జూన్ 15, 2008

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౫

Posted in అనుభవాలు, ట్రెక్, సంగతులు, హిమాలయాలు వద్ద 3:52 సా. ద్వారా Praveen Garlapati

ఈ టపాతో ముగించేస్తానని చెప్పాను గానీ ఈ టపా అంతా ఒకే రోజు గురించి చెప్పాల్సి వచ్చేటట్టుంది…

అసలు చలి అంటే ఏంటో తెలిసొచ్చిన రాత్రి “తిలాలోట్నీ” లో గడిపినది. ఏదో బెంగుళూరు చలి తప్ప పెద్దగా చలి అనుభవం లేదాయే… (ఇంతకు ముందు కేదార్‌నాథ్ యాత్ర చేసినప్పుడు తప్ప)

ఆ తడిచిన బట్టలు వదిలేసిన తరువాత వెచ్చగా అనిపించినా తొందర్లోనే మళ్ళీ చలి మొదలయింది. కనిపించిన జాకెట్టూ, గ్లవ్స్, వులెన్ సాక్సూ వగయిరా లన్నీ వంటి మీద ఉంచుకుంటే గానీ తట్టుకోలేకపోయాము.

అదీ కాక సాయంత్రం ఆగిపోయిన మంచు కాస్తా చీకటి పడుతుండేసరికి మళ్ళీ మొదలు. అవును అన్నట్టు చెప్పడం మరచిపోయాను. మంచు ఎప్పుడూ చూడని వారికి మొదటి “స్నో ఫ్లేక్స్ ” మీద పడే అనుభవం ఉంటుందే అది అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేనిది.

కొన్ని అనుభూతులు అలా మనతో ఉండిపోతాయి. వాటిలో ఇది కూడా ఒకటి.

సరే ఇక రాత్రి గడుస్తుండగా చలి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. లక్కు బాగుండి అక్కడ చక్కని స్లీపింగ్ బాగులు లభించాయి. వాటిలో దూరి కాసేపు వేడి కబుర్లు చెప్పుకుని నిద్రపోయాము.

అసలు నాకు అర్థం కానిదేమిటంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను పొద్దున్నయింతర్వాత కానీ నిద్రపోను, తొమ్మిదిన్నరకి కానీ నిద్ర లేవను. కానీ ఈ కాంపులలో మాత్రం రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రపొవడమే, ఉదయాన్నే ఐదున్నర ప్రాంతంలో నిద్ర లేవడమే. ఎలా సాధ్యమయిందో అర్థమే కాలేదు. (చెయ్యడానికి ఇంకేమీ లేకపోవడం మూలాన కాబోలు)

మరుసటి రోజు ఉదయం “సర్ పాస్” కేసి బయలుదేరాము. ఆ రోజు ఉదయం అందరికీ “యాస్ ఫ్రీజింగే” 🙂
కానీ ఉదయాన కనిపించిన దృశ్యాలు చూస్తుంటే అసలు కదలాలనిపించలేదు. పొరపాటున ఆ రోజు తొందరగా లేచినందుకు ఎంత భాగ్యం కలిగిందో అని మురిసిపోయాను.

ఆ రోజు ట్రెక్కుకి మామూలు రోటీ వగయిరాలు కాకుండా బిస్కెట్లు, కచోరీ లాంటి డ్రై ఐటెమ్స్ ఇచ్చారు.
పొద్దున్నే బయలుదేరాల్సింది కనీసం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాము ఆ రోజు, కాంపు లీడరుతో అక్షింతలు వేయించుకుని.
క్రితం రోజు అలవాటయింది కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు మంచులో నడవడం. అదీను ఆ రోజు వాన, మంచు కురవట్లేదు. కాబట్టి సాఫీగానే నడుస్తున్నాము. మేము ఉన్నది ఇంకొక కొండ, దాని మీద నుంచి మేము చేరాల్సిన “సర్ పాస్” కి వెళ్ళాలంటే కొంత దూరం దిగి మళ్ళీ ఎక్కాలి. సరదాగా సాగింది ప్రయాణం ఆరోజున. అదీ మేము చేరబోతున్న ప్రదేశం చేరుతున్నామనే ఉత్సాహంతో…

ఒక రెండు గంటలు నడవగానే చేరుకున్నాము “సర్ పాస్” కి. ఆ ప్రదేశం అని తెలియడానికి రాళ్ళతో మార్కు చేసారు అక్కడ.

