ఓ చాక్లెట్టిచ్చి ఈ టపా చదవండి …

చిన్నప్పటినుంచీ చాక్లెట్టులంటే స్పెషలింటరెస్టు నాకు.

అన్నం లేకపోయినా ఫరవాలేదు కానీ చాక్లెట్టు లేనిదే నా భోజనమెప్పుడూ పూర్తయేది కాదంట.
అంటే దాని మహత్యం నాకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట.
అప్పటి నుంచీ ఇప్పటి దాకా నా బెట్టు తీర్చడానికి చాక్లెట్టే మార్గం.

చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాదు మరి.
అసలు చాక్లెట్లు అంటే అమ్మాయిలకు తెగ ఇష్టం అనే ముద్ర వెయ్యడం ఒక పెద్ద “కాన్స్‌పిరసీ” అని నాకనిపిస్తుంది. మన మగాళ్ళ చాక్లెట్లు కూడా లాక్కుని వారు తినడానికి.

నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పటి దాకా తిన్న ఒక్కొక్క చాక్లెట్టూ గుర్తే…

చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే దానిని చప్పరిస్తూ ఉంటే ఆహా! (జెండా వందనాల స్పెషలు ఇదే)
క్లాసురూములో కూడా దాచుకుని చివరి బెంచీలలో కూర్చుని మరీ తినేవాడిని.

తర్వాత నెమ్మదిగా అసలయిన చాక్లెట్టులు అలవాటయ్యాయి. అంటే “కాడ్బరీ ఎక్లయిర్స్” అన్నమాట. దానిని తప్ప ఇంక దేనినీ ఇప్పటికీ నేను చాక్లెట్టుగా అంగీకరించలేను. (రాపర్లలో ఉన్న చాక్లెట్లలో అన్నమాట)
ఆ రుచి మరిగిన తరువాత అసలు ఇంక ఏ ఇతర చాక్లెట్టు తినబుద్దయ్యేది కాదు. అసలు అవి తింటేనే మహా పాపం అనుకునేవాడిని. కాఫీ బ్రేకులూ, న్యూట్రినులూ ఎన్ని తిన్నా తృప్తిగా ఉంటేగా ?

కానీ విధి ఆడిన వింత నాటకంలో నేను బలయినట్టు రోజూ నాకు అర్థ రూపాయి ఇవ్వరుగా అందుకే “ఆశ” లాంటి చాక్లెట్లు తినలేక, చాక్లెట్లు తినకుండా ఉండాలేక ఎంత మధనపడ్డానో నాకే తెలుసు.
కొన్ని సార్లు కష్టపడి రెండు రోజులకి ఆ పావలా దాచుకుని మరీ ఎక్లయిర్సే కొనుక్కునేవాడిని.

అలాగే ఇంటికెవరొచ్చినా బిస్కెట్లు, స్వీట్లు గాక నాకోసం ఎవరయినా చాక్లెట్లు పట్టుకొస్తే వాళ్ళు నాకు అత్యంత ఆప్తులన్నమాట. వాళ్ళ కోసం స్పెషలుగా మంచినీళ్ళు తెచ్చివ్వడం, ఫలహారాల ప్లేట్లు అందివ్వడం లాంటివి చేసేవాడినన్నమాట. అవి తేనివాళ్ళకు మాత్రం నన్ను పలకరించినా మొహం తిప్పుకునే వాడిని.

దాని సైడెఫెక్టు ఏమిటంటే నాచేత పని చేయించుకోవడమెలాగో జనాలకు తెలిసిపోయింది. ఇంట్లో అమ్మకి కందిపప్పో, మినప్పప్పో కావాలంటే ఓ రూపాయెక్కువిచ్చేది కావాలనే. అమ్మకి తెలుసు ఆ రూపాయి వెనక్కి రాదని. అదే కదా మరి మర్మం.

ఎక్లయిర్స్ ఎలా ఉన్నా ప్రత్యేక సందర్భాలకి మాత్రం పెద్ద చాక్లెట్లు ఉండాల్సిందే. అంటే నా పుట్టిన రోజు, అక్క, అమ్మ, నాన్న ఎవరి పుట్టిన రోజులయినా నాకు పండగే. మరి నన్ను సంతృప్తి పరచాలంటే నాకు “ఫైవ్ స్టార్” ఇవ్వాల్సిందే. ఏ స్వీటూ, హాటూ దానికి సాటి రాదు. దానిని పిసర పిసరంత కొనుక్కుని తిని ఆనందిస్తే ఆ మజానే వేరు. నాది తినడం అయిపోయిన తర్వాత మరి అక్కది వదిలేస్తే ఎలా ? దానినీ హాం ఫట్టు.
ఇక అమ్మా, నాన్నలదయితే డీఫాల్టుగా నాదే. అంటే నాలుగు చాక్లెట్లు కొని తేగానే మూడు నా చేతిలో. అవి తిన్న తర్వాత అక్కది కూడా నాదేనన్నమాట. అక్క తింటున్నా సరే అందులో సగం నా వాటానే.

“పెద్ద” చాక్లెట్లు తినడం మొదలుపెట్టిన తర్వాత నాకు పిచ్చపిచ్చగా నచ్చింది “ఫైవ్ స్టారే”. డెయిరీ మిల్కులూ, క్రాకిల్ లూ, కిట్ కాట్ లూ దాని తర్వాతే.

అలా చిన్నప్పటి నుంచే వందలాది (వేలాది ??) చాక్లెట్లు తిని చాక్లెట్టు ఫాక్టరీలను పోషించడంలో కీలక పాత్ర పోషించానన్నమాట.

పెద్దయ్యాక స్నేహితులందరూ బేకరీలలో పఫ్ లూ, కేకులూ కొనుక్కుని తింటుంటే నేను మాత్రం చాక్లెట్టులే తినేవాడిని. వారికేమో అదో చిత్రం. ఇంకా చిన్నపిల్లాడిలా చాక్లెట్లు తినడమేంట్రా అని ?
అయినా నాకు తెలియక అడుగుతాను చాక్లెట్లు తినడానికి వయసుతో సంబంధం ఏమిటండీ ?

నేను పొరపాటున కేకులు గట్రా కొనాల్సి వచ్చినా చాక్లెట్టు ఉన్న కేకులే కొనేవాడిని. అందుకే ఇప్పటికీ ఎవరయినా నన్ను కొనమని చెప్పడానికి సందేహిస్తారు.

సరే ఎలాగో రెండు రోజులకి ఒక చాక్లెట్టు తింటూ ఇంజినీరింగు వరకూ గడిపేసాను.

ఇక నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే వెంటనే ఒక వంద రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనుక్కుని తినేసాను. అన్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా స్వీట్లు బదులు చాక్లెట్లే… 🙂

నా జీతంలో ఓ పావు వంతు చాక్లెట్లకి కేటాయింపన్నమాట. మా అమ్మ కూడా ప్రతీ నెలా సరుకులతో పాటూ ఓ పది రకాల చాక్లెట్లు కొంటుంది ఇప్పటికీ… నాలుగు రాత్రులు కూడా దాటకుండానే వాటికి కాలం చెల్లిపోతుందనుకోండి.

ఇక మన లెవెలు పెరిగింది. ఇప్పటి దాకా దేశీ చాక్లెట్లే తినే నాకు విదేశీ చాక్లెట్లు పరిచయమయ్యాయి. హెర్షీసూ, ఘిరాడెల్లీలు, ఫెర్రెరో రోషర్‌లూ, మార్సు బారులూ, లిండ్ట్ లూ అన్నీ ఒకటొకటిగా నా చిట్టాలో చేరాయి.
ఆఖరికి నా పిచ్చి ఎంత వరకూ వచ్చిందంటే నా స్నేహితులు ఆన్సైటు నుంచి తిరిగొచ్చేటప్పుడు నా కోసం ఓ పాకెట్టు చాక్లెట్లు ప్రత్యేకంగా తెచ్చేవారు. అవి లేకపోతే వారితో మాటలుండవు మరి.

నా ఇష్టాన్ని ఉపయోగించుకుని జనాలు నాతో ఆడుకున్నారు కూడా… ఓ సారి మా స్నేహితులతో కలిసి వెళుతుంటే ఓ చాక్లెట్టు చాపారు నా ముందు. నా సంగతి ఎలాగూ తెలిసిందే. మరు క్షణంలో గబుక్కు. అది కొరికిన తర్వాత చేదుగా ఏదో ద్రవం వచ్చింది దాంట్లోంచి. అప్పుడు గానీ చెప్పలా వాళ్ళు అదేదో వోడ్కా నింపిన చాక్లెట్టంట. యాక్…
అప్పుడు గానీ నాకు తెలీలేదు నే తినని చాక్లెట్టు కూడా ఉంటుందని. (ఆఖరికి చేదుగా ఉండే చాక్లెట్లు కూడా నే తింటాను మరి)

మీకు తెలీదేమో నా చాక్లెట్టు పిచ్చి ఎంతంటే ఆఖరికి ఐస్ క్రీం తిన్నా చాక్లెట్టుదే… చాక్లెట్టు ఫడ్జ్‌లూ, సండేలూ. అన్నిటికన్నా ప్రియమైనది కార్నర్ హౌజ్‌లో “డెత్ బై చాక్లెట్”.
హహ… పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా…
వెనిల్లా స్కూపుల మీద పెద్ద పెద్ద చాక్లెట్టు కేకులూ, దాని మీద ఓ బకెట్టుడు చాక్లెట్ సాసు. నాలాంటి వారికి అది చాలదూ ???

అన్నట్టు ఫ్రిజ్‌లో “పర్క్” పిలుస్తుంది కానీ మళ్ళీ కలుస్తా !