నవంబర్ 7, 2008

సురభి మాయాబజార్ – ఇది ఒక అద్భుతమయిన లోకం …

Posted in అనుభవాలు, నాటిక, మాయాబజార్, రంగ శంకర, సురభి వద్ద 9:10 సా. ద్వారా Praveen Garlapati

క్రితం వారం అర్జున రావు గారు నాకు ఫోన్ చేసి నవంబరు ఏడున బెంగుళూరు “రంగ శంకర“లో సురభి వారి చేత “మాయాబజార్” ప్రదర్శింపబడుతుంది అని వార్త అందించినప్పుడు నాకు తెలియలేదు నేను ఎలాంటి అనుభవాన్ని చవి చూడబోతున్నానో.

సరే ఒక కొత్త అనుభవం లాగా ఉంటుంది కదాని వెంటనే నవీను అన్నకి ఒక వేగు పంపి మరుసటి రోజే ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చేసేసాను. మా ఇద్దరికీ ఎంతో ఆసక్తి ఉన్నా ఆ ఆసక్తి తీరే మార్గం మాత్రం అనుకోని విధంగా ఇలా కలిగింది.

ఇవాళ పొద్దున్న నుంచి ఇద్దరమూ తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. రాత్రి ఏడున్నరకి మొదలవుతుంది నాటకం “రంగ శంకర”లో. ఐదున్నరకే ఇంటికొచ్చి వేచి ఉన్నాను నేను. నవీను అన్న ఏడయినా రారే. ఇంటి పక్కనే “రంగ శంకర” అయినా వేళకు చేరతామో లేదో అని నాకు తెగ టెన్షను పుట్టుకొచ్చింది.

ఆఖరికి హడావిడిగా ఎలాగయితే ఏడు పదికి ఇద్దరమూ రంగ శంకర చేరుకున్నాము. ఐదు నిముషాల తరువాత లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్ళగానే అసలు ఏ లోకంలో ఉన్నామో అనిపించింది కాసేపు. మొత్తం థియేటర్ నిండుగా ఉంది. అందరి మొహాల్లోనూ చెప్పలేని ఉత్కంఠ.

అసలు మన పాత మాయాబజార్ సినిమాకే మూలమయిన ఈ నాటికను చూడబోతున్నామంటేనే నాకు ఒక రకమయిన పులకరింత కలిగింది. ఇందులోని సీనులూ, ఎఫెక్టులూ, పాటలూ సినిమాలో ఉపయోగించారు.

నిజంగా చెప్పాలంటే నేను ఇంతటి జనాన్నీ, ఇలాంటి స్పందననీ ఊహించలేదు. తెలుగు వారనేమిటి, కన్నడ, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలు మాట్లాడే జనాలూ అక్కడున్నారు. అవి గమనిస్తూ నేను అదో రకమయిన ట్రాన్సులోకి వెళ్ళిపోయాను.

ఏడున్నరకి అందరూ వచ్చేసాక తలుపులు మూసేసారు. “అరుంధతి నాగ్” సురభి గురించీ, మాయాబజార్ గురించీ ఒక నాలుగు ముక్కలు చెప్పి మొదలుపెట్టారు. సురభికి ఉన్న చరిత్ర దాదాపు వంద ఏళ్ళ పైమాటే. మాయాబజార్ (శశిరేఖా పరిణయం) ఒక్కటే‌కాక ఎన్నెన్నో అద్భుతమయిన నాటకాలు రచించి అద్భుతంగా ప్రదర్శించారు, ప్రదర్శిస్తున్నారు.

అరుంధతి నాగ్ మాట్లాడుతున్నప్పుడు నన్ను అచ్చెరువొందేలా చేసింది థియేటర్ యొక్క “అకౌస్టిక్స్“. నేను నా చెవులనూ, కళ్ళనూ నమ్మలేకపోయాను. ఎటువంటి మైకు, స్పీకర్లూ లేకుండా మొత్తం థియేటరులో ఆవిడ మాట్లాడే ప్రతీ మాటా వినబడుతోంది. అద్భుతంగా తీర్చిదిద్దారు థియేటరుని.

“మాయాబజార్”కి వచ్చిన అశేషమయిన ఆదరణ చూసి మొదట మధ్యాహ్నం రెండున్నరకీ, రాత్రి ఏడున్నరికీ అనుకున్న దానికి జతగా రాత్రి పదకొండింటికి ఇంకో షో ఏర్పాటు చేసామనే సరికే నాకు అర్థమయింది ఈ రోజు నేను ఎలాంటి అనుభవాన్ని చవి చూడబోతున్నానో. చప్పట్లతో అందరూ “మాయాబజార్”కి ఆహ్వానం పలికారు.

మొదటి సీనుకే అందరూ డంగైపోయారు. నారద మునీంద్రుడు మబ్బులలో విహరిస్తూ భూలోకానికి విచ్చేస్తాడు. మరి నిజంగానే నారదుడు ఎగురుతూ మబ్బులలో నుంచి భూలోకానికి దిగితే ?
అదే జరిగింది. నేనైతే అవాక్కయి చూస్తుండిపోయాను. అదెలా సాధ్యపదిందో అర్థం కాలేదు.