నిజంగా అక్కడికి (13800 అడుగుల ఎత్తు) చేరుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. అసలు అరకిలోమీటరు దూరం కూడా రోజూ నడవని నేను (జిమ్ములో ట్రెడ్ మిల్ మీద పరిగెట్టడం వేరే విషయం) రోజుకి తొమ్మిది, పది కిలోమీటర్ల దూరం ఎత్తు పల్లాల మీద, మంచులో నడిచి ఆ ప్రదేశం చేరుకున్నానంటే నమ్మబుద్ధి కాలేదు. కాసేపు అక్కడ ఫోటోలు దిగాము.
అక్కడ నుంచి చూస్తే భూమి, ఆకాశం కలిసిపోయాయా అన్నట్టుగా అనిపించింది. మబ్బులకంటే పై ఎత్తులో ఉన్నాము మేము.

అన్నట్టు ఆ రోజున మాకు ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయండోయ్… (ఎలుగుబంటి మాత్రం కనబడలేదు 😦 )

అక్కడో‌ చిత్రమయిన సంఘటన జరిగింది. ఆ రోజుకి మాతో వస్తున్న గైడు దగ్గర ఒక “పిక్ ఆక్స్ ” ఉంది. నేను హీరోలా ఫోజు కొడదామని దానిని పట్టుకుని ఫోటో దిగడానికి ఆ కొండ అంచు దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ దానిని పట్టుకుని కొండ ఎక్కుదామని ఫోజు ఇవ్వడానికి ఆ అంచులో కొంత కిందున్న మంచులోకి కాలేసాను. అంతే అది నా మోకాలు దాకా దిగబడిపోయింది.
పిచ్చా అన్నట్టు అరిచాడు మా గైడు. వెంటనే తేరుకుని పైకొచ్చేసాను. ఇంకొంత అజాగ్రత్తగా ఉంటే పిక్ ఆక్స్ ని నిజంగా వాడాల్సిన అవసరం వచ్చేదేమో 😉

మళ్ళీ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే మా గ్రూపు లీడరుగా ఉన్న అతను (ప్రతీ ట్రెక్ చేసే గుంపూ ఒక లీడరు ని ఎన్నుకుంటారు తమ లో నుంచి. జనాలను టైముకి కదిలించడం, అందరూ ఉన్నారా లేదా, కలిసి వెళుతున్నారా లేదా అని అతను చూస్తాడన్నమాట) తన బాగులోనుంచి మువ్వన్నెల మన భారత జాతీయ పతాకం ఒకటి బయటకు తీసాడు.
అందరమూ కలిసి దానిని మంచులో పాతాము. జనగణమన గీతం పాడాము. కొందరు సిగ్గు పడ్డారు, మిగతా వాళ్ళము పాడాము. అదేంటో మన జాతీయ గీతం పాడుకునేందుకు సిగ్గెందుకో అర్థం కాలేదు.
అంత అందమయిన మన జెండా రెపరెపలాడుతుంటే ఛాతీ కొంత వెడల్పవదూ ?

అది అయిన తరువాత కొంత దూరంలో లంచ్ కోసం ఆగాము. మంచు పైనే ప్లాస్టిక్ షీటు ఒకటి పరచి దాని పైన కానిచ్చాము. అన్నట్టు నాకెందుకో ఒక వింత కోరిక కలిగింది. ఆ మంచులో అసలు స్వెట్టరు, గ్లవ్స్ గట్రాలు ఏమీ లేకుండా ఒక ఫోటో దిగాలని. ఇప్పుడు సిగ్గుపడితే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని ఒక ఫోటో అలా కానిచ్చేసా.

