మంట నక్క ౩, ఇతరాలు …

మొత్తానికి మంట నక్క ౩ విడుదలయింది. వారు స్థాపించదలచుకున్న ఐదు మిలియన్ల దిగుమతుల రికార్డు ఎప్పుడో దాటేసారు (ఇప్పటికి ఎనిమిది మిలియన్లు దాటింది). వివరాలు ఇక్కడ.

నిన్న అందరూ ఒకే సారి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించడంతో దాని సర్వరు డౌనయింది కూడా. రాత్రి ఆన్లైనులో కనబడిన వారందరికీ దిగుమతి చేసుకోమని ప్రచారం చేసి నా వంతు నేను చేసాను (నేను కూడా దిగుమతి చేసుకున్నాను). అన్నట్టు వీవెన్, నేను రాత్రి స్టాట్స్ పేజీని ఒకటే తాజీకరించడం. నిముషానికి ఎన్ని దిగుమతులవుతున్నాయో చూడడానికి 🙂

ఎన్నో చక్కని ఫీచర్లతో, మెరుగుపరచబడిన మెమొరీ వాడకంతో ఆకట్టుకునేదిగా ఉంది. అన్ని ఫీచర్లనూ తెలుసుకోవడానికి ఓ సారి ఇక్కడికెళ్ళండి.

అన్నిటి కన్నా మంచి సదుపాయం మనం ఇంతకు ముందు వెళ్ళిన పేజీల సంగ్రహాన్ని సులువుగా వెతకడానికి జత చేసిన ఫీచర్లు.

మీరు మీ URL bar లో ఏదయినా కీ పదాన్ని టైపు చెయ్యగానే అది మీరు ఇంతకు ముందు వెళ్ళిన పేజీలలో ఆ పదం ఎక్కడెకడుందో ఆ పేజీలను మీకు వెంటనే చూపిస్తుంది.

అలాగే మీరు తరచుగా వెళ్ళే పేజీలను ఆటోమేటిగ్గా Places, Smart Bookmarks, Most Visited అనే ఫోల్డర్లలో పెడుతుంది. పేజీకలను (bookmarks) ను స్థాపించుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఏ పేజీనయితే పేజీకగా మార్చదలచుకున్నారో ఆ పేజీకి వెళ్ళి URL bar లో ఉన్న నక్షత్రం బొమ్మని క్లిక్కుమనిపించండి. అంతే అది పేజీకగా మారిపోతుంది. అలాగే మీ పేజీకలకు టాగులని పెట్టుకోవచ్చు. నక్షత్రం గుర్తు మీద రెండు సార్లు నొక్కండి. అక్కడ మీకు కావలైసిన టాగులను దానికి జోడించండి.

ఇంకా కొత్త ఫీచర్లును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఇక్కడ, ఇక్కడ చూడండి.

అన్నట్టు కొసరుగా ఓ రెండు చక్కని ఆడాన్‌ ల గురించి ఈ సందర్భంగా చెబుతాను.

౧. వీవ్: ఇది ఇంకా పూర్తిగా విడుదల అవలేదు. ఇంకా మోజిల్లా లాబ్స్ లోనే ఉంది. అంటే దీనిని ఇంకా పరీక్షిస్తున్నారు. కానీ చక్కని ఆడాన్ ఇది.

మీరు చాలా సార్లు అనుకునుంటారు మీ పేజీకలు, వెబ్ పేజీల చరిత్ర, కుకీలు, మంట నక్కలో నిక్షిప్తం చేసుకున్న సంకేత పదాలూ మీరెక్కడి నుంచి పని చేసినా అక్కడికొచ్చేలా ఉంటే బాగుండునని. సరిగా దానికోసం సృష్టించబడిన ఆడాన్ ఇది.

దీని కోసం మీరు ఒక మోజిల్లా లాబ్స్ లో ఒక ఖాతా సృష్టించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ మంట నక్క విహరిణి లో దానిని నిక్షిప్తం చేసుకుంటే అప్పటి నుంచీ పైన చెప్పినవన్నీ దాని సర్వరులో పెట్టుకుంటుంది (ఎన్‌క్రిప్ట్ చేసి పెట్టుకుంటుంది.)

మీకు ఇవన్నీ ఇంకొక సిస్టం మీద పని చేసేటప్పుడు కావాలనుకోండి, ఆ సిస్టం లో ఉన్న మంట నక్క కి వీవ్ ఆడాన్ ని జత చెయ్యండి. మీ లాగిన్ వివరాలు అందిస్తే అన్నిటినీ కొత్త సిస్టం లోకి తెచ్చేసుకుంటుంది.

మీరు Tools > Weave > Weave Preferences కి వెళ్ళి కావలసిన ఎంపికలను చేసుకోండి.

అంతే కాదు ఇక నుంచి మీరు కొత్తగా జోడించిన పేజీకలు వగయిరా అన్నీ కూడా వీవ్ ఉన్న అన్ని సిస్టం ల మీదా లభ్యమయ్యేలా చూస్తుంది.

మీ పని సులభతరం చేస్తుంది కదూ. ప్రయత్నించి చూడండి.

౨. రీడిట్ లేటర్: ఈ ఆడాన్ కూడా మీ మంట నక్కకి చక్కని జోడింపు.

ఎన్నో సార్లు మీరు అంతర్జాలంలో విహరించేటప్పుడు కావలసిన పేజీలు అన్నీ అప్పటికప్పుడే చదవడం కుదరదు. అలాగని అంత సేపూ మీరు అంతర్జాలానికి అనుసంధానమయ్యి ఉండలేరు. సరిగా ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ ఆడాన్.

దీనిని మీ మంట నక్కలో వ్యవస్థాపితం చేసుకోండి. తర్వాత మీకు URL bar లో ఒక టిక్కు మార్కు కనిపిస్తుంది. మీరు ఏ పేజీనయితే తర్వాత చదవదలచుకున్నారో ఆ పేజీలో టిక్కు మార్కుని నొక్కండి. ఆ లంకె వెంటనే రీడిట్ లేటర్ జాబితాలో చేరిపోతుంది. (మీరు ప్రస్తుతం చూస్తున్న అన్ని టాబులనూ, విడి విడిగా లంకెలనూ కూడా ఇందులో చేర్చుకోవచ్చు)

అయితే మీరు ఎంచుకున్న పేజీలు మీరు అంతర్జాలానికి అనుసంధానమయి లేనప్పుడు కుడా లభ్యం కావాలంటే మీరు దాని మెనూ కి వెళ్ళి “Read Offline” అనే లంకె మీద నొక్కండి. అది మీకు కావలసిన పేజీలన్నిటినీ మీ సిస్టం లో నిక్షిప్తం చేసుకుంటుంది. తర్వాత మీరు అంతర్జాలానికి దూరమయినా దాని మెనూ కి వెళ్ళి ఆ లంకె మీద నొక్కితే ఆ పేజీ మీకు లభ్యమవుతుంది.

అక్కర్లేదనుకున్న పేజీల నుంచి టిక్కు మార్కు తొలగిస్తే ఆ పేజీ ఇక లభ్యమవదు.

భలేగా ఉంది కదూ.

అందుకే మరి మంట నక్క లాంటి విహరిణులు వాడాలి. మరిన్ని చక్కని ఆడాన్‌ లు స్థాపించుకుని మీ విహరిణిని మరింత శక్తిమంతంగా తయారు చేసుకోండి.

ఇది చూడండి: అన్నట్టు నా లాగా ఒకటి కంటే ఎక్కువ విహరిణులు వాడే వారు ఓపెరా 9.5 ని ప్రయత్నించి చూడండి. దాని వేగం ముందు ఏ విహరిణి అయినా దిగదుడుపే. అదీ కాక ఏ ఆడాన్ లు లేకుండానే అది ఎన్నో ఫీచర్లను అందిస్తుంది. అవేమిటో ఇక్కడ చూడండి.
కొత్త రూపుతో ఆకట్టుకునేలా తయారు చేసారు కూడా.

ఒపెరా – విహరిణి విపణిలో అండర్‌డాగ్ …

ఒపెరా – అంటే ఓ సంగీత నాటకం.

కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఒపెరా విహరిణి (browser) గురించి. ఈ విహరిణి అంటే నాకు ఎంతో గౌరవం.
అవును నేను మంటనక్క (firefox) వాడతాను, అది నాకిష్టం. కానీ ఒపెరా అంటే నాకు చాలా గౌరవం. దానికి కారణం కూడా లేకపోలేదు.

నేను ఒపెరా ని ఉపయోగించడం దాదాపు ఓ నాలుగయిదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను.
అప్పట్లోనే దాంట్లో టాబ్ లు ఉండేవి. ఓ మూడు సంవత్సరాల క్రితం మంటనక్క వచ్చినప్పుడు జనాలు టాబ్ ల గురించి అబ్బురపడటమే ఒపెరా మార్కెటింగ్ లో ఎంతగా విఫలమయిందో చెబుతుంది.
నిర్ద్వంద్వంగా ఒపెరా అన్నిటికన్నా వేగవంతమయిన విహరిణి. అయినా జనాల ఆదరణ ఎక్కువగా దక్కలేదు.
దానికి ముఖ్య కారణం మొదట్లో ఇది ఉచితం కాకపోవడమే. ఉచిత వర్షన్లో పైన ఓ ఆడ్ బానర్ ఉండేది. అది చికాకు కలిగించేది.

నాకు ఒపెరా అంటే ఎందుకంత గౌరవమో దీంట్లో ఉన్న ఫీచర్లు చూస్తే తెలుస్తుంది. ఎన్నో విహరిణులలో లేని ఫీచర్లు ఇందులో ఏ ఆడాన్లు లేకుండానే లభ్యం.

* మెయిల్ క్లయింట్
* న్యూస్‌గ్రూప్ క్లయింట్
* ఐఆర్సీ క్లయింట్
* బిట్ టోరెంట్ క్లయింట్
* నోట్స్ అప్లికేషన్
* విడ్జెట్లు

ఇన్ని ఫీచర్లతోనూ ఇది తక్కువ మెమోరీ తీసుకుంటుంది. వేగవంతంగా పని చేస్తుంది.
చాలా మంచి ఇన్నోవేషన్లు చేస్తారు ఈ విహరిణి తయారీదారులు.

ఏ ఇతర విహరిణి లోనూ లేని కొన్ని ప్రత్యేకమయిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఈ మధ్య విడుదలయిన కెస్ట్రెల్ అనే ఆల్ఫా బిల్డ్ లోనివి. కెస్ట్రెల్ అద్భుతంగా ఉంది.