సురభి గురించి అంతర్జాలంలో చదివినప్పుడు వారు ఆ కాలంలోనే స్పెషల్ ఎఫెక్టులు స్టేజీ పైన చేసేవారనీ, దానికి ఎంతో విశేష ప్రాచుర్యం ఉందనీ చదివాను కానీ ఈ స్థాయిలో నేను అస్సలు ఊహించలేదు. నాకింకా అప్పటికే తెలీదు నేను ఏమేమి వింతలు చూడబోతున్నానో…

నారదుడు అద్భుతమయిన వాచ్యంతో, చక్కని గొంతుతో పలికాడు. అప్పటికే నే పరిసరాలన్నీ మరచిపోయి మాయాబజార్ లోకానికి వెళ్ళిపోయాను.

ఆ తరువాత నా కళ్ళ ముందు కదాలాడిన నాటకం ఒక గొప్ప ఆవిష్కరణ. కళ్ళు మూసి తెరిచేంతలోనే రాజభవనాలు ప్రత్యక్షమయ్యాయి, రాచనగరులు వచ్చాయి. చిటికెలో సెట్లు మారిపోయాయి. భూమి, ఆకాశం, రాజభవనం, జలపాతం, అడవి, యుద్ధభూమి ఒకటేమిటి సర్వమూ క్షణాల్లో కళ్ళ ముందు ప్రత్యక్షం. నిజంగా ఏమయినా మంత్ర తంత్రాలు జరుగుతున్నాయేమో అనిపించేటట్లుగా జరిగింది.

అసలు పాత్రధారులు ఎంత అద్భుతంగా నటించారో చెప్పటానికి ఒక మచ్చుతునక. నాటిక మొదలయిన కొద్ది నిముషాలలో బలరాముడు వేషధారి తూలుతూ మాట్లాడుతున్నాడు. నాకు, నవీను అన్నకీ, మా చుట్టుపక్కల అందరకీ ఒక రెండు నిముషాలు అర్థం కాలేదు అదేమిటి ఇంతటి పేరొందిన నాటిక చేసేటప్పుడు అందులో నటుడు తాగివచ్చాడేమిటీ, అలా తూలిపోతున్నాడేమిటీ, అయ్యో అయ్యో అనుకుంటున్నాము.

ఆ పాత్రధారి “అవును నేను సురాపానం చేసాను …, ” అని డైలాగు చెప్పిన తర్వాత కానీ మాలో అది నిజమా, అబద్దమా అన్న సంశయం పోలేదు. అద్భుతం, అమోఘం.

అభిమన్యుడి పాత్ర పోషించిన అతను మంచి స్ఫురదౄపి. చక్కని పలుకుతో, దానికి తగిన భావంతో, శైలితో బాగా నటించాడు.
శశిరేఖ, కృష్ణుడు, ఒక్కరేమిటి అందరూ చక్కని నటనని ప్రదర్శించారు.

తర్వాత కాసేపటికి రంగప్రవేశం చేసాడు ఘటోత్కచుడు, భలే చక్కని కంఠం. అసలు నిజంగా రాక్షసుడు మాట్లాడితే ఇలాగే ఉంటుందా అనిపించే కంఠంతో చక్కని ప్రదర్శన ఇచ్చాడు.
ఘటోత్కచుడి రంగప్రవేశం తరువాత రంగస్థలం మీద ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శితమయ్యాయి. ఏ కృత్రిమమయిన ఎఫెక్టులూ లేకుండా ఆ స్పెషలు ఎఫెక్టులు ఎలా సృష్టించారో అని ప్రతీ ఒక్కరూ అబ్బురపడుతూనే ఉన్నారు.

ఉదా: అభిమన్యుడి రథం నిజంగానే స్టేజీ పైన పరుగులెత్తింది. వెళుతున్న కొద్దీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా మారిపోతోంది.

అలాగే అభిమన్యుడి, ఘటోత్కచుడి యుద్దంలో నిజంగానే బాణాలు ఎగిరాయి, గదతో ఢీకొట్టాయి. విస్ఫోటాలు సంభవించాయి. ఎలా చేయగలిగారో ఎవరికీ అంతుపట్టలేదు.
ఆగ్నేయాస్త్రం ప్రయోగించబడింది. నిజమైన మంటలు లేచాయి. తరువాత వరుణాస్త్రం ప్రయోగించబడింది. నిజంగా వర్షం కురిసి ఆ మంటలు ఆర్పబడ్డాయి.

