కనులు కనులతో కలబడితే …

ఆహా… కన్నుల గురించి మాట్లాడాలంటే మాటలా ?

మనకీ ప్రపంచాన్ని చూపించేవి కన్నులు. చూడ చక్కని అందాలను ఆస్వాదించేలా చేసేవి కన్నులు.
ఒక అందమయిన ముఖానికి మరింత అందాన్ని తెచ్చేవి కన్నులు. మీ మనసులోని భావాలను ఇట్టే ఇతరులకు తెలియ చెప్పేవీ కన్నులే.

మీనాల వంటి కన్నులు, చారడేసి కళ్ళు అని ఎలాంటి కన్నులు చూడ చక్కగా ఉంటాయో రాస్తారు. అలాగే కాటుక రాసిన కన్నులు ఎంత అందంగా ఉంటాయో అందరికీ తెలిసిందే.

మీరు సరిగా గమనిస్తే మీరు ఒక మనిషిలోని భావాలను వారి కన్నుల ద్వారా ఇట్టే పట్టెయ్యవచ్చు. ఉబికి వస్తున్న కన్నీరు వారి మనసులో అలజడిని, పసి పాప నిర్మలమయిన కన్నులు వారి మనసులోని అమాయకత్వాన్ని, చలాకీగా అటూ ఇటూ తిరిగే చిన్నదాని కన్నులు చిలిపితనాన్ని, పెద్దవిగా చేసిన ఎర్రబారిన కన్నులు రౌద్రాన్ని ప్రకటిస్తాయి.

ఆనాటి అన్నగారు కనుబొమలు ఎగరేసి, కన్నులు పెద్దవి చేసి గర్జించినా, ఈ నాటి ఐశ్వర్యా రాయ్ “ఆంఖోన్ కీ గుస్తాఖియాన్” అంటూ కన్నులతో ఎన్నెన్నో భావాలను ప్రకటించినా అది వారికే చెల్లింది. అలాంటి భావ ప్రకటన మన శరీరంలో ఉండే మరే ఇతర అంగాలతోనూ సాధ్యం కాదేమో.

పడుచు వయసులో ఉన్న ఒక చిన్నది ఒక చిన్నవాడిని చూసి కన్నులు దించుకున్నది అంటే సిగ్గు ప్రకటించి నువ్వు నాకు నచ్చావు అని చెప్పక చెప్పినట్టే. ఇక అదే చిన్నది మిమ్మల్ను చూసి కళ్ళు పక్కకి తిప్పుకుందంటే ఇక నీకు సెలవు అని అర్థమే.

నాకు మటుకు ఒక మనిషిని చూస్తే ఆ మనిషి లోని నిజాయితీ, మనసు ఆ మనిషి కళ్ళల్లో కనిపిస్తుంది.
సూటిగా కళ్ళళ్ళోకి చూసి మాట్లాడే నిజాయితీ కలిగిన వారని, బిత్తర చూపులు చూస్తూ కళ్ళు ఆ పక్క ఈ పక్క కదిలిస్తూ తప్పు చేసినవారినీ, నేల చూపులు చూస్తూ కాలి బొటనవేలును నేల మీద గీస్తున్నట్టు సిగ్గు పడే చినదాన్ని మన నవలల్లో, పుస్తకాల్లో రాస్తారు. అప్రకటితమయిన ప్రకటిత భావాలను మన కళ్ళు అందరికీ తెలుపుతాయి.

మరి అలాంటి కన్నులను నిర్లక్ష్యం చేస్తే ? ఇప్పుడు పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో కనీసం ముప్ఫై పర్సెంటు వారికి ఏదో కంటికి సంబంధించిన సమస్య ఉంటుందని చదివాను. అంతెందుకు ఒక రెండేళ్ళ కిందటి వరకూ చక్కగా ఉన్న నా కంటిచూపు లాప్టాప్ రావడంతో మందగిస్తుందా అని అనిపిస్తుంది. డాక్టర్ దగ్గర కెళితే అవును కంట్లో తేమ తక్కువుంటుంది కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు, ఎక్కువ సార్లు కన్నులు ఆర్పము అందుకని కంటి చూపు మందగిస్తుంది. ప్రతీ అరగంటకయినా ఒకసారి కళ్ళు మానిటర్ మీద నుంచి తిప్పి కాస్త రెస్టు ఇవ్వాలని చెప్పారు. ఒక కళ్ళజోడు తగిలించారు. నామోషీతో నేను సరిగా పెట్టుకోననుకోండి. అది వేరే విషయం. ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు ? కంటి చూపు లేని అంధకారం ఎంత భయంకరమయిందో ఒక్క సారి కళ్ళు మూసుకుంటే మనకే అవగతమవుతుంది.

ఒక అంధ విద్యార్థి కథ అయిన బ్లాక్ ఎంతగా గుండెలను పిండుతుందో చూసిన వారికి తెలిసే ఉంటుంది.

అందుకనే మీ అందమయిన కన్నులను కాపాడుకోండి. భావాలను ప్రకటించే స్వేచ్చను నాలుగు కళ్ళతో కోల్పోకండి. లేజర్ ఆపరేషన్లూ, కాటరాక్ట్లూ అవసరం రాకుండా చూసుకోండి.