నాకూ కొన్ని గుర్తొచ్చాయి. ట్రెక్కు వెళ్లడం వరకే కదా అయింది. అంటే సగమే కదా!? మరి ఒకే భాగంలో మిగతా సగం ముగించేస్తావా?

 14. భయం లేదంటే నమ్మరు జనాలు నిజమే! 🙂 కానీ నమ్మించేలా చెప్పడమెలాగో ఆ విద్య నువ్వు సాధించినట్లేవుంది. 🙂 భయపడుతున్నామా లేక దుస్సాహసం చేస్తున్నామా అనిపించిన ఘటనలు నాకూ కొన్ని గుర్తొచ్చాయి. ట్రెక్కు వెళ్లడం వరకే కదా అయింది. అంటే సగమే కదా!? మరి ఒకే భాగంలో మిగతా సగం ముగించేస్తావా?

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @రానారె:
  ముగించేద్దామనే అనుకున్నాను. మొదలెట్టాక కానీ తెలీలేదు అయేట్టు లేదని…
  ఇంకొక టపా చెయ్యక తప్పేట్లు లేదు.

 16. @రానారె:ముగించేద్దామనే అనుకున్నాను. మొదలెట్టాక కానీ తెలీలేదు అయేట్టు లేదని…ఇంకొక టపా చెయ్యక తప్పేట్లు లేదు.

 17. కొత్త పాళీ said,

  ప్రవీణ్! ఈ ఘట్టం అన్నిటికంటే సూపరు. ఫొటోలు ఇంకా సూపరు. ఒక కొశ్చెను – పడూకునే టెంట్లు మీరు కాంపు చేరేసరికి వేసి ఉంచేవారా? మీరే వేసుకుని మళ్ళీ తియ్యాల్సి వచ్చేదా?
  @రవి.. నీల్ గాయ్ అంటే ఇది కాదనుకుంటా. అదొక జింక/దుప్పి లాంటి జంతువు. రాజస్థాన్ వేపు ఉంటాయి.

 18. ప్రవీణ్! ఈ ఘట్టం అన్నిటికంటే సూపరు. ఫొటోలు ఇంకా సూపరు. ఒక కొశ్చెను – పడూకునే టెంట్లు మీరు కాంపు చేరేసరికి వేసి ఉంచేవారా? మీరే వేసుకుని మళ్ళీ తియ్యాల్సి వచ్చేదా?@రవి.. నీల్ గాయ్ అంటే ఇది కాదనుకుంటా. అదొక జింక/దుప్పి లాంటి జంతువు. రాజస్థాన్ వేపు ఉంటాయి.

 19. రవి said,

  అమ్మా., తూచ్..నేనుప్పుకోనంతే…:-)
  ఏదో హిమాలయాలపైన పుస్తకం చదివి గూట్లో రాయేసా…తగిలిందని ఆనందిస్తా ఉంటే కొత్తపాళీ వచ్చి, తన పాళీ తో పొడిచాడు 😦 వా…

 20. రవి said,

  అమ్మా., తూచ్..నేనుప్పుకోనంతే…:-)ఏదో హిమాలయాలపైన పుస్తకం చదివి గూట్లో రాయేసా…తగిలిందని ఆనందిస్తా ఉంటే కొత్తపాళీ వచ్చి, తన పాళీ తో పొడిచాడు 😦 వా…

 21. ప్రవీణ్ గార్లపాటి said,

  @ కొత్త పాళీ గారు:
  కాంపులు, అందులో టెంట్లు ట్రెక్కు జరిగిన ఆ నెల నాళ్ళూ (రోజుకో జట్టు) అలాగే ఉంటుంది.

  కాంపులో లీడరు కూడా దానితో పాటే అక్కడే మకాం. కాకపోతే వాలంటరీగా చేసే పని కాబట్టి వీలుని బట్టి ఒక్కో కాంపు లీడరు పది రోజుల వరకూ ఉంటుంటారు.

  @ రవి:
  అచ్చికచ్చిక…‌:) అమ్మా నాకు తెలీని విషయం మీకు తెలుసా లేకపోతే 😉

 22. @ కొత్త పాళీ గారు:కాంపులు, అందులో టెంట్లు ట్రెక్కు జరిగిన ఆ నెల నాళ్ళూ (రోజుకో జట్టు) అలాగే ఉంటుంది. కాంపులో లీడరు కూడా దానితో పాటే అక్కడే మకాం. కాకపోతే వాలంటరీగా చేసే పని కాబట్టి వీలుని బట్టి ఒక్కో కాంపు లీడరు పది రోజుల వరకూ ఉంటుంటారు.@ రవి:అచ్చికచ్చిక…‌:) అమ్మా నాకు తెలీని విషయం మీకు తెలుసా లేకపోతే 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: