ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి …

ఆఫీసయిపోయింది. ఇంటికి బయలుదేరాను. పని మీద ఇంకో ఆఫీసుకి రావడంతో ఇవాళ్టికి క్యాబు లేదు. అలాగే బైకూ లేదు.

నెమ్మదిగా అడుగులేస్తూ ఇంటికేసి బయలుదేరాను. ఒక కిలోమీటరు దూరం మాత్రమే. నడిచి ఎన్ని రోజులయిందో!
చీకటి పడింది, రాత్రి దాదాపు ఎనిమిదిన్నర అయింది. ఆఫీసు బిల్డింగు నుంచి బయటకు రావడంతోనే వెల్లువలా ట్రాఫిక్కు. అదో మహా సముద్రం. అందులో కొట్టుకుని పోవడమే తప్ప ఆగి ఆలోచించే సమయం ఉండదు.

ఒక్క క్షణం ఆ దృశ్యం నా కళ్ళలో ఇంకే దాకా ఆగి నేనూ అందులో కలిసాను. ఆ ప్రయత్నంగా నాకు తెలీకుండానే అడుగులు పడుతున్నాయి. కొన్ని విషయాలు మనకు అంతర్గతంగా అలా ముద్ర పడిపోతాయి. వాటిని గురించి ఆలోచించక్కర్లేకుండానే ఆ పనులు ఆ ప్రయత్నంగా జరిగిపోతాయి. అలా నా అడుగులూ ఇంటికేసి సాగుతున్నాయి.

నడక రోడ్డు మీదయినా ఆలోచనలు ఎక్కడో. ఆ ట్రాఫిక్కు లాగానే పొంతన లేకుండా సాగుతున్నాయి. అడుగు తూలబోయి మళ్ళీ నిలదొక్కుకున్నాను.
పొద్దున్నే ఆఫీసుకి చేరుకున్నాను. ఏమిటో ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువయింది. ఇంకో ఆఫీసులో పనుందని ముందే తెలిసుంటే ఇంత దూరం వచ్చి ఉండకపోయేవాడిని కదా ? హు… అనవసరంగా సమయం వృధా. కానీ, తప్పేదేముంది.

వచ్చిన పనన్నా సక్రమంగా జరిగిందా అంటే అదీ లేదు. ఎప్పటిలాగానే బోరింగు మీటింగు. అదేదో ఐపీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడచ్చుగా ? ఊహు… లేదు అక్కడికే వెళ్ళాలి. మేనేజరు (డామేజరు ?) ప్రత్యేకంగా చెప్పాడు. వెధవ, పని లేక తీరిగ్గా తిని కూర్చునే వాడికేం తెలుసు మా ఇక్కట్లు.

మీటింగు గంటన్నరా నిద్రపోలేక, సుత్తి వినలేక ఆపసోపాలు పడడం నా వంతు.

టప్… ఏంటిది ? చినుకులు పడుతున్నాయి. ఏంటో వానాకాలం అయిపోవచ్చిన సమయాన ఇక్కడ రోజూ వర్షం కురుస్తుంది. ఒక చిన్న వర్షం చాలు రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా తయారవడానికి. ఇందాక కురిసిన వర్షానికి ఇప్పటికే రోడ్లన్నీ బురద బురదగా ఎలా ఉన్నాయో. ఇలాంటప్పుడు నడవడానికి భలే ఇబ్బంది. హుప్… ఈ మాత్రం లాంగు జంపులు చెయ్యాల్సిందే.

ఎంత చిరాకు పడినా సన్నని జల్లు కురుస్తుంటే దాంట్లో తడిచీ తడవకుండా నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. ఈ ‘దర్శిని’లో ఓ టీ తాగితేనో ? ఛా… టీ ఏంటి ఫిల్టరు కాఫీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆగి కాఫీ తాగనా ? మళ్ళీ ఇంటికెళ్ళి భోంచెయ్యాలి ఇంకో గంటలో. మ్‌…
కానీ, ఓ రోజు ఆలస్యంగా తింటే పోయేదేమీ లేదు. ఎంత రద్దీగా ఉందో ఈ దర్శిని. వీడి పనే మేలు. ఓ బోండా సూపు తిని కాఫీ తాగితే బాగుంటుంది.

ఫర్లా! వేడిగానే ఉంది బోండా సూపు. బాగుంది, బాగా చేసాడు. కారం కారంగా ఇది తిన్న తరువాత ఈ వేడి కాఫీ తాగుతుంటే భలేగుంది. ఏంటో ఈ దర్శినిల్లో చేసే లాంటి ఫిల్టరు కాఫీకీ, ఇంట్లో చేసే ఫిల్టరు కాఫీకీ రుచి భలే తేడా. రెండూ వేటికవే…

లేటవుతుంది గానీ ఇక ఇంటికి తిన్నగా వెళితే మేలు. ఎందుకో దిగులుగా ఉంది. ఏమిటో ఈ ఆర్థిక మాంద్యం. ఎక్కడ చూసినా ఈ బూచిని చూపించే పేపర్లే. ఎవడు మాట్లాడినా దీని గురించే. పనికి మాలిన వెధవలు అత్యాశకి పోయి చేసిన తప్పులకి ఎంచగ్గా ఆనందంగా ఉన్న మనకి కష్టాలు. ఇలాగే ఉంటుంది ఏంటో జీవితంలో. ఎవడో చేసిన తప్పుకి ఇంకెవడో బలవుతాడు.

ఓహ్.. కొద్దిగా ఉంటే ఆ కారు వెధవ మీదకెక్కించి ఉండేవాడే. వెధవ, రోడ్డు మీద నడుస్తున్న మనుషులు కూడా కనబడట్లేదు. అవును మరి నేను రోడ్డు మీదెందుకు నడుస్తున్నాను. ఫుట్‌పాత్ మీద కదా నడవాల్సింది ??
అవునులే అక్కడ బైకులు ఫుట్‌పాత్ మీద నడుపుతుంటే నేను రోడ్డు మీద కాక ఇంకెక్కడ నడుస్తాను !

అరే! మర్చేపోయాను. ఇవాళ ఈ ఆఫీసుకి రావడం మంచిదే అయింది. మన మెరుపు తీగ మళ్ళీ కనబడింది. పెదాల మీద ఆ ప్రయత్నంగా చిరునవ్వు. ఏమిటో జనాలకు టేస్టు లేదు. ఎంత సేపూ మోడర్న్ అమ్మాయిల వెంట పడతారు కానీ ఈ డీసెన్సీలో ఉన్న అందం వారికి అర్థం కాదు. అసలు తను నవ్వితే ఎంత అందంగా ఉంటుందీ… తెల్ల చుడీదారులో దేవత దిగివచ్చినట్టు లేదూ ?
పెళ్ళి చేసుకుంటే అలాంటి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి… ఆ అమ్మాయినే చేసుకుంటే ?

ఛా! అది ప్రాక్టికల్ గా ఉందా అసలు. ముక్కూ మొహం తెలియని అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకుంటాం. ఎవరయినా అమ్మాయిలను పటాయించడంలో కూడా ట్రయినింగు ఇస్తే నాలాంటి వాళ్ళకు బాగుండేది.

అవును కానీ రాజేష్ గాడికి పాపం. అలాంటి చెత్త మేనేజరు దొరికాడు. పాపం అలాంటి సిన్సియరుగా పని చేసే వారికే ఎందుకో అలా జరుగుతుంది. ఆ రీజనల్ ఫీలింగేమిటో ఆ మేనేజరుకి. వాడింకో టీముకి మారిపోతే బాగుండు తొందరగా. అలాంటి మేనేజరు వెధవలకు తగిన శాస్తి జరగాలి. బయటికెళితే కానీ మంచి పనితనం ఉన్న వాళ్ళ విలువ అర్థం కాదు.

ఈ రోడ్డు దాటే ప్రహసనం ఒకటి. ఎంతసేపు చూసినా అసలు ఈ ట్రాఫిక్కు ఆగదే ?
ఇలాంటి ఇరుకు రోడ్ల మీద భలే కష్టం. ఇటు సిగ్నళ్ళూ ఉండవు, ట్రాఫిక్ పోలీసూ ఉండడు. మనవాళ్ళకా క్రమశిక్షణా ఉండదు. ఇక లాభం లేదు, రిస్కు తీసుకునయినా అవతలి వైపుకెళ్ళాల్సిందే.

హమ్మయ్య! దాటేసాను.

విరల్ గాడి కొత్త కారు బాగుంది. స్విఫ్ట్. నేనూ కొనాలి. ఎన్నాళ్ళు ఈ బైకు మీద ?
కొనడానికేం గానీ రోజూ పదిహేను కిలోమీటర్లు ఆఫీసుకి వేసుకెళ్ళాలంటే చచ్చినట్టే. అదీ ఈ రద్దీలో. హాయిగా ఆఫీసు క్యాబు ఎక్కి గంట సేపు పడుకుంటే దింపుతాడు. అయినా ఈ సమయంలో ఎందుకులే ? కొంత డబ్బు చేతిలో ఉంటేనే మంచిది.
ఇంకా నయం నేను షేరు మార్కెట్టులో ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. లేకపోతే బుక్కయిపోయేవాడిని. ఇప్పటికే నా స్టాక్ ఆప్షన్లు దొబ్బినియ్యి. పోన్లే కనీసం మార్కెట్లు ఈ స్థితికి రాకముందే కనీసం హైకులొచ్చాయి. లేకపోతే ఓ రెండు మూడేళ్ళు ఏమీ లేకపోయేది.

అన్నట్టు అసలు ఇప్పుడు ఎవడూ ఉన్న చోటు నుంచి కిక్కురుమనట్లేదు. మరే! అన్ని చోట్లా లే ఆఫ్‌లు జరుగుతుంటే ఇంకెక్కడికి వెళ్ళేది.

అయ్యయ్యో! ఆ గుడ్డి అమ్మాయి రోడ్డు దాటలేకపోతోంది. సహాయం చెయ్యనా ?
ఎవరయినా పాపం దాటిస్తే బాగుండు. పోనీ నేనే దాటిస్తే. దాటించనా ? వెళ్ళనా ?
హమ్మయ్య… ఎవరో ఆటోవాడు పాపం మంచోడు దాటిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు.

అయ్యో! వాన పెరిగిపోతోంది. జాకెట్టు తెచ్చుకునుండాల్సింది. సర్లే ఇంకో ఫర్లాంగే కదా. తొందరగా నడిస్తే మంచిది. ఇంటికి దగ్గరగా ఈ షాపింగు మాలు రావడమేమో గానీ రోడ్డు నిండా అడ్డంగా కార్లు పార్కు చెయ్యడమే… అసలు బుద్ధుండదు వెధవలకి. ఇంత పెద్ద కార్లు తీసుకొచ్చి రోడ్డుకడ్డంగా పెడితే మిగతా వెహికిల్స్ ఎలా వెళ్ళాలి ?
వీళ్ళకి నిజంగా పెద్ద పెద్ద జరిమానాలెయ్యాలి. అప్పుడు గానీ బాగుపడరు.

హమ్మయ్య. గేటొచ్చేసింది. నేను పైకెళ్ళే వరకూ కరెంటు పోకుండా ఉంటే బాగుండు. మళ్ళీ ఏడంతస్థులు ఎక్కాలి చచ్చినట్టు. ఈ ముసలి వాచ్‌మెన్ వెధవ ఎప్పుడూ ఉండి చావడు. వీడికి డబ్బులు దండగ.

కాలింగు బెల్లు కొట్టకుండా తలుపు మీద ఈ టకటకలాడించడం అలవాటయిపోయింది నాకు. అమ్మకి కూడా నేనే అని తెలిసిపోతుంది.
తలుపు తెరుచుకుంది. ఆహ్! అమ్మ…

ఇది చూడండి: ఇది కల్పితమే! కానీ నా ఆలోచనలూ ఒక్కోరోజు అలా ఎడతెగకుండా కలగాపులగంగా సాగుతాయి. స్వాతిలో బాపు గారి కోతి కొమ్మచ్చి ఫీచరు లాగా 🙂

నాదా ? …. కాదా? …. – ఓ చిన్న కథ

నాదా? …. కాదా ? ….

డబ్బులు తగలేసి చాలా రోజులవడంతో ఫోరం మాలు కేసి బయలుదేరాను.

ఈ మధ్య ఆఫీసుకి కాబ్ లో వెళుతుండడంతో నాకెంతో ఇష్టమయిన నా బైకు కాస్తా అలిగింది.
దాని అలక తీరుద్దామని కాస్త దాన్ని సవరించి కిక్కు కొట్టగానే “ఊ…” అంటూ మూలిగింది. కాసేపు ఆక్సిలరేటరు తిప్పిన తర్వాత గర్జించింది.

అసలు నేను ఒంటరిగా షాపింగ్ చెయ్యను. కానీ ఏం చెయ్యను. పరిస్థితులు అలా తగలడ్డాయి.

పాపం నెల పైగా బైకుని బయటకు తీయలేదేమో దాని బాటరీ కాస్తా డౌనయింది. నాకు తిండి కూడా పెట్టకుండా నడుపుతావా అంటూ సూచీ కేసి బేలగా చూసింది.
సరే ముందు నీ ఆకలి తీరుస్తానని దానిని ఇంటి పక్కనున్న హెచ్పీ పెట్రోల్ పంపు దగ్గరికి తీసుకెళ్ళాను.

ఏమిటో వారాంతంలో కూడా పెద్ద లైనే ఉందక్కడ.
జనాలందరూ లక్షాధికారులూ, కోటీశ్వరులేమో మరి కార్లలో లీటర్ల కొద్దీ పెట్రోలు కొట్టించుకుంటున్నారు. నేను మాత్రం ఓ లీటరుతో సరి పెట్టుకున్నా.

నాకనుమానమొచ్చి చూస్తే పొల్యూషన్ సర్టిఫికెటు కూడా ఓ నెల రోజుల క్రితం ఎక్స్పైర్ అయిపోయింది. సరే వచ్చినప్పుడే పనులన్నీ కానిచ్చెయ్యాలి అని చెప్పి అక్కడే ఉన్న వాడి దగ్గర కెళ్ళి ఓ పొల్యూషన్ సర్టిఫికెట్టు కూడా తీసుకున్నా. అలాగే కాస్త నా బైకు టైర్లు వెడల్పు చేయించి ఆక్సిలరేటరు తిప్పాను.

ఎందుకో మరి మెయిన్ రోడ్డు కంటే నాకు, నా బైకుకీ సందులే ఇష్టం.
వెళ్ళాల్సిన చోటికి నేరుగా వెళ్ళకుండా కాస్త అటూ ఇటూ చక్కర్లు కొట్టి, కాసేపు ఆ చక్కని వాతావరణాన్ని ఆస్వాదించి ఫోరం మాలు కేసి పరిగెత్తించాను నా బైకుని.

అసలు మాలులంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అలాగని ఇష్టం లేదనీ అనలేను.
ఏమిటో అక్కడ వందలాది జనాలలో ఉక్కగా ఉంటుంది. తిరుణాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది. అలాంటి చోటికి ఒక్కణ్ణే వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది. అయినా తప్పదు.

రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు. తొందరగానే చేరాను . బైకుకో టికెట్టు కొనుక్కుని దానిని పార్కు చేసి లోపలికి వెళ్ళాను.
బెంగుళూరులో సగం మంది వారాంతాలలో ఈ మాల్స్ లోనే పడుంటారేమో ?
గోల గోలగా ఉంది. భార్యా భర్తలు, గర్లు ఫ్రెండు బాయ్ ఫ్రెండులూ, స్నేహితులూ, స్నేహితురాళ్ళూ, పిల్లలు, నాలాంటి ఒంటరులు అందరూ ఈగల్లా ముసురుతున్నారు.

ఓ సారి చుట్టూ చూసాను. రకరకాల షాపులు, షోరోములు. జీన్సు, షూసు, టీ షర్టులు, తిండి వస్తువులు, పుస్తకాలు ఒకటేంటి అన్నీ అమ్ముతున్నారు. డబ్బెక్కువయినా జనాలు కొంటున్నారు.
కొంత డాబు కోసం, కొంత కొనగలిగినందుకు.

ఎందుకో నేనిక్కడ చెందను అనిపించింది. అయినా ధైర్యంగానే షాపుల అద్దాల్లోంచి తొంగి చూస్తున్నాను.
అరే… ఇక్కడేదో సేల్ ఉందే అని లివైస్ జీన్సు షోరూములోకి వెళ్ళాను.
బయట యాభై పర్సెంటు తగ్గింపు అన్నాడు గానీ లోపలికెళితే ఒక చిన్న టేబుల్ మీద కొన్ని జీన్సు, టీ షర్టులు పడేసి వీటికి మాత్రమే తగ్గింపు అని చూపించాడు. సరే నా లాంటి జనాలను ఆకర్షించడానికి ఇదో విధానం.

అందులోనే కొద్దిగా బాగున్న జీన్సు ఒకదాన్ని ఎంచుకుని ట్రయల్ రూముకేసి నడిచాను. ఫర్లేదు బానే ఉంది. బానే ఉందా ? లేక నాకు నేనే బాగుందని సర్దిచెప్పుకున్నానా ?
సర్లే ఏదో ఒకటి. కాస్త సైజు ఆల్టరేషను చెయ్యమని చెప్పి దాన్ని బిల్ చేయించుకుని బయటకొచ్చాను.

నిజం చెప్పుకోవాలి. ఇలాంటి మాల్స్ కి వస్తే ఒకటికి రెండు కొంటాము మనం. సరే ఇక ఆ జీన్సు మీదకి షర్టో, టీ షర్టో కొనాలి కదా. పక్కన షాపులు చూసుకుంటూ ముందుకెళుతున్నాను.

అరె స్కల్లర్స్ లో ఇదేదో పాంటు బాగుందే అని దాంట్లో దూరాను. అటూ ఇటూ చూడగానే పాంటు నచ్చేసింది. మ్… ఈ రంగు నా దగ్గర ఇప్పటికే ఉందా ?
ఛా! అసలు అర్థం కాదేంటో. ఎన్ని సార్లు కొన్నా నా దగ్గర ఉన్న రంగులకి దగ్గరవే కొంటుంటాను.
అసలు తెలీట్లేదు. సర్లే ఏదో ఒకటి. అంత ఆలోచించేంత ఓపిక లేదని దానిని కూడా ఆల్టరేషను కి ఇచ్చాను. షాపతన్ని అడిగితే పది నిముషాలు పడుతుందని చెప్పాడు.

ఇప్పుడు రెండు పాంట్లకి షర్టులు కొనాలి. హు…
పక్కనే “లీ” లో కొత్త సరుకు వచ్చినట్టుంది. సరే ఇక దాంట్లోకి.
అమ్మో! ఏంటిది ఇంతేసి ఉన్నాయి ధరలు ఇక్కడ అనిపించింది. అంతలోనే మంచి షార్టు షర్టు ఒకటి కనిపించింది. ధర వెయ్యి.
తప్పుతుందా ? దానిని బిల్లు వేయించాను.

హు… ఈ ఎస్కలేటర్లెప్పుడూ మనముండే వైపుకి కాక ఇంకో వైపుకే ఎందుకుంటాయో ?
అటు నడిచి వెళ్ళేసరికి ఒక ఐస్ క్రీం తింటే బాగుంటుందనిపించింది.
కింది కొచ్చి మెక్ డోనాల్డ్స్ కి వెళ్ళి ఓ సాఫ్టీ కొనుక్కుని లాగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. అందాలని ఆస్వాదించడానికి సమయం దొరికింది. అలాగే బయటకెళ్ళి కాసేపు అక్కడ అరుగు మీద కూర్చుని తింటున్నా. ఆకాశం మబ్బు పట్టి ఉంది. వర్షమొస్తుందేమో ?

త్వరగా షాపింగు ముగించుకుని ఇంటికెళ్ళిపోతే మంచిదనిపించింది.
లోపలికెళ్ళాను మళ్ళీ. ఇక మిగిలిన షర్టయినా కొద్దిగా తక్కువలో కానిస్తే బాగుంటుందేమో ? ఊ… వెస్ట్ లైఫులో ఏమన్నా తక్కువకొస్తాయేమో అని అటు నడిచాను. చూస్తే ధరలు “సరసం”గానే ఉన్నాయి.

చుట్టూ అన్నిటినీ గమనిస్తుంటే ఒక షార్టు కుర్తా, ఒక టీ షర్టు, ఇంకొక పాంటు నా చేతుల్లోకొచ్చాయి.
మళ్ళీ మతి తిరిగి రావడంతో టీ షర్టు మాత్రం కొని బయటకొచ్చా. హమ్మయ్య షాపింగంతా అయిపోయింది. సరే అని ఆల్టరేషను కి ఇచ్చిన పాంట్లు రెండూ తీసుకున్నాను.

బయటకొస్తుంటే “జాకీ” కనిపించింది. లోపలి కెళ్ళి కావలసినవి తీసుకున్నాను.
ఎంతయింది ? అని అడిగితే రెండొందల ముప్ఫై అన్నాడు.
ఐదొందల నోటు ఒకటి తీసి అతని చేతికిచ్చాను. చిల్లర తిరిగిచ్చాడు. ఒక చిరునవ్వు విసిరి బయటకొచ్చాను.

ఎస్కలేటరు దిగుతుంటే అనుమానమొచ్చింది. అదేంటి బిల్లు నాలుగొందల అరవై అయింది. అతనేమో రెండొందల ముప్ఫై తీసుకున్నాడు అని ?
బిల్లు బయటకి తీసి అతనిచ్చిన చిల్లర చూసుకున్నాను. నేననుకున్నట్టుగానే రెండొందల ఢెబ్బై రూపాయలున్నాయి. బిల్లు చూసాను నాలుగు వందల అరవై.
అయ్యో! పొరపాటున ఎక్కువిచ్చేసాడే. ఇప్పుడేం చెయ్యను ? వెనక్కెళ్ళి ఇచ్చేసి రానా ?

అంతలో మనసులో అనిపించింది.. అరే అప్పనంగా రెండొందల ముప్ఫై రూపాయలు వస్తే ఎందుకు కాదనాలి ? నేనేమన్నా తప్పు చేసానా ?
అయినా షాపు వాడు కదా పొరపాటు చేసింది. దానికి వాడు అనుభవిస్తే తప్పేమిటి ?

నేను కావాలని దొంగతనం చెయ్యలేదు. ఎవరినీ మోసం చెయ్యలేదు ఈ డబ్బు కోసం.
ఎలాగో నా వద్దకు చేరింది. ఉంచేసుకుంటే తప్పేంటి ? మనసు పరి పరి విధాల సర్ది చెప్పుకుంటుంది.

అయినా ఇందాక నేను షాపుకి వెళ్ళినప్పుడు వాడు సరిగా మాట్లాడలేదు అనుకుంట నాతో.
షాపు వారికి కూడా కస్టమర్లను సరిగా ట్రీట్ చెయ్యడం రాదు. అలాంటి వాళ్ళకి నేను డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలి. వాళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే.

అంతే… డబ్బు నేనే ఉంచేసుకుంటే సరి.
కాళ్ళు బయటకేసి కదిలాయి.

రెండడుగులు వేసిన తర్వాత కాళ్ళు కదలనంటున్నాయి.
హు… ఇప్పుడు ఏమిటి ? అంతా డిసైడయిపోయిందిగా ?
అంతలోనే ఆత్మారాముడు మళ్ళీ… మరి నీకు ఎక్కువగా ఇచ్చిన డబ్బులు నీవి కాదుగా న్యాయంగా. దానిని నువ్వెలా ఖర్చు పెడతావు ?
ఇప్పుడు నావేగా… ఇందాక అదేగా అనుకుంది.
కానీ నువ్వు ఏమన్నా సంపాదించావా ? నీకు తెలిసీ తప్పుగా డబ్బు వాడుకుంటున్నావంటే అది దొంగతనమే అవుతుందిగా మరి ?
ఛ ఛ! లేదు లేదు. అది దొంగతనం ఎలా అవుతుంది ? నేను ఎవరి దగ్గరనుంచీ డబ్బు తీయలేదుగా. పొరపాటున నా దగ్గరకు వచ్చింది అంతే.
సరే నీ ఇష్టం. నువ్వు చేస్తున్నది తప్పని నీకూ తెలుసు. నే చెప్పాల్సింది చెప్పాను.
ఊ… పెద్ద చెప్పొచ్చావులే. ఇంకో నాలుగడుగులు పడ్డాయి.

మళ్ళీ…
ఛా! సావధానంగా ఉండనీయవు కదా నన్ను.
సరే వెనక్కెళ్ళి డబ్బులు తిరిగిచ్చేద్దామా ? ఊరకే వచ్చిన డబ్బులు… ప్చ్.
పద. ఇంక చెప్పేదేముంది.

