మే 23, 2008

కలలుంటాయి… కొన్ని సార్లు అవి నిజమవుతాయి

Posted in కల, ట్రెక్, హిమాలయాలు వద్ద 6:05 సా. ద్వారా Praveen Garlapati

ఆ స్థితిలోనే ఉన్నాను ప్రస్తుతం నేను…

గత నెల రోజులుగా బ్లాగులలో ఎందుకు కనిపించడం లేదని ఎవరయినా అనుకునుంటే దానికి కారణం ఆ కల నిజం చేసుకోవడమే.

ఎక్కడికెళ్ళావు అనడిగితే రెండు మాటలలో “హిమాలయాల కెళ్ళాను”.
లేదు లేదు నేను జీవితం మీద విరక్తి పుట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళలేదు 🙂

అడ్వెంచర్లంటే ఇష్టం ఉన్నా, ట్రెక్కింగంటే ఆసక్తి ఉన్నా సమయం దొరికినప్పుడు చిన్న చిన్నవాటితో సరిపెట్టుకోవలసి వచ్చింది ఇన్నాళ్ళూ. ఈ సారి మాత్రం కాదు.

ఒక రోజున సాయంత్రం నేను, నా స్నేహితుడు హర్ష ఇద్దరం మాట్లాడుకుంటుండగా హిమాలయాల గురించి సంభాషణ మొదలయింది.
అక్కడ మంచు ఎంత బాగుంటుందో, మంచు కొండలు ఎంత అందంగా ఉన్నాయో వెతుకుతూ బొమ్మలు చూస్తున్నాము. మనమూ వెళ్ళగలిగితే ఎంత బాగుంటుందో అని అనుకున్నాము ఇద్దరమూ.

అంతలోనే నాకు హిమాలయన్ ట్రెక్ గురించి ఎక్కడో చదివిన గుర్తొచ్చింది. ఎవరో ఆర్గనైజ్ చేస్తారని, నా బ్లాగు స్నేహితుల్లో ఎవరో వెళదామని అనుకుంటున్నానని చెప్పినట్టు గుర్తొచ్చింది.

అది గుర్తు రాగానే ఇద్దరమూ ఇంకాస్త వివరాలు శోధించడం మొదలు పెట్టాము. వివరాలు చిక్కాయి చేతికి. కానీ ట్రెక్కే పదకొండు రోజులు. అది కాక వెళ్ళి రావడానికి ఎంత లేదన్నా నాలుగు రోజులు. మరి మొత్తం ఒక పదిహేను ఇరవై రోజుల దాకా సెలవులు అవసరమవుతాయి.
తెలియందేముంది అన్ని రోజులు సెలవు పెట్టాలంటే మాటలా ? అసలు దొరుకుతుందా ?

సరే ఓ రాయేసి చూద్దామని ఇద్దరమూ మా మేనేజర్ల చెవిన వేసాము మేము ఇలా ట్రెక్కుకి వెళదామనుకుంటున్నాము. ఒక రెండు వారాల పైగా సెలవు కావాలని.
ఏ కళనున్నారో ఇద్దరి మేనేజర్లూ ఒప్పుకున్నారు. ఇకనే వెంటనే వెళ్ళి ఆ ట్రెక్కులో ప్లేసు ఖరారు చేసుకున్నాము.

అనుకున్నామే గానీ దానికి ఎంత ఫిట్‌నెస్ అవసరమో, చెయ్యగలమో లేదో అన్న అనుమానాలు లేకపోలేదు. అయినా ఆ మాత్రం సాహసం చెయ్యనిదే మజా ఏముందని ఇద్దరమూ డిసైడయిపోయాక వెనుదిరిగేదేముంది ?

ఇదుగో పోయిన నెల ఆ ట్రెక్కుకి వెళ్ళి ఆ పదకొండు రోజులు ఒక వేరే ప్రపంచంలో గడిపి, స్వర్గం లో ఉన్నామా ? అనిపించి, ఆ కల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను.

ఇంతకీ ట్రెక్కు సంగతులేమిటంటారా ?
కొండలు ఎక్కడాలు, మంచు తుఫానులు, విపరీతమయిన మంచులో సన్నని ఇరుకు మూలలు దాటడాలు, జనాలు జారి ఓ ముప్ఫై అడుగులు పడిపోవడాలు అన్నీ ఉన్నాయి. ఈ వారాంతంలో తీరికగా ఆ ట్రావెలాగుని రాయగలనేమో చూడాలి మరి.

అంత వరకూ ఈ కింది చిత్రాన్ని ఎంజాయ్ చెయ్యండి.

ఇంకా ఎన్నో చిత్రాలు చూపిస్తా, చెబుతా…