అన్నట్టు ఆ గాగుల్స్ ఏదో స్టైలుకి పెట్టినవి కాదండోయ్… అసలు నా మొహానికి గ్లాసులేవీ బాగుండవు, సూటవవు. కానీ మంచులో నడుస్తున్నప్పుడు కనుక అవి ధరించకపోతే కళ్ళకు ముప్పు. మంచు మీద పడిన యు.వి కిరణాలు పర్యావర్తనం చెంది మన కళ్ళకి హాని కలిగిస్తాయి. అందుకని ధరించక తప్పదు.

మేము లంచ్ ముగించాక నడక మొదలెట్టామో లేదో మా గైడు భలే చక్కని వార్త చెప్పాడు. పైకి చేరుకున్నాక ఇక చేసేదేంటి ? కిందికి దిగడమే… మరి మంచు ఉంటే ?? స్లైడింగే 🙂
హహ… అనుకోకుండా భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. సర్ పాస్ నుంచి కొద్ది దూరం నడిచిన తరువాత నుంచి ఒక మూడు స్లైడ్లు చేస్తే మేము వెళ్ళాల్సిన కాంపుకి వెళ్ళిపోతామని గైడు చెప్పాడు. (స్లైడంటే ఏదేదో ఊహించుకునేరు… స్కీలో, స్కేట్ బోర్డులో ఉండవు, స్లెడ్జీ ఉండదు. మనం కూర్చుని జారుడు బండ మీద జారినట్టు జుయ్యంటూ జారిపోవడమే… హహహ)

అంతకు ముందు రోజు ట్రెక్కులలో మేము చిన్న ప్రదేశం దొరికితేనే దాని మీద స్లైడు చేసి ఆడుకున్నాము. ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ (దిగువకి) స్లైడు చేసి జారిపోతే భలే బాగుండదూ ?
ఇక గబగబా నడిచేసి మొదటి స్లైడు దగ్గరికి చేరుకున్నాము. ఒకరిద్దరు కొంత భయపడ్డా నెమ్మదిగా ఒకరొకరుగా జారడం మొదలుపెట్టారు. నేను కూడా వెయిటింగు నా వంతు కోసం. శరీరం నిలువుగా ఉంచి, కర్రని తల వెనుకాల పట్టుకుని, బాగుని అటూ ఇటూ కాకుండా సర్ది జుయ్ఁ….

భలే భలే… కళ్ళు మూసి తెరిచేంతలో ఎంత వేగాన్నందుకున్నానో, అసలు భలే అనుభవం లెండి. ఆ వేగంలో ఏ కొద్దిగా బాలెన్సు తప్పినా తలకిందులుగానో, అడ్డదిడ్డంగానో కిందికొస్తాము. పెద్ద దెబ్బలేవీ తగలవనుకోండి. అది కూడా ఒక సరదా అనుభవం.

సమయం గడుస్తున్న కొద్దీ మళ్ళీ మంచు పడడం మొదలు. మొదటి స్లైడు చేసిన తరువాత కొంత దూరం నడవగానే మంచు దట్టంగా పడుతోంది. క్రితం రోజు జ్ఞాపకాలు వచ్చాయి జనాలకి. సరే అని వడి వడిగా నడవడం మొదలుపెట్టారు.
ఈ స్లైడింగు వల్ల చిక్కేమిటంటే మనం వేసుకున్న బట్టల మీదే జారడం వల్ల మీ వెనుక ప్రాంతమంతా తడి తడే… ఆరే ప్రసక్తే లేదు. అదే కాక స్లైడింగులో మంచు కాస్తా మీ బట్టల్లోకి దూరిపోతుంది. కాబట్టీ మళ్ళీ బట్టలంతా తడి తడి.

మంచు పడడంతోనే మళ్ళీ చలి మొదలయింది. అదీ జారడంతో కుడిన తడి వల్ల గజ గజ…
ఈ సారి మేము అందరికన్నా ముందుగా వెళ్ళిపోయాము. కొంత మంది మరీ నెమ్మదిగా వస్తున్నారు వెనుక. రెండో స్లైడు కొంచం దూరం తలకిందులుగా చేసిన తరువాత, మూడో స్లైడు మళ్ళీ బానే ఉంది. కాకపోతే తలకిందులుగా చేసిన స్లైడు వల్ల బట్టల్లో మొత్తంగా మంచు దూరిపోయింది.

మంచులో నీటి “స్ట్రీమ్‌” ఒకటి ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. ఉంది, జలజల పారుతోంది. ఎంత ఆశ్చర్యమో నాకు.

నాకు బాగా వణుకు మొదలయింది… చేతులకి వులెన్ గ్లవ్సే కాక, లెదర్ గ్లవ్స్ కూడా తొడిగాను. అప్పటికి కొంత ఆగింది. మిగతా పార్టులకి ఏమీ చెయ్యలేని పరిస్థితి. మూడో స్లైడు అయింతర్వాత దాదాపు మా గైడు సహచరులు కొంత ముందుగానే అక్కడ ఒక చిన్న మొబైల్ కాంటీను తయారు చేసారు. టీ, మాగీ గట్రా అమ్మడానికి.
మేము అందరికన్నా ముందుగా చేరుకోవడంతో అక్కడ ఇంకెవరూ లేరు. వారు టీ కాస్తున్న మంటతోనే మేము చలి కాచుకుంటున్నాము. ఒక మాగీ, టీ ఒకటి ఆర్డరు చేసాము. కాస్త వెచ్చబడ్డాము. గంట సేపు పైన గడిచినా ఇంకా ఎవరూ రారే…

అయ్యరు మేమొచ్చిన కాసేపటికే చేరాడు. ఇక చెప్పేదేముంది కాలు కాలిన పిల్లి మాదిరే. గైడు తలని ఎంతగా తిన్నాడంటే నీ చావు నువ్వు చావు అన్నట్టు వాడు మాకు ఒక దారి చూపించి దీని గుండా పొండి, మీకు కాంపు తగులుతుంది అని చెప్పాడు.

ఇక ఎంతసేపని చలిలో ఉండగలమని మేమూ బయలుదేరాము. ఇక్కడ ఒక తమాషా సంఘటన జరిగింది. ఒక దగ్గర కిందికి వెళ్ళడానికి రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి మంచులో వెళ్ళాలి, ఇంకోటి అంత మంచు లేకుండా బురద బురదగా ఉన్న ప్రదేశంలో నుంచి. రెండూ కింద ఒక దగ్గరే కలుస్తాయి.
అయ్యరు పుత్తరు వరుణ్ కాసింత ముందు బయల్దేరి మంచు మార్గంలో కిందికెళ్ళిపోయాడు. అంతలోనే గైడు ఇంకో మార్గం ద్వారా వెళ్ళమని అయ్యరుకి చెప్పాడు. ఇక అయ్యరుకి ఒకటే టెన్షను. వరుణ్ పైకి రా… అంటాడు. అప్పటికే అతను కిందికి చేరిపోయి రెండు దారులూ కలిసే చోట ఉన్నాడు. రెండడుగులు వేస్తే అక్కడికి చేరుకుంటానని చెప్పడు అయ్యరుతో.

అయినా అయ్యరు వింటే కదా ? వీల్లేదు ఆ రెండడుగులూ వెయ్యద్దు, పైకిరా అంటాడు. మేమందరమూ విస్తుపోయాము. అసలు ఇదేం పిచ్చి, ఇంతగా పిల్లలని కంట్రోల్ చేస్తే ఏదో రోజు ఏ కత్తో పెట్టి పొడిచెయ్యగలడనిపించింది. ప్చ్…
మళ్ళీ పైకంటా నడుచుకుంటూ వచ్చి బురదలోనుంచి దిగి అదే ప్రదేశానికొచ్చాడు పుత్తరు. జాలేసింది అతని మీద.

ఇక తర్వాత అయ్యరు ఒక దారి పడితే మేము ఇంకో దారి పట్టాము. బాగా చెట్లు గట్రాతో గుబురుగా ఉంది మేము వెళ్ళిన దారి. ఒక పది నిముషాలు నడిచిన తర్వాత గానీ అర్థం కాలేదు మేము తప్పిపోయామని…
ఇక వెనక్కెళ్ళాలా లేక ముందుకా అని కాసేపు తర్జన భర్జనలు పడి ఏదోకటయిందిలే అని ముందుకే సాగాము.
ఎటెటో వెళ్ళి మొత్తానికి ఒక అరగంట తర్వాత కాంపుకి చేరాము ఇంకేదో దారి నుంచి.

