సెప్టెంబర్ 14, 2007

వావ్…

Posted in ఇండియా, క్రికెట్, ట్వెంటీ ట్వెంటీ, పాకిస్తాన్ వద్ద 8:39 సా. ద్వారా Praveen Garlapati

వావ్…
ట్వెంటీ ట్వెంటీ మాచ్ అదిరిపోయింది. ఆహా ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడాడినా నరాలు తెగే ఉత్కంఠ కోసం జనాలు ఎదురు చూస్తారు. అది కాస్తా ఇవాళ మాచ్ లో వారికి కావలసినంత దొరికింది.
ముందు మాచ్ టై అవ్వడం, ఆ తరవాత షూటవుట్ లో ఇండియా గెలవడం. నేనేమో స్నేహితులతో లైవ్ చాట్ చెయ్యడం స్కోర్ గురించి. 🙂
ఏదెలాగున్నా పాకిస్తాన్ పై నెగ్గితే అదో సంతోషం…

మార్చి 4, 2007

నా క్రికెటింగ్ కెరీర్…

Posted in క్రికెట్ వద్ద 7:47 సా. ద్వారా Praveen Garlapati

నాకున్న కొన్ని వీక్నెస్ లలో క్రికెట్ ఒకటి. చిన్నప్పటి నుంచి ఇది నా నేస్తమే అన్నమాట. ఇది నాకు ఎంతో మేలు కూడా చేసింది.

నాకు దాదాపు మూడు లేక నాలుగు ఏళ్ళు అనుకుంట. అప్పుడు మొదటి సారి బ్యాట్ చేతబట్టుకున్నాను. ఆ తరవాత బాల్ కూడా పట్టుకున్నాననుకోండి. ఇక అప్పుడు మొదలయిన నా క్రికెట్ కెరీర్ క్రిందటి సంవత్సరం వరకూ అప్రతిహతంగా కొనసాగింది. కానీ ఇక ఇప్పుడు చూడడం వరకే పరిమితమయిందనుకోండి.

మొదట ప్లాస్టిక్ బ్యాట్ తో మొదలయిన నా కెరీర్ కొన్నాళ్ళకే చెక్క బ్యాట్ కి మారింది. ఇక ప్లాస్టిక్ బాలు కాస్తా రబ్బర్ బాల్ కి మారింది.

అవి మేము వరంగల్ లో ఉన్న రోజులు. నేను అప్పుడప్పుడే క్రికెట్ గురించి తెలుసుకుంటున్నాను. బ్యాట్ చేత బట్టడం నేర్చుకుంటున్నాను. అప్పట్లో రవి శాస్త్రి, గవాస్కర్, శ్రీకాంత్, వెంగ్సార్కర్ మొదలయిన వారిని డీడీ లో చూసేవాడిని. అప్పుడు వేరే చానళ్ళు ఉండేవి కావు. ఎప్పుడూ డీడీ నే. అందులో వచ్చే చిత్రహార్, హిత్రలహరి, శనివారం హిందీ సినిమా, ఆదివారం తెలుగు సినిమా హైలైట్లు అన్నమాట.

ఇక అక్కడ మొదలయిన నా క్రికెట్ ఆడటం, చూడడం ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది.

ఇక స్కూల్ కి వచ్చిన తరవాత స్నేహితులు ఎంతో మంది చెంత ఉండగా క్రికెట్ కి ఇంక కొరతేల ? ఇక సాయంత్రాలు స్కూలు వదిలిపెట్టగానే ఆ గ్రౌండ్ లో పడి రాత్రి దాకా ఆడటమే. ఎక్కడెక్కడి నుంచో జనాలు పోగు పడే వారు. సందుల్లో గొందుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆడేసేవారం.

ఇక ఆ తరవాత నాన్న గారికి హైదరబాదు ట్రాన్స్ ఫర్ అవడంతో నా క్రికెట్ అక్కడికి షిఫ్ట్ అయింది. చిన్న చిన్న సందుల్లో ఆడే నేను పెద్ద పెద్ద గ్రౌండ్ లలోకి మారాను. ఇక బెట్ మాచ్ లు కూడా ఆడె వారము అప్పుడప్పుడూ. అది సరదాకే లేండి. బెట్ లు కూడా చిన్న చిన్నవే. ఇక స్కూల్ లో ఆడడం మొదలెట్టాను. ఆ టీం లో కూడా ఆడాను. ఎనిమిది, పది తరగతుల వరకూ వచ్చేవరకు అది ఒక పిచ్చి గా తయారయింది. ఇక ఆడనిదే ఒక్క రోజు కూడా ఉండలేకపోయేవాడిని. అమ్మా, నాన్నలతో డీల్స్ చేసేవాడిని. రెండు గంటలు చదువుతాను, ఒక గంట ఆడతాను లాంటివి 🙂 ఇక క్రికెట్ మ్యాచులు వస్తే వాటి ముందే.

మా అమ్మా నాన్నలు నా గురించి వర్రీ అవడం మొదలెట్టారు. ఎందుకంటే నా పదో తరగతి అప్పుడే వరల్డ్ కప్పు మరి 🙂 ఇక పరీక్షలు తన్నినట్టే అని అనుకున్నారు. అదీ నేను పరీక్షల సమయం లో కూడా క్రికెట్ ఆడి తీరాల్సిందే. ఇక ఆశలు వదిలేసుకున్నారు. కానీ అప్పుడు నేను యమా షార్ప్ గా ఉండే వాడిని. (ఇప్పుడు కాదనుకోండి) ఒకసారి చదివినది చక్కగా అర్థం చేసుకుని ఎప్పటికీ గుర్తు ఉండిపోయేది. ఇక నాకు మాత్రం ఏ టెన్షనూ లేదు. నన్ను పరీక్షల సమయంలో ఆడడానికి వెళ్ళద్దనేవారు, అందుకని నేను కంబైండ్ స్టడీ పేరు చెప్పి ఆడటానికి వెళ్ళిపోయేవాడిని. అది తెలిసి తరవాత పెద్ద గొడవ అయిందనుకోండి. నిమిష నిమిషానికీ వచ్చి స్కోరు చూసేవాడిని. ఇక ఎలాగో పరీక్షలు అయ్యాయనిపించి ఇక ఇంట్లోంచి తుర్రు. నేను ఆ ఒక్క సెలవలలోనే కారు నల్లగా తయారయిపోయాను. కారణం ఎండల్లో పడి ఆడటం.

ఇక రిజల్ట్స్ వచ్చాయి. నేను అనుకున్నట్టే మంచి మార్కులే వచ్చాయి. ఆఫ్కోర్స్ నా ప్రకారం అనుకోండి. స్కూల్లో టాప్ ఫైవ్ లో వచ్చిందనుకుంట. అమ్మ నాన్నలకు ఎంతో సంతోషం. అప్పుడన్నాను చూసారా మరి అదే క్రికెట్ మహిమ అని. వాళ్ళన్నారు నవ్వుతూ అవును అదే క్రికెట్ మహిమ సరిగా చదివితే స్టేట్ రాంక్ వచ్చేదేమో అని. తల బొప్పి కట్టించుకున్నాను. 🙂

స్కూల్ అయిపోయింది. ఇక కాలేజీ కి వచ్చాను. ఇక్కడ కొంత జోరు తగ్గింది. కారణం ఉదయం కాలేజీ, సాయంత్రం ఎంసెట్ కోచింగ్. అదో గడ్డు కాలం. ఎందుకో నాకు సడన్ గా చదువు మీద ఇంటెరస్ట్ తగ్గింది. అందరూ IIT లకి ప్రిపేర్ అవుతుంటే నేను లైట్ గా తీసుకున్నాను. అందుకే ఎంసెట్ ఎగిరింది. నేను చదవాలనుకున్న కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీటు రాలేదు. అప్పుడు రియలైజ్ అయ్యాను, కానీ అప్పటికే అవ్వాల్సింది అయిపోయింది. సరే లే అని ఇక కె సెట్ రాసాను కర్ణాటక లో వళ్ళు దగ్గర పెట్టుకుని. మంచి రాంక్ వచ్చింది. అయ్యో అనుకుంటూ ఇక అక్కడ చేరి పోయాను. అప్పుడు నాకు తెలీదు అది నాకు ఎంత మచి చేసిందో. కారణమా ? ఇంకా అర్థం కాలేదా అక్కడ పేద్ద గ్రౌండ్ ఉంది మరి. హహహ. ఇక నా లాంటి వారికి కొదవ లేదు. అందరం జట్టు గా ఏర్పడిపోయాము. మొదటి సెమిస్టర్ లో కొద్దిగా తగ్గి ఉన్నాము. రాగింగ్ భయంతో. ఆ తరవాత సీనియర్లే ఆడటానికి పిలిచే వారు. ఇంక ఎదురేంటి. ఆడటమే ఆడటం. మాంచి టీం ఫార్మ్ అయ్యింది.

నేను ఒక రకమయిన ఆల్ “రౌండ”ర్ ని అన్నమాట. టీం కి పర్మనెంట్ వికెట్ కీపర్ని. మొదట్లో ధనాధన్ ధోని మాదిరిగా ఆడిన నేను తరవాత ద్రవిడ్ లాగా మారిపోయాను. అవుటవకుండా ఒకట్లు, రెండులు తీసేవాడిని అన్నమాట. ఇక ఫీల్డ్ లో కత్తి. డైవింగులు అవీ సూపర్. వికెట్ వెనకాల ఎన్నో అద్భుతమయిన కాచ్లు. బౌలింగ్ కూడా చేసేవాడిని స్పిన్, మీడియం పేస్ రెండూ. అదే మరి చెప్పాగా ఆల్ రౌండర్ ని అని. ఆ క్రికెట్ లోనే నాకు ప్రాణ స్నేహితుడయిన భరత్ దొరికాడు. మా ఇద్దరివీ ఎన్నో పార్ట్నర్షిప్పులు. మంచి జోడీ మా ఇద్దరిదీ (అవును మరి వాడు 6 ఫీట్ 2 ఇంచస్ పైనే, నేను 5 ఫీట్ 5 ఇంచస్).

వాడు వేసే బంతులకీ, వాడి బాటింగ్ ధాటికీ ఎవరూ ఎదురు నిలవలేకపోయేవారు. వాడు జోనల్ మాచ్ లలో కూడా ఆడేవాడు. అందుకే మేమిద్దరమూ ఎప్పుడూ ఒకే జట్టు 😉

మేమిద్దరమూ ప్రతీ రోజూ క్రికెట్ ఆడాల్సిందే. ఇక మేము సీనియర్ల మయిన తరవాత చూడాలి. మా రాగింగ్ అంతా గ్రౌండ్ మీదే. హహహ. మా స్టైలు మరి.

ఇక సరదా కాంపిటీషన్లు ఎన్నో. మా బాచ్లో నార్తీలకు మమ్మల్ని క్రికెట్ లో పడగొట్టాలని ఎప్పుడూ కోరిక అన్నమాట. ఇక మన ఆంధ్రా వాళ్ళతో పెట్టుకుంటే తెలిసిందే కదా. మా నాలుగెళ్ళలో వారు మమ్మల్ని ఒక్క సారి కూడా కొట్టలేక పోయారు. వాళ్ళు మాతో గెలుపుకి దగ్గరగా వచ్చింది ఒక్క మాచ్ లో అది కూడా డ్రా గా అన్నమాట. అందులో హీరో మరియు జీరో నేనే అనుకోండి. వికెట్లన్నీ టప టపా రాలిపోవడంతో నేను కింది వరస బాట్స్మన్లతో ఆఖరి వికెట్ తో ఆఖరి బాల్ కి డ్రా చేసాను. కాకపోతే ఆ సంతోషంలో ఓవర్ త్రో జరిగింది అని గమనించలేదు, మాచ్ డ్రా అయిపోయింది.

ఇక కాలేజీ కాంపిటీషన్లలో కూడా తెగ ఆడెవాళ్ళము. ఎక్కువ గెలవలేదనుకోండి.

తరవాత బెంగుళూరు కి వచ్చా జాబ్ కోసం. జాయిన్ అయ్యిన తరవాత ఇప్పుడెలా అబ్బ అనుకుంటుంటే భరత్ కూడా ఇక్కడికే వచ్చాడు . అమ్మయ్య అని ఇక మళ్ళీ జనాలని కూడ దీసి ఆడటం మొదలెట్టాము. అలా హాయిగా జీవితం గడిచిపోతుంటే ఆ వెధవకి ఎందుకో యూ ఎస్ వెళ్ళాలన్న కోరిక కలిగింది. హెచ్ వన్ మీద జంపేసేసాడు కొన్ని నెలెల క్రితం. ఇక అప్పటి నుంచీ నా జీవితం క్రికెట్ చూడడానికే పరిమితమయిపోయింది మరి. :(:(

వరల్డ్ కప్ దగ్గరకొచ్చే సరికి అన్నీ గుర్తుకొచ్చాయి. వా….

జనవరి 3, 2007

క్రికెట్ ఇక ఇంతేనా ??

Posted in ఇండియా, క్రికెట్, సౌత్ ఆఫ్రికా వద్ద 6:21 సా. ద్వారా Praveen Garlapati

ఏదో ఎట్టకెలకి ఇండియా చక్కగా ఆడింది కదా అనుకుంటే ఇంతలోనే వికెట్లన్ని టపా టపా రాలిపోయాయి చివర్లో…

ఆఖరికి 414 కి ఆల్ అవుట్ అయిపోయారు.

సౌత్ ఆఫ్రికా 141/1 తో దీటుగా సమాధానం ఇస్తుంది…

ఏమిటో ఇక ఈ సిరీస్ లో గెలుపు అవకాశాలు ముగిసినట్టేనేమో. ఒక టెస్టు మ్యాచ్ గెలవడంతోటే సరిపెట్టుకోవాలెమో.

ఇక వరల్డ్ కప్ ని తలచుకుంటేనే బాధగా ఉంది.