కాదు ఏ సమాచారమూ భద్రం …

సెక్యూరిటీ గురించి నా ఇంతకు ముందు టపాలలో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చెప్పాను.

వెబ్ అప్లికేషన్లలో సెక్యూరిటీ సమస్యలు కేవలం చిన్న సంస్థలకే అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

A chain is only as strong as its weakest link.

అన్న సూత్రం అచ్చంగా సెక్యూరిటీకి వర్తిస్తుంది. ఎంత పటిష్ఠంగా రూపొందించిన సిస్టం లేదా వెబ్‍సైటయినా ఒక చిన్న పొరపాటు వల్ల క్రాకర్ల బారిన పడవచ్చు. ఒక పెద్ద సంస్థ రూపొందించింది కదా అని మనం భరోసాగా ఉండలేము. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొన్నీ మధ్యే నాకు తారసపడిన ఒక ఉదంతం వల్ల.

బ్లాగరు ఈ మధ్యే “Followers” అనే ఒక కొత్త ఫీచరు/విడ్జెటుని విడుదల చేసింది. మీరు ఏ బ్లాగులయితే తరచుగా చదువుతారో వాటిని మీ బ్లాగరులో చేర్చుకోవచ్చు. అలా చేర్చిన బ్లాగుల ఆరెసెస్ ఫీడ్లు ఆటోమేటిగ్గా మీ గూగుల్ రీడర్ లో చేర్చబడతాయి. ఈ విడ్జెటు వల్ల ఉపయోగాలు మీరు మీ బ్లాగుని తరచూ చదివే వారి జాబితాని మీ బ్లాగులో ప్రదర్శించుకోవచ్చు. అలాగే మీరు తరచూ చదివే బ్లాగుల ఆరెసెస్ ఫీడ్లను మిస్సవకుండా గూగుల్ రీడరులో ఎంచగ్గా చదువుకోవచ్చు.

అంతా బానే ఉంది మరి సమస్య ఎక్కడ ఉంది ?

బ్లాగరులోకి లాగిన్ అవగానే మన “Followers” లంకెని మనకి చూపిస్తుంది మనకి. దాని మీద నొక్కితే మన “Followers” జాబితాని మనకి చూపిస్తుంది. వారి పక్కనే “Block” అనే ఒక బటన్ ని కూడా చూపిస్తుంది. దానిని నొక్కితే మన బ్లాగు “Followers” చిట్టాలో వారిని చూపించదు. ఇదీ సమంజసంగానే ఉంది. మరి సమస్య ఇంకెక్కడుంది ?

మీ బ్లాగు “Followers” ని మీరు మాత్రమే మేనేజ్ చేసుకోగలగాలి కదా ? బ్లాగరు వాడు ఎంత అందంగా తయారు చేసాడంటే ఎవరి బ్లాగుకి సంబంధించిన “Followers” ని అయినా చిన్న హాక్ ద్వారా మీరు మేనేజ్ చేసెయ్యవచ్చు.

“Followers” ని మేనేజ్ చేసే లంకె

http://www.blogger.com/manage-followers.g?blogID=xxxxxxxx

పై లంకెలో xxxxxxxx అనేది మీ బ్లాగు ఐడీ.
(మీరు సృష్టించే ప్రతీ బ్లాగుకీ ఒక ఐడీ ఉంటుంది. మీరు బ్లాగరులోకి లాగిన్ అయి అది మీరు తెలుసుకోవచ్చు.)

ఇప్పుడు మీరు పై లంకెని

http://www.blogger.com/manage-followers.g?blogID=xxxxxxxx+1

గా మారిస్తే ఎంచగ్గా పక్కవాడి బ్లాగుని మేనేజ్ చేసెయ్యచ్చు.

మరి అలా లంకె మార్చినప్పుడు మన సంకేత పదం (password) అడగాలి కదా. ఊహూ… ఏమీ అక్కర్లేకుండానే మీకు వారి సమాచారాన్నంతా చూపించేస్తుంది. దానిని మార్చడానికి అవకాశం కూడా కల్పిస్తుంది.

ఉదా:

ఈ కింది చిత్రం నా బ్లాగుకి సంబంధించినది.

నేను పైన చెప్పిన విధంగా లంకెని మారిస్తే వచ్చిన ఇంకొక తెలుగు బ్లాగరు యొక్క సమాచారం ఈ కింది చిత్రంలో చూడవచ్చు.

వారి “Followers” ని నేను “Block” చెయ్యగలిగాను. (నన్ను నేనే అనుకోండి)

మళ్ళీ “Unblock” చేసేసాననుకోండి.

ఇంతకు ముందు ఈ టపాలో నేను చెప్పిన “URL Rewriting” అనే పద్ధతికి పర్ఫెక్టు ఉదాహరణ ఇది.

అదన్నమాట సంగతి ! 🙂

ఇంతకీ ఈ సంగతి నేనెలా కనుగొన్నానంటారా ? టాప్ సీక్రెట్ 😉

గూగుల్ క్రోమ్ – విహరిణుల విపణిలో సరికొత్త ఎంట్రీ …

ఇన్నాళ్ళూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ మధ్య సాగుతున్న విహరిణుల పోటీ నిన్నటితో సరికొత్త మలుపు తిరిగింది.

కొంత మంది ఊహించినట్టు, ఇంకొంత మంది ఊహించనట్టూ గూగుల్ నిన్న క్రోమ్ అనే ఒక సరికొత్త ఓపెన్ సోర్స్ విహరిణిని విడుదల చేసింది.

దీనికి ప్రేరణ గూగుల్ చెబుతున్న ప్రకారం ఒక సరికొత్త విహరిణిని స్క్రాచ్ నుంచి తయారు చెయ్యడం. అంటే దీని డిజైన్, ఆర్కిటెక్చరు అన్నీ కొత్తగా దేని మీదా ఆధారపడకుండా తయారు చెయ్యడం. (ఫైర్‌ఫాక్స్ నెట్‌స్కేపు కోడు బేసు నుంచి తయారయిందని అందరికీ తెలుసనుకుంట)
అలాగే ఇప్పటి విహరిణులలో ఉన్న సమస్యలని అధిగమించడానికీ, ఇప్పటి వెబ్ కి తగినట్టూ తీర్చిదిద్దటం.

ఇక దీంట్లో ప్రత్యేకంగా ఏమున్నాయో చూద్దాము:

౧. లుక్స్ : అన్నిటికన్నా మొదటిగా ఇందులో నేను గమనించింది విహరిణిలో ఎంత ఎక్కువ స్థలం ఉపలబ్ధంగా ఉందో. క్రోమ్ లో టూల్‌బార్ లేదు, స్టేటస్‌బార్ లేదు. ఉన్నదల్లా టాబులు మాత్రమే.
ప్రతీ టాబుకీ విడివిడిగా వాటికి సొంతమయిన యూఆర్‌ఎల్ బారు, పేజీకల బారు ఉంది. దానితో మనకి ఎక్కువ స్క్రీను స్పేసు కనిపిస్తుంది.
అనవసరంగా ఎక్కువ స్థలాన్ని ఉపయోగించకుండా, జాజీగా కాకుండా గూగుల్ స్టైల్లో దీనిని సింపుల్ గా తీర్చిదిద్దారు. అయితే మరీ ప్లెయినుగా ఉండి కొందరికి నచ్చ్కపోవచ్చు కూడా.

. టాబులు: టాబులలో కొత్తేముంది. అన్ని విహరిణులలోనూ ఉన్నాయి. ఐఈ ౭ తో దాంట్లోనూ వచ్చి చేరాయి. ఇక ఓపెరా, ఫైర్‌ఫాక్స్ లలో అయితే మొదటి నుంచీ ఉన్నాయి.
మరి ఇందులో ప్రత్యేకత ఏముంది ?
మీరు వాడే విహరిణులలో మీరు అప్పుడప్పుడూ గమనించి ఉంటారు. ఒక టాబులో చూపించే వెబ్‌పేజీ గనక భారంగా ఉండి స్టక్ అయితే మొత్తం విహరిణినే మూసి మళ్ళీ తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే క్రోమ్‌లో దీనిని కొంత మేరకు మార్చగలిగారు.
ఇందులో మొత్తం విహరిణి ఒక ప్రాసెసుగా కాక, ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా డిజైని చేసారు. అందుకని ఒక టాబులో గనక సమస్య తలెత్తితే దానిని మాత్రమే మూసివేసి మిగతావాటిని అలాగే ఉంచుకోవచ్చు.

. ప్రతీ టాబూ ఒక కొత్త ప్రాసెసు: మొత్తం విహరిణి ఒకే ప్రాసెసుగా కాక ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా చూడడం వల్ల లాభాలున్నట్టే నష్టాలూ ఉండవచ్చు. వాడుకలో నేను గమనించిందేమిటంటే మెమురీ వాడకం ఎక్కువగా ఉంది.
ఉదా: అవే వెబ్‌సైట్లు వివిధ టాబులలో ఫైర్‌ఫాక్స్, ఓపెరా, క్రోమ్, ఐఈ లో తెరిస్తే క్రోమ్ అన్నిటికన్నా ఎక్కువగా మెమొరీ వాడుతుంది నా సిస్టంపైన.
అందుకని డిజైను పరంగా ఇది మంచి నిర్ణయమే అయినా నిజానికి మీ సిస్టముని నెమ్మది చేయవచ్చు.

. జావాస్క్రిప్టు: జావాస్క్రిప్టు మరీ అంత స్ట్రక్చర్డ్ లాంగ్వేజీ కాదు. కాబట్టి దానికి సంబంధించి చాలానే సమస్యలు ఉన్నాయి. అయితే క్రోమ్ లో v8 అనే జావాస్క్రిప్టు ఇంజనుని వాడుతున్నారు. ఇది ఒక VM. జావాస్క్రిప్టుని కంపైల్ చేసి మెషీన్ లాంగ్వేజీలోకి తర్జుమా చెయ్యడంవల్ల వెబ్‌పేజీలు త్వరగా లోడవుతాయని గూగుల్ ఉవాచ.

. వేగం: క్రోమ్‌లో చాలా ఆప్టిమైజేషన్లు చేసామనీ ఇంకా కొత్త జావాస్క్రిప్టు ఇంజిను వాడటం వల్ల పేజీలు వేగవంతంగా లోడవుతాయనీ చెబుతున్నారు. ఇది కొంతవరకూ నిజంలగే ఉంది. నే వాడినంతలో పేజీలు వేగంగానే లోడవుతున్నాయి. దాదాపు ఓపెరాలో అయినంత వేగంగానో, అంతకంటే వేగంగానో లోడవుతున్నాయి.

. అన్నిటికీ ఒకే అడ్రసు బారు: ఫైర్‌ఫాక్స్ ౩ తో మొదలయింది ఆసం పట్టీ. (ఇది మీరు ఇంతకు ముందు వెళ్ళిన వెబ్‌పేజీలనీ, వాటి కంటెంటునీ, మీ పేజీకలనీ అన్నిటినీ కలిపి వెతుకుతుంది) క్రోమ్ ఇవన్నీ చేస్తుంది. అలాగే దానితో పాటు దీనిని గూగుల్ సజెస్ట్‌తో అనుసంధానించారు. కాబట్టి మీరు దేనికోసమయితే వెతుకుతున్నారో దానికి సంబంధించిన సజెషన్లను గూగుల్ సజెస్టు నుంచి అందిస్తుంది.
అలాగే ఇది కొంత తెలివయిన సెర్చ్ ఏర్పాటుని కూడా కలిగుంది. మామూలుగా అయితే మీరు యూఆర్‌ఎల్ బారులో టైపు చేసిన టెక్స్టుని గూగుల్‌లో చెతుకుతుంది. అయితే మీరు ఏదయినా వెబ్‌సైటుకి వెళ్ళి దానికో సెర్చ్ బాక్సు ఉంటే మాత్రం దానిని వాడే ఏర్పాటు ఇందులో ఉంది.

ఎలాగంటే ఉదాహరణకి మీరు cnn.com కి వెళ్ళారనుకోండి. ఆ వెబ్‌సైటులో ఒక సెర్చ్ బాక్సు ఉంటుంది వెతకడానికి. అందుకని మీరు మీ యూఆర్‌ఎల్ బారులో cnn.com అని టైపు చేసి టాబు కొడితే మీరు గూగుల్ కి బదులుగా cnn.com లో సెర్చ్ చెయ్యవచ్చు.

. స్పీడ్ డయల్: ఓపెరాలో స్పీడు డయల్‌లు ఉంటాయి. ఇవేమిటంటే మీరు ఒక కొత్త టాబుని గనక తెరిస్తే మీకు ఒక తొమ్మిది స్పీడు డయళ్ళు కనిపిస్తాయి. దాంట్లో మీరు తరచూ వాడే వెబ్‌సైట్లు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్త టాబు తెరవగానే సమయం వృధా కాకుండా వాటిని నొక్కితే వెంటనే ఆయా సైట్లకి వెళ్ళిపోవచ్చు.
ఇలాంటిదే క్రోమ్‌లో కూడా ఉంది. అయితే ఇందులో స్పీడు డయళ్ళు ఆటోమేటిగ్గా మీరు తరచూ వెళ్ళే వెబ్‌సైట్లుగా సెట్ చెయ్యబడి ఉంటాయి. మీరు సెట్ చేసుకోలేరు. మీరు ఇంతకు ముందు బ్రౌజ్ చేసిన చరిత్రని బట్టి వీటి ఎంపిక ఉంటుంది.

. ప్రైవేటు బ్రౌజింగు: కొన్ని సార్లు మీరు వెళ్ళిన వెబ్‌సైట్ల వివరాలు బ్రౌజరులో నిక్షిప్తం కాకుండా ఉండాలని మీరు కోరుకోవచ్చు. (ఉదా: పోర్న్ కోసం చూసేవారు) ఎందుకంటే మీ ఆసం పట్టీలో లేదా స్పీడు డయళ్ళలో ఆయా సైట్లు కనిపిస్తే మీకు ఇబ్బంది కలగవచ్చు. సాధారణంగా అయితే మీరు మీ విహరిణి కాష్ (cache) ని తుడిచివెయ్యడమో లేదా చరిత్రని తుడిచివెయ్యడమో చేస్తుంటారు. అయితే దానివల్ల మిగతా చరిత్ర వివరాలన్నీ కూడా తుడుచుకుపోతాయి.
అలా కాకుండా మీరు ప్రస్తుతం బ్రౌజ్ చేస్తున్న టాబుని మాత్రమే విహరిణి చరిత్రలో రాకుండా “Incognito” అనే ఒక కొత్త మోడ్‌ని క్రోమ్ లో ప్రవేశపెట్టారు. మీ దానిని ఎంపిక చేసుకుంటే ప్రైవేటుగా బ్రౌజ్ చెయ్యవచ్చన్నమాట.

. సెక్యూరిటీ: ఇతర విహరిణులలో ఉన్నట్టే ఇందులోనూ సెక్యూరిటీ బాగుంది. మీరు “ఫిషింగ్” లేదా స్పైవేరు ఉన్న వెబ్‌సైట్లకి వెళితే క్రోమ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
అలాగే సర్టిఫికెట్లు ఎక్స్పైర్ అయిన లేదా సరిపోలని వెబ్‌సైట్లకి వెళ్ళినా ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

౧౦. దిగుమతులూ, అప్లికేషన్లూ: ఇక క్రోమ్ లో దిగుమతులూ సులభమే. ప్రస్తుతం అవుతున్న దిగుమతిని “పాజ్” చేసి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి కానివ్వచ్చు. అలాగే దీనికి స్టేటస్ బార్ ఉండదు కానీ దిగుమతి అవుతున్న ఫైలుని అవుతున్నంత సేపూ ఆ స్థలంలో చూపిస్తుంది. పూర్తయిన తర్వాత ఆ ఫైలుని మీకు కావలసిన ప్రదేశానికి మార్చుకోవచ్చు.
అలాగే ఫైర్‌ఫాక్స్ “ప్రిజ్మ్” లాగా దీనినుంచి ఒక్క టాబు మాత్రమే ఉండే అప్లికేషన్లూ కూడా సృష్టించుకోవచ్చు.

౧౧. తెలుగు: క్రోమ్‌లో తెలుగుకి మద్దతు ఉంది. మీ విహరిణి ప్రధానమయిన భాషగా తెలుగుని పెట్టుకోవచ్చు. అలాగే తెలుగు యూనీకోడుని బాగానే చూపిస్తుంది. అయితే బరహ, అక్షరమాల వంటి ఉపకరణాలు ఇందులో సరిగా పని చెయ్యట్లేదు. అలాగే అక్కడక్కడా “Unjustified text” సమస్య చూసాను నేను.
ఇంకా పద్మ, indic input extension లాంటి జోడింపులు ఇందులో వాడలేము.
చిత్రంగా ఈనాడు డైనమిక్ ఖతిని ఇది బానే చూపిస్తుంది. ఆంధ్రజ్యోతిని సరిగా చూపించట్లేదు.

పైనవి స్థూలంగా ఇందులో విశేషాలు. ఇన్నొవేషను పరంగా ఫీచర్లను చూస్తే పెద్దగా కొత్తేమీ లేదు. (ఉంటే డిజైను పరంగా ఉండవచ్చు). ప్రస్తుతం ఉన్న ఇతర విహరిణులలో నుంచి మంచి ఫీచర్లన్నిటినీ ఒక దగ్గర పోగు మాత్రం చేసారు.

అయితే సరికొత్త విహరిణి తయారు చెయ్యవలసిన అవసరం గూగుల్ కి ఏముందని ప్రశ్నిస్తే దీనికి వేరే కారణాలు ఎక్కువుండచ్చనిపిస్తుంది. ముందు ముందు గూగుల్ అప్లికేషన్లని ప్రమోట్ చేసుకునేందుకు వీలుగా దీనిని తయారు చెయ్యవచ్చు లేదా మీ బ్రౌజింగు డాటాని మాకందిస్తే మీకు తగినట్టు మీరు విహరిస్తున్నప్పుడు మీకు కావలసినట్టు అంతర్జాలాన్ని కస్టమైజు చేస్తామని చెప్పవచ్చు. అలాగే మొబైలు మీద ఈ విహరిణిని ప్రస్తుతం ఉన్న ఓపెరా మినీ, ఐఈ లకి ప్రత్యామ్నాయంగా ఉంచవచ్చు.

ప్రస్తుతానికయితే ఇది ఇంకో విహరిణి మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఫైర్‌ఫాక్స్ కంటే తక్కువలో ఉంది ఇది. ఎందుకంటే దీంట్లో జోడింపుల సౌకర్యం లేదు. ఫైర్‌ఫాక్స్ బలమంతా అందులోనే ఉంది. కాబట్టి అలాంటిదేదో గూగుల్ చెయ్యాల్సిందే.
నాకయితే ఏదో బ్రౌజ్ చేసుకోడానికి బాగానే ఉన్నా ప్రస్తుతానికి ఫైర్‌ఫాక్స్ ఇచ్చిన సౌకర్యం ఇది ఇవ్వట్లేదని అనిపిస్తుంది. కానీ గూగుల్ కున్న హైపుని బట్టి దీనికి మంచి మార్కెటే ఉండవచ్చు.
అలాగే మొత్తం స్క్రాచు నుంచి తయారు చేసామని చెబుతున్నా ఆపిల్ వారి వెబ్‌కిట్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ నుంచి కోడుని వీరు వాడారు. కాబట్టి అందులో ఏమన్నా సమస్యలుంటే అవి వీటిలోకీ రావచ్చు.

ఏదయితే ఏమిటి. మనకి దీని దయవల్ల ఇంకొక మంచి విహరిణి వస్తే సంతోషమే…

మైక్రోసాఫ్టు, యాహూ, గూగుల్ … వెబ్ సమీకరణాలు …

ఆన్లైను వెబ్ వ్యాపారం మరింత రంజుగా మారే రోజులొచ్చాయి మైక్రోసాఫ్టు యాహూ ని కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావడంతో.

ఇంతవరకూ వెబ్ కంపెనీలలో రారాజులు లాంటివి యాహూ, గూగుల్, అమెజాన్ వంటివి. కాకపోతే అమెజాన్ ఎక్కువగా కన్స్యూమర్ బిజినెస్ మీద ఆధారపడినది. అంటే విక్రేత వ్యాపారం పరంగా అది అగ్రగామి. కానీ పోర్టలు బిజినెస్ లో కాదు.

ఇంక ఆ స్పేసులో కొట్టుకునేది ఈ మధ్య వరకూ గూగుల్, యాహూ. యాహూ గూగుల్ కంటే ముందే వచ్చి స్థిరపడింది. వెబ్‌సైట్ల లంకెలని ఒక డైరెక్టరీ గా ఉంచుతూ ప్రస్థానం మొదలుపెట్టింది. అలా ఒకదాని వెంట ఒకటిగా విభిన్న పోర్టల్సు ని ప్రారంభించి తనకంటూ ఒక విశిష్ఠ స్థాయిని ఏర్పరచుకుంది. యాహూ మెయిల్ ఆన్లయిను మెయిళ్ళన్నింటిలోనూ అగ్రగామి. అలాగే యాహూ పోర్టలు, యాహూ న్యూస్, యాహూ ఫైనాన్సు మొదలయిన ఎన్నో మంచి సైట్లు దీని సొంతం. ఈ బిజినెస్ లో ముందుగా రావడంతో ఒక చక్కని లీడ్ ఉంది యాహూకి.

గూగుల్ సంగతి అందరికీ తెలిసిందే. సెర్చ్ ఇంజనుగా ప్రారంభమయింది. తర్వాత కొన్నాళ్ళు యాహూ సైటు కూడా గూగుల్ సెర్చ్ ఇంజనుతో శక్తిమంతమయింది. ఆ తర్వాత తన కంపెనీని యాహూకి అమ్మజూపారు గూగుల్ స్థాపకులు. కానీ యాహూ కొనలేదు. దాంతో ఐపీఓ కి వెళ్ళి అద్వితీయమైన విజయం సాధించడం, ఆ తర్వాత వెనుదిరిగి చూడనవసరం లేని విజయాలు సాధించింది. డబ్బు పుష్కళంగా చేరుతుండడంతో కొత్త కొత్త వ్యాపారాలలోకి ప్రవేశించి మెయిలు, మెసెంజరు, వగయిరా అప్పటికే స్థాపించుకుపోయిన వాటిలోంచి కూడా మార్కెటు షేరుని కొల్లగొట్టింది.

ఇక ఇంతటితో ఆగితే మజా ఏముంటుంది కథలో ?
గూగుల్ కి ఆయువు పట్టు ఆడ్‌సెన్స్. అంటే ఆన్లైనులో చూపించే అడ్వర్టైజ్మెంట్లు. దానితోనే అది బిలియన్ల కొద్దీ డబ్బు గడిస్తూంది. దీనికీ ఓ కథ ఉంది. ఈ ఆడ్ ఆలోచన గూగుల్ సొంతానిది కాదు. ఓవర్చుర్ అనే ఓ కంపెనీ ఈ పద్ధతిని కనిపెట్టింది. దానిని నకలు చేసి గూగుల్ ఆన్లైను ఆడ్లని తన సెర్చింజనులోకి చొప్పించింది.
తర్వాత ఆ ఓవర్చుర్ కంపెనీని యాహూ కొనేసి గూగుల్ ని స్యూ చేసింది పేటెంటు ఇన్ఫ్రిన్జ్మెంటు కింద. గూగుల్ తో పేటెంటుకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంలో బ్లండర్ చేసింది. ఓ రెండు మిలియన్ల పైన గూగుల్ స్టాక్స్ కి బదులుగా ఆ పేటెంటుని ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చింది. గూగుల్ ఐపీఓ విడుదలవగానే అమ్మేసుకుని కాష్ చేసేసుకుంది. అలా కాక ఆడ్ టెక్నాలజీ మీద ఎప్పటికీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని ఉంటే ఎంతో డబ్బు గడించి ఉండేది.

