అంతర్జాలంలో తెలుగు/బ్లాగులు – అరువు టపా

నా బ్లాగు సమీక్ష ఈనాడులో వచ్చిందని చదువరి గారు చెప్పేవరకూ నాకు తెలీదు. 🙂

ఆయన పాపం ఓపికగా రాసుకున్న వ్యాసం అందరికీ ఉపయోగపడుతుందని వెంటనే నాకు పంపించారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Can’t see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer… you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

 • మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో తెలీకపోతే లేఖినికి వెళ్ళండి. మీరు రోమను లిపిలో రాసుకుంటూ పోతుంటే అది తెలుగు లిపి లోకి మార్చేస్తూ ఉంటుంది. నేను తెలుగులో రాయగలగుతున్నాను అని రాయాలనుకున్నారనుకోండి.. “nEnu telugulO raayagalagutunnaanu” అని అక్కడ రాస్తే చాలు.. మిగతా పని అదే చూసుకుంటుంది. కొత్తవారికి దీని కంటే మంచి గురువు మరోటి లేదు. కొన్ని ఆసక్తికరమైన లింకులివిగోండి:
 • తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలుగువారు తమకో విజ్ఞాన భాండాగారాన్ని తయారుచేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళంతా అందులో భాగస్తులే! ఆంధ్ర దేశంలోని ప్రతి ఒక్క ఊరి గురించి వివరాలు పొందుపరచాలనేది అక్కడి ఆశయాల్లో ఒకటి. అక్కడ మా ఊరి గురించి ఉంది, నేనే రాసాను. మీ ఊరి గురించి వ్యాసం ఉందో లేదో చూడండి. లేకపోతే మీరే రాయండి. ఉంటే.. దానిలో మార్పులు చెయ్యండి, కొత్త విషయాలు చేర్చండి
 • ఇక, బ్లాగులు ! బ్లాగులు రాసేందుకు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు – నేను పెట్టలేదు. మీకు కావాల్సిందల్లా కంప్యూటరు, జాలంలో జొరబడేందుకు ఓ కనెక్షను -అంతే! ఇక మీ మనసులో ఉన్నదంతా బైటపెట్టడమే. చంద్రబాబును, రాజశేఖరరెడ్డిని, చిరంజీవిని, బాలకృష్ణను.. ఎవ్వర్నీ వదలొద్దు. ఛందోబద్ధమైన పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు.. దేన్నీ వదలొద్దు. హాస్యం, వ్యంగ్యం, సీరియస్, విషాదం, వేదన, రోదన.. ఏదైనా సరే! పుస్తక సమీక్ష, సినిమా సమీక్ష, మీ చిన్ననాటి స్మృతులు, నిన్నామొన్నటి జ్ఞాపకాలు, కాలేజీ కబుర్లు.. ఆఫ్సు కబుర్లు.. అన్నిటినీ మీ బ్లాగులో పరవండి. అంతా వచ్చి చదూకుంటారు.. మీ బ్లాగు గురించి ఏమనుకుంటున్నారో కూడా చెబుతారు.
 • బ్లాగుల్లో కనబడేవి.. వినూత్నమైన ఆలోచనలు, స్వంత భావాలు, చక్కటి భాష, నిర్మొహమాటంగా, నిర్మోహంగా సాగే రచనలు. కొన్ని చక్కటి బ్లాగుల్లోని కొన్ని మంచి టపాలను ఏరి కూర్చిన ఈ పుస్తకాన్ని చూడండి. (ఇదో పీడీయెప్ఫు పుస్తకం.. దించుకోడానికి కాస్త ఎక్కువ సేపే పడుతుంది.)
 • బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి.. బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా.. తెలుగుబ్లాగు గుంపునడగండి.
 • బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి, జల్లెడలను చూస్తూ ఉండండి. బ్లాగుల్లో కొత్త రచనలు రాగానే వీటికి ఉప్పందుతుంది. కొత్తగా ఏయే రచనలు వచ్చాయో తెలిసికొనేందుకు తెలుగు బ్లాగరులు ఈ సైట్ల వద్దే తారట్లాడుతూ ఉంటారు.
 • చక్కటి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు ఇప్పటి కుర్రకారులోనూ ఉన్నారు తెలుసా? అంతర్జాలంలో అభినవ భువనవిజయాలు జరిగాయి కూడాను. ఛందస్సునూ, పద్యాల లక్షణాలనూ నేర్పే గురు బ్లాగులు బ్లాగురువులూ కూడా ఉన్నారు.
 • ఈమాట జాల పత్రికను చూడండి. అలాంటి ఉత్తమ సాహితీ విలువలున్న పత్రికను అచ్చులో చూసి ఎన్నాళ్ళైందో గుర్తుకు తెచ్చుకోండి.
 • గళ్ళ నుడికట్టు అంటే ఇష్టమా? అయితే పొద్దు దిక్కుకు తిరగండి. తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైను గళ్ళ నుడికట్టు ఇది.
 • కొత్త సినిమాల దగ్గర మైకులు పట్టుకుని, జనాల చేత అబ్బో, బెమ్మాండం, సూపరు, వందరోజులు, వెయ్యిరోజులు అంటూ చెప్పిస్తున్నపుడు “ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం.” అని టీవీల వాళ్ళను చీదరించుకున్నారా? అయితే నవతరంగపు తాజా గాలి పీల్చండి. నిష్పాక్షిక సమీక్షలే కాదు, సినిమాల గురించిన బోలెడు కబుర్లు తెలుసుకోవచ్చు.
 • తెలుగును చూపించే విషయంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు కాస్త మొహమాటపడుతుంది. పక్కనున్న స్క్రాల్ బారును పట్టుకుని పైకీ కిందకీ జరిపబోతే మహా బద్ధకంగా కదులుతుంది. (మరి ఈ సమస్య నాకేనో ఇతరులకూ ఉందో తెలీదు.) ఈ సందర్భంలో ఫైరుఫాక్సు అనే బ్రౌజరును మనం స్మరించుకోవాలి. దానిలో ఈ ఇబ్బంది కనబడలేదు. అది తెలుగుతో చెలిమి చేసింది. మంటనక్కపై తెలుగు సవారీ నల్లేరుపై నడకే! అన్నట్టీ మంటనక్క అనేది ఫైరుఫాక్సు బ్రౌజరును మనాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు.
 • మంటనక్కలాంటి ముద్దుపేర్లే కాక, మనం నిత్యం వాడే అనేక ఇంగ్లీషు పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను వెలికితీస్తూ, నిష్పాదిస్తూ, కనిపెడుతూ, చెలామణీ చేస్తూ ఉన్నారు. మీరూ ఓ చెయ్యెయ్యండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఉండే జనులను ఇంగ్లీషులో నెటిజెన్స్ అంటారు. మనాళ్ళు నెజ్జనులు అన్నారు. జాలజనులు అన్నారు. నెటిజనులు అన్నారు. మీరేమంటారో చెప్పండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

