చిక్కమగళూరు ట్రావెలాగుడు …

భారతంలో పొడవాటి వారాంతం (మధ్యలో ఒక సెలవు పెడితే ఐదు రోజులు) కావడంతో ఎప్పటిలాగే ఎలాంటి ప్లానూ లేకుండానే మంగళవారం ఆఫీసుకెళ్ళాను.

నా సహోద్యోగి ఒకతను మేము చిక్కమగళూరుకి వెళుతున్నాము వస్తావా ? అని అడిగాడు. ఎప్పటిలాగే ఇంకో లాస్ట్ మినట్ ట్రిప్పుకి రెడీ అయ్యాను.

ఆ రోజు రాత్రి బయలుదేరి మళ్ళీ శుక్రవారం పొద్దున్నకి తిరిగి వచ్చేటట్టు అనుకున్నాము. రాత్రి పదకొండున్నరకి ఇంటి నుంచి బయలుదేరాలి. అయితే మన భారత కాలామానం ప్రకారం పన్నెండున్నర కల్లా బయలుదేరాము.
క్వాలిస్ ఒకటి మాట్లాడుకుని దాంట్లో ఎక్కగానే నాకిష్టమయిన పని మొదలెట్టేసాను. ఇంకేంటి పడక. అదేంటో జనాలకి క్యాబుల్లోనూ, బస్సుల్లోనూ నిద్ర రాదు కానీ నాకయితే ముంచుకొచ్చేస్తుంది.

ఇక మధ్యలో ఒకట్రెండు బ్రేకులేసి టీ తాగి మళ్ళీ నా నిద్ర కొనసాగించాను. ఎలాగయితే పొద్దున్నే ఆరింటికల్లా చిక్కమగళూరు చేరుకున్నాము.
(చిక్కమగళూరు అంటే చిన్న కూతురి ఊరు అని అర్థం కన్నడంలో. ఈ ఊరుని ఏదో రాజు తన చిన్న కూతురికి కట్నంగా ఇచ్చాడని ఒక కథగా వికీపీడియాలో చదివాను.)

ఒక మోస్తరు (అంతకంటే అక్కడ లేవు) హోటల్లో దిగి మళ్ళీ పడక. చిక్కమగళూరులో చూడడానికంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. మంచి వ్యూ పాయింట్లకీ, ట్రెక్కింగుకీ అనువయిన స్థలం.
పదింటికల్లా తయారయి ఘాట్ రోడ్డెక్కి ప్రయాణం చేస్తుండగానే వాతావరణంలో మార్పు కనిపించసాగింది. నెమ్మదిగా మంచుతో కూడిన మబ్బుల మధ్యలో నుంచి మా వాహనం వెళుతూంది. భలే ఆహ్లాదంగా ఉంది వాతావరణం.

అలా ఒక గంట సేపు ప్రయాణం చేసిన తరువాత “సీతాళయ్యన మఠా”నికి చేరుకున్నాము. అప్పటికి అక్కడ బాగా దట్టంగా మంచు కమ్ముకుని ఉంది. ఒక చిన్న గుడి కూడా ఉంది.

మాతో పాటూ వచ్చిన ఒక స్నేహితుడికి అది సొంతూరు. అక్కడి లోకలు స్పెషల్సుని మా మధ్యాహ్న భోజనానికి ఆర్డరు చేసాడు కింద. మా డ్రైవరుని అది తేవడానికి పంపి “ముళ్ళయ్యన గిరి” ట్రెక్కింగు మొదలెట్టాము. చిరు చలిగా ఉన్న ఆ వాతావరణంలో మాంచి పచ్చదనం ఉన్న దట్టమయిన చెట్ల మధ్య నుంచి ట్రెక్కింగు చెయ్యడం ఒక మంచి అనుభూతి.

రెండు ప్రదేశాలకీ దూరం బానే ఉంది. కానీ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే సమయం తెలియలేదు. ఇంతకు ముందు అనుభవాల వల్ల మరీ అలసటగా కూడా అనిపించలేదు నాకు. మధ్య మధ్యలో ఆగుతూ, బిస్కెట్లు, చిప్సూ మేస్తూ మేము చేరాల్సిన కొండ దిగువకి చేరుకున్నాము. అక్కడ నుంచి మెట్లున్నాయి. అవి ఎక్కితే చక్కగా కొండ పైకి చేరుకోవచ్చు. ఆ ప్రదేశం కర్ణాటకలోనే ఎత్తయిన ప్రదేశం అట.

అక్కడ వ్యూ చాలా బాగుంది. చెప్పుకోవడానికి ఏదో గుడిలాంటిది ఉందక్కడ. ఒక గంట సేపు అక్కడ గడిపి మా బెటాలియనుకి రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసి నెమ్మదిగా తిరిగి “సీతాళయ్యన మఠా”నికి చేరుకున్నాము. మా డ్రైవరుదీ చిక్కమగళూరు సొంతూరు కావడంతో కేవలం ఒక గంట ఆలస్యంగా మా మేత తీసుకొచ్చాడు. అప్పటికే ఆకలితో నకనక లాడుతోంది మాకు. అది కొండ ప్రాంతం, మేము వెళ్ళాల్సింది ఆ దారే కావడంతో మధ్యలో ఆపి తిండి తిందామని ప్లాను. కాకపోతే తినడానికి అనువయిన ప్రదేశమే దొరకలేదు.
చివరాఖరికి ఒక చిన్న సైజు ట్రెక్కు చేసి ఒక కొండ మీదకి చేరి అక్కడ తినడానికి కూర్చున్నాము. అక్కీ రోటీ, వంకాయ కూర లాంటి వాటితో ఓ మోస్తరుగా లాగించాము.

అక్కడ నుంచి ఇంకో రెండు ప్రదేశాలు చూడడానికి బయలుదేరాము. బాగా అలసిపోయామేమూ ఇంకో కునుకేసాము. జోరుగా వర్షం మొదలయింది. ఆ వర్షంలోనే చూడాల్సిన రెండు ప్రదేశాలూ చూసి వెనక్కొచ్చాము. రాత్రికి ఏదో తిన్నామనిపించి బెడ్డెక్కితే మళ్ళీ పొద్దున్నే లేవడం.

మాతో పాటూ వచ్చిన లోకలు స్నేహితుడికి అక్కడికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఒక రిసార్టు ఉంది. ఇక మరుసటి రోజు మొత్తం అక్కడ గడపాలని ప్లాను.
ఆ రిసార్టు పేరు “రొట్టికల్లు”. దాని అర్థం నన్నడక్కండి. నాకు తెలీదు.

అక్కడికి చేరిన తరువాత అతను మమ్మల్ని సైటు సీయింగుకి తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశం బాగా తెలిసిందే అతనికి. చెట్లూ, పుట్టల మధ్య నుంచి మమ్మల్ని ఓ చిన్న సెలయేరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని ప్లానన్నమాట. సెలయేరు చక్కగా పారుతోంది. ఆ పారే నీళ్ళ చప్పుడు నాకు భలే ఇష్టం. అలా దాంట్లో నుంచి చాలా సేపు అడ్వెంచర్ చేసాం. ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్ళరు లాగుంది. మేమే దారి చేసుకుంటూ వెళ్ళాము. అదో చక్కని అనుభవం.

అలా దాంట్లో నడుస్తూ వెళితే ఆఖరికి ఒక చిన్న సైజు జలపాతానికి చేరుకున్నాము. అసలే మనకి నీళ్ళంటే చాలా ఇష్టము. ఇక ఆ జలపాతం కింద ఒక గంట గడిపిన తరువాత వెనక్కి బయల్దేరాము.
వెనక్కొచ్చేటప్పుడు నా కాలికి ఏదో నల్లనిది అంటుకుని ఉందని నా స్నేహితుడు చెప్పగానే చూస్తే జలగ. దానిని పీకి ముందుకెళుతుంటే ఒక్కొక్కరికీ పట్టిన జలగలు కనిపిస్తున్నాయి. అందరికీ తలా ఒక రవుండు అయిన తర్వాత మళ్ళీ నా వంతు వచ్చింది. ఓ రెండు జలగలు పట్టకుండానే పీకితే, మరో మూడిటికి రక్త దానం చేసాను. పట్టిన ప్రదేశంలోనే మళ్ళీ పట్టడంతో రక్తం చాలా సేపు ఆగలేదు.

అదో కొత్త అనుభవం. 🙂

రిసార్టుకి తిరిగొచ్చి సుష్ఠుగా లాగించి కాసేపు అక్కడ ఉయ్యాలలాంటి దాంట్లో ఒక చిన్న కునుకు తీసాను నేను. మా వాళ్ళు బాతాఖానీ మొదలెట్టారు.
ఒక గంట తర్వాత వాలీ బాలు ఆడిన తర్వాత ఆ రిసార్టుకే ఆనుకుని ఉన్న సెలయేట్లో స్నానం చేసి వెనక్కి బయలుదేరాము.

అనుకోకుండా కుదిరే నా ట్రిప్పులు భలే బాగుంటాయి. మళ్ళీ లాంగు వీకెండు వరకూ ఈ అనుభవాలతోనే 🙂