ఐపీ టెలీఫోనీ …

ఐపీ టెలీఫోనీ అని వింటూంటాము. ఇదేంటి ?

మనకి ఒక కొత్త టెలీఫోన్ కనెక్షన్ కావాలంటే ఏం చేస్తాం ? ఏదో ఒక టెలీఫోన్ ప్రొవైడర్ కి అర్జీ పెట్టుకుంటాము.
మనింటి దగ్గర వారి కనెక్షన్ కోసం వైర్లు ఉంటే సరి, లేకపోతే గనక వారు మన రోడ్లు తవ్వి, కొత్త వైర్లేసి, మీ ఇంటికి కనెక్షన్లివ్వాలి. ఇంత తతంగమంతా పూర్తవాలి. దీనిని PSTN అని అంటారు. ఇది జనరల్ గా అనలాగ్ అన్నమాట.

ఉదా: బీఎస్ఎన్ఎల్ మొదలయినటువంటి సంస్థలు ఇలాంటి కనెక్షన్లు ఇస్తాయి.

దీనికి ప్రత్యామ్నాయం గానే ఐపీ టెలీఫోనీ వచ్చింది. దీనినే VoIP అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న IP కనెక్షన్ మీద పని చేస్తుంది. అంటే ఆల్రడీ ఉన్న మన ఇంటర్నెట్ కనెక్షన్ మీదే మనం కాల్స్ చేసుకోవచ్చు అన్నమాట. చెపినంత ఈజీ కూడా కాదు కానీ ఇంతకు ముందున్న PSTN టెక్నాలజీ మీద ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది కొత్త గా infrastructure అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఐపీ నెట్వర్క్ మీదే దీనిని వ్యవస్థాపితం చెయ్యవచ్చు. దీని వల్ల ఎంతో సేవింగ్స్ కూడా.

సరే మరి ఈ టెక్నాలజీ ని అందించేవారెవరు ?

దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్, సాఫ్ట్‌వేర్ తయారు చేసేవి కమర్షియల్ అయితే సిస్కో, అవయా, నార్టెల్ మొదలయినవి. ఇప్పుడు వీటికి ఇవి మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్ లు. ఇక VoIP ప్రొవైడర్లు కూడా మనముండే దేశాన్ని బట్టి వేర్వేరు గా ఉంటారు.
పైన చెప్పినవే కాక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లు కూడా ఉన్నాయి. అందులో ప్రముఖమయినది asterisk. ఇది మంచి ఊపే అందుకుంది కానీ ఇంకా కమర్షియల్ సాఫ్ట్‌వేర్ లకు దీటుగా తయారవలేదు. అదీ కాక సపోర్ట్ అవసరం కూడా ఎక్కువగా కావలసి ఉంటుంది.

ఇప్పుడు దీనినే యూనిఫైడ్ కమ్యూనికేషన్ అని అన్ని కంపెనీలూ అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. అంటే కంపెనీలకు కావలసిన అన్ని టెక్నాలజీలనూ ఇస్తామని, అన్నీ తమ దగ్గరున్నాయని చెప్పటం అన్నమాట.
ఉదా: మామూలు టెలీఫోన్ కాల్స్, కాల్ సెంటర్ లాంటి సొల్యూషన్, వాయిస్ మెయిల్, వీడియో, కాంఫరెన్సింగ్ ఏం కావాలంటే అది అన్నీ దొరుకుతాయని చెప్పడం.

వీటిలో సిస్కో ముందుంది కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇందులో ప్రవేశం చేసింది. కొన్నిటి ని సొంతంగానూ, కొన్నింటిని వేరే కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అవయా మొదలయినవి కొన్నింటిలో ఉన్నా అన్ని సొల్యూషన్లూ వీటి దగ్గర లేవు.

సరే ఇక వీటి వల్ల కంపెనీలకు ఉపయోగం కానీ మనకు ఎలాంటి ఉపయోగం ? ఇది ఆలోచిస్తే మనం ఇప్పుడు ఉపయోగించే స్కైప్, యాహూ వాయిస్, గూగుల్ టాక్, ఎమెసెన్ వాయిస్ చాట్ మొదలయినవి అన్నీ ఐపీ మీదే పని చేస్తాయి.

కొంత వాటి గురించి కూడా:

స్కైప్: ఇది మాట్లాడుకోవడానికి మాత్రమే తయారు చేసిన ఒక సాఫ్ట్‌వేర్. ఎంతగానో ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఇప్పుడు మాట్లాడడానికి దీనినే వాడతారు. దీంట్లొ వీడియో చాట్ సౌకర్యం కూడా ఉంది.
మధ్యలో కొన్ని రోజులు ఇది US లో ఏ ఫోన్ కయినా ఉచితంగా కాల్ చేసుకునే సౌకర్యం కల్పించింది. కానీ ఇప్పుడు దీనికి డబ్బులు కట్టాల్సిందే.

యాహూ, ఎమెసెన్, గూగుల్ టాక్: ఇవన్నీ మెసెంజర్ మీద మాట్లాడుకోవడానికి సౌకర్యం కలించే సాఫ్ట్‌వేర్లు. గూగుల్ టాక్ లో తప్పితే వేరే వాటిలో వీడియో సౌకర్యం కూడా ఉంది.