సురభి మాయాబజార్ – ఇది ఒక అద్భుతమయిన లోకం …

క్రితం వారం అర్జున రావు గారు నాకు ఫోన్ చేసి నవంబరు ఏడున బెంగుళూరు “రంగ శంకర“లో సురభి వారి చేత “మాయాబజార్” ప్రదర్శింపబడుతుంది అని వార్త అందించినప్పుడు నాకు తెలియలేదు నేను ఎలాంటి అనుభవాన్ని చవి చూడబోతున్నానో.

సరే ఒక కొత్త అనుభవం లాగా ఉంటుంది కదాని వెంటనే నవీను అన్నకి ఒక వేగు పంపి మరుసటి రోజే ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చేసేసాను. మా ఇద్దరికీ ఎంతో ఆసక్తి ఉన్నా ఆ ఆసక్తి తీరే మార్గం మాత్రం అనుకోని విధంగా ఇలా కలిగింది.

ఇవాళ పొద్దున్న నుంచి ఇద్దరమూ తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. రాత్రి ఏడున్నరకి మొదలవుతుంది నాటకం “రంగ శంకర”లో. ఐదున్నరకే ఇంటికొచ్చి వేచి ఉన్నాను నేను. నవీను అన్న ఏడయినా రారే. ఇంటి పక్కనే “రంగ శంకర” అయినా వేళకు చేరతామో లేదో అని నాకు తెగ టెన్షను పుట్టుకొచ్చింది.

ఆఖరికి హడావిడిగా ఎలాగయితే ఏడు పదికి ఇద్దరమూ రంగ శంకర చేరుకున్నాము. ఐదు నిముషాల తరువాత లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్ళగానే అసలు ఏ లోకంలో ఉన్నామో అనిపించింది కాసేపు. మొత్తం థియేటర్ నిండుగా ఉంది. అందరి మొహాల్లోనూ చెప్పలేని ఉత్కంఠ.

అసలు మన పాత మాయాబజార్ సినిమాకే మూలమయిన ఈ నాటికను చూడబోతున్నామంటేనే నాకు ఒక రకమయిన పులకరింత కలిగింది. ఇందులోని సీనులూ, ఎఫెక్టులూ, పాటలూ సినిమాలో ఉపయోగించారు.

నిజంగా చెప్పాలంటే నేను ఇంతటి జనాన్నీ, ఇలాంటి స్పందననీ ఊహించలేదు. తెలుగు వారనేమిటి, కన్నడ, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలు మాట్లాడే జనాలూ అక్కడున్నారు. అవి గమనిస్తూ నేను అదో రకమయిన ట్రాన్సులోకి వెళ్ళిపోయాను.

ఏడున్నరకి అందరూ వచ్చేసాక తలుపులు మూసేసారు. “అరుంధతి నాగ్” సురభి గురించీ, మాయాబజార్ గురించీ ఒక నాలుగు ముక్కలు చెప్పి మొదలుపెట్టారు. సురభికి ఉన్న చరిత్ర దాదాపు వంద ఏళ్ళ పైమాటే. మాయాబజార్ (శశిరేఖా పరిణయం) ఒక్కటే‌కాక ఎన్నెన్నో అద్భుతమయిన నాటకాలు రచించి అద్భుతంగా ప్రదర్శించారు, ప్రదర్శిస్తున్నారు.

అరుంధతి నాగ్ మాట్లాడుతున్నప్పుడు నన్ను అచ్చెరువొందేలా చేసింది థియేటర్ యొక్క “అకౌస్టిక్స్“. నేను నా చెవులనూ, కళ్ళనూ నమ్మలేకపోయాను. ఎటువంటి మైకు, స్పీకర్లూ లేకుండా మొత్తం థియేటరులో ఆవిడ మాట్లాడే ప్రతీ మాటా వినబడుతోంది. అద్భుతంగా తీర్చిదిద్దారు థియేటరుని.

“మాయాబజార్”కి వచ్చిన అశేషమయిన ఆదరణ చూసి మొదట మధ్యాహ్నం రెండున్నరకీ, రాత్రి ఏడున్నరికీ అనుకున్న దానికి జతగా రాత్రి పదకొండింటికి ఇంకో షో ఏర్పాటు చేసామనే సరికే నాకు అర్థమయింది ఈ రోజు నేను ఎలాంటి అనుభవాన్ని చవి చూడబోతున్నానో. చప్పట్లతో అందరూ “మాయాబజార్”కి ఆహ్వానం పలికారు.

మొదటి సీనుకే అందరూ డంగైపోయారు. నారద మునీంద్రుడు మబ్బులలో విహరిస్తూ భూలోకానికి విచ్చేస్తాడు. మరి నిజంగానే నారదుడు ఎగురుతూ మబ్బులలో నుంచి భూలోకానికి దిగితే ?
అదే జరిగింది. నేనైతే అవాక్కయి చూస్తుండిపోయాను. అదెలా సాధ్యపదిందో అర్థం కాలేదు.

సురభి గురించి అంతర్జాలంలో చదివినప్పుడు వారు ఆ కాలంలోనే స్పెషల్ ఎఫెక్టులు స్టేజీ పైన చేసేవారనీ, దానికి ఎంతో విశేష ప్రాచుర్యం ఉందనీ చదివాను కానీ ఈ స్థాయిలో నేను అస్సలు ఊహించలేదు. నాకింకా అప్పటికే తెలీదు నేను ఏమేమి వింతలు చూడబోతున్నానో…

నారదుడు అద్భుతమయిన వాచ్యంతో, చక్కని గొంతుతో పలికాడు. అప్పటికే నే పరిసరాలన్నీ మరచిపోయి మాయాబజార్ లోకానికి వెళ్ళిపోయాను.

ఆ తరువాత నా కళ్ళ ముందు కదాలాడిన నాటకం ఒక గొప్ప ఆవిష్కరణ. కళ్ళు మూసి తెరిచేంతలోనే రాజభవనాలు ప్రత్యక్షమయ్యాయి, రాచనగరులు వచ్చాయి. చిటికెలో సెట్లు మారిపోయాయి. భూమి, ఆకాశం, రాజభవనం, జలపాతం, అడవి, యుద్ధభూమి ఒకటేమిటి సర్వమూ క్షణాల్లో కళ్ళ ముందు ప్రత్యక్షం. నిజంగా ఏమయినా మంత్ర తంత్రాలు జరుగుతున్నాయేమో అనిపించేటట్లుగా జరిగింది.

అసలు పాత్రధారులు ఎంత అద్భుతంగా నటించారో చెప్పటానికి ఒక మచ్చుతునక. నాటిక మొదలయిన కొద్ది నిముషాలలో బలరాముడు వేషధారి తూలుతూ మాట్లాడుతున్నాడు. నాకు, నవీను అన్నకీ, మా చుట్టుపక్కల అందరకీ ఒక రెండు నిముషాలు అర్థం కాలేదు అదేమిటి ఇంతటి పేరొందిన నాటిక చేసేటప్పుడు అందులో నటుడు తాగివచ్చాడేమిటీ, అలా తూలిపోతున్నాడేమిటీ, అయ్యో అయ్యో అనుకుంటున్నాము.

ఆ పాత్రధారి “అవును నేను సురాపానం చేసాను …, ” అని డైలాగు చెప్పిన తర్వాత కానీ మాలో అది నిజమా, అబద్దమా అన్న సంశయం పోలేదు. అద్భుతం, అమోఘం.

అభిమన్యుడి పాత్ర పోషించిన అతను మంచి స్ఫురదౄపి. చక్కని పలుకుతో, దానికి తగిన భావంతో, శైలితో బాగా నటించాడు.
శశిరేఖ, కృష్ణుడు, ఒక్కరేమిటి అందరూ చక్కని నటనని ప్రదర్శించారు.

తర్వాత కాసేపటికి రంగప్రవేశం చేసాడు ఘటోత్కచుడు, భలే చక్కని కంఠం. అసలు నిజంగా రాక్షసుడు మాట్లాడితే ఇలాగే ఉంటుందా అనిపించే కంఠంతో చక్కని ప్రదర్శన ఇచ్చాడు.
ఘటోత్కచుడి రంగప్రవేశం తరువాత రంగస్థలం మీద ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శితమయ్యాయి. ఏ కృత్రిమమయిన ఎఫెక్టులూ లేకుండా ఆ స్పెషలు ఎఫెక్టులు ఎలా సృష్టించారో అని ప్రతీ ఒక్కరూ అబ్బురపడుతూనే ఉన్నారు.

ఉదా: అభిమన్యుడి రథం నిజంగానే స్టేజీ పైన పరుగులెత్తింది. వెళుతున్న కొద్దీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా మారిపోతోంది.

అలాగే అభిమన్యుడి, ఘటోత్కచుడి యుద్దంలో నిజంగానే బాణాలు ఎగిరాయి, గదతో ఢీకొట్టాయి. విస్ఫోటాలు సంభవించాయి. ఎలా చేయగలిగారో ఎవరికీ అంతుపట్టలేదు.
ఆగ్నేయాస్త్రం ప్రయోగించబడింది. నిజమైన మంటలు లేచాయి. తరువాత వరుణాస్త్రం ప్రయోగించబడింది. నిజంగా వర్షం కురిసి ఆ మంటలు ఆర్పబడ్డాయి.

శశిరేఖ పడుకున్న మంచం అమాంతంగా గాలిలోకి ఎగిరింది. అలాగే ద్వారకలో జనాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి పళ్ళాలు ఎగిరాయి, చెప్పులు వీపుల మీద చరిచాయి, కంబళి దానంటత అదే చుట్టుకుంది, నాగుపాములు బుసలు కొట్టాయి, వెన్నెలా-చంద్రుడూ-నక్షత్రాలూ ప్రత్యక్షమవుతాయి, జలపాతం వచ్చింది, దాని ముందు నుంచి ఏనుగు ఘీంకరిస్తూ వెళ్ళింది, దాని పక్కన నుండి చిన్న కుందేలు గెంతులేసింది. అబ్బ ఒకటేమిటి సర్వమూ మాయే. మనల్ని అచ్చెరువొందించేవే.

ఇవన్నీ ఒక ఎత్తయితే నాటికలోని ఒక పాటలో చూపించిన ఎఫెక్టు ఒక ఎత్తు. (అవును నాటికలో పాటలున్నాయి. కొన్నింటిని “మాయాబజార్” సినిమాలో కూడా వాడారు)

పాట సందర్భం ఏమిటంటే అభిమన్యుడూ, శశిరేఖా విరహ గీతం. శశిరేఖ పాట మొదలుపెడుతుంది. ఒక చరణం ముగిసిన తరువాత అభిమన్యుడు పాట మొదలుపెడతాడు. అభిమన్యుడు పాట మొదలుపెట్టగానే హఠాత్తుగా ఈ వైపు శశిరేఖ చీకట్లోకి లీనమై ఘటోత్కచుడి ఇంట్లో బస చేసిన అభిమన్యుడు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ శశిరేఖ పాట మొదలుపెట్టగానే అభిమన్యుడు మాయమై శశిరేఖ ప్రత్యక్షమవుతుంది.
అసలు మన కళ్ళు మనల్నే మోసం చేస్తున్నాయా అనిపిస్తుంది. హేట్సాఫ్…

ఇలా అసలు రెండు గంటల సమయం ఎప్పుడు గడచిపోయిందో తెలీనే లేదు. ప్రతీ దృశ్యానికీ మైమరచిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఆగనే లేదేమో ?

నాటిక ముగిసిన తరువాత నాకు తెలీకుండా నేనే “స్టాండింగ్ ఒవేషన్” ఇచ్చాను. చుట్టూ చూస్తే అందరు జనాలూ నాలాగే. చప్పట్లు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పాత్రధారుల కళ్ళలో ఆనందాన్ని చూడడానికి నాకయితే రెండు కళ్ళూ చాలనే లేదు. ఆ ప్రయత్నంగా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి.

చివరికి ఆ నాటక దర్శకుడయిన నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి సురభి చరిత్ర గురించీ, అరవై కుటుంబ సభ్యులు కలిసి ఇంకా నిర్వహిస్తున్న నాటక రంగం గురించీ, తర తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారి సభ్యుల గురించీ చెబుతుంటే ఆశ్చర్యం కలిగింది.

జనాలెవరికీ అక్కడ నుంచి కదలాలని లేకపోయినా ఆ లోకం నుంచి బయటకు రావలసి వచ్చి సంతోషం నింపుకున్న హృదయాలతో బయటకు వచ్చారు.
ఈ రోజు నాకు నా జీవితంలో మరచిపోలేని ఒక మధురానుభూతి.

ఇలాంటి చక్కని నాటకాలు, మన సంప్రదాయం ప్రతిబింబించే కళలు ప్రదర్శింపబడాలి. వాటికి తగిన ఆదరణ ఉండాలి. “రంగ శంకర” లాంటి థియేటర్లు కలకాలం వర్థిల్లాలి.

* సురభి వారి గురించి వెతుకుతుంటే ఈ బ్లాగు తగిలింది. ఇందులో విశేషాలు చూడండి.