* స్పీడ్ డయల్: ఒపెరా లో మీరు ఓ కొత్త టాబ్ తెరవగానే మీకు తొమ్మిది చిన్న కిటికీలు కనిపిస్తాయి. అందులో ఒక్కో కిటికీలో ఒక వెబ్ పేజీ ని సెట్ చేసుకోవచ్చు. ఆ కిటికీలనే స్పీడ్ డయల్ అంటారు. అందులో సెట్ చేసిన వెబ్ పేజీల స్నాప్ షాట్ ఆ స్పీడ్ డయల్ లో కనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవుతుంది. కాబట్టి మీకు కావలసిన పేజీలు ఓ క్లిక్కు దూరం మాత్రమే. అదీ కాక ఆ వెబ్ పేజీ తెరవకుండానే దానిని చూడచ్చు.
* మౌస్ జెస్చర్స్: మీ మౌస్ తో బ్రౌజింగ్ చర్యలని నియంత్రించవచ్చు. ఉదా: రైట్ క్లిక్కు, లెఫ్ట్ క్లిక్కు చేస్తే మీ ఇంతకు ముందు పేజీ కి వెళతారు.
* వాయిస్ బ్రౌజింగ్: వాయిస్ కమాండ్లతో బ్రౌజ్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు.
* కంటెంట్ బ్లాకర్/పాపప్ బ్లాకర్: ఇది మంట నక్క ఆడ్ బ్లాక్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ ఆడ్లను, అక్కర్లేని ఫ్లాష్ కంటెంటు నూ బ్లాక్ చెయ్యవచ్చు. అలాగే పాపప్ లని ఆటోమాటిగ్గా బ్లాక్ చేసేస్తుంది.
* టాబ్ ప్రీవ్యూ: మీరు ఏ టాబ్ మీదయినా మీ మౌస్ ని ఉంచితే ఆ వెబ్ పేజీ ప్రీవ్యూ కనిపిస్తుంది.
* సింక్రనైజేషన్ (కెస్ట్రెల్ ఫీచర్): ఇది గూగుల్ బ్రౌజర్ సింక్, లేదా ఫాక్స్‌మార్క్స్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ పేజీకలు (bookmarks) అన్నీ మీ ఒపెరా విహరిణుల మధ్య సింక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక సిస్టం మీద సేవ్ చేసుకున్న పేజీకలను ఎక్కడయినా సరే పొందవచ్చు. అలాగే మీ స్పీడ్ డయల్స్ కూడా.
* హిస్టరీ సెర్చ్ (కెస్ట్రెల్ ఫీచర్): మీరో వెబ్ పేజీ చూసారు. అందులో ఏదో కంటెంట్ కోసం వెతికారు. తరవాత అదే పేజీ కి మళ్ళీ వెళ్ళాలనుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ సెర్చ్ చేసో లేదా హిస్టరీ లోని పేజీలను ఒక్కోటీ వెతికో చేరుకోవాల్సుంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ హిస్టరీ లో కేవలం లంకెలనే కాకుండా పేజీ కంటెంటు ని కూడా ఇది గుర్తుంచుకుంటుంది. కాబట్టి మీరు వెతకాలంటే చాలా ఈజీ. కంటెంట్ ని ఇట్టే పట్టెయ్యవచ్చు. అంతే కాక మీరు మీ URL bar లో టైప్ చేసిన పదాలను కూడా అప్పటికప్పుడు వెతికేస్తుంది ఆ హిస్టరీ లో. చాలా సౌకర్యం కదూ.

మరందుకే చెప్పింది ఈ విహరిణి అంటే నాకెంతో గౌరవం అని. ఈ ఫీచర్లే కాకుండా వేగం లో దీనికి సాటి రాగలిగే బ్రౌజర్లు తక్కువే అని చెప్పాలి.

అంతా బానే ఉంది కానీ దీనితో వచ్చిన చిక్కులంటారా ?
* డెవలపర్స్ సాధారణంగా ఈ బ్రౌజర్ కోసం టెస్ట్ చెయ్యడం తక్కువే ఎందుకంటే దీని మార్కెట్ ఎక్కువ కాదు కాబటి.
* జావాస్క్రిప్ట్, అజాక్స్ తో దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి.
* దీనికి కూడా అన్‌జస్టీఫై సమస్య ఉంది.

అన్నట్టు ఇందులో తెలుగు బాగానే కనిపిస్తుంది కానీ మీకు డీఫాల్ట్ సెట్టింగులలో తెలుగక్షరాలు చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే ఇందులో డీఫాల్ట్ గా ఏరియల్ ఫాంట్ ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు ప్రిఫరెన్సస్ లో ఫాంట్స్ కి వెళ్ళీ అక్కడ ఇంటర్నేషనల్ ఫాంట్స్ లో తెలుగు ఎంచుకుని గౌతమి ఫాంట్ ని ఎంచుకోండి. చక్కగా కనిపిస్తుంది.