ఆ కాంపు లీడరెవరో భలే సరదా మనిషి. మేము అతనితో కాసేపు మాట్లాడి టెంట్లలోకి వెళ్ళిపోయాము. తడి బట్టలన్నీ ఒక తాడు కట్టి దాని మీద వేసేసాము. పొడి బట్టల్లోకి మారి జీడిపప్పులో కారం కలిపి మందు లేకుండా సైడు డిష్షు తినడం మొదలెట్టాము. (జీడిపప్పు ఎక్కడ నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా ? ఆ కథ చెప్పడం మర్చేపోయాను నేను… కసోల్ కి వచ్చేటప్పుడు హర్ష కవరు మర్చిపోయాడని చెప్పనుగా…. ఏం జరిగిందంటే ఆ వచ్చే ట్రిప్పులో కండక్టరు కవరు ఎవరో మర్చిపోవడం చూసి మా తర్వాత వచ్చే ట్రెక్కర్లకి ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ అది మా చేతికి చిక్కింది. ఎంత మంచి వారో కదూ…)
ఆవురావురుమంటూ తినేసిన తర్వాత ఇంకో సర్‌ప్రైజ్ మాకు. కాంపులో మామూలుగా అయితే ఫైరు వెయ్యకూడదు. కానీ మా పరిస్థితి చూసి కాంపు లీడరు పాపం మాతో వచ్చిన గైడులతో ఫైరు వేయించాడు. (కాకపోతే కాంపుకి అవతల, రూల్సు ఏవీ ఉల్లంఘించకుండా 🙂 )

నెమ్మదిగా ఒక గంట తర్వాత మిగతా జనాలందరూ కాంపుకి చేరారు. నెమ్మదిగా ఆ ఫైరు చుట్టూ మూగాము. ఇక అంత మంది ఫైరు చుట్టూ మూగితే ఊరికే ఉంటామా ? పాటలు మొదలెట్టారు జనాలు. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. పాటలు మేము పాడకుండా గైడ్ల చేత పాడించాము. వాళ్ళ లోకల్ సాంగులని వారు పాడడం మొదలుపెట్టారు. ఫోక్, వారి సినిమా పాటలను పాడుతుంటే మేమూ వారితో గొంతు కలిపాము. వారితోటి డాన్సు కుడా ఆడించాము. వారితోటి మేమూనూ…

మీకు టైముంటే మా గుంపులో ఒకతను సృష్టించిన ఈ వీడియో చూడండి.

అబ్బో… మరచిపోలేము ఆ రోజు. అందరమూ మా తడిచిన బట్టలని ఆ మంట చుట్టూ ఆరబెట్టుకున్నాము. షూ, సాక్సులు కూడా… (హర్ష గాడి షూ కాస్తా డాన్సాడేటప్పుడు మంటల్లోకి తోసేసారెవరో… అది కాస్తా సైడుకి కాలిపోయింది…)

అలా ఆడుతూ పాడుతూ ఆ కాంపు కూడా ముగిసింది…..

20 వ్యాఖ్యలు »

 1. oremuna said,

  !

  envy U 🙂

 2. oremuna said,

  !envy U 🙂

 3. Raj said,

  ఫోటోలు బాగున్నాయి. మీతో పాటు మమ్మల్ని కూడా ట్రెక్కింగుకు తీసుకెళ్ళినందుకు నెనెర్లు.

 4. Raj said,

  ఫోటోలు బాగున్నాయి. మీతో పాటు మమ్మల్ని కూడా ట్రెక్కింగుకు తీసుకెళ్ళినందుకు నెనెర్లు.