శశిరేఖ పడుకున్న మంచం అమాంతంగా గాలిలోకి ఎగిరింది. అలాగే ద్వారకలో జనాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి పళ్ళాలు ఎగిరాయి, చెప్పులు వీపుల మీద చరిచాయి, కంబళి దానంటత అదే చుట్టుకుంది, నాగుపాములు బుసలు కొట్టాయి, వెన్నెలా-చంద్రుడూ-నక్షత్రాలూ ప్రత్యక్షమవుతాయి, జలపాతం వచ్చింది, దాని ముందు నుంచి ఏనుగు ఘీంకరిస్తూ వెళ్ళింది, దాని పక్కన నుండి చిన్న కుందేలు గెంతులేసింది. అబ్బ ఒకటేమిటి సర్వమూ మాయే. మనల్ని అచ్చెరువొందించేవే.

ఇవన్నీ ఒక ఎత్తయితే నాటికలోని ఒక పాటలో చూపించిన ఎఫెక్టు ఒక ఎత్తు. (అవును నాటికలో పాటలున్నాయి. కొన్నింటిని “మాయాబజార్” సినిమాలో కూడా వాడారు)

పాట సందర్భం ఏమిటంటే అభిమన్యుడూ, శశిరేఖా విరహ గీతం. శశిరేఖ పాట మొదలుపెడుతుంది. ఒక చరణం ముగిసిన తరువాత అభిమన్యుడు పాట మొదలుపెడతాడు. అభిమన్యుడు పాట మొదలుపెట్టగానే హఠాత్తుగా ఈ వైపు శశిరేఖ చీకట్లోకి లీనమై ఘటోత్కచుడి ఇంట్లో బస చేసిన అభిమన్యుడు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ శశిరేఖ పాట మొదలుపెట్టగానే అభిమన్యుడు మాయమై శశిరేఖ ప్రత్యక్షమవుతుంది.
అసలు మన కళ్ళు మనల్నే మోసం చేస్తున్నాయా అనిపిస్తుంది. హేట్సాఫ్…

ఇలా అసలు రెండు గంటల సమయం ఎప్పుడు గడచిపోయిందో తెలీనే లేదు. ప్రతీ దృశ్యానికీ మైమరచిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఆగనే లేదేమో ?

నాటిక ముగిసిన తరువాత నాకు తెలీకుండా నేనే “స్టాండింగ్ ఒవేషన్” ఇచ్చాను. చుట్టూ చూస్తే అందరు జనాలూ నాలాగే. చప్పట్లు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పాత్రధారుల కళ్ళలో ఆనందాన్ని చూడడానికి నాకయితే రెండు కళ్ళూ చాలనే లేదు. ఆ ప్రయత్నంగా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి.

చివరికి ఆ నాటక దర్శకుడయిన నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి సురభి చరిత్ర గురించీ, అరవై కుటుంబ సభ్యులు కలిసి ఇంకా నిర్వహిస్తున్న నాటక రంగం గురించీ, తర తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారి సభ్యుల గురించీ చెబుతుంటే ఆశ్చర్యం కలిగింది.

జనాలెవరికీ అక్కడ నుంచి కదలాలని లేకపోయినా ఆ లోకం నుంచి బయటకు రావలసి వచ్చి సంతోషం నింపుకున్న హృదయాలతో బయటకు వచ్చారు.
ఈ రోజు నాకు నా జీవితంలో మరచిపోలేని ఒక మధురానుభూతి.

ఇలాంటి చక్కని నాటకాలు, మన సంప్రదాయం ప్రతిబింబించే కళలు ప్రదర్శింపబడాలి. వాటికి తగిన ఆదరణ ఉండాలి. “రంగ శంకర” లాంటి థియేటర్లు కలకాలం వర్థిల్లాలి.

* సురభి వారి గురించి వెతుకుతుంటే ఈ బ్లాగు తగిలింది. ఇందులో విశేషాలు చూడండి.

34 వ్యాఖ్యలు »

 1. నిషిగంధ said,

  ప్రవీణ్, నిజం చెప్పొద్దూ టపా చదవడం పూర్తయ్యేసరికి నా కళ్ళల్లోనూ నీళ్ళు!! సురభి వారి మాయాబజార్!! తల్చుకుంటేనే రోమాంచితమౌతుందసలు! ప్రత్యక్షంగా చూసే అదృష్టం లేకపోయినా కళ్ళకి కట్టినట్లు చూపించారు!! థాంక్స్ సో మచ్!!

 2. ప్రవీణ్, నిజం చెప్పొద్దూ టపా చదవడం పూర్తయ్యేసరికి నా కళ్ళల్లోనూ నీళ్ళు!! సురభి వారి మాయాబజార్!! తల్చుకుంటేనే రోమాంచితమౌతుందసలు! ప్రత్యక్షంగా చూసే అదృష్టం లేకపోయినా కళ్ళకి కట్టినట్లు చూపించారు!! థాంక్స్ సో మచ్!!

 3. సుజాత said,

  చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాదులో లలిత కళా తోరణం లో వరసగా నెల రోజులనుకుంటాను మాయా బజార్ ప్రదర్శించారు సురభి వారు. అప్పుడు చూసాము మేము. జనాదరణ ఇక్కడ కొంచెం తక్కువే, అంటే రోజూ అదే ప్రదర్శన నెల రోజుల పాటు జరగడం వల్ల కూడా కావొచ్చు.

  ఇంటికొచ్చాక రాత్రంతా నేను నిద్ర పోలేదు.అంత మధురానుభూతిని మిగిల్చింది. మీ వల్ల ఇవాళ ఆ అనుభూతి మళ్ళీ నిద్ర లేచి కూచుంది.

  ధన్యవాదాలు.

 4. చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాదులో లలిత కళా తోరణం లో వరసగా నెల రోజులనుకుంటాను మాయా బజార్ ప్రదర్శించారు సురభి వారు. అప్పుడు చూసాము మేము. జనాదరణ ఇక్కడ కొంచెం తక్కువే, అంటే రోజూ అదే ప్రదర్శన నెల రోజుల పాటు జరగడం వల్ల కూడా కావొచ్చు. ఇంటికొచ్చాక రాత్రంతా నేను నిద్ర పోలేదు.అంత మధురానుభూతిని మిగిల్చింది. మీ వల్ల ఇవాళ ఆ అనుభూతి మళ్ళీ నిద్ర లేచి కూచుంది. ధన్యవాదాలు.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @ నిషిగంధ గారు:
  నిజమే… అంతగా కదిలించగలదని నేనూ ఊహించలేదు అసలు.
  అందుకే అదొక అందమయిన అనుభవంగా మిగిలిపోతుంది.

  @ సుజాత గారు:
  మీకు అలాంటి అనుభూతులని గుర్తుకు తెచ్చినందుకు సంతోషం.
  అవును, వారు పబ్లిక్ గార్డెన్స్ లో కూడా ప్రదర్శిస్తున్నట్టున్నారు.

  కుదిరిన వాళ్ళు తప్పకుండా చూడాలి.

 6. @ నిషిగంధ గారు:నిజమే… అంతగా కదిలించగలదని నేనూ ఊహించలేదు అసలు.అందుకే అదొక అందమయిన అనుభవంగా మిగిలిపోతుంది.@ సుజాత గారు:మీకు అలాంటి అనుభూతులని గుర్తుకు తెచ్చినందుకు సంతోషం.అవును, వారు పబ్లిక్ గార్డెన్స్ లో కూడా ప్రదర్శిస్తున్నట్టున్నారు.కుదిరిన వాళ్ళు తప్పకుండా చూడాలి.

 7. చివుకుల కృష్ణమోహన్‌ said,

  ఒక ఏడాది క్రితం మొదటిసారి మా ఊరిలో మాయాబజారు చూసినప్పుడు నాకు నిజంగా మతి పోయింది. అసలు చిన్న స్టేజి మీద, అందరూ చూస్తుండగా,అసలు అలా ఎలా చేస్తున్నారని. ఆ టైమింగులో ఒక సెకను అటూ ఇటూ అయినా రసాభాసే. ముందు ఒక అంకం సాగుతూంటే వెనకాతల తరవాత అంకానికి ఎఫెక్టులు సిద్ధం. నాటకం చూడడమనేది అంత గొప్పగా ఉంటుందని నమ్మడానికి నాకు కొంచెం సమయం పట్టింది.
  15 రోజుల కింద విశాఖపట్నంలో వాళ్ళు నాటకోత్సవాలు చేసారు. అందులో మాయాబజారు, కృష్ణలీలలు, బాలనాగమ్మ మొదలైనవి ప్రదర్శించారు. ప్రతీ నాటకంలోనూ నోరు వెళ్ళబెట్టుకుని చూసే సన్నివేశాలు బోలెడన్ని. ముఖ్యంగా కృష్ణలీలలు లో, కంసుడు దేవకీవసుదేవుల్ని జైలులో బంధించాక, కావలి ఉన్న సైనికులు మగతగా పడుకుంటే, సైనికుడి జేబులోనుంచి తాళం అలాగ గాలిలో తేలుకుంటూ వెళ్ళి జైలు తాళం తీస్తూ ఉంటే, చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయి నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయా. మీరన్న అభిమన్యుడూ, శశిరేఖ, వెన్నెల సన్నివేశం కూడా –
  సరిలెండి – చెపుతూ పోతే నేనే ఒక టపాకి సరిపడా విశేషాలు చెప్పాలి. ఏమైనా అద్భుతమైన అనుభవం.
  అభినందనలు.