తెలుగెలా ఏమిటి ??? కథా కమామీషు …

కంప్యూటర్లో తెలుగు ఎలా?

తెలుగులో రాయడం

యూనీకోడ్, ఫాంట్లు, సెర్చింజన్లు

యూనీకోడ్ అనేది ఒక కంప్యూర్ పరిభాష. యూనీకోడ్ లో రాసిన తెలుగు సార్వజనీనం. అంటే మీ ఆపరేటింగ్ సిస్టం తో సంబంధం లేకుండా చూపబడగలిగేది. ఎన్నో వార్తా పత్రికలు డైనమిక్ ఫాంట్లు వాడుతుంటాయి. వాటిని మన కంప్యూటర్ల లో చూడాలంటే ఆ ఫాంట్లను మన కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాలి. అన్ని బ్రౌజర్లూ వాటిని ఆదరించవు. అలా కాకుండా యూనీకోడ్ లో రాసిన సమాచారం ఏ కంప్యూటర్ అయినా అర్థం చేసుకోగలదు. (యూనీకోడ్ లో రాసిన తెలుగు ని చూపించడానికి కూడా ఫాంట్లు అవసరం)

యూనీకోడ్ ఫాంట్లు

 • గౌతమి (విండోస్ తో పాటు వస్తుంది)
 • పోతన
 • వేమన

యూనీకోడ్ వల్ల ఇతర ఉపయోగం అది సెర్చబుల్ కంటెంట్ ని ఇస్తుంది. అంటే శోధన యంత్రాలు వీటిని శోధించగలవు. యూనీకోడ్ కాని ఫాంట్లు ఉపయోగించడం వల్ల మీ కంటెంటుని శోధించడం కష్టం. ఉదా: వందలాది తెలుగు బ్లాగులని మీరు గూగుల్, యాహూ, విండోస్ లైవ్ వంటి శోధన యంత్రాలతో శోధించవచ్చు.

తెలుగు వికీపీడియా

వికీపీడియా అనేది ఓ విజ్ఞాన సర్వస్వం. (ఆంగ్ల వికీ గురించి తెలిసున్నవారికి – ఇది తెలుగు లో వికీ)
ఇందులో ఉన్న సమాచారం ఏ ఒక్కరో కాక అందరూ కలిసి పోగుచేస్తారు. మనకు తెలిసిన ఏ విషయం గురించయినా వికీలో నిరభ్యంతరంగా రాయవచ్చు. అప్పటికే ఉన్న విషయాలను మార్చవచ్చు, సరిదిద్దవచ్చు. అలా మెరుగు పరుస్తుంటే ఒక సమగ్రమయిన వ్యాసం తయారవుతుంది. అందరి జ్ఞానం ఒక దగ్గర పోగవడం ఇందులో విశేషం.

http://te.wikipedia.org లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఉదా: మీ ఊళ్ళ గురించి, మన రాష్ట్రం గురించి, సాహిత్యం గురించి, సినిమాల చరిత్ర గురించి, ఎన్నో మంచి వ్యాసాలు ఇప్పటికే అందులో ఉన్నాయి. వీటిని ఇంకా ఎంతో మెరుగుపరచవచ్చు మనందరి సహకారంతో.

తెలుగు బ్లాగులు

# ఎందుకు

 • మన మాతృభాష అంటే మనకు ఇష్టం.
 • ఇతర తెలుగు బ్లాగర్ల నుంచి సాహిత్యం, పుస్తకాలు, సినిమాల గురించి తెలుసుకోచ్చు

# ఎలా ?

 • ఇతర బ్లాగులు సృష్టించినట్టే. కాకపోతే తెలుగు యూనీకోడ్ ద్వారా రాసి ఇందులో కంటెంటు సృష్టించడమే తేడా.
 • లేఖిని, పద్మ, బరహ, ఇన్స్క్రిప్టు ఎడిటర్ లేదా ఇంకేదయినా ఉపయోగించి తెలుగు లో రాసి మీ బ్లాగులో ఉంచండి.

# ఎక్కడ చూడచ్చు ?
తెలుగు బ్లాగులు వందలలో ఉన్నాయి (వేయికి దగ్గరగా కావచ్చు). వాటిని ఒక దగ్గర చేర్చేందుకు అగ్రిగేటర్లు ఉన్నాయి.

# సాధ్యాసాధ్యాలు

 • తెలుగు బ్లాగు సృష్టించడం చాలా సులువు. బ్లాగరు, వర్డ్ప్రెస్సు లాంటి ఏదయినా బ్లాగు ప్రొవయిడరు సహాయం ద్వారా బ్లాగు సృష్టించుకోవచ్చు లేదా మీ సొంత బ్లాగు హోస్టు చెయ్యవచ్చు.

# ఉపయోగాలు

 • ఎందరో తెలుగు బ్లాగర్లు అనేక విషయాల మీద బ్లాగులు రాస్తుంటారు. సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు, కవితలు, పద్యాలు, యాసలు అన్నీ. ఎంతో సమాచారం పొందవచ్చు.
 • వివిధ విషయాల మీద మంచి చర్చలు జరుగుతాయి. పలువురి అభిప్రాయాలు చదవవచ్చు. మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.