 5. రానారె said,

  అద్దిరిపోయిందయ్యా చంద్రం!! :-))

 6. అద్దిరిపోయిందయ్యా చంద్రం!! :-))

 7. రానారె said,

  ఈ ప్రపంచంలో ఎక్కడైనా పొద్దున సూరిబాబు కంటే ముందే నిద్రలేచి ఆయన కొండెక్కివచ్చేవరకూ ఒక్కళ్లమే అలా పచార్లు చేస్తే ఆరోజు జీవితం ధన్యమైనట్లే అనిపిస్తుంది! చేతిలో కెమెరా వుంటే చెప్పనక్కర్లేదు. హిమాలయాల సానువుల్లో ఆ అదృష్టం దక్కడమంటే వేరే చెప్పాలా …

  ఫోటోలు భలే వున్నాయి. ఇంతకు ముందరి వ్యాఖ్య మీ వీడియో చూసి రాసింది. 🙂

 8. ఈ ప్రపంచంలో ఎక్కడైనా పొద్దున సూరిబాబు కంటే ముందే నిద్రలేచి ఆయన కొండెక్కివచ్చేవరకూ ఒక్కళ్లమే అలా పచార్లు చేస్తే ఆరోజు జీవితం ధన్యమైనట్లే అనిపిస్తుంది! చేతిలో కెమెరా వుంటే చెప్పనక్కర్లేదు. హిమాలయాల సానువుల్లో ఆ అదృష్టం దక్కడమంటే వేరే చెప్పాలా …ఫోటోలు భలే వున్నాయి. ఇంతకు ముందరి వ్యాఖ్య మీ వీడియో చూసి రాసింది. 🙂

 9. రవి said,

  ఈ టపా సూపరు…ఫోటోలతో సహా…’అట జని కాంచె భూమిసురుడంబర చుంబి ‘ పద్యానికి ఫొటో సెషన్ లాగుంది…

 10. రవి said,

  ఈ టపా సూపరు…ఫోటోలతో సహా…’అట జని కాంచె భూమిసురుడంబర చుంబి ‘ పద్యానికి ఫొటో సెషన్ లాగుంది…

 11. కత్తి మహేష్ కుమార్ said,

  చాలా..చాలా..చాలా..బాగుంది. అంతకంటే చెప్పడం కష్టం.

 12. చాలా..చాలా..చాలా..బాగుంది. అంతకంటే చెప్పడం కష్టం.

 13. వికటకవి said,

  Lovely shots. Enjoyed reading your travelogue for sure.

 14. Lovely shots. Enjoyed reading your travelogue for sure.

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @ చావా:
  🙂

  @ raj గారు:
  కృతజ్ఞతలు. చాలా సంతోషం.

  @ రానారె:
  కదూ… ఏమిటో అప్పుడప్పుడూ అలాంటి కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను.

  @ రవి:
  మీ ప్రతిభ కొంచం కొంచంగా తెలుస్తుంది 🙂
  నచ్చినందుకు ఆఆఆనందం….

  @ మహేష్ గారు:
  మరీనూ… ఇబ్బంది పెట్టేస్తున్నారు 🙂

  @ వికటకవి గారు:
  ఇది రాసేటప్పుడు నేనూ అంతగానే ఎంజాయ్ చేసాను.

 16. @ చావా::) @ raj గారు:కృతజ్ఞతలు. చాలా సంతోషం.@ రానారె:కదూ… ఏమిటో అప్పుడప్పుడూ అలాంటి కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను.@ రవి:మీ ప్రతిభ కొంచం కొంచంగా తెలుస్తుంది :)నచ్చినందుకు ఆఆఆనందం….@ మహేష్ గారు:మరీనూ… ఇబ్బంది పెట్టేస్తున్నారు :)@ వికటకవి గారు:ఇది రాసేటప్పుడు నేనూ అంతగానే ఎంజాయ్ చేసాను.

 17. సుజాత said,

  మొత్తం చదివాక చుట్టూ చూస్తే ‘ఇదేమిటి, గదిలో ఉన్నాను?’ అనిపించింది! అంతగా మీ టూర్లో మమ్మల్నీ involve చేసారు.

 18. మొత్తం చదివాక చుట్టూ చూస్తే ‘ఇదేమిటి, గదిలో ఉన్నాను?’ అనిపించింది! అంతగా మీ టూర్లో మమ్మల్నీ involve చేసారు.

 19. Kamaraju Kusumanchi said,

  చాలా బాగుంది.

 20. చాలా బాగుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: