జూన్ 10, 2007

నిజంగానే తెలుగు వెలుగులు …

Posted in తెలుగు వెలుగులు వద్ద 7:45 ఉద. ద్వారా Praveen Garlapati

ఆహా…
ప్రతీ ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా తీరిగ్గా లేచి, ఈనాడు చదివి అమ్మ చేసిన దోశెలు తింటున్నా.
అప్పుడు గానీ గమనించలా ఈనాడు ఆదివారం లో తెలుగు వెలుగుల గురించి రాసిన వ్యాసం. ఆనందానికి అడ్డులేక పోయింది.
మన తెలుగు బ్లాగర్ల లోనే ఎవరో రాసినట్టు సమగ్రంగా, అన్ని ఉపకరణాలతోనూ, లంకెలతోనూ వచ్చింది వ్యాసం.

చివరి సారి తెవికీ గురించి వచ్చిన వ్యాసం తో వచ్చిన లాంటి స్పందన కంటే ఈ సారి ఇంకా ఎక్కువ స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.
ఇది మన తెలుగు బ్లాగరులందరికీ ఎంతో శుభదినం. ఇలాగే ఇంకా ఎన్నో పత్రికలలోనూ మన గురించి రావాలి, అందరికీ తెలియాలి.

ఇక ఈ పోస్టు రాసే ఉద్దేశం.

ఎవరయినా తెలుగు లో బ్లాగు మొదలెట్టాలంటే ఏం చెయ్యాలి.

* తెలుగు ని మీ మీ కంప్యూటర్లలో చూడాలనుకుంటే ఈ వికీ వ్యాసాన్ని చదవండి.

1. మొదట బ్లాగరు లో కానీ వర్డ్‌ప్రెస్ లో కానీ ఒక అకౌంట్ సృష్టించుకోండి. సగం పని పూర్తయినట్టే.

2. మీరు తెలుగు లో రాయడానికి ఒక ఎడిటర్ కావాలి, దానికి RTS, inscript లాంటి ప్రత్యామ్నాయలు ఉన్నాయి. RTS కోసం లేఖిని, బరహా లాంటి ఉపకరణాలు, inscript కోసం విండోస్ లోనె ఉన్న కీబోర్డ్ లే అవుటు, మినీ వంటివి ఉపలబ్ధం.

3. ఇక ఒక సారి మీరు రాయడం కొద్దిగా సాధన చేస్తే మీకు ఎదురే లేదు.

4. ఏమి రాయాలని ఆలోచిస్తున్నారా, ఏదయినా. అదీ ఇదీ అని లేదు, మీకు తట్టిన, మీరు అనుకుంటున్న, మీరు భావాలు వ్యక్తీకరించ దలచిన వేటి గురించయినా రాయచ్చు.

5. ఇక వీటి వల్ల లాభమంటారా. మీ లాగా ఆలోచించే వారి గురించి తెలుస్తుంది. తెలుగు భాష మీద మమకారం పెరుగుతుంది. నాలుగు విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. నలుగురూ ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. అదీ గాక మంచి కాలక్షేపం కూడా.

6. ఇంకోటండోయ్ ఇక్కడ కేవలం సాహిత్యం గురించే కాదండోయ్, సినిమాలు, టెక్నాలజీ, పాటలు, సాహిత్యం, సంగీతం, వంటలు ఒకటేంటి అన్నిటి గురించీ సమాచారం లభ్యం.

7. ఇలాంటివన్నీ ఒకే చోట చూడాలనుకుంటే కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ వంటి అగ్రిగేటర్స్ లభ్యం.

8. తెలుగు విషయాల గురించి తెలుసుకోవడానికి తెవికీ (తెలుగు వికీపీడియా) ఎలాగూ ఉంది. ఇంగ్లీషు వికీ గురించి తెలిసినంతగా తెలుగు వికీ గురించి తెలిసుండకపోవచ్చు. దీనిలో కూడా ఎంతో సమాచారం ఉంది. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత.

9. పొద్దు చూడడం మర్చిపోకండి.

10. ఇంక్నా ఏమన్నా సహాయం కావాలంటే తెలుగుబ్లాగ్ గుంపు లో అడగండి.

ఇక ఇది చదివిన వారందరూ తొందరలోనే బ్లాగులని, వికీ ని ఆదరించాలని కోరుకుందాము.