Context is everything !

నేపథ్యం. ఎందుకో “కాంటెక్స్ట్” అన్న పదానికి నేపథ్యం అంత దగ్గరగా అనిపించట్లేదు. నా టపా టైటిలుని “నేపథ్యంలోనే ఉందంతా …” అని పెడదామనుకున్నా… కానీ నా నేపథ్యం వల్లనేమో అది నాకు రుచించలేదు 🙂

ఇంతకీ ఈ టపా ఎందుకంటే నిన్న మాలతి గారి బ్లాగులో గురించి ప్రస్తావించడం, దానికి వ్యాఖ్య రాస్తూ దాని గురించి నేను ఆలోచించడం జరిగింది.
ఆ ఆలోచనలు అలా ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి.

అసలు నేపథ్యం అంటే ఏమిటి ? మనిషి విషయాలను అర్థం చేసుకోవడంలో దాని పాత్ర ఎందుకు ఉంది, ఎంతవరకూ ఉంది ? అనే ఆలోచనలు మొదలయ్యాయి.

ఒక మనిషి పెరుగుతున్నప్పుడు అతని చుట్టూతా ఉన్న పరిసరాలు, పరిచయాలు, అనుభవాలు, అనుభూతులు, స్నేహాలు అన్నీ అతని వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. ఆ ప్రయత్నంలో ఒక మనిషి అందరినీ తన మాటలతో ఆకట్టుకుంటూ, అందరికీ మంచి చేస్తూ, మంచి వాడిగా పేరు తెచ్చుకోవచ్చు. లేదా చెడు వైపుకి మొగ్గి, ఎవరికీ అర్థం కాని మూర్ఖుడిగా అవతరించవచ్చు.

అన్నట్టు ఇక్కడ మంచితనం, మూర్ఖత్వం కూడా ఆయా నేపథ్యాల ప్రకారమేనండోయ్. ఎందుకంటే నాకు మంచితనం అనిపించింది మరొకరికి చేతకానితనం లాగా అనిపించవచ్చు. నాకు మూర్ఖత్వం అనిపించింది ఇంకొకరికి పట్టుదలగా కనిపించవచ్చు. నాకు విపరీత ఆలోచనలు అనిపించినవి ఇంకొకరికి చాలా సాధారణ ఆలోచనలు కావచ్చు. అవన్నీ అలా ఆలోచించటానికి వారి నేపథ్యమే కారణమూ కావచ్చు.

ఉదా: ఫెమినిస్టుల ఆలోచనలు నాకు అర్థం కావు. మగవాళ్ళు పశువులు, ఆడవారిని హింసించడానికే పుట్టారు, ఆడవారిని అణగదొక్కటానికే వారున్నది అని వాదించే ఫెమినిస్టులంటే నాకు మా చెడ్డ చిరాకు. కొన్ని సార్లు వారు చెప్పేమాటలకి నాకు విపరీతంగా కోపం పుట్టుకొస్తుంది. ఏమిటి అసలు వీరు మగవాళ్ళలో మంచిని చూడనేలేరా ? అసలు ఇంత పెద్ద లోకంలో వీరికి మంచితనం ఉన్న మగవాళ్ళే కనిపించరా ? అనే ప్రశ్నలు నన్ను తొలుస్తాయి.
అయితే కొంత ఆలోచిస్తే నాకు తట్టేదేమిటంటే నా ఆలోచనలు నేను పెరిగిన నేపథ్యం, నా దృక్పథం వల్ల కావచ్చు. మా ఇంట్లో గానీ, నా చుట్టుపక్కల గానీ నేను ఇలాంటి మగవారిని ఎక్కువ చూసి ఉండకపోవచ్చు. అప్పుడు నేచురల్ గా నాకు ఎక్కువ మంచితనమే కనబడుతుంది. చెడు కనిపించదు.
అలాగే కుటుంబంలో పెత్తనం చలాయించే మగవారు ఉన్నారనుకోండి, భార్యని మానసికంగా/శారీరకంగా హింసించే భర్త ఉన్నాడనుకోండి వారికి ఈ ఫెమినిస్టుల రాతలు దగ్గరగా అనిపించవచ్చు. వారికి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని కూడా అనిపించవచ్చు.
ఆ నేపథ్యం గురించే నేను మాట్లాడేది.

మా సాఫ్టువేరు ఫీల్డులో ఒక జోకుంది. ఇద్దరు బిచ్చగాళ్ళు, ఇద్దరు సాఫ్టువేరు ఇంజినీర్లు కలిస్తే మాట్లాడుకునే ఒకే వాక్యం ఏమిటి అని ?
దానికి సమాధానం నువ్వే ప్లాటుఫారం మీద పని చేస్తున్నావు అని 🙂
అవును మరి ఇద్దరికీ ఈ ప్రశ్న ఒక్కటే దాని నేపథ్యమే వేరు.

ఇంకో నేపథ్యం చూద్దాము. బ్లాగుల్లో అస్పృశ్యత, అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు. నాకయితే ఇవేవీ ఈ లోకంలో లేవు అని అనిపిస్తుంది. దానికి కారణం నేను నగరాల్లో పెరగడం, ఓపెన్ మైండ్ ఉన్న తల్లిదండ్రుల పెంపకంలో పెరగడం, అవి పట్టించుకోని స్నేహితులుండడం కావచ్చు. అందుకని వారు చెప్పే విషయాలు వేటితోనూ నేను రిలేట్ కాలేను. ఆ బాధలు అర్థం చేసుకోలేను. కాకపోతే కొంచం ఆలోచన పెట్టగలిగితే వారి వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం మాత్రం చెయ్యగలను.
మరి అదే బ్లాగు చదివేవారిలో అలాంటి సంఘటనలు ఎదురయ్యి, అనుభవించిన వారున్నారనుకోండి వారు ఆ బ్లాగరి చెప్పేదానితో అద్భుతంగా రిలేట్ చేసుకోగలరు. అవే రాతలు వారిలో ఆవేశం కలిగించి ఇలాంటివి ఈ సమాజంలో రూపుమాపాలి అనే ఆలోచనలు కలిగించవచ్చు.
మరి ఇక్కడ ఎవరి ఆలోచన సరి ఎవరి ఆలోచన తప్పు ? ఇద్దరిదీనూ. ఎందుకంటే మొదటి వ్యక్తి అయిన నా దృక్పథంలో ఈ రెండో కోవకి చెందినవారిది తప్పు. రెండో కోవకి చెందినవారికి మూర్ఖుడనయిన, అర్థం చేసుకోలేకున్న నేను తప్పు.

మొన్నొక సంఘటన జరిగింది. ఒక బ్లాగులో నేను ఏదో విషయం గురించి సూటిగా నా అభిప్రాయం చెప్పాను. దానికి ఆ బ్లాగరి వ్యంగ్యంగా ఎత్తిపొడుపులతో నాకు సమాధానం ఇచ్చారు. నాకర్థం కాలేదు, అరే ఇంత నిజమయిన విషయం నేను ఇంత సూటిగా చెబుతుంటే ఆయన ఇంత మూర్ఖంగా ఎందుకు సమర్థించుకుంటున్నారు ? అని నాకు కొంతసేపు చాలా కోపం వచ్చింది.
కానీ కొద్దిసేపు శాంతంగా ఆలోచిస్తే నాకు సమాధానం తట్టింది. నా నేపథ్యం, ఆ బ్లాగరి నేపథ్యం వేరు కావచ్చు. నాకున్న విలువలు, నాకున్న అనుభవాలు ఆయనతో పోలిస్తే వేరు అయి ఉండవచ్చనే ఆలోచన రాగానే విషయం అర్థమయింది.
నేను పెరిగింది ఒక మిడిల్ క్లాసు కుటుంబంలో, మామూలు జీవితంలో ఎదిగాను. ఆ తరువాత జీవితం స్థాయి ఎదిగినా నాలో చిన్నప్పటి నుంచీ నేను పెరిగిన ఆ వాతావరణం, నేపథ్యం నరనరానా జీర్ణించుకుపోయాయి. ఏదీ వృధా చెయ్యకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు, తల్లిదండ్రులని స్నేహితులుగా భావించాలి, అందరితోనూ కలుపుగోలుగా ఉండాలి, అనవసరమయిన గోడవల జోలికి పోకూడదు, ఎప్పుడూ నిజం చెప్పాలి లాంటి ఆలోచనలు నా నరనరానా జీర్ణించుకుపోయాయి. అలాగే కొంత ఇంట్రావర్టుగా ఉండడం, కొత్తవారితో అంత తొందరగా కలుపుగోలుగా మాట్లాడలేకపోవడం లాంటివీ నా నేపథ్యం నుంచి వచ్చి ఉండవచ్చు.
అదే ఆ బ్లాగరి పెరిగిన నేపథ్యం వేరు అయి ఉండవచ్చు. నేను విభేదించిన విషయం వారి సర్కిల్లో అతి సామాన్యం అయి ఉండవచ్చు. అదసలు తప్పుగానే కనిపించకపోవచ్చు. అందుకనే ఆయనకి నా ఆలోచనలు ఏ పురాతన కాలం నాటివి అనిపించి ఉండవచ్చు అని.
అలా ఆలోచించిన తరువాత నేను తిరిగి వ్యాఖ్య రాయడం మానుకున్నాను. ఎందుకంటే ఎంత సేపు అక్కడ వాదులాడినా ఎవరి విషయం వారికి సరి అనే అనిపిస్తుంది. మరి నేపథ్యం మహత్యం అది.

సరే ఇవి ఇలాగుంటే ఇంకొన్ని సార్లు మన నేపథ్యం కొన్ని విషయాలను అర్థం చేసుకోనివ్వదు. అదెలాగంటే మాలతి గారి బ్లాగులో నేను చెప్పినట్టు కొన్ని కథలు నాకు అర్థం కావు. వాటి భావం, వాటి వెనకున్న ఆంతర్యం నాకు అంతుపట్టదు. అసలు ఆ రచయిత అలా ఎందుకు రాస్తున్నాడో నాకర్థమే కాదు.
ఉదా: వితంతువు వివాహాలు, కన్యాశుల్కం ఇలాంటి వాటి మీద రచనలు చదివినప్పుడు (తక్కువే అనుకోండి). అప్పుడు నేను అవి అంత తొందరగా అర్థం చేసుకోలేను. వాటి గురించి చదివీ, ఆ రచన జరిగిన కాలంలో సంఘటనలు, మనుషుల స్వభావాలు, పరిస్థితుల గురించి ఒక అవగాహన ఏర్పరచుకున్న తరువాత ఆ రచన నేను కొంత అర్థం చేసుకోగలుగుతాను.

అలాగే రాబిన్ కుక్ నవలలు చదవటం మొదలుపెట్టినప్పుడు మామూలు జనాలకు అవి అంతగా నచ్చవు. ఎందుకంటే ఆయన రాసేది మెడిసిన్ నేపథ్యమున్న నవలలు. వాటిలోని విశేషాలను కథలో మిళితం చేసి నవలలు రచిస్తారు. అవి పూర్తిగా అర్థమవాలంటే ఎంతో కొంత ఆ నేపథ్యం అవసరం. మొదట నాకు ఎక్కలేదు ఆ కథలు, తర్వాత వేరు కారణాల వల్ల ఆసక్తి కలిగి చదవడం మొదలుపెట్టాను. ఆ విషయాల గురించి కొంత నేర్చుకున్నాను. ఇప్పుడు బాగానే నచ్చుతాయి.

నా ఆంగ్ల సినిమా ప్రస్థానంలోనూ నేపథ్యం పాత్ర ఉంది. మొదట్లో నేను పెరుగుతున్న వయసులో, కాలేజీలో నాకసలు ఆంగ్ల చిత్రాలు ఎక్కేవి కావు. ఎందుకంటే నాకు వారి ఆచారాలు, వ్యవహారాలు, సిట్యువేషను పరంగా ఉండే కామెడీ అర్థమయేవి కావు. ఆ యాక్సెంటూ అర్థమయేది కాదు.
కానీ తరవాత్తర్వాత నా పరిధి విస్తరించింది. వివిధ ఆంగ్ల పుస్తకాలు, నవలలూ చదవటం మొదలుపెట్టాను ఇంజినీరింగులో ఉండగా. అందులోని భాష, పద్ధతులు, ఆచార వ్యవహారాలు కొద్ది కొద్దిగా తెలియడం మొదలయింది. అవి తెలిసిన తర్వాత చూసిన సినిమాలు అంతకు ముందుకన్నా బాగా అర్థమవడం మొదలయింది. ఇంకొన్నాళ్ళు గడిచిన తరువాత ఉద్యోగంలో చేరాను. అక్కడ పని తీరు (తెచ్చిపెట్టుకున్నది అయినా సరే), పాశ్చాత్యాలలో ఉన్న సహచరులతో మెలగడం, అక్కడ గుడారం వేసుకున్న స్నేహితుల ద్వారాను విషయాలు తెలిసిన తరువాత (బేబీ షవరు, బాచిలర్స్ పార్టీ చేసుకున్న స్నేహితులు ఉన్నారు నాకు), అంతర్జాలం ద్వారా ఆ విషయాలు నాకు మరింత బాగా అర్థమవడం మొదలయింది. ఇప్పుడు ఆంగ్ల సినిమాలను బాగా అర్థం చేసుకుని చూడగలను.

అందుకనే ఒక విషయం మీద తీర్పు ఇచ్చే ముందు దాని నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. (కోర్టు వారు హత్యని మర్డర్ గానూ, సెల్ఫ్ డిఫెన్సు గానూ నేపథ్యం బట్టి ఎలా తీర్పిస్తారో అలాగన్నమాట)
కానీ ఎంతయినా మనుషులమే కదా ! మన రియాక్షను స్ప్లిట్ సెకన్లలో ఉన్నప్పుడు అన్ని సార్లూ ఇవన్నీ ఆలోచించగలగడం కష్టమే. కానీ సాధ్యమయిన చోట ఈ విధానంలో ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యవచ్చు.

అన్నిటినీ నేపథ్యమే కారణం కాదు గానీ మన జీవితంలో నేపథ్యం తిరుగులేని పాత్ర పోషిస్తుందన్నది మాత్రం నిజం.