ఆన్లైను ఆఫీసు సాఫ్టువేర్లు …

ఆహా… ఆన్లైన్ ఆఫీసు సాఫ్టువేరు మార్కెటు ఎంత ఇంటరెస్టింగుగా తయారవుతుందో.

ఇంతవరకూ మనకు ఏమన్నా డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లూ తయారు చేసుకోవాలంటే విండోస్ లో మైక్రోసాఫ్టు ఆఫీసు, లినక్స్ లో ఓపెన్ ఆఫీసు ఉపయోగించేవాళ్ళం. (చాలా మటుకు)

ఓ ఏడాది క్రితం నుంచీ నెమ్మదిగా వెబ్ ఆధారిత ఆఫీసు సాఫ్టువేరులు ఊపందుకోవడం మొదలుపెట్టాయి. అంటే అంతర్జాలం మీద ఆఫీసు డాక్యుమెంట్లు సృష్టించుకునే సౌలభ్యం అన్నమాట.

వివిధ కంపెనీలు ఇలాంటి సాఫ్టువేర్లు రూపొందిస్తూండగా జోహో అనే భారతంలో బేస్ అయిన కంపెనీ, గూగుల్ (గూగుల్ డాక్స్) దీనిని సీరియస్ బిజినెస్ ఆపర్చ్యూనిటీ గా పరిగణించాయి. ఎప్పటిలాగే మైక్రోసాఫ్టు ఇవన్నీ పిల్ల చేష్టలు అని కొట్టిపడేసింది.
అలా చూస్తుండగానే జోహో చక్కని ఇన్నోవేషన్ తో ఎంతో చక్కని ఆఫీసు సాఫ్టువేరును తయారు చేసేసుకుంది. దానికి ఎన్నో మంచి ఫీచర్లను జోడించుకుంది. ఒక్క వర్డు, ఎక్సెలు వంటి సాఫ్టువేరులకే పరిమితం కాకుండా ప్రెజెంటేషను, నోట్సు, మెయిలు, ప్రాజెక్టు మేనేజిమెంటు మొదలయిన వివిధ కాటగరీలకి విస్తృతం చేసింది.

గూగుల్ కూడా మేలుకుని మూలుగుతున్న డాలర్లతో కంపెనీలను ఎడా పెడా కొనేసి ఒక ఆన్లైను సాఫ్టువేరు సూటు ని తయారు చేసేసుకుంది. ఇందులో వర్డు, ఎక్సెలు, ప్రెజెంటేషను సాఫ్టువేర్లున్నాయి.

నెమ్మదిగా ఈ కంపెనీలు ఎంటర్ప్రైజు మార్కెట్టు మీద కూడా కన్నేసాయి. గూగుల్ తన బ్రాండునుపయోగించి కాప్‌జెమిని తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా గూగుల్ ఆప్స్ ప్రీమియర్ ఎడిషన్ ని కాప్‌జెమిని తన క్లైంట్లకి చేరువ చెయ్యబోతుంది. దీని ద్వారా గూగుల్ ఆన్లైను ఆఫీసు సాఫ్ట్వేరుకి హైప్ సృష్టించింది.
ఇక అప్పటి నుంచీ అందరూ దీనిని మైక్రోసాఫ్టు ఆఫీసు కి ప్రత్యామ్నాయాలు గా పేర్కొనడం మొదలుపెట్టాయి. గూగుల్ మాత్రం ఇది ఆఫీసు సాఫ్టువేరుకి కాంప్లిమెంటరీ మాత్రమే అని చెబుతూ వచ్చింది. కానీ దాని అంతరంగం మాత్రం వేరని అర్థమవుతుంది.

జోహో మాత్రం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ వచ్చింది. తన సాఫ్టువేరు సూటు కి ఎన్నో అప్లికేషన్లని జోడించేసుకుంది. ఈ మధ్యే ఒక ఆన్లైను డాటాబేసు ని కూడా తయారు చేసింది.

ఇవన్నీ ఇలా సాగుతుండగా గూగుల్ ఒక మంచి ప్రోడక్టు తయారు చేసింది. గూగుల్ గేర్స్ అనే ఓపెన్ సోర్స్ ఏపీఐ. దీని ద్వారా ఆన్లైను, ఆఫ్లను మధ్య దూరాన్ని తగ్గించాలని ప్రయత్నం. దీని ద్వారా ఆన్లైనులో మాత్రమే చెయ్యగలిగే పనులను ఆఫ్లైనులో చెసుకునేలా సౌకర్యం పొందవచ్చు. దీని కోసం ఒక ఏపీఐ సృష్తించి విడుదల చేసింది గూగుల్. దీనిని తన గూగుల్ రీడర్ ప్రోడక్టులో ఉపయోగించింది. (మీ ఆరెసెస్ ఫీడ్లను ఆఫ్లైనులో చదువుకోవచ్చు).

కానీ ఇక్కడ జరిగిన చమత్కారమేమిటంటే గూగుల్ తన ఆఫీసు అప్లికేషన్లను ఆఫ్లైను ఎడిటింగు కి సిద్ధంగా తయారు చెయ్యలేదు ఇంకా. కానీ జోహో ఈ గూగుల్ గేర్స్ ఏపీఐ ని ఉపయోగించి తన ఆఫీసు సాఫ్టువేరు ని ఆఫ్లైనులో ఎడిట్ చేసుకునేలా తీర్చిదిద్దింది.
అంటే ఇప్పుడు యూజర్లు తమ డాక్యుమెంటులను ఆన్లైనులో సృష్టించుకోవచ్చు, ఆఫ్లైనులో ఎడిట్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్టు ఆఫీసు లాగా, మళ్ళీ ఆ డాక్యుమెంటు ని ఆన్లైను డాక్యుమెంటుతో సింక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే రెండు విధాలా లాభం అన్నమాట. మన డాక్యుమెంటులు ఎప్పుడు కావాలన్నా రెడీగా ఉంటాయి ఆన్లైనులో, కావాలంటే ఆఫ్లైనులోనూ వాడుకోవచ్చు. బాగుంది కదూ…

ఇక ఈ పైవన్నీ చూసి మైక్రోసాఫ్టు కి కొద్దిగా గుబులు పుట్టిందేమో నేనూ ఉన్నానంటూ ఆఫీసులైవ్ అంటూ ఒక కొత్త ప్రోడక్టు ని లాంచ్ చేసేసింది. ఇక ఇదెలా ఉందో నాకు తెలీదు. నేను వాడలేదు.

ఏది ఏమయినా ఒకటి మాత్రం నిజం ఇంకా ఈ ఆన్లైను ఆఫీసు సాఫ్టువేరులన్నీ ఫంక్షనాలిటీ లో మాత్రం మైక్రోసాఫ్టు ఆఫీసుకి కానీ, ఇతర ఆఫీసు సాఫ్టువేరు సూట్లకి దరిదాపుల్లోకి చేరలేదు. కానీ తొందర్లోనే అదీ జరగవచ్చు.