మళ్ళీ ఎస్కలేటరు ఎక్కి షాపులోకి వెళ్ళాను.
కౌంటరు దగ్గర ఉన్నతను చిరాగ్గా చూస్తున్నాడు. ఇప్పుడే కొని వెళ్ళిన వాడు తిరిగొచ్చాడంటే ఏదో కిరికిరి అని.
మీరు నాకు డబ్బులెక్కువిచ్చారు అన్నా అతని దగ్గరకెళ్ళి.
అతను నాకు డబ్బు తక్కువిచ్చాడని నేను అన్నట్టు అర్థం చేసుకుని మొహం చిరాగ్గా పెట్టాడు.
హు… ఇలాంటి వాడికా డబ్బు తిరిగిద్దామనుకుంది…

బిల్ చూపించమన్నాడు. ఏంటి సంగతి చెప్పు అన్నాడు ?
ఏమీ లేదు బిల్లు నాలుగొందల అరవై. నేను మీకు ఐదొందలు ఇచ్చాను. కానీ మీరు నాకు తిరిగి రెండొందల ఢెబ్బై రూపాయలిచ్చారు అన్నాను.
ఆశ్చర్యం! అతని మొహంలో.
ఓ ఈజిట్ ?? బిల్ వంక తీక్షణంగా చూసాడు.

పక్కన నుంచి అతని పార్ట్‌నరో, ఎవరో కొరకొరగా చూస్తున్నాడు అతని వైపు.
ఓ సారీ అన్నాడు నా దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకుంటూ.
మొహంలో ఇందాక చిరాకు మాయమయింది. ఓ చిరునవ్వు వెలిసింది.

నా మనసెందుకో సడన్ గా తేలిక అయింది. ఎంతో ఆనందంగా గొప్ప పని చేసిన అనుభూతి కలిగింది.
ఇట్స్ ఓకే… నో ప్రాబ్లెం. అన్నా తిరిగి ఇంకో చిరునవ్వు విసురుతూ.

హమ్మయ్య!
ఇప్పుడు అడుగులు చకచకా పడుతున్నాయి. మాంచి పాట కూడా ఆ పాటున హం చెయ్యాలనిపించింది.
నాలో నేనే హం చేసుకుంటూ బైకు పార్కు చేసిన బేసుమెంటు కేసి నడుస్తున్నాను.

చల్ల గాలి మొహానికి తగులుతూ ఉంది. హాయిగా ఉంది.
షాపింగు చేసిన బాగులని బైకుకి తగిలించి కిక్ కొట్టాను. ఈ సారి మొదటి సారికే స్టార్టయింది బండి.

రోడ్డు మీదకి రాగానే మబ్బులు కరిగి సన్నని జల్లు మొదలయింది.
ఆహా! ఇలా వర్షంలో బైకు నడిపి ఎన్నాళ్ళయిందో…

చల్లని గాలి, సన్నని తుంపర మొహం మీద పడుతుంటే బైకు వేగం నెమ్మదిగా పెరిగింది.
వర్షం నా వంటిని కాక నా మనసుని కడిగేస్తున్నట్టనిపించింది.

ఇందాక ఆ డబ్బు తిరిగివ్వకపోతే నేనింతే ఆనందంగా ఉండేవాడినా ?

బైకు సాఫీగా ఇంటికేసి సాగుతుంది.

ఇది చూడండి: కథలు రాయడంలో నాకు అనుభవం లేదు. అసలు ఇది కథగా క్వాలీఫై అవుతుందో లేదో కూడా తెలీదు. ఇక మీ అభిప్రాయాలు చెప్పండి మరి 🙂

55 మాటలతో కథ…

అలారం మోగింది.
అమ్మాయి: ఆ…(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి?
అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే…
అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా?
అబ్బాయి: హు…
ఇంతలో బయట కారు శబ్దమయ్యింది.
అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే?
అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో.
అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా.
అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు? కబోర్డ్ వైపు కదిలాడు.
గన్ను శబ్దం…
అమ్మాయి: నో…

అలారం మోగింది. అబ్బాయికి మెలకువొచ్చింది, బయట కారు శబ్దం….