జ్ఞాపకాలు… ఒక సమీక్ష

రోజులు గడుస్తుంటాయి… మనకి వయసు పెరుగుతుంటుంది. దానితో పాటు ఎన్నో బాధ్యతలు.
ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. పక్క వారి కోసం, అప్పుడప్పుడు మనవారి కోసం కూడా సమయం ఉండదు.
అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి మన స్వార్థం తప్ప, మన పని తప్ప వేరే ఏమి చేసామో తెలీదు.

కొన్ని అద్బుత క్షణాలు గుర్తుకు వస్తాయి ఎప్పుడో మన చిన్నప్పుడు వీధుల్లో ఆడుకోవడమో, అమ్మ నాన్నలతో ఎంతో సమయం ఆనందంగా గడపడమో, లేక క్రిక్కెట్ ఆడుతూ దెబ్బలు తగిలించుకోవడమో, గోడవ చేస్తే అమ్మ రెండు వడ్డించడం, మారాం చేస్తే అమ్మ నాన్న గారాబం చెయ్యడం వంటివి.

ఇంకా కొద్దిగా పెరిగిన తరువాత స్కూల్లో అల్లరి చెయ్యడం, చదువు, క్లాసులో మొదటి రాంకు రావడం, స్నేహితులు, గోల చెయ్యడం, కాలేజీ కి వెళ్ళడం ఇంజినీరింగ్ కోర్సులకి ప్రిపేర్ అవడం, తరవాత సీటు సంపాదించడం.

తరువాత ఇంజినీరింగ్ లో చేరడం అక్కడ అంతా కొత్త ఎలా నెత్తుకు రావాలో అనే సందిగ్ధం లో పడడం, తరువాత తేరుకుని హాస్టల్ లో స్నేహితులు, వారితో కలిసి అల్లర్లు చెయ్యడం, చదువు, కొత్త విషయాలు తొలి ప్రేమ మొదలయినవి.

అంతే అక్కడితో మన జీవితం ముగిసినట్టు అనిపిస్తుంది నాకు అయితే, ఆ తరువాత ఒక సారి ఉద్యోగంలో చేరిన తరువాత అంతా అక్కడే ఎక్కడ ఏ కంపని లో చేరాలి, ఏం చెయ్యాలి, పక్కన వారి కంటే ఎలా బాగా నిరూపించుకోవాలి, ఇంకా పెద్ద కంపని కి ఎలా వెళ్ళాలి, ఇంకా ఎక్కువ జీతం ఎలా తెచ్చుకోవాలి, ఇల్లు ఎలా వగైరా వగైరా….

ఈ గోడవల్లో పడి అసలు మనం నిజంగా వీటిని ఆనందించగలుగుతున్నామా ? నేను సంపాదించేది ఆనందించే సమయం ఉందా ? అమ్మ నాన్నలతో సరిగా గడుపుతున్నానా ? స్నేహితులతో మాట్లాడుతున్నానా, పాత స్నేహితులను గుర్తు పెట్టుకుని ఎప్పుడయినా వారిని కలుస్తున్నానా ? ఇలాంటి విషయాలు మరుగున పడతాయి.

వారితో గడిపే సమయం కంటే ఆన్‌లైన్ లో ఉండే సమయం ఎక్కువుంటుందేమో ?

ఈ ఆలోచనలు అన్ని ఒక సారి అందరూ చెయ్యవలసినవి…మీరు ఈ పాటికే గనక చేసి ఉండకపోతే ఇప్పుడయినా మొదలెట్టండి లేక పోతే జీవితంలో ఎంతో ఆనందాకరమయిన క్షణాలు కోల్పోయిన వారావుతారు. ఈ పాటికే చేసి ఉంటే గనక ఎంతో సంతోషం.

నేను కూడా ఇలాగే ఉండే వాడిని… ఎందుకో నన్ను నేనే ప్రశ్నించుకుని వాటికీ సరయిన సమాధానల కోసం ఆలోచించి ఇప్పుడిప్పుడే నా priorities నిర్ధారించుకుని అన్నిటికి సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకేసారి ఆది కుదరకపోవచ్చు కానీ కొద్ది కొద్దిగా ఆది సాధించగలను అనే నమ్మకం ఉంది. నాకు ఎంతో సంతోషం కలిగించే పనులు చెయ్యగలుగుతున్నాను.

ఎందుకో ఇవాళ nostalgia…