ఆలోచనలు… ప్రశ్నలు…

కొన్ని సార్లు నేను ఆలోచిస్తుంటాను మనం ఎంత నిజాయితీగా బతుకుతున్నామా అని ?

మనమొక చర్చలో పాల్గొంటాము. అందులో మనం సరి అని అనుకున్న పాయింటు లేవదీస్తాము చర్చ సాగినకొద్దీ మనం వాదించేది తప్పు అని తెలుస్తుంది. అప్పుడు మనం మన వాదనను వెనక్కి తీసుకుంటామా ? లేక అడ్డంగా వాదిస్తామా ?
ఇప్పుడు నేనడిగితే తొంభై శాతం మంది నేను సరయినదాన్ని సమర్థిస్తా అని చెబుతారు, కానీ నిజంగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే.
కొన్ని సార్లు మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది.

నిజాన్ని నిజం అని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. అది మనలో అప్పుడప్పుడూ లోపిస్తుందేమో ?

దానికి కారణాలు ఏవయినా కావచ్చు. చాలా సార్లు మటుకు మన అహం. నేను తప్పు అని ఒప్పుకుంటే ఎక్కడ అందరికీ లోకువయిపోతానో, నా ఉనికి, నేను సంపాదించుకున్న పేరు ఎక్కడ దెబ్బతింటాయో అని.
కానీ మనం ఇక్కడ మర్చిపోయేది నిజాయితీ. వేరే వాళ్ళ సంగతి వదిలెయ్యండి. మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇక మరి దానిని కూడా పట్టించుకోని మనిషంటే ఆత్మ లేని మనిషి అన్నమాటేగా ?

అసలు తప్పుని తప్పు అని ఒప్పుకోవడానికి ఎందుకు భయం ?

తప్పును తప్పు అని ఒప్పుకుంటే మనమీద గౌరవం పెరుగుతుందే తప్ప తరగదని నా ఉద్దేశ్యం.

ఒక వాదనలో ఎవరి తప్పో మనం ఎత్తి చూపగానే వెంటనే తొంభై శాతం మంది ఎదుటి వారు మన తప్పుల్ని ఎత్తి చూపుతారు. కానీ అక్కడ జనాలు ఆలోచించనిది ఏమిటంటే ఎదుటి వాడి తప్పులు ఎత్తి చూపడం వల్ల తప్పు ఒప్పు అయిపోదు అని.
ఒక్క క్షణం ఆగి అసలు తప్పేంటి అని ఆలోచిస్తే ఇంకో సారి ఎదుటి వాళ్ళకి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వం కదా. ఆ పద్ధతిలో ఎందుకు ఆలోచించకూడదు ?

ఇంకొన్ని సార్లు నాకనిపిస్తుంది నిజాయితీగా ఉండడం సరయినదే కానీ అప్పుడప్పుడూ దానివల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే మనం నిజాయితీగా ఉండాలా ? లేక లౌక్యం చూపించాలా ?

చిన్నప్పటి నుంచీ నాకందరూ చెబుతుంటారు లౌక్యం నేర్చుకో అపుడే పైకొస్తావు అని. నాకు తెలుసు లౌక్యం అంటే “అన్యుల మనముల్ ఒప్పింపక తానొవ్వక…” అనేట్లు ఉండాలనే. కానీ అది అబద్ధం ఆడకుండా ఎంతవరకు సాధ్యం ?

లౌక్యం అంటే ఏంటి అబద్ధం ఆడటమేనా ?

అసలు నిజాయితీ కీ నిజానికీ సంబంధం ఉందా ? లేదా రెండూ వేరు వేరా ?

హు…