అటు గూగుల్ ఈ ఆడ్ టెక్నాలజీని న భూతో అన్నట్టుగా అభివృద్ధి పరచి మొత్తం ఆన్లైను ఆడ్ మార్కెటుని ఆక్రమించేసుకుంది. యాహూ అది తెలుసుకునే సరికే కీలకమయిన సెర్చ్ లోనూ, ఆడ్ మార్కెటు లోనూ గూగుల్ అందరాని ఎత్తుకి ఎదిగిపోయింది. తర్వాత నాలుక్కరచుకుని సెర్చ్ లోకి ప్రవేశించినా, పనామా అనే ప్రాజెక్టుని సృష్టించి ఆడ్ ప్లాట్ఫాం ని సృష్టించినా ఏవీ పని చెయ్యలేదు.

ఇక అటు గూగులేమో అపారంగా వచ్చిన కొత్త డబ్బుతో మంచి మంచి ప్రాడెక్టులని సృష్టించి, అక్వైర్ చేసి యాహూ బిజినెస్ నే కొల్లగొట్టడం మొదలుపెట్టింది. ఆఖరికి పరిస్థితి తారుమారయి యాహూ రెవెన్యూ అంతా కోల్పోతూ వచ్చింది. పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలయింది.

ఇది ఈ రెండు కంపెనీల సంగతయితే ఈ మధ్యలో ఇంకో కంపెనీ నేనున్నానంటూ ముందుకొచ్చింది. అదే మైక్రోసాఫ్టు. పీసీ మార్కెట్లో ఎదురులేని కంపెనీగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా అవతరించిన మైక్రోసాఫ్టు ఆన్లైను మార్కెటు నాడి పట్టడంలో చాలా జాప్యం చేసింది. గూగుల్ ని బచ్చాగా తీసివేస్తూ వచ్చింది. దాన్ని పొడిచేస్తాం, చంపేస్తాం అని ప్రగల్భాలు పలకడమే తప్ప ఏమీ చెయ్యలేకపోయింది.
కానీ ఇన్నాళ్ళుగా రెండిటి వ్యాపారమూ వేరు వేరు అవడంతో చాప కింద నీరులా గూగుల్ విస్తరించింది. ఇప్పుడు మైక్రోసాఫ్టు కొన్ని బిజినెస్సులకి గురి పెడుతుండడంతో అకస్మాత్తుగా మేలుకుంది.

ఓఎస్ మార్కెట్టులో ఎదురు లేని రారాజయినా నెమ్మదిగా అందులో ప్రాఫిట్ మార్జిన్లూ, ఇన్నోవేషనూ తగ్గుతుండడంతో, ప్రత్యామ్నాయ ఓఎస్ లు (లినక్స్, మాక్) కొంత మార్కెట్టుని చేజిక్కించుకోవడంతో ప్రత్యామ్నాయాల కోసం వెబ్ బిజినెస్ లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. అదే కాక ఆడ్ బిజినెస్సులో ఉన్న డబ్బు కూడా నోరూరించేది.
ఇక దాని కోసం ఎమెసెన్ అనే సెర్చ్ ఇంజిన్ ని ప్రారంభించి, లైవ్ అనే పోర్టలుని సృష్టించి, అనేకమయిన సర్వీసులతో ముందుకు వచ్చింది. లైవ్ సెర్చ్ తో గూగుల్ ని తరిమేద్దామనుకున్న మైక్రోసాఫ్టు సెర్చ్ లో విఫలమయించి. యాహూ కొంతయినా మెరుగు. అలాగే లైవ్ బ్రాండుకి కూడా పెద్ద మార్కెట్టు ఏర్పడలేదు. ఆడ్ బిజినెస్సుని పెద్దగా చేజిక్కించుకోలేకపోయింది.

కానీ చూస్తూ చూస్తూ అంత లాభదాయకమయిన బిజినెస్సుని వదులుకోలేదు కూడా.

అలాంటి సమయంలో దానికి యాహూ కనబడింది. యాహూ గత కొన్నేళ్ళుగా పడిపోతున్నా దాని బ్రాండుకి ఇంకా మంచి డిమాండే ఉంది. చాలా సర్వీసుల్ల్లో ఇంకా అది మార్కెట్ లీడరే. ఇప్పటికీ ఎక్కువ జనాలు వీక్షించే పోర్టలు యాహూనే.
కానీ ఈ మధ్య కాలంలో లాభాలు లేక చతికిలబడుతూ వచ్చింది. పెద్ద పెద్ద ఎగ్జిక్యూటీవ్ లందరూ వదిలేసి వెళ్ళిపోయారు కూడా. అలాగే పనామా ప్రాజెక్టు ఫెయిలవడంతో యాహూ సీయీఓ అయిన టెర్రీ సెమెల్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆన్లైను మార్కెట్ లోకి చొచ్చుకుపోవడానికి విఫలయత్నం చేస్తున్న మైక్రోసాఫ్టుకి యాహూ మంచి ఇన్వెస్ట్‌మెంటుగా కనిపించింది. అందుకే పేద్ద ఇన్వెస్టుమెంటయినా సరే 44.6 బిలియన్ డాలర్లకి యాహూ ని కొనడానికి సిద్ధపడింది. మంచి ప్రైజ్ ఆఫరు చేసింది. ఇక ఇప్పుడు బంతి యాహూ కోర్టులోకి వచ్చింది. యాహూ ఈ ఆఫరుని కాదంటే కూడా షేర్ హోల్డర్లు దానిని స్యూ చెయ్యవచ్చు. అందుకని ఊరికే కాదు అనలేదు. అలా అని మైక్రోసాఫ్టు ని చూస్తే పూర్తిగా విభిన్నమయిన కల్చరు. దాంట్లో ఇమడనూ లేదు. (నాకు తెలిసి యాహూ లో నా స్నేహితులెవరూ మైక్రోసాఫ్టు ప్రాడక్టులని ఉపయోగించరు)

ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం వచ్చింది యాహూకి. మైక్రోసాఫ్టుకి అమ్ముడుపోవాలి, గూగుల్ వాడి సహాయం తీసుకోవాలి లేదా ఇంకో బిడ్డర్ ని అయినా సంపాదించాలి. సొంతంగా లాభాల బాటలోకెళ్ళడం కష్టతరమే. ఇదీ దాని వైపు నుంచి చూస్తే.

ఇక గూగుల్ వైపు నుంచి చూస్తే ఇంత కాలం ఎదురులేని వాడు ఇప్పుడు మైక్రోసాఫ్టు, యాహూ కలిస్తే ఒక పెద్ద అపోనెంటు తయారవచ్చు. కాబట్టి పావులు ఆచి తూచి కదుపుతున్నాడు.

మైక్రోసాఫ్టు వైపు నుంచి చూస్తే ఇంత ఇన్వెస్టు చేసి యాహూ ని కొంటే దానిని లాభాలలో పెట్టి మార్కెట్టు కోల్పోకుండా, చొచ్చుకుపోవాలి. కానీ దానికన్నా ముందు ఈ మర్జరు సరిగా జరగాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

యాహూ మైక్రోసాఫ్టు బిడ్ ని తిరస్కరించింది ఓ రెండు రోజుల క్రితం. (ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో కావచ్చు.)

కాబట్టి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏది ఏమయినా ఈ సంవత్సరం వెబ్ మార్కెట్టులో ఎన్నో మార్పులు చూడవచ్చేమో ?
వినియోగదారుడికి వచ్చే నష్టమేమీ లేదు 🙂

ఆన్లైను ఆఫీసు సాఫ్టువేర్లు …

ఆహా… ఆన్లైన్ ఆఫీసు సాఫ్టువేరు మార్కెటు ఎంత ఇంటరెస్టింగుగా తయారవుతుందో.

ఇంతవరకూ మనకు ఏమన్నా డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లూ తయారు చేసుకోవాలంటే విండోస్ లో మైక్రోసాఫ్టు ఆఫీసు, లినక్స్ లో ఓపెన్ ఆఫీసు ఉపయోగించేవాళ్ళం. (చాలా మటుకు)

ఓ ఏడాది క్రితం నుంచీ నెమ్మదిగా వెబ్ ఆధారిత ఆఫీసు సాఫ్టువేరులు ఊపందుకోవడం మొదలుపెట్టాయి. అంటే అంతర్జాలం మీద ఆఫీసు డాక్యుమెంట్లు సృష్టించుకునే సౌలభ్యం అన్నమాట.

వివిధ కంపెనీలు ఇలాంటి సాఫ్టువేర్లు రూపొందిస్తూండగా జోహో అనే భారతంలో బేస్ అయిన కంపెనీ, గూగుల్ (గూగుల్ డాక్స్) దీనిని సీరియస్ బిజినెస్ ఆపర్చ్యూనిటీ గా పరిగణించాయి. ఎప్పటిలాగే మైక్రోసాఫ్టు ఇవన్నీ పిల్ల చేష్టలు అని కొట్టిపడేసింది.
అలా చూస్తుండగానే జోహో చక్కని ఇన్నోవేషన్ తో ఎంతో చక్కని ఆఫీసు సాఫ్టువేరును తయారు చేసేసుకుంది. దానికి ఎన్నో మంచి ఫీచర్లను జోడించుకుంది. ఒక్క వర్డు, ఎక్సెలు వంటి సాఫ్టువేరులకే పరిమితం కాకుండా ప్రెజెంటేషను, నోట్సు, మెయిలు, ప్రాజెక్టు మేనేజిమెంటు మొదలయిన వివిధ కాటగరీలకి విస్తృతం చేసింది.

గూగుల్ కూడా మేలుకుని మూలుగుతున్న డాలర్లతో కంపెనీలను ఎడా పెడా కొనేసి ఒక ఆన్లైను సాఫ్టువేరు సూటు ని తయారు చేసేసుకుంది. ఇందులో వర్డు, ఎక్సెలు, ప్రెజెంటేషను సాఫ్టువేర్లున్నాయి.

నెమ్మదిగా ఈ కంపెనీలు ఎంటర్ప్రైజు మార్కెట్టు మీద కూడా కన్నేసాయి. గూగుల్ తన బ్రాండునుపయోగించి కాప్‌జెమిని తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా గూగుల్ ఆప్స్ ప్రీమియర్ ఎడిషన్ ని కాప్‌జెమిని తన క్లైంట్లకి చేరువ చెయ్యబోతుంది. దీని ద్వారా గూగుల్ ఆన్లైను ఆఫీసు సాఫ్ట్వేరుకి హైప్ సృష్టించింది.
ఇక అప్పటి నుంచీ అందరూ దీనిని మైక్రోసాఫ్టు ఆఫీసు కి ప్రత్యామ్నాయాలు గా పేర్కొనడం మొదలుపెట్టాయి. గూగుల్ మాత్రం ఇది ఆఫీసు సాఫ్టువేరుకి కాంప్లిమెంటరీ మాత్రమే అని చెబుతూ వచ్చింది. కానీ దాని అంతరంగం మాత్రం వేరని అర్థమవుతుంది.

జోహో మాత్రం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ వచ్చింది. తన సాఫ్టువేరు సూటు కి ఎన్నో అప్లికేషన్లని జోడించేసుకుంది. ఈ మధ్యే ఒక ఆన్లైను డాటాబేసు ని కూడా తయారు చేసింది.

ఇవన్నీ ఇలా సాగుతుండగా గూగుల్ ఒక మంచి ప్రోడక్టు తయారు చేసింది. గూగుల్ గేర్స్ అనే ఓపెన్ సోర్స్ ఏపీఐ. దీని ద్వారా ఆన్లైను, ఆఫ్లను మధ్య దూరాన్ని తగ్గించాలని ప్రయత్నం. దీని ద్వారా ఆన్లైనులో మాత్రమే చెయ్యగలిగే పనులను ఆఫ్లైనులో చెసుకునేలా సౌకర్యం పొందవచ్చు. దీని కోసం ఒక ఏపీఐ సృష్తించి విడుదల చేసింది గూగుల్. దీనిని తన గూగుల్ రీడర్ ప్రోడక్టులో ఉపయోగించింది. (మీ ఆరెసెస్ ఫీడ్లను ఆఫ్లైనులో చదువుకోవచ్చు).

కానీ ఇక్కడ జరిగిన చమత్కారమేమిటంటే గూగుల్ తన ఆఫీసు అప్లికేషన్లను ఆఫ్లైను ఎడిటింగు కి సిద్ధంగా తయారు చెయ్యలేదు ఇంకా. కానీ జోహో ఈ గూగుల్ గేర్స్ ఏపీఐ ని ఉపయోగించి తన ఆఫీసు సాఫ్టువేరు ని ఆఫ్లైనులో ఎడిట్ చేసుకునేలా తీర్చిదిద్దింది.
అంటే ఇప్పుడు యూజర్లు తమ డాక్యుమెంటులను ఆన్లైనులో సృష్టించుకోవచ్చు, ఆఫ్లైనులో ఎడిట్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్టు ఆఫీసు లాగా, మళ్ళీ ఆ డాక్యుమెంటు ని ఆన్లైను డాక్యుమెంటుతో సింక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే రెండు విధాలా లాభం అన్నమాట. మన డాక్యుమెంటులు ఎప్పుడు కావాలన్నా రెడీగా ఉంటాయి ఆన్లైనులో, కావాలంటే ఆఫ్లైనులోనూ వాడుకోవచ్చు. బాగుంది కదూ…

ఇక ఈ పైవన్నీ చూసి మైక్రోసాఫ్టు కి కొద్దిగా గుబులు పుట్టిందేమో నేనూ ఉన్నానంటూ ఆఫీసులైవ్ అంటూ ఒక కొత్త ప్రోడక్టు ని లాంచ్ చేసేసింది. ఇక ఇదెలా ఉందో నాకు తెలీదు. నేను వాడలేదు.

ఏది ఏమయినా ఒకటి మాత్రం నిజం ఇంకా ఈ ఆన్లైను ఆఫీసు సాఫ్టువేరులన్నీ ఫంక్షనాలిటీ లో మాత్రం మైక్రోసాఫ్టు ఆఫీసుకి కానీ, ఇతర ఆఫీసు సాఫ్టువేరు సూట్లకి దరిదాపుల్లోకి చేరలేదు. కానీ తొందర్లోనే అదీ జరగవచ్చు.

గూగుల్ ఓపెన్‌సోషల్ …

సోషల్ నెట్వర్కులు ఇప్పుడు కామధేనువులు అవడంతో అందరికీ దాంట్లో వాటా కావాలి. దాంతో రోజుకో కొత్త పోకడ వస్తుంది వీటిలో.

మై స్పేస్, ఫేస్బుక్, ఆర్కుట్ వగయిరా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఇందులో మిగతా వారికన్నా ముందుండటానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ మై స్పేస్ కు ఎదురు లేకపోయింది. మిలియన్ల కొద్దీ యూజర్లు, బిలియన్ల కొద్దీ పేజీ వ్యూ లతో అప్రతిహతంగా కొనసాగిపోతూ ఉన్నది. దానికి పోటీ గా ఉన్న ఫేస్బుక్ దానిని ఎదురుకోవడానికి ఓపెన్ ప్లాట్ఫాం అని విడుదల చేసింది. స్థూలంగా కథ ఏమిటంటే అంతవరకూ బయటి వారికి అందుబాటులో లేని సమాచారాన్ని ఏపీఐ ల ద్వారా వారికి అందుబాటులోకి తెచ్చింది.
వాటిని వాడి ఎవరయినా ఫేస్బుక్ కోసం తమ అప్లికేషన్లు రాయవచ్చు, ఎంబెడ్ చెయ్యవచ్చు. కానీ దానికోసం వారు తయారు చేసిన FBML అనే లాంగ్వేజీ వాడాల్సి ఉంటుంది. అదేమీ అంత కష్టం కాదు. ఉదా: మన బ్లాగులలో ఉన్నట్టు గా బొత్తాలు ఫేస్బుక్ లో పెట్టడానికి నేను రాసిన చిన్న అప్లికేషన్ కి నాకు నాలుగు లైన్లు పట్టింది అంతే.

ఇక ఆ ప్లాట్ఫాం తయారు చేసిన తరవాత ఫేస్బుక్ స్వరూపం మారిపోయింది. కొన్ని వేల, లక్షల ? అప్లికేషన్లు కొద్ది కాలంలోనే తయారయిపోయాయి. ఫేస్బుక్ లో లేని ఎన్నో కొత్త ఫీచర్లు వీటి ద్వారా యూజర్లకు అందుబాటులోకొచ్చాయి. ఎక్స్‌క్లూజీవ్ గా ఫేస్బుక్ ని టార్గెట్ చేసుకునే స్టార్టప్ లు తయారయ్యాయి.
అలా ఫేస్బుక్ దూసుకుపోతుంది. ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్ అందులో రెండొందల మిలియన్లు పెట్టి వాటా కొనుక్కుంది (ఫేస్బుక్ వాల్యువేషన్ ని పదిహేను బిలియన్ డాలర్లుగా వెల కట్టింది.)
గూగుల్ కూడా మైక్రోసాఫ్ట్ తో పోటీ పడినా దానికి ఆ డీల్ దక్కలేదు.

గూగుల్ కి ఆర్కుట్ అనే సొంత సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్ ఉన్నా దానిని ఇబ్బంది పెట్టే సంగుతులేమిటంటే:

  • ఆర్కుట్ కి భారతం, బ్రెజిల్ లో తప్పితే మిగతా మార్కెట్లలో ఎక్కువ మార్కెట్ షేర్ లేదు.
  • ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ సైటులలో వైవిధ్యంగా దూసుకుపోతుంది. అంతటితో ఆగకుండా వివిధ ఇతర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని గూగుల్ కి ఎదురుదెబ్బల వంటివి.
  • మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లో షేర్ సాధించడంతో ఇప్పుడు ఫేస్బుక్ లో లైవ్ సెర్చ్ ని డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా చెయ్యవచ్చు. దానితో దాని వాడకం ఎక్కువవచ్చు.
  • ఫేస్బుక్ తన సొంత ఆడ్ నెట్వర్కుని ప్రారంభించబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అది గూగుల్ కి పోటీ కావచ్చు.

ఇవన్నీ గూగుల్ ని ఆలోచనలోకి నెట్టేసాయి. ఫేస్బుక్ తో ఒప్పందం కుదరకపోయే సరికి ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం ఓపెన్‌సోషల్ ఒక కొత్త కాన్సెప్టు ని ముందుకు తెచ్చింది. ఇంతకీ దీని ద్వారా గూగుల్ ఏం చెబుతుందంటే ఫేస్బుక్ కోసం తయారు చేసిన అప్లికేషన్లు కేవలం ఫేస్బుక్ లో మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ గూగుల్ విడుదల చేసిన ఈ ఓపెన్సోషల్ ఏపీఐ లు వాడితే దానిని సపోర్ట్ చేసే అన్ని సోషల్ నెట్వర్కులలోనూ ఆ అప్లికేషన్లు పనిచేస్తాయన్నమాట.
కాబట్టి ఆ అప్లికేషన్లు రాసేవారికి మరింత ఈజీ అన్నమాట. అలా అప్లికేషన్ డెవలపర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో గూగుల్ కి ఏమి లాభం ?
ఒకరకంగా ఇది డెస్పరేషన్ తో కూడిన మూవ్ అనిపిస్తుంది. ఎలాగోలా అందరి దృష్టినీ ఫేస్బుక్ నుంచి మరల్చడం ముఖ్యమయిన కారణంగా కనిపిస్తుంది (పెద్ద పెద్ద సోషల్ నెట్వర్కులు MySpace, LinkedIn, Six Apart, Orkut వంటివి ఇప్పటికే ఇందులో భాగస్వాములు). ఇంకోటి ఇది ప్రపోజ్ చేసింది గూగుల్ కాబట్టి దీని మీద ఓ రకంగా దానికి కంట్రోల్ లభిస్తుంది. ముందు ముందు లాభించవచ్చు. అదీ కాక ఇతర సోషల్ నెట్వర్కులలో నుండి సమాచారం గూగుల్ కి అందుబాటులోకి రావచ్చు. అది దానికి ఉపయోగం. ఉదాహరణ కి ఎలాంటి ట్రెండులు నడుస్తున్నాయో, ఎలాంటి ఏజ్ గ్రూపులు ఏం ఇష్టపడుతున్నాయో మొదలయినవన్నమాట.

ఇప్పటికే యూజర్ల ప్రైవసీ గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యూజర్లకి సంబంధించి ఎంతో సమాచారం గూగుల్ వద్ద ఉంది. దానికి ఇది కూడా తోడయితే మంచిది కాదని కొంత మంది అభిప్రాయం. అయినా సరే గూగుల్ కి ఇప్పుడున్న క్రేజ్ మీద అవన్నీ మరుగున పడిపోవచ్చు. గూగుల్ ఓపెన్సోషల్ ముందు ముందు ఏ దిశలో ప్రయాణిస్తుందో వేచి చూడాల్సిందే.

 

మళ్ళీ టపాలు రాస్తున్నానంటే నా ప్రదర్శన ముగిసిందన్నమాట. 🙂 ఎక్సలెంటుగా జరిగింది. అద్భుతమయిన రెస్పాన్సు. దాదాపు నాలుగు వేల మంది ముందు ప్రదర్శించడం ఓ అనుభూతిగా ఎప్పటికీ మిగిలిపోతుంది. విపులంగా ఇంకో టపాలో…

గూగుల్ కొత్తవతారం …

గూగుల్ వాడు అంత తొందరగా హోం పేజీ లో ఏ మార్పులూ చెయ్యడు.
ఏళ్ళ తరబడి ఒక సింపుల్ వెబ్ పేజీ లో, ఒక సెర్చ్ టెక్స్ట్ బాక్సూ, ఓ రెండు బటన్లూ, ఓ మూడు నాలుగు లింకులూ అంతే.

మొన్న మొన్నటి నుంచే కొత్త డిజైన్ ని పెట్టినట్టున్నాడు. ఇంతకు ముందు సెర్చ్ బాక్సు పైన ఉండే లింకులని పేజీ పైకి మార్చాడు.
అలాగే వాడి ముఖ్యమయిన టూల్సన్నిటినీ “more” అనే లింక్ పెట్టి డ్రాప్ డౌన్ లా చూపిస్తున్నాడు.

ఇంకా “igoogle” గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. క్లీన్ గూగుల్ హోం పేజీ కాకుండా థీంస్ అవీ పెట్టి, విడ్జెట్స్ లాంటివి పెట్టాడు.

గూగుల్ టాక్, ఆర్ ఎస్ ఎస్ ఫీడ్లు, టాబ్స్ మొదలయినవి చేర్చి నెట్‌వైబ్స్ లాగా సర్దుకునే సదుపాయం కలిగించడానికి ట్రై చేసాడు. (అంత గొప్పగా ఏమీ లేదనుకోండి.)

వెబ్ అనలటిక్స్ …

ఇంటర్నెట్ అంటేనే అదో పెద్ద సముద్రం. మరి దాంట్లో చిన్న చిన్న చేపలయిన వెబ్ పేజీలు ఎలా మనగలుగుతాయి ???

మీకో వెబ్ సైట్ ఉందనుకోండి. దాని గురించి అందరికీ తెలియాలి. జనాలు మీ వెబ్ సైట్ కి రావాలి. అక్కడ ఉన్న సమాచారం చదవాలి. చదివిన తరువత మీకు లాభం కలిగించే (ఒక వేళ మీది commercial వెబ్ సైట్ అయితే గనక.) చోట్లకు వెళ్ళాలి.

మరి ఈ తతంగం అంతా ఎలా చెయ్యాలి ? ఇందులో విజయం ఎలా సాధించాలి అని study చేస్తే అదే web analytics అవుతుంది.

అన్నిటికంటే ముందు ముఖ్యమయినది సెర్చ్ ఇంజన్లు. మీ వెబ్ సైట్లకు traffic తెచ్చేందుకు తొడ్పడే వాటిలో అగ్రస్థానం వీటిదే.

ఎవరికయినా ఏమన్నా కావాలనుకోండి, మీరు మొదట వెళ్ళేది ఎక్కడికి ? సెర్చ్ ఇంజన్ దగ్గరకే కదా. అక్కడ ఎం చేస్తారు ? కీ వర్డ్స్ enter చేస్తారు. ఆ కీ వర్డ్స్ కి వచ్చిన ఫలితాలలో మీకు దగ్గరగా అనిపించిన దానిని ఎంపిక చేసుకుని ఆ వెబ్ పేజీ కి వెళ్ళిపోతారు. ఇదంతా జరిగేది నిముషాల మీదనే, కొన్ని సార్లు సెకండ్ల మీద కూడా.

మరి అలాటప్పుడు మీరు ఈ సెర్చ్ ఇంజన్లను మెప్పించడానికి ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఒక్కో సెర్చ్ ఇంజనూ ఒక్కోలా పని చేస్తుంది కూడా. వీటిలో ముఖ్యమయినవి meta information, keywords, content, links. వీటి మీద దృష్టి పెట్టినంత మాత్రాన ఆటొమాటిగ్గా మీ వెబ్ సైట్ కి మంచి రాంక్ వచ్చి తీరుతుంది అన్న నమ్మకం లేదు. ఇవే కాక ఇంకెన్నో parameters ఉంటాయి వాటికి మరి. అలాగని మీరు సెర్చ్ ఇంజన్లను fool చెయ్యడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని అథోగతి తోసేస్తాయి కూడానూ. అంటే demote చేస్తాయి అన్నమాట. కొన్ని సార్లు ban కూడా చేస్తుంటాయి.

సెర్చ్ ఇంజన్ల గురించే ఒక పెద్ద రీసర్చ్ పేపర్ రాయచ్చు. జనాలు రాసారు కూడా.

కాబట్టి వెబ్ సైట్ web masters, designers మరియు system administrators దీని మీద ఎంతో శ్రద్ధ చూపుతారు.

సెర్చ్ ఇంజన్ల దయ వెబ్ సైట్ ల మీద పడేలా చూసుకుంటారు. optimize చేస్తారు, వారి వెబ్ సైట్ లకు referral links సంపాదిస్తారు (వీటి మీద వెబ్ సైట్ ల popularity ఆధార పడి ఉంటుంది మరి.), వాటికి తగ్గట్టుగా design చేస్తారు.

ఇది ఒక భాగం మాత్రమే. ఇక పోతే వెబ్ సైట్ administrators ఇంకొన్ని metrics సేకరిస్తారు. అవి ఏమిటి అంటే అసలు జనాల visits trend ఎలా ఉంది ? కాలం తో పాటూ పెరుగుతుందా, తగ్గుతుందా ? వారు దేని కొసం వెతుకుతున్నారు ? వారు దేని మీద click చేస్తున్నారు ? ఏ పేజీలు ఎక్కువగా చూస్తున్నారు ? మీరు ఒక కొత్త ప్రోడుక్ట్ రెలీజ్ చేసారనుకోండి. దానికి జనాల reaction ఎలా ఉంది ? మొదలయినవి అన్నమాట.

ఇంతకు ముందు దీని మీద concentration ఓ మాదిరిగా ఉండేది కానీ ఇప్పుడు అంతా ఇంటర్నెట్ మయం అయిపోయిన తరవాత కంపనీలు దీని మీద పెద్దగా invest చేస్తున్నారు.

పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి కంపనీలు వీరిని మెయింటెయిన్ చేస్తారు. కానీ మనలాంటి వారికి ఇలాంటి tools ఉన్నాయా ?

ఉన్నాయి. ఉదాహరణకి మనలో చాలా మంది ఉపయొగించే web site stats ఉన్నయే (sitemeter, wordpress లో builtin counter మొదలయినవి) కూడా ఒకలాంటి tool ఏ. కాకపోతే ఇది మనకు ఇచ్చే సమాచారం కేవలం పేజీ statistics మాత్రమే, అంటే మీ వెబ్ పేజీ కో, బ్లాగు కో ఎంత మంది జనం వచ్చారో అన్నది మాత్రమే. అది కూడా Page impressions, visitor stats మాత్రమే. ఇది ఊరికే మనం సరదాకి పెట్టుకున్నది. కాకపోతే wordpress లో అలా కాక మనకు కొన్ని టూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. (keep track of where visitors come from, trackback links etc.)

ఇప్పుడు వీటిలో రెండిటి గురించి చెబుతాను.

మొదటిది MyBlogLog. ఇది ఇప్పుడు Yahoo acquire చేసేసిందనుకోండి. ఇది బ్లాగులకోసం ఉద్దేశించినది. దీనిని ఉపయొగించడానికి ఆ వెబ్ సైట్ లో ఒక account సృష్టించి, మన వెబ్ సైట్ లో చిన్న code snippet పెడితే చాలు. ఇక అది మన బ్లాగులకు సంబంధించి ఎన్నో వివరాలు సేకరిస్తుంది. ఎలాంటివంటే మన బ్లాగుకి ఎక్కడ నుంచి visitors వస్తున్నారు (ఉదాహరణకి కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ మొదలయిన aggregators లాంటివన్నమాట.), వారు ఏ links మీద click చేస్తున్నారు. ఏ పోస్టులు అంటే ఆసక్తిగా చదువుతున్నారు, ఏ టాగ్స్ అంటే ఇష్టం లాంటివి అన్నమాట. అదే కాక మన బ్లాగు నుంచి ఎక్కడ కి వెళుతున్నారు లాంటివన్నమాట (outgoing links). కాకపోతే ఉచితంగా ఇచ్చే సర్వీసులో వీటి మీద restrictions ఉన్నాయి . మొదటి పది రిజల్ట్స్ మాత్రమే మనకు చూపిస్తాయి వంటివి.

ఇక పోతే రెండవది మన దేవుడు గూగుల్ నుంచి అన్నమాట. దాని పేరు Google Analytics.

గూగుల్ web masters కి ఎంతో స్నెహితుడయిన ఒక సెర్చ్ ఇంజన్. ఇది వారికి ఎన్నో టూల్స్ ఇచ్చి సహాయపడుతుంది. అందులో ఇది ఒకటి. (Google Webmaster Central కూడా మంచి సమాచారం అందిస్తుంది.)

ఇక దీనిని వాడదలచుకుంటే ఇంక మరో టూల్ అవసరమే లేదు. అంత comprehensive అన్నమాట. ఇది వివిధ user profiles (Executive, marketer, web master) కి వివిధ రకాలయిన రిపోర్ట్స్ చూపిస్తుంది. దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద వ్యాసమే అవసరం. టూకీగా చెప్పాలంటే మీ content ని slice and dice చేసి అన్ని రకాల రిపోర్ట్స్ ను అందిస్తుంది. అదీ కాక మీ కంటెంట్ ని ఎలా optimize చెయ్యాలో కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు adwords గనక ఉపయోగిస్తుంటే అవి ఎంత effective గా పని చేస్తున్నాయో కూడా ఓ కన్నేసి ఉంచవచ్చు.

ఇది ఎంత సమర్థవంతం అంటే మన వెబ్ సైట్ users వాడే బ్రౌజర్ వర్షన్లు, వారి screen resolutions, వారి screen colors, వారి Java, flash versions, వారి connection speed మొదలయినవి కూడా చెబుతుంది. ఇవన్నీ చాలా ముఖ్యం ఎందుకంటే ఉదాహరణకి మీ వెబ్ సైట్ కి వచ్చే వారిళో ఎక్కువ 800×600 screen resolution వాడుతున్నారనుకోండి, మీ వెబ్ సైట్ వారి కోసం design చెయ్యబడకపోతే మీకు నష్టమే కదా. అలాగే మీరు మీ వెబ్ సైట్ లో latest flash version ఉపయోగిస్తున్నారు. అది పాత versions తో compatible కాదు. అలాంటప్పుడు మరి మీ users కి అది చికాకే కదా. మీ వెబ్ సైట్ కి వచ్చే users ఎక్కువ dialup connection మీద పని చేస్తున్నారనుకోండి, మీ వెబ్ సైట్ jazzy graphics తోనూ పెద్ద పెద్ద images, flash తోనూ నిండి ఉందనుకోండి మరి వారు తిరిగి వచ్చే అవకాశమే లేదు.

ఇలాంటివన్నీ సరి చేసుకోవచ్చు అన్నమాట.

ఉదాహరణకి నా బ్లాగు కి వచ్చే వారిలో ఈ క్రింది విధంగా బ్రౌజర్ల వాడకం ఉంది.

ఇవన్నీ మనకు spy activities లాగా అనిపించచ్చు కానీ professional blogs కీ websites కీ ఇవి చాలా అవసరం. ఎందుకంటే జనాలని మన వెబ్ సైట్ ల మీద ఉండగలిగేలా చెయ్యలంటే ఎం చెయ్యాలో అనేది వారికి ఈ సమాచారం నుంచి లభిస్తుంది. వారి ad placings ఎక్కడ అయితే సమర్థవంతంగా డబ్బు తెచ్చి పెడుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. వారి సైట్లను, బ్లాగులను సమర్థవంతంగా తీర్చి దిద్దవచ్చు.

ఇన్ని చేసినా జనాలు మర్చిపోయేది content గురించి. విజిటర్స్ ని మీ వెబ్ సైట్ లకు రప్పించేది content అందుకని అది సరిగా లేకపోతే ఎన్ని చేసినా అది నిరుపయోగమే.

గమనికలు:

ఇది ఎంత చెప్పుకున్నా తరగని అంతు లేని కథ. నాకు ఇవంటే passion కాబట్టి తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఇంత పెద్ద వ్యాసం రాసినందుకు క్షమించాలి. ఇంకా నాకు సంతృప్తిగా లేదు. మీకు తెలిసింది చెబితే నేనూ నేర్చుకుంటాను 🙂

ప్రతి సారీ సాధ్యమయినంత తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను కానీ అక్కడక్కడా తప్పదు, కొన్ని నాకు వాటికి సరయిన పదాలు తెలుగు లో తెలీక, కొన్ని వాడటం ఇష్టం లేక.

మీ సొంత సెర్చ్ ఇంజన్…

మీకందరికి Google Custom search Engine గురించి తెలిసే ఉంటది.
ఇది ఎంతో ఉపయొగకరమయిన సాధనం.

ఎందుకంటారా మీరు ఎన్నొ సెర్చ్ ఇంజెన్స్ ఉపయొగించి ఉండవచ్చు, కానీ వీటితొ అప్పుడప్పుడు సమస్య ఏమిటి అంటే, ఇది మీకు మంచి సెర్చ్ రిజల్ట్స్ తో పాటు ఎన్నో అనవసరమయిన రిజల్ట్స్ ని కూడా ఇస్తుంది. చాలా మటుకు అనవసరమయిన లంకెలు ఉంటాయి వీటిలో. అలా కాకుండా మీకు నచ్చిన వెబ్ సైట్ల నుంచి మత్రమే సెర్చ్ చెసే సదుపాయం ఉంటే ??? అలాంటి సదుపాయం కొసమె ఈ google custom search engine. ఇది ఒక రకంగా మీ సొంత సెర్చ్ ఇంజిన్ లాంటిది.

google custom search engine గురించి చెప్పుకునే ముందు మనం సెర్చ్ ఇంజన్ గురించి కొద్దిగా చెప్పుకుందాము.
అసలు సెర్చ్ ఇంజిన్లు ఎలా పని చెస్తాయి అంటే అవి వెబ్ ని క్రాల్ చేస్తాయి. అంటె వెబ్ లో ఉన్న సైట్లు, వాటి information ని అవి సంగ్రహిస్తాయి అన్నమాట. అది ఎలా అంటె వెబ్ బాట్స్, లెద స్పైడర్స్ అనే వాటితొ. ఉదాహరణకి గూగుల్ ని తీసుకున్నరంటే దాన్ని గూగుల్ బాట్ అంతారు. అది ముందే నిర్ణయించిన కాల పరిమితులలొ ప్రతీ కొన్ని రొజులకూ/గంటలకూ వెబ్ లో ఉందే సైట్లను క్రాల్ చేస్తుంది. క్రాల్ చెయ్యడం అంటే ఆ పేజీలలొ ఉన్న విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి, వాటిలోని కీ వర్డ్స్ తో వాటిని categorize చేస్తుంది అన్నమాట. అలా చెసిన వెబ్ పెజీ లను తన డాటా బేస్ లొ నిక్షిప్తం చెసుకుంటుంది. ఇంత వరకు చెసే పని అన్ని బాట్లూ దాదాపు ఒకే విధంగా చెస్తాయి కాకపొతే ఎలా, ఎప్పుడు, ఏ వెబ్ సైట్ల నుంచి చెయ్యాలి మొదలయిన విశేషాలు మాత్రం దేనికదే ప్రత్యేకం.

ఆ బాట్స్ క్రాల్ చెయ్యడాన్ని నియంత్రించేందుకు web aministrator, robots.txt అనే ఒక ఫైల్ తయారు చేసి అందులో తన rules ఉంచుతాడు. వాటి ప్రకారం ఆ బాట్ క్రాల్ చేస్తుంది.

సరే ఇలా క్రాల్ చేసిన information ని ఒక ఆల్గారిథం ప్రకారం మనం సెర్చ్ చేసినప్పుడు చూపిస్తుంది. గూగుల్ దీనినే పేజ్ రాంక్ అని అంటుంది.

సరే ఇక google custom search engine గురించి చెప్పుకుందాము. ఇది ఏమి చెస్తుంది అంతే సెర్చ్ ఇంజెన్ default గా కాకుండా మీకు కావలసిన సైట్లలోంచి మాత్రమే సెర్చ్ రిజల్ట్స్ ని చూపిస్తుంది. అదే కాకుండా పోగా పోగా మీకు నచ్చిన సైట్లను మీరు ఆ custom search engine కి జోడించవచ్చు. అలా మీకు కావలసిన సైట్లలోనుంచి సెర్చ్ రిజల్ట్స్ ని మాత్రమే మీరు చూడగలుగుతారు. ఉదాహరణకి మీకు వికీపీడియా లొంచి మాత్రమే సెర్చ్ చెయ్యాలనుకున్నారనుకోండి ఆ ఒక్క సైట్ ని మాత్రమె మీరు add చెయ్యవచ్చు అన్నమాట. తరువాత మీకు ఇంకొ మంచి వెబ్ సైట్ కనిపించి దీనిలొ నుంచి కూడా సెర్చ్ చెయ్యలని అనుకున్నారనుకొండి ఆ సైట్ ని మీ google custom search engine లొ జొడిస్తే చాలు.

ఎలా చెయ్యలంటే

http://google.com/coop/
అనే లంకె కి వెళ్ళండి.

అక్కడ Create your own search engine కింద ఉన్న custom search engine అనే లంకెను నొక్కి మీకు కావలసిన పేరు, ఏ సైట్లను సెర్చ్ చెయ్యలి మొదలయిన విషయాలను తెలిపి మీ యొక్క సెర్చ్ ఇంజన్ ను తయారు చేసుకొండి.

అక్కడ ఉన్న html ను మీ సైట్లో పెట్టుకుంటే మీ సెర్చ్ ఇంజను తయారు.

ఈ సెర్చ్ ఇంజను మీ ఒక్కరే కాకుండా వేరే వాళ్ళు కూడా సైట్లను add చేసే సదుపాయం ఇందులో ఉంది.