 8. ఒక ఏడాది క్రితం మొదటిసారి మా ఊరిలో మాయాబజారు చూసినప్పుడు నాకు నిజంగా మతి పోయింది. అసలు చిన్న స్టేజి మీద, అందరూ చూస్తుండగా,అసలు అలా ఎలా చేస్తున్నారని. ఆ టైమింగులో ఒక సెకను అటూ ఇటూ అయినా రసాభాసే. ముందు ఒక అంకం సాగుతూంటే వెనకాతల తరవాత అంకానికి ఎఫెక్టులు సిద్ధం. నాటకం చూడడమనేది అంత గొప్పగా ఉంటుందని నమ్మడానికి నాకు కొంచెం సమయం పట్టింది. 15 రోజుల కింద విశాఖపట్నంలో వాళ్ళు నాటకోత్సవాలు చేసారు. అందులో మాయాబజారు, కృష్ణలీలలు, బాలనాగమ్మ మొదలైనవి ప్రదర్శించారు. ప్రతీ నాటకంలోనూ నోరు వెళ్ళబెట్టుకుని చూసే సన్నివేశాలు బోలెడన్ని. ముఖ్యంగా కృష్ణలీలలు లో, కంసుడు దేవకీవసుదేవుల్ని జైలులో బంధించాక, కావలి ఉన్న సైనికులు మగతగా పడుకుంటే, సైనికుడి జేబులోనుంచి తాళం అలాగ గాలిలో తేలుకుంటూ వెళ్ళి జైలు తాళం తీస్తూ ఉంటే, చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయి నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయా. మీరన్న అభిమన్యుడూ, శశిరేఖ, వెన్నెల సన్నివేశం కూడా -సరిలెండి – చెపుతూ పోతే నేనే ఒక టపాకి సరిపడా విశేషాలు చెప్పాలి. ఏమైనా అద్భుతమైన అనుభవం.అభినందనలు.

 9. ramya said,

  వావ్ !!…
  ప్రవీణ్ గారు,చదువుతూ అక్కడికి నేనూ వచ్చేసాను.
  సురభి వారి చే అందులోనూ నాకిష్టమైన మాయాబజార్.
  రెక్కలు కట్టుకుని వెళ్ళి చూడాలనిపించేలా రాసారు,

 10. ramya said,

  వావ్ !!… ప్రవీణ్ గారు,చదువుతూ అక్కడికి నేనూ వచ్చేసాను.సురభి వారి చే అందులోనూ నాకిష్టమైన మాయాబజార్.రెక్కలు కట్టుకుని వెళ్ళి చూడాలనిపించేలా రాసారు,

 11. కొత్త పాళీ said,

  మీకు అద్భుతం అనిపించిన అనుబవాన్ని మాక్కూడా పంచి పెట్టేందుకు మంచి ప్రయత్నం చేశారు. నేనూ వీరి ప్రదర్శనల గురించి వినడమే గాని ఎప్పుడూ చూడలేదు.

 12. మీకు అద్భుతం అనిపించిన అనుబవాన్ని మాక్కూడా పంచి పెట్టేందుకు మంచి ప్రయత్నం చేశారు. నేనూ వీరి ప్రదర్శనల గురించి వినడమే గాని ఎప్పుడూ చూడలేదు.

 13. krishna rao jallipalli said,

  ప్రవీణ్ గారికి అభినందనలు. మంచి టపా అందించినందుకు మరియు నన్ను నా బాల్యం లోకి తీసుకేల్లినందుకు. అప్పట్లో సురభి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం, ఆకర్షణ. సురభి వారి నాటకాలలో నాకు సతి అనసూయ, కృష్ణ లీలలు కొంచం గుర్తు. అప్పట్లో వారి నాటకాలూ శ్రీ ఘంటశాల గారి దినకరా… శుభకరా పాట తో ప్రారంభం అవుతాయి. తెర లేపటం కూడా ఒక గొప్ప అనుభూతి. ఇప్పటి లాగా ఒక పక్కకో లాగడం , చీల్చడం కాదు. పైకి చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పట్లో అదొక వింత. ఎలా సాద్యం అని. నాటకం నిండా ట్రిక్కుల మయం. చాల పెద్ద స్టేజి వాడతారు. స్టేజి రూఫ్ అంతా చుట్టబడిన తెరలు, తాళ్ళు, కప్పీలుతో నిండి పోతుంది. ఒక్కక్క నాటకం 5 నుండి 7 రోజులు ఆడతారు. పోవ్రానికాలతో పాటు మద్య మద్యలో సాంఘిక నాటకాలు (రంగూన్ రౌడీ) లాంటివి ఉంటాయి. కన్ను మూసి తెరిచే లోపల సెట్టింగే పూర్తిగా మారిపోతుంది. కొన్ని సెట్టింగులు సినిమాలను మరిపించే విధంగా ఉంటాయి. ఇప్పటి గ్రాఫిక్సూ , టెక్నాలజీ , మన్ను, మాసానాం, వీళ్ళ బొందా… ఇవేవీ సురభి ట్రిక్ వర్క్సు ముందు ఎందుకూ సాటి రావు. వారి సంభాషణలు, పాటలు, పద్యాలు… నిజంగా చాలా గొప్పవి. వారి సామగ్రి అంటే సెట్టింగులు, కుర్చీలు, బల్లలు, దేరాలు, జేనరేటారు వగైరా వగైరాలు నాలుగైదు లారీలు సరిపోవు. అన్నీ వారి సొంతమే. మద్య మద్య విరామం లో స్థానిక కళాకారులచే కొన్ని కామెడి బిట్స్ చేయించి ప్రోత్సాహిస్తారు. సమయపాలన వారి నుంచి అందరూ నేర్చు కోవాల్సిందే. మానవ సహజ పరిణామ క్రమంలో, పరుగు పందేలులో, వీరి ప్రాభవం, ఉనికి, చరిత్ర, కీర్తి కూడా ఈ పరిణామ ప్రక్రియలో సన్నగిల్లింది. ఇప్పటకీ వారి కళా వైభవం చెక్కు చెదర లేదు అని మీ టపా ద్వారా తెలిసికొని చాలా ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది. మరొక్కసారి ఆ తీపి గురుతులు మననం చేసుకొనే అవకాశం కలుగ చేసినందుకు మీకు నా నమో వాకాలు.

 14. ప్రవీణ్ గారికి అభినందనలు. మంచి టపా అందించినందుకు మరియు నన్ను నా బాల్యం లోకి తీసుకేల్లినందుకు. అప్పట్లో సురభి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం, ఆకర్షణ. సురభి వారి నాటకాలలో నాకు సతి అనసూయ, కృష్ణ లీలలు కొంచం గుర్తు. అప్పట్లో వారి నాటకాలూ శ్రీ ఘంటశాల గారి దినకరా… శుభకరా పాట తో ప్రారంభం అవుతాయి. తెర లేపటం కూడా ఒక గొప్ప అనుభూతి. ఇప్పటి లాగా ఒక పక్కకో లాగడం , చీల్చడం కాదు. పైకి చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పట్లో అదొక వింత. ఎలా సాద్యం అని. నాటకం నిండా ట్రిక్కుల మయం. చాల పెద్ద స్టేజి వాడతారు. స్టేజి రూఫ్ అంతా చుట్టబడిన తెరలు, తాళ్ళు, కప్పీలుతో నిండి పోతుంది. ఒక్కక్క నాటకం 5 నుండి 7 రోజులు ఆడతారు. పోవ్రానికాలతో పాటు మద్య మద్యలో సాంఘిక నాటకాలు (రంగూన్ రౌడీ) లాంటివి ఉంటాయి. కన్ను మూసి తెరిచే లోపల సెట్టింగే పూర్తిగా మారిపోతుంది. కొన్ని సెట్టింగులు సినిమాలను మరిపించే విధంగా ఉంటాయి. ఇప్పటి గ్రాఫిక్సూ , టెక్నాలజీ , మన్ను, మాసానాం, వీళ్ళ బొందా… ఇవేవీ సురభి ట్రిక్ వర్క్సు ముందు ఎందుకూ సాటి రావు. వారి సంభాషణలు, పాటలు, పద్యాలు… నిజంగా చాలా గొప్పవి. వారి సామగ్రి అంటే సెట్టింగులు, కుర్చీలు, బల్లలు, దేరాలు, జేనరేటారు వగైరా వగైరాలు నాలుగైదు లారీలు సరిపోవు. అన్నీ వారి సొంతమే. మద్య మద్య విరామం లో స్థానిక కళాకారులచే కొన్ని కామెడి బిట్స్ చేయించి ప్రోత్సాహిస్తారు. సమయపాలన వారి నుంచి అందరూ నేర్చు కోవాల్సిందే. మానవ సహజ పరిణామ క్రమంలో, పరుగు పందేలులో, వీరి ప్రాభవం, ఉనికి, చరిత్ర, కీర్తి కూడా ఈ పరిణామ ప్రక్రియలో సన్నగిల్లింది. ఇప్పటకీ వారి కళా వైభవం చెక్కు చెదర లేదు అని మీ టపా ద్వారా తెలిసికొని చాలా ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది. మరొక్కసారి ఆ తీపి గురుతులు మననం చేసుకొనే అవకాశం కలుగ చేసినందుకు మీకు నా నమో వాకాలు.

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @ చివుకుల కృష్ణమోహన్ గారు:
  అవును అచ్చు అలాంటి అనుభూతే కలిగింది. అంత చక్కని కోఆర్డినేషను మామూలు విషయం కాదు.
  ఎఫెక్టులలో కానీ, తెరలు మార్చడంలో కానీ ఎక్కడయినా కాసింత ఆలస్యమయినా రసాభసే…
  అంత చక్కగా చెయ్యగలిగారంటే ఎంత సాధన చేసి ఉంటారో ?

  @ ramya గారు:
  హైదరాబాదుకి దగ్గరలో ఉన్న వారికయితే చూడడానికి కుదురుతుంది. వారు ఇంకా అక్కడ ప్రదర్శనలిస్తున్నారనుకుంట.

  @ కొత్త పాళీ గారు:
  ఒక ప్రొఫెషనల్ నాటకం చూడడం నాకూ ఇదే మొదటి సారి.

  @ krishna rao jallipalli గారు:
  అయ్యో! గారనకండి.
  ఈ టపా మీ అనుభవాలు నెమరు వేసుకునేలా చెయ్యగలిగిందంటే నాకు చాలా ఆనందం.

 16. @ చివుకుల కృష్ణమోహన్ గారు:అవును అచ్చు అలాంటి అనుభూతే కలిగింది. అంత చక్కని కోఆర్డినేషను మామూలు విషయం కాదు.ఎఫెక్టులలో కానీ, తెరలు మార్చడంలో కానీ ఎక్కడయినా కాసింత ఆలస్యమయినా రసాభసే…అంత చక్కగా చెయ్యగలిగారంటే ఎంత సాధన చేసి ఉంటారో ?@ ramya గారు:హైదరాబాదుకి దగ్గరలో ఉన్న వారికయితే చూడడానికి కుదురుతుంది. వారు ఇంకా అక్కడ ప్రదర్శనలిస్తున్నారనుకుంట.@ కొత్త పాళీ గారు:ఒక ప్రొఫెషనల్ నాటకం చూడడం నాకూ ఇదే మొదటి సారి.@ krishna rao jallipalli గారు:అయ్యో! గారనకండి. ఈ టపా మీ అనుభవాలు నెమరు వేసుకునేలా చెయ్యగలిగిందంటే నాకు చాలా ఆనందం.

 17. చైతన్య క్రిష్ణ పాటూరు said,

  రంగశంకరలో సురభివారి మాయాబజార్ ప్రదర్శన ఉందని తెలిసి కూడా బద్దకించి వెళ్ళలేదు. నాటకంలో ఆ సీన్ లన్నీ ఎలా చూపిస్తార్లే అని తేలికగా తీసుకున్నాను. ఇప్పుడే మీ టపా చదివి చెంపలు గట్టిగా వాయించుకున్నాను. ఇంకోసారి చూసే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోను.

 18. రంగశంకరలో సురభివారి మాయాబజార్ ప్రదర్శన ఉందని తెలిసి కూడా బద్దకించి వెళ్ళలేదు. నాటకంలో ఆ సీన్ లన్నీ ఎలా చూపిస్తార్లే అని తేలికగా తీసుకున్నాను. ఇప్పుడే మీ టపా చదివి చెంపలు గట్టిగా వాయించుకున్నాను. ఇంకోసారి చూసే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోను.

 19. శ్రీ said,

  చాలా అద్భుతంగా వివరించారు. నాకు చూడడానికి అవకాశం వస్తే తప్పకుండా చూస్తాను!

 20. చూసే అవకాశం వస్తుందో రాదో, ప్రస్తుతానికి మీ టపా ని ఎంతలేదన్నా ఒక పది సార్లు చదువుకొని నాటకం చూసిననట్లుగా సరిపెట్టుకున్నాను. అవకాశం వస్తే మాత్రం ఈసారి చూసి తీరతాను. మంచి టపా మాకందించినందుకు ధన్యవాదాలు..

 21. Nani & Choti said,

  మరో మనసును ఆకట్టుకొనే వివరన రా.యునివర్సెల్ స్తూడియొలో/వేగస్ షోస్ దొరుకునా ఈ అనుభూతి అనెలా వుంది!!!

 22. @ చైతన్య:అయ్యయ్యో అవునా! పెద్ద తప్పే చేసారు. :)@ శ్రీ:తప్పకుండా! @ ఉమాశంకర్ గారు:మీ వ్యాఖ్య వల్ల నేను చూడని మీ బ్లాగు పరిచయమయ్యింది. చాలా చక్కగా రాస్తున్నారు, అలాగే కొనసాగించండి.@ భరత్:థాంక్స్ రా మామా! మన తెలుగు, మన భారతంలో ఉండే కళల ముందు యూనివర్సల్, వేగాస్ ఏపాటిరా 😛

 23. రవి said,

  వావ్ ! భలే !! ఇలాంటివి నేనెప్పుడూ చూళ్ళేదు. అప్పుడెప్పుడో, పూనాలో బాలగంధర్వ రంగమందిర లో ఓ నాటకం చూసాను కానీ ఇన్ని హంగుల్లేవు!మొత్తానికి మస్తు enjoy చేస్తున్నారు, ముష్టి బెంగళూరులో ఉంటూ కూడా..

 24. చిన్నప్పుడు నాటకాలలో వేసే సెట్టింగులు, సన్నివేశానికి తగ్గట్టు నిమషాలలో వాటిని మార్చటం ఓ అద్భుతంగా అనిపించేది. సురభి వారి ప్రదర్శనల గురించి వినటమే కాని ఎప్పుడూ చూడలేదు, మంచి విషయాన్ని తెలియచేసారు. వీలైతే హై.లో వారి ప్రదర్శన చూడాలి. మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 25. నేను నా కామెంట్లో ట్రిక్ వర్క్ అని ఉదహరించాను.. సారి.. వాటిని వైర్ వర్క్(WIRE WORKS) అని అంటారు/అనేవారు. సురభి వారు .. వారి ప్రదర్శనకి జనం వచ్చినా, రాక పోయినా అనుకొన్న సమయానికి తేరా లేవాల్సిందే. ఒక చోట చదివాను – ఒక ఊర్లో వారు నాటకాలు ఆడుతున్నప్పుడు తుఫాను వలన ఒక రోజు ఒకే ఒక ప్రేక్షకుడు వచ్చాడట.. అయినా సరే వారు ఆ రోజు ఆ నాటకాని ఆడారు.

 26. @ రవి:ఛా! నాకు గుర్తు రాలేదు. లేకపోతే మీకూ ఒక వేగు పంపుందును.అయ్యో, నమ్మ బెంగుళూరుని ముష్టి అంటే ఎలా ? కన్నడిగులు దాడి చేసేయగలరు :P@ సిరిసిరిమువ్వ గారు:అవును. ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఒక సన్నివేశం సరిగా రక్తి కట్టించడానికి ఎన్ని పాట్లు పడాలో.సింక్రనైజేషను చాలా ముఖ్యం.@ krishna rao గారు:చక్కని వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.అంత కమిట్‌మెంటు ఉంది కాబట్టే ఇన్నాళ్ళు ఇంత చక్కగా వారు ప్రదర్శనలు చెయ్యగలుగుతున్నారు.

 27. చాలా ఆలస్యంగా ఈ టపా చూసా,పనుల్లొ బడి,సురభి వారి నాటకాలు దాదాపు అన్నీ చూసా,అవి చూసి ఆనందించానా,అబ్బురపడి అలా…స్థాణువునై నిలిచిపోయానా అన్నది అలా ఉంచితే అదొక గొప్ప అనుభవం.ఈ మధ్య వైజాగు లో వారు మళ్ళీ ప్రదర్శనలిచ్చారు కానీ పిల్లల అనారోగ్యం వల్ల సాయంత్రాలు వాళ్ళు స్కూలు నుంచి వచ్చాక బయటకు కదల్లేక పోయి,అలా మిస్సయ్యాను.దరిద్రమేమంటే అన్ని నాటకాలు వారివి చూసి,సదరు మహోన్నత కళాకారులతో మాట్లాడి కూడా ఎప్పుడూ ఎప్పుడూ నాకు బ్లాగులో వారి గురించి రాయాలనిపించకపోవటం దారుణంకదా,ప్రవీణ్ గారు అసంఖ్యాక సురభి అభిమానుల తరపున మీకు నా పొగడపూల దండ,తప్పదు తలొంచాల్సిందే.

 28. chaduvari said,

  సురభి నాటకం ఇంత వరకూ చూళ్ళేదు కాబట్టి దాని గురించి ఏమీ చెప్పలేను గానీ, వాళ్ళ గురించి మీరు రాసింది మాత్రం గొప్పగా ఉంది. ఈసారి అవకాశం దొరికితే వాళ్ళ నాటకం చూడాల్సిందే. గతంలో కూచిపూడి వారి అహమ్మదాబాదు ప్రదర్శన గురించి నువ్వుశెట్టి బ్రదర్స్‌లో వచ్చిన టపాను గుర్తుకు తెచ్చింది మీ ఈ జాబు.

 29. అవకాశం లేకో..సమయం కుదరకో తెలియదు కానీ…సురభి వారి నాటకాలు ఇప్పటివరకూ చూడలేదు…(చిన్నప్పుడు నవరాత్రులకి ప్రదర్శించే ప్రతీ నాటకానికి వేళ్ళేవాళ్ళం)..కనీసం మీ వల్ల ఈ అవకాశం వచ్చినందుకు(మీ కళ్ళతో చూసి వ్యాఖ్య ద్వారా చదవగలిగినందుకు)జోహార్లు అర్పిస్తున్నాము..మీకు..మీ ద్వార సురభి వారికి కూడా..

 30. కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రవీణ్…థాంక్స్… నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసేలా చేసారు.

 31. @ రాజేంద్ర గారు:నన్ను మాటలతో ముంచేయకండి. మీరు అంద్లో ఘట్కులని తెలుసు :-)మీ పిల్లలకు కూడా ఈ అనుభవం కలగాలని ఆశిస్తున్నాను.@ చదువరి:ఆహ్! చక్కని టపాని వెలికి తీసినందుకు మళ్ళీ కృతజ్ఞతలు.@ శ్రీనివాస్ పప్పు గారు:నాటకం చూడడమే దానంతలో అది ఒక ప్రత్యేక అనూభూతి. మీకు నా ద్వరా ఆ అనుభవం కలిగిందంటే చాలా సంతోషం.@ వేణూ శ్రీకాంత్:తప్పకుండా, మీరు త్వరలో చూడగలగాలి.

 32. పనిలో పనిగా మాక్కూడా నాటకం మొత్తం చూపించేసారుగా. అభినందనలు

 33. మీరు చెపుతున్న వర్ణన వింటుంటే ఇక్కడ బ్రాడ్ వే లోని నాటకాలని మరిపించేట్లున్నాయి. బాగా వర్ణించారు.

 34. @ సత్యసాయి గారు, వికటకవి:అవి వర్ణించనలవి కావు. కానీ ఓ ప్రయత్నం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: