నవంబర్ 3, 2007

గూగుల్ ఓపెన్‌సోషల్ …

Posted in ఓపెన్‍సోషల్, గూగుల్, టెక్నాలజీ వద్ద 5:58 సా. ద్వారా Praveen Garlapati

సోషల్ నెట్వర్కులు ఇప్పుడు కామధేనువులు అవడంతో అందరికీ దాంట్లో వాటా కావాలి. దాంతో రోజుకో కొత్త పోకడ వస్తుంది వీటిలో.

మై స్పేస్, ఫేస్బుక్, ఆర్కుట్ వగయిరా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఇందులో మిగతా వారికన్నా ముందుండటానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ మై స్పేస్ కు ఎదురు లేకపోయింది. మిలియన్ల కొద్దీ యూజర్లు, బిలియన్ల కొద్దీ పేజీ వ్యూ లతో అప్రతిహతంగా కొనసాగిపోతూ ఉన్నది. దానికి పోటీ గా ఉన్న ఫేస్బుక్ దానిని ఎదురుకోవడానికి ఓపెన్ ప్లాట్ఫాం అని విడుదల చేసింది. స్థూలంగా కథ ఏమిటంటే అంతవరకూ బయటి వారికి అందుబాటులో లేని సమాచారాన్ని ఏపీఐ ల ద్వారా వారికి అందుబాటులోకి తెచ్చింది.
వాటిని వాడి ఎవరయినా ఫేస్బుక్ కోసం తమ అప్లికేషన్లు రాయవచ్చు, ఎంబెడ్ చెయ్యవచ్చు. కానీ దానికోసం వారు తయారు చేసిన FBML అనే లాంగ్వేజీ వాడాల్సి ఉంటుంది. అదేమీ అంత కష్టం కాదు. ఉదా: మన బ్లాగులలో ఉన్నట్టు గా బొత్తాలు ఫేస్బుక్ లో పెట్టడానికి నేను రాసిన చిన్న అప్లికేషన్ కి నాకు నాలుగు లైన్లు పట్టింది అంతే.

ఇక ఆ ప్లాట్ఫాం తయారు చేసిన తరవాత ఫేస్బుక్ స్వరూపం మారిపోయింది. కొన్ని వేల, లక్షల ? అప్లికేషన్లు కొద్ది కాలంలోనే తయారయిపోయాయి. ఫేస్బుక్ లో లేని ఎన్నో కొత్త ఫీచర్లు వీటి ద్వారా యూజర్లకు అందుబాటులోకొచ్చాయి. ఎక్స్‌క్లూజీవ్ గా ఫేస్బుక్ ని టార్గెట్ చేసుకునే స్టార్టప్ లు తయారయ్యాయి.
అలా ఫేస్బుక్ దూసుకుపోతుంది. ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్ అందులో రెండొందల మిలియన్లు పెట్టి వాటా కొనుక్కుంది (ఫేస్బుక్ వాల్యువేషన్ ని పదిహేను బిలియన్ డాలర్లుగా వెల కట్టింది.)
గూగుల్ కూడా మైక్రోసాఫ్ట్ తో పోటీ పడినా దానికి ఆ డీల్ దక్కలేదు.

గూగుల్ కి ఆర్కుట్ అనే సొంత సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ ఉన్నా దానిని ఇబ్బంది పెట్టే సంగుతులేమిటంటే:

  • ఆర్కుట్ కి భారతం, బ్రెజిల్ లో తప్పితే మిగతా మార్కెట్లలో ఎక్కువ మార్కెట్ షేర్ లేదు.
  • ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ సైటులలో వైవిధ్యంగా దూసుకుపోతుంది. అంతటితో ఆగకుండా వివిధ ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని గూగుల్ కి ఎదురుదెబ్బల వంటివి.
  • మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లో షేర్ సాధించడంతో ఇప్పుడు ఫేస్బుక్ లో లైవ్ సెర్చ్ ని డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా చెయ్యవచ్చు. దానితో దాని వాడకం ఎక్కువవచ్చు.
  • ఫేస్బుక్ తన సొంత ఆడ్ నెట్వర్కుని ప్రారంభించబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అది గూగుల్ కి పోటీ కావచ్చు.

ఇవన్నీ గూగుల్ ని ఆలోచనలోకి నెట్టేసాయి. ఫేస్బుక్ తో ఒప్పందం కుదరకపోయే సరికి ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం ఓపెన్‌సోషల్ ఒక కొత్త కాన్సెప్టు ని ముందుకు తెచ్చింది. ఇంతకీ దీని ద్వారా గూగుల్ ఏం చెబుతుందంటే ఫేస్బుక్ కోసం తయారు చేసిన అప్లికేషన్లు కేవలం ఫేస్బుక్ లో మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ గూగుల్ విడుదల చేసిన ఈ ఓపెన్సోషల్ ఏపీఐ లు వాడితే దానిని సపోర్ట్ చేసే అన్ని సోషల్ నెట్వర్కులలోనూ ఆ అప్లికేషన్లు పనిచేస్తాయన్నమాట.
కాబట్టి ఆ అప్లికేషన్లు రాసేవారికి మరింత ఈజీ అన్నమాట. అలా అప్లికేషన్ డెవలపర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో గూగుల్ కి ఏమి లాభం ?
ఒకరకంగా ఇది డెస్పరేషన్ తో కూడిన మూవ్ అనిపిస్తుంది. ఎలాగోలా అందరి దృష్టినీ ఫేస్బుక్ నుంచి మరల్చడం ముఖ్యమయిన కారణంగా కనిపిస్తుంది (పెద్ద పెద్ద సోషల్ నెట్వర్కులు MySpace, LinkedIn, Six Apart, Orkut వంటివి ఇప్పటికే ఇందులో భాగస్వాములు). ఇంకోటి ఇది ప్రపోజ్ చేసింది గూగుల్ కాబట్టి దీని మీద ఓ రకంగా దానికి కంట్రోల్ లభిస్తుంది. ముందు ముందు లాభించవచ్చు. అదీ కాక ఇతర సోషల్ నెట్వర్కులలో నుండి సమాచారం గూగుల్ కి అందుబాటులోకి రావచ్చు. అది దానికి ఉపయోగం. ఉదాహరణ కి ఎలాంటి ట్రెండులు నడుస్తున్నాయో, ఎలాంటి ఏజ్ గ్రూపులు ఏం ఇష్టపడుతున్నాయో మొదలయినవన్నమాట.

ఇప్పటికే యూజర్ల ప్రైవసీ గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యూజర్లకి సంబంధించి ఎంతో సమాచారం గూగుల్ వద్ద ఉంది. దానికి ఇది కూడా తోడయితే మంచిది కాదని కొంత మంది అభిప్రాయం. అయినా సరే గూగుల్ కి ఇప్పుడున్న క్రేజ్ మీద అవన్నీ మరుగున పడిపోవచ్చు. గూగుల్ ఓపెన్సోషల్ ముందు ముందు ఏ దిశలో ప్రయాణిస్తుందో వేచి చూడాల్సిందే.

 

మళ్ళీ టపాలు రాస్తున్నానంటే నా ప్రదర్శన ముగిసిందన్నమాట. 🙂 ఎక్సలెంటుగా జరిగింది. అద్భుతమయిన రెస్పాన్సు. దాదాపు నాలుగు వేల మంది ముందు ప్రదర్శించడం ఓ అనుభూతిగా ఎప్పటికీ మిగిలిపోతుంది. విపులంగా ఇంకో టపాలో…