మన సినిమాలు, తారల డాన్సులు …

మన సినిమాలలో ఎంత లేదన్నా నాకు నచ్చేది డాన్సులు పాటలు. ఇతర భాషలలో వచ్చే సినిమాలలో కథ, కథనం, ఆక్షన్ అన్నీ ఉన్నా డాన్సులు, పాటలు మాత్రం ఉండవు. అవన్నీ కావాలంటే వారు ఏ రాక్ షో కో, పాప్ షో కో వెళ్ళాలి. కానీ మనకవి మన సినిమాలలో పాకేజీ అయి వస్తాయి.

మంచి కాలక్షేపం కోసం సినిమాకి వెళ్ళే వారికి (అందులో నేనూ ఉన్నా) డాన్సులు, పాటలు ఎంతో ముఖ్యం.
నాకు మంచి డాన్సులున్న పాటలు చూడడమంటే ఎంతో ఇష్టం. డాన్సులను దగ్గరగా ఫాలో అవు ఎవరెలా చేస్తారో.

మన స్టారుల వైపు ఓ లుక్కేస్తే

చిరంజీవి: డాన్సనగానే చిరు తో తప్ప ఇంకెవరితో మొదలెడతాము. ఆ డాన్సులో ఉన్న ఈజు ఇంకెవరికీ లేదు. పాటకు తగ్గ స్టెప్పులు వెయ్యడంలో ఆయనకి ఆయనే సాటి. తొలి నాటి చిత్రాల నుంచీ ఇప్పటి లేటెస్టు చిత్రాల వరకూ డాన్సులో తన విశిష్టత నిలుపుకుంటూ వచ్చాడు చిరంజీవి. అప్పటి బ్రేక్ డాన్సు నుంచి ఇప్పటి సరదా పాటల వరకూ డాన్సు అదరగొడుతూనే ఉన్నాడు.
అలాగే ఆయన తనకు తగిన డాన్సు డైరెక్టర్లను కూడా ఎంచుకుంటాడు. ఇప్పుడయితే లారెన్స్ కి ఫిక్సయిపోయాడు. లారెన్సు వీణ స్టెప్పు ఎంత ప్రాచుర్యం పొందిందో నే చెప్పవలసిన అవసరం లేదనుకుంట. ఈ చక్కని జోడీ ఎన్నో చక్కని స్టెప్పులని మనకందించిండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు లారెన్సు చేసే అవే స్టెప్పుల కంటే చిరంజీవి చేసిన స్టెప్పులే బావున్నట్టనిపిస్తాయి.
కాకపోతే ఈయన మీద నాకు కొన్ని కంప్లెయింట్లు ఉన్నాయి. డాన్సుకి ముఖ్యమయినవి ఒకటి ఈజు, బాడీ లాంగ్వేజీ అయినా బాడీ స్ట్రక్చర్ బావుంటే దానికి అదనపు అందం వస్తుంది. ఈ మధ్య ఫిట్నెస్ విషయంలో మాత్రం చిరంజీవి దెబ్బతినేస్తున్నాడు. ఆ అదనపు అందం రావట్లేదు.

బాలకృష్ణ: బాలకృష్ణ డాన్సు పవర్ పాక్డ్. డాన్సులో స్లీక్‌నెస్ కనిపించదు. కొంత మోటు గానూ, వేషధారణ కూడా డిఫరెంటుగా ఉంటుంది. లెదర్ పాంట్లు, ఓ కాలు గ్రీను, ఇంకోటి యెల్లో లాంటివి ఉంటాయి. కొన్ని స్టెప్పులు మోటుగా, బండగా ఉన్నా డాన్సు బాగా చెయ్యాలి అనే తపన మాత్రం తప్పకుండా కనబడుతుంది.

నాగార్జున: ఈయన డాన్సులో కంపారిటీవ్లీ వీక్. అందుకే ఈయన పాటలలో చాలా మటుకు ఏ పార్టీ లో పాటలో (మన్మధుడు లో అందమయిన భామలు… టైపు), లేక స్టెప్పులు ఎక్కువగా లేని సరదా పాటలో (బోటనీ ఆట ఉంది టైపు) వో ఎక్కువుంటాయి. మరీ
కష్టమయిన స్టెప్పులెయ్యకుండా చేసినంతలో బాగానే చేస్తాడు.

వెంకటేష్: వెంకటేష్ కూడా సూపర్ స్టెప్పులు వేయ్యగా నేను చూడలా. నాలుగు ఐదు విదేశీ మోడళ్ళను వెంట పెట్టుకుని వారి మధ్యలో నడవడం (అన్ని సినిమాల్లోనూ), ఏ పూదోటలో నడుస్తూనో చలా మటుకు పాటలు లాగించేస్తాడు. మానరిజంలు చాలా రిపీటవుతూ ఉంటాయి వెంకటేష్ పాటలలో.

అల్లు అర్జున్: నాకు ఈ టైపు డాన్సంటే ఇష్టం. ప్రొఫెషనల్ టైపు అన్నమాట. చిరంజీవి నుంచి డాన్సు ని వారసత్వంగా పుచ్చుకున్నాడు. డాడీ సినిమాలో డాన్సుని రుచి చూపినా ఆర్య సినిమాతో వెలుగులోకొచ్చింది డాన్సు ప్రతిభ. మంచి ఈజు ఉంది. కానీ చిరంజీవి లా స్టెప్పులు పాటతో పాటుగా ఉండవు, కొంత తెచ్చిపుట్టుకున్న స్టెప్పులలా ఉంటాయి.

జూనియర్ ఎన్‌టీఆర్: ఈ మధ్య ఆక్టర్లలో డాన్సు మీద కొంత పట్టున్న వారిలో ఎన్‌టీఆర్ ఒకడు. ఎక్కువ మాసు స్టెప్పులే కాకపోతే. మాసు కి అప్పీల్ కావడానికే ఈయన డాన్సులు ఓరియెంటెడ్ (నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి, షేకు షకాలా… లాంటివి). కానీ చక్కని ఈజుతో, మంచి పెర్ఫార్మెన్సు ఇవ్వగలడు.

మహేష్ బాబు: ఈయన స్టెప్పులు పరవాలేదనిపిస్తాడు. కానీ ఈయన పాటలు ఎక్కువ డ్రెస్ సెన్స్ చూపించడానికీ, హెయిర్ స్టైలు హైలైటు చెయ్యడానికీ అనిపిస్తుంది. నాకు అన్ని పాటలలోకీ ఒక్కడు సినిమాలో చెప్పవే చిరుగాలి, హరే రామ… హరే రామ… పాటకు చేసిన స్టెప్పులు నచ్చుతాయి. అటు సీరియస్ స్టెప్పులు కాకుండా అప్పీలింగుగా ఉంటాయి.

ఇక ఆ కాలం నటులలో చూస్తే. రాజుల కాలం నాటి సినిమాలు వగయిరాలు వదిలేస్తే

ఎన్‌టీఆర్: కలర్ సినిమాలలో ఈయన డాన్సు పంథా చాలా డిఫరెంటు. హావభావాల మీద ఆధారపడ్డ స్టెప్పులుంటాయి. అలాగే స్ట్రాంగు స్టెప్పులు ఈయన పాటల్లో ఉండాల్సిందే. కొంత మోటు టైపే. చేతులు, కాళ్ళు బాగా ఆడతాయి ఈయన స్టెప్పుల్లో 🙂 ఎవరయినా డాన్సులకేసిన స్టెప్పులు చూడండి, ఆ చెయ్యి ముందుకు చాచి కాలు ముందు కీ వెనకకీ కదిపే స్టెప్పు తప్పక ఉంటుంది. అలా ట్రేడు మార్కు అయిపోయింది.

నాగేశ్వరరావు: నో స్టెప్పులు. ఏ బాల్కనీలో నుంచుని పాడే పాటలో, పియానో వాయిస్తూ పాడే పాటలో, అమ్మాయి వెంట పడి ఏడిపిస్తూ పాడే పాటలో ఉంటాయి. చటుక్కున గెంతులు తప్పితే ఆక్చువల్ స్టెప్పులు పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించదు.

కృష్ణ: డాన్సు గురించి మాట్లాడి, ఈయన గురించి మాటలాడకపోవడమా ? పీటీ మాస్టరు దగ్గర డాన్సు నేర్చుకొచ్చినట్టుంటాయి ఈయన స్టెప్పులు. ఆయన డాన్సు చేస్తుంటే వన్, టూ, త్రీ లు నాకు కనబడుతూ ఉంటాయి కళ్ళ ముందు. ఎక్కడ నుంచో అమ్మాయిల మధ్య నడుచుకుంటూ రావటం, లేదా ఎక్సర్సైజులు ఈయ స్టెప్పుల్లో ఎక్కువ. చలాకీగా గెంతడం కూడా ఈయన డాన్సులో భాగమే.

