ట్రాఫికాసుర హతః …

ఓ రోజు బైకు తీసి ఇంటి నుంచి బయలుదేరా.

అలా రోడ్డు మీదకి వచ్చానో లేదో పక్కన నుంచి జూమ్మని ఓ శబ్దం వినిపించింది. అదేంటబ్బా రాకెట్లని ఈ మధ్య రోడ్డు మీద కూడా నడిచేలా చేస్తున్నారా అని అబ్బురపడుతుంటే కనబడింది దూరంగా, అదేదో “లప్సర్” అంట ఆ బండి మీద ఎవడో రెండు కాళ్ళతోనూ చాలా పొందిగ్గా తోలుతున్నాడని.

పక్కన ఓ నాలుగు కార్లకి సొట్టలు పడి, పది మందికి బొక్కలిరిగి పడున్నారు. వాడు ఓ సాడిజం కలగలసిన విలన్ నవ్వు నవ్వి క్లచ్ మీద నుంచి ఓ కాలు తీసి ఇంకో కాలు మీద వేసుకున్నాడు. ఓ చేతిలో మొబైలు, ఇంకో దాంట్లో ఐపాడు మోగుతున్నాయి.

వామ్మో ఎందుకొచ్చిన గొడవ అని పక్కనే కనిపించిన సందులోకి దూరా ఇలాంటి ట్రాఫిక్కుని తప్పించుకోవడానికి. కొంత సేపు ఏదో ఫ్రీ రోలర్ కోస్టర్ రైడు అనుభవం కలిగింది ఖర్చు లేకుండానే. అక్కడెక్కడో ఒయాసిస్సులా రోడ్డు కనిపిస్తుంటే దానిని అందుకోవడానికి జెయింటు వీళ్ళు ఎక్కి దిగుతున్నా బైకు సహాయంతో. సడన్‌గా ఏంటో పదడుగులు లోతులో ఉన్నా. నా బైకు ఈదుతోంది పాపం. ఇదేంటా అని ఆలోచిస్తే ఓ దీనిని “మనిషిరంధ్రం” అంటారని అర్థమయ్యింది. పాపం నిన్న డ్రైనేజీ క్లీను చేసేవాడెవడో చెయ్యక చెయ్యక పని చేసి అలసిపోయి మూత మూయకుండా వెళ్ళిపోయుంటాడు అని జాలిపడి ముక్కుతూ మూల్గుతూ పైకొచ్చా.

అలా వస్తూనే రోడ్డు కి మూడు సైడులా వెళ్ళడానికి వీలు లేదు అనే బోర్డులున్నాయి. అదేంటబ్బా మూడు వైపులా వెళ్ళడానికి వీలులేకపోతే ఇప్పుడెలా అని ఆలోచించి, అరే ఇంత వెధవాయిని ఎలా అయ్యానో ఇంకా ఓ సైడు వదిలారుగా అని వచ్చిన సైడునే వెనక్కి తిప్పా బైకుని. మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకొచ్చేసరికి అదేంటో ఓ రెయిల్ కంపార్టుమెంటుని మోసుకెళుతూ ఓ లారీ కష్టపడుతోంది. దాని కింద ఓ రెండు మూడు కార్లు, దాని పైన ఓ పది బైకులూ డ్రైవ్ చేసుకుంటున్నాయి. అబ్బో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అని కాసేపు నడుం నెప్పొచ్చి బైకు దిగి నడిపించడం మొదలెట్టా.

నడుస్తుంటే అక్కడ పాపం ఇంతకు ముందు వెళ్ళిన టాంకరులోంచి నీళ్ళు పడి బురదలా తయారయింది. కాలందులో వేసి అరెరే అనుకుంటుండగానే ఓ కారు పాపం అక్కడ బురద ఉండకూడదని దాని మీద నుంచి సర్రున వెళ్ళి దాన్ని నా వంటి మీదకి ట్రాన్స్ఫరు చేసింది. “అడుసు తొక్కనేల…” అని గుర్తొచ్చి ఎందుకొచ్చిన గొడవ అని మళ్ళీ బైకు మీద ఎక్కా.

ఒకే ట్రాఫిక్కు లైటు ముందు నాలుగు సార్లు ఆగిన తర్వాత క్రాస్ చెయ్యడానికి నా వంతు వచ్చింది. హుర్రే అని అరుస్తూ ముందుకెళుతుంటే ఎదురు పక్కనున్నోడు కూడా వచ్చేస్తున్నాడు. అదేంటబ్బా ఆకుపచ్చ రంగు ఈ వైపున కదా ఉంది అని ఆలోచిస్తుంటే నా పక్క చూసి లైటంటే నాకో లెక్కా అని తొడగొడుతూ దూసుకెళ్ళిపోయాడు.

అబ్బో నాకింకా రూల్సు వంటబట్టలేదని తెలిసిపోయింది.

తర్వాత ఇరవై కిలోమీటర్ల అతివేగంతో వెళుతున్నానని ఓ పోలీసు బాబాయి ఆపాడు. ఆపగానే బైకు తాళాలు ఇచ్చెయ్యాలట ఆయనకి పాపం. తాళాలు కలెక్టు చెయ్యడం ఆయన హాబీ కాబోసు అని ఇవ్వగానే లైసెన్సు చూపమన్నాడు. తాళాలివ్వండీ బైకు లో ఉన్నాయి తెరిచి చూపుతా అంటే అదంతా నాకు తెలీదు ఐదొందలు ఫైను కట్టు అన్నాడు. వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకుని చెమటోడ్చి, కష్టించి, కాఫీ పోసి, టీ తాగించి సంపాదించిన డబ్బుని వాడికి స్వాహా చేసి నా తాళాలు వెనక్కి తెచ్చుకున్నా.

ఇక అసలు స్పీడుగా వెళ్ళకూడదని పది కిలోమీటర్ల స్పీడుతోనే వెళుతుంటే నా స్పీడు పెంచడానికి కంపెనీ కాబు సుమో ఒకటి వెనక నుంచి డాషిచ్చింది. అదేదో సినిమాలో చిరంజీవి గుర్రం లారీ కింద నుంచి స్లైడయినట్టు నా బైకు ఓ బస్సు కింద నుంచి జర్రున జారి మళ్ళీ పైకి లేచింది. హమ్మయ్య జీన్సూ, లెదర్ జాకెట్టూ వేసుకురావడం మంచిదయిందని అనుకుని మళ్ళీ నడపడం మొదలెట్టా.

అలా వెళుతుంటే పక్కనోడు సార్ అగ్గిపెట్టుందా అని అడిగాడు. వార్నీ బైకు మీద వీడికి అగ్గిపెట్టెతో ఏం పని అని ఆలోచిస్తుంటే పాపం ఒంటి చేత్తో ఆక్సిలరేటరు మీద చెయ్యేసి ఓ సిగరెట్టు ఊదేస్తూ గాల్లో తేలిపోతున్న వాడొకడు కనిపించాడు. వావ్ ఏం అథ్లెటిసిజం అని పొగుడుదామనుకున్నా కానీ అప్పటికే ఓ కారు పైకి ఎక్కి దిగడంలో బిజీగా ఉన్నాడు. సర్లే అని ఊరుకున్నా.

ఎదురుగా ఓ కిలోమీటరు వరసగా కార్లు, బైకులూ, లారీలు ఆగి ఉన్నాయి. ఓ కిసాన్ జామన్నమాట బ్రెడ్డు తెచ్చుకున్నా బాగుండు అనుకున్నా. ఇప్పుడు బాధపడి ఏం లాభం. సరే అని బైకు ని నిలిపేసి దాని మీద ఓ కునుకేసా. నాకు పెళ్ళయినట్టు, ఓ పిల్లాడు పుట్టినట్టూ పీడకలలు వచ్చాయి. అంతటితో ఆగితే బానే ఉండు. అదేదో స్కూలులో చేర్పించడానికి వెళ్ళినట్టు కనిపించింది. అక్కడ స్కూలు ప్రిన్సిపాలు చెబుతున్నాడు. అదేదో కొత్త కాన్సెప్టు స్కూలు అంట. అన్నీ ప్రాక్టికలుగా నేర్పుతారంట. ట్రాఫిక్కు బేస్డు పాఠాలంట. పజిల్సు ఎలా సాల్వు చెయ్యాలో నేర్పడానికి వాళ్ళకో సైకిలిచ్చి హోసూరు రోడ్డు మీద వదులుతారంట. బతికి బయటపడ్డవాళ్ళని మాత్రమే ముందు క్లాసులకి పంపుతారంట. ఇంకా ముందుకెళుతున్నకొద్దీ పేవ్‌మెంటు మీద ఒక్క టైరున్న బైకుని నడపడం, బైకుతో పాము మెలికలను రప్పించడం లాంటి పరీక్షలు కూడా ఉంటాయని ఇంకా ఏదేదో చెబుతుంటూనే “బా…” అని ఒక పెద్ద సైరను మోగింది. చూస్తే వెనక బైకు వెధవ ఏమీ తోచక హారన్ నొక్కాడు. ముందర వెధవకి గుండె పోటు వచ్చి గిల గిలా కొట్టుకుంటున్నాడు ఆ సౌండుకి అప్పుడే.

ఇంతలోనే ట్రాఫిక్కు జాము తొలగిపోయింది. ఆహా నా అదృష్టం ఇవాళ తొందరగా తొలగిపోయింది ట్రాఫిక్కు జాము అని మళ్ళీ సాగిపోతున్నా. అదేంటో సడనుగా వందలాది “నీనో” కార్లంట నన్ను చుట్టుముట్టేసాయి. ఎక్కడికీ కదలడానికి వీల్లేకుండా పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడిలా ఫీలవుతున్నా. పాపం ఒక నీనో ఏదో ఖర్మ కాలి రోడ్డు మధ్యలో ఆగిపోతే అక్కడ నుంచి బయటపడ్డా.
ఒకడెవడో రోడ్డుకడ్డంగా తీరిగ్గా నడిచెళుతుంటే అక్కడేదో జీబ్రా క్రాసింగుందేమో అని డౌటొచ్చి వాడినడిగా. జీబ్రా నా అది జూలో ఉంటుంది కానీ ఇక్కడెందుకుంటుంది అని పిచ్చాడిని చూసినట్టు చూసాడు.

ఏమోలే అనుకుని ఓ వన్ వే రోడ్డులో వెళుతుంటే అవతల సైడు నుంచి ఓ లారీ దూసుకొచ్చేస్తుంది. బతికుంటే బలిసాకు తినొచ్చు అని బైకొదిలేసి పరిగెత్తా. ఓ ఐదు నిముషాల తరవాత వచ్చి బైకుని లేపి పక్కనున్న ఆంబులెన్సులో నేను లేనందుకు సంతోషించి వాడికి దారిచ్చా. వెనకున్నోడు నన్ను గుర్రుగా చూస్తున్నాడు ఆంబులెన్సు కి ఎవడన్నా దారిస్తాడా ? ఈడో వెర్రి వాజమ్మ అన్నట్టు.
ప్చ్… అనుకుని ఆఖరికి పదడుగుల దూరంలో ఆఫీసు బోర్డు కనబడగానే లోపలికి బైకు తీసుకెళుతుంటే అక్కడున్న బోర్డు చూపించాడు సెక్యూరిటీ గార్డు, “పార్కింగ్ ఫుల్” అని. సర్లే అని పక్కనే ఉన్న ఇనపసామానోడికి బైకుని కిలోల్లెక్క అమ్మేసి పల్లీలు కొనుక్కుని ఆఫీసులోకెళ్ళా.

ఎదురుగా బాసుకి నమస్తే చెప్పి గడియారం చూపించి చూసావా ఇవాళ పదకొండింటి కల్లా ఆఫీసుకొచ్చేసా అని. నన్ను ఎగా దిగా చూసి నిన్నెందుకు రాలేదు ? అన్నాడు.
ఆఁ… ఇక తేరుకోలా…

* ఇంతకీ సంగతేమిటంటే నా ఆఫీసు బిల్డింగు మారి కొత్త చోటికి చేరింది. వచ్చే నెల నుంచీ ఓ పదిహేను కిలోమీటర్లు పైన చెప్పినటువంటి ట్రాఫిక్కులో వెళ్ళాలి. ఆ బాధలన్నీ ఎందుకులే అని ఆఫీసు కాబ్ కి స్వాగతం పలుకుతున్న శుభతరుణంలో….
ట్రాఫికాసుర హతః