ఓపెన్ సోర్స్ ఉచితమా ?

ఓపెన్ సోర్స్ అంటే ఉచితం కాదు…

అసలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (OSS) ఫిలాసఫీ ఏంటి ? అని తరచి చూస్తే అది చెప్పేది మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ యొక్క సోర్స్ మీ చెంత ఉండాలనే.

అంటే మీరు ఇవాళ ఓ సాఫ్ట్‌వేర్ కొన్నారనుకోండి దానికి చెందిన సోర్స్ కోడ్ మీ దగ్గర ఉంటుందన్నమాట. మీకు కావాలంటే దాని డిజైన్ గమనించవచ్చు, దాని కోడ్ చూడచ్చు, మార్చనూ వచ్చు. అలా ఉండే సాఫ్ట్‌వేర్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని అంటారు (OSS). కానీ ఇందులో ఎక్కడా ఇది ఉచితంగా ఉండాలి అని చెప్పలేదు. (ఉచితం మరియు ఓపెన్ సోర్స్ అయిన సాఫ్ట్‌వేర్ ని FOSS అని అంటారు) కానీ సాధారణంగా తొంభై శాతం పైన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లన్నీ ఉచితమే. ఇంకా ఎక్కువ శాతం కూడా అయి ఉండవచ్చు.

ఉదా: ఓపెన్ సోర్స్ అయి ఉచితం కాని సాఫ్ట్‌వేర్ రెడ్‌హాట్ లినక్స్. అది సప్లై చేసే సాఫ్ట్‌వేర్ ఓపెన్ సోర్సే. అదే లినక్స్. కానీ దానికి అది వాడుకదార్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుంది. అది డబ్బు వసూలు చేసేది సోర్స్ కోసం కాదు. పాకేజింగ్ కి, సపోర్ట్ కీ. అంటే మీరు లినక్స్ లో సాధారణంగా అప్లికేషన్లు గానీ, ఫీచర్లు గానీ వ్యవస్థీకరించాలనుకుంటే అవి పాకేజీలుగా లభ్యం అవుతాయి. ఎలా అంటే రెడ్‌హాట్ ఆధారితమయిన లినక్స్ ఫ్లేవర్లలో RPM లని ఉంటాయి. డెబియన్ ఆధారిత లినక్స్ ఫ్లేవర్లలో deb లు ఉంటాయి.

అలా ఆ పాకేజీలను వాడుకదార్లకు కావలసిన రీతిలో సృష్టించినందుకూ, సోర్స్ కోడ్ ని మెయిన్‌టెయిన్ చేసినందుకూ అది డబ్బు వసూలు చేస్తుందన్నమాట. అలాగే మీ వర్షన్లలో బగ్గులున్నాయనుకోండి వాటిని ఫిక్స్ కూడా చేసి ఇస్తారు. మామూలుగా అయితే లినక్స్ కమ్యూనిటీ ఆధారితమయినది కాబట్టి మీరు ఎవరో ఒకరు ఆ బగ్గుని ఫిక్స్ చేసేవరకూ ఆగాల్సుంటుంది (అదీ త్వరగానే ఫిక్సయిపోతుందనుకోండి.) కానీ ఈ మోడల్ లో అయితే మీకు ఆ బగ్గులు ఫిక్స్ చేసేందుకు సపోర్టు రెడ్‌హాట్ నుండి లభిస్తుంది.

ఇక్కడ నేను మాట్లాడేది ఫెడోరా గురించి కాదు, రెడ్‌హాట్ ఎంటర్ప్రెయిస్ వర్షన్ గురించి. ఫెడోరా అని రెడ్‌హాట్ నుండి ఉచిత వర్షన్ కూడా ఉంది.

అలా ఓపెన్ సోర్స్ నుండి రెవెన్యూ సృష్టించుకున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. ఉచితంగా లభిస్తుంటే ఎవరు వాడతారులే అనుకుంటున్నారా ? చాలా ఎంటర్ప్రయిజులే దీనిని వాడతాయి. (నే పని చేసే కంపెనీ కూడా వాడుతుంది కానీ నే వాడను 🙂 )ఎందుకంటే సపోర్టు లభ్యమవుతుంది. అది అవసరం. ఉదాహరణకి మీరు ఓ ప్రోడక్ట్ ని ఓపెన్ సోర్స్ కోడ్ పైన తయారు చేస్తున్నారనుకోండి, సగం కోడ్ తయారయిన తరవాత ఆ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లో బగ్గులుంటే మీరు మీ ప్రోడక్ట్ ని ఆపెయ్యలేరు కదా. అందుకనే ఆ భరోసా కోసమే కంపెనీలు వీటిని వాడతాయి.

ఓపెన్ సోర్స్ కోసం ఎన్నో లైసెన్సులున్నాయి GPL, Apache, Mozilla Public License, వగైరా… కొద్ది తేడాలతో ఇవన్నీ ఒకటే. మీరు సోర్స్ ఉపయోగించండి, మార్చండి. మళ్ళీ పది మందికి పంచండి. ఇలా చెయ్యడం వల్ల కోడ్ నాణ్యత వాడుతున్నకొద్దీ పెరుగుతుంది.

ఇవన్నీ ఎందుకు అసలు ఓపెన్ సోర్స్ ఎందుకు ఉపయోగించాలంటారా ?

మీరుపయోగించే లేదా కొన్న సాఫ్ట్‌వేర్ కోడ్ మీ దగ్గరే ఉంటుంది. దానికి కావలసిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆ కోడ్ ని, డిజైన్ ని గమనించి మరింత మంచి సాఫ్ట్‌వేర్ రాయవచ్చు. కావాలంటే చిన్న చిన్న బగ్గులుంటే వాటిని మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. స్వేఛ్ఛ ఉంటుంది.

ఇక మామూలు వాడుకదారు విషయానికొస్తే చాలా మటుకు ఓపెన్ సోర్స్ ఉచితం. సాఫ్ట్‌వేర్ ఉచితంగా లభిస్తుంది. అది కూడా నాణ్యమైనది. సరే ఇక పైరేటెడ్ వాడతానంటారా, అది వారి వారి నిర్ణయం. వీధుల్లో కాకుండా రహదారిలో వెళతానంటారా ఓపెన్ సోర్స్ వాడి అదీ వారి ఇష్టమే 🙂