అదీ టూకీగా.
ఇక నాకు సంబంధించి నేను ఎంతో అభిమానించే హీరో డాన్సులో హృతిక్ రోషన్. మొదటి సినిమా ఎక్ పల్ కా జీనా తోటే నే ఫ్లాటు. దాని తరువాత లక్ష్య లో మై ఐసా క్యో హూ… సాంగు లో డాన్సు కూడా అదురుతుంది. అన్ని సినిమాలలోనూ డాన్సు అదుర్స్.

కొసమెరుపు: ఈ టపా రాస్తుంటే టీవీలో ఈ పాటొస్తుంది హిందీది. నో కామెంట్ మీరే చూసి ఎంజాయ్ చెయ్యండి.

నేనెందుకు కనిపించట్లేదు ???

డాన్సంటే నాకెంతో గౌరవం. ఎందుకంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి.
అన్నట్టు చెయ్యడం వేరు రావడం వేరు. నేను చేసా కానీ రాదు 🙂

ఇంతకీ సంగతేంటంటే మా “కంపెనీ రోజు” జరగబోతుంది. దానికి డాన్సాడే వాళ్ళ పేర్లిమ్మంటే ఓ బలహీన క్షణాన “ఊ” అన్నా…
ఇక అక్కడనుండీ కష్టాలు మొదలు. నాకు నా ఫిట్‌నెస్ మీద ఎలాంటి అపోహలూ లేవు. కానీ అలా జరిగిపోయిందన్నమాట.

ఇక ఓ వారం పది రోజుల నుండీ ప్రాక్టీసు చేస్తుంటే తెలుస్తుంది. కాలేజీలో ఆడిన మాసు డాన్సు, స్టెప్పులు ఓ రకం. కానీ ఇప్పుడు కాలేజీ అయిపోయిన ఇన్నాళ్ళ తరవాత ఎగరాలంటే అబ్బో తల ప్రాణం తోకకొస్తుంది.
అదీ మా వోళ్ళు ఎవరో బయట డాన్స్ అకాడమీ నుండి ఓ కొరియోగ్రాఫర్ ని తీసుకొచ్చి మరీ ప్రాక్టీసు చేయిస్తున్నారు.

పాపం నా లాగే ఇంకొందరు బకరాలు కూడా ఉన్నారు మా గ్రూపులో. అందులో కొన్ని ఓస్ డాన్సెంత అని అనుకుని వచ్చినవి కొన్నయితే, అబ్బో కాలేజీలో ఇలాంటివెన్నో చేసాము అని అనుకుని వచ్చినవి మరికొంత.

మొదటి రోజు నాలుగు స్టెప్పులేసేసరికి నలుగురు కనిపించలా. అదేంటబ్బా అని చూస్తే నేల మీద ఆయాసంతో పడున్నారు. హహహ… అని నవ్వినంత సేపు మిగిలిన నలుగురం కూడా అదే స్థితి. ఇక డాన్సు దేవుడెరుగు అని ఆ రోజుకి దుకాణం కట్టేసాము.
ఇక ఆ రోజు నుండి ప్రతీ రోజూ సాయంత్రం ఓ రెండు గంటలు కంపెనీ కెఫటీరియా లో కలవటం, డాన్సు నేర్చుకోవడం. ఇంటికెళ్ళి అన్నం తినడం, పడుకోవడం. అంతే.

మా అమ్మ నాకు దిష్టి తీసింది. ఎప్పుడూ లేంది వీడు ఇంటికి రాగానే సుబ్బరంగా తిని కంప్యూటర్ తెరవకుండా పడుకుంటున్నాడేంటబ్బా ? అని.
తర్వాత చెప్పా డాన్సు చేస్తున్నా అని. ఆ.. అని కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము అనే లుక్కించింది.

అన్నట్టు దీని సైడెఫెక్టు ఏంటంటే ఓ రెండు కేజీలు తగ్గా (అని జనాలంటున్నారు). ఓ రెండేళ్ళు తగ్గినట్టు కనబడుతున్నాని కాంప్లిమెంటిచ్చారు. అవునవును తొందర్లోనే షారూఖ్ ఖాన్ లాగా సిక్స్ పాక్ తో కనిపిస్తా.
ఆ… ఏంటి డేట్సా ? ఇప్పుడప్పుడే ఖాళీలు లేవు…. తర్వాత చూద్దాం. 😛

ఎలాగో కష్టపడి మొత్తానికి డాన్సు స్టెప్పులయితే నేర్చేసుకున్నా మరి. చూడాలి ఆ రోజు ఎన్ని టమాటాలు, గుడ్లూ ఏరుకోవచ్చో. అంత వరకూ నేను ఆన్‌లైను లో అంతగా కనిపించను మరి. టాటా… బై.