ఓ చాక్లెట్టిచ్చి ఈ టపా చదవండి …

చిన్నప్పటినుంచీ చాక్లెట్టులంటే స్పెషలింటరెస్టు నాకు.

అన్నం లేకపోయినా ఫరవాలేదు కానీ చాక్లెట్టు లేనిదే నా భోజనమెప్పుడూ పూర్తయేది కాదంట.
అంటే దాని మహత్యం నాకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట.
అప్పటి నుంచీ ఇప్పటి దాకా నా బెట్టు తీర్చడానికి చాక్లెట్టే మార్గం.

చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాదు మరి.
అసలు చాక్లెట్లు అంటే అమ్మాయిలకు తెగ ఇష్టం అనే ముద్ర వెయ్యడం ఒక పెద్ద “కాన్స్‌పిరసీ” అని నాకనిపిస్తుంది. మన మగాళ్ళ చాక్లెట్లు కూడా లాక్కుని వారు తినడానికి.

నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పటి దాకా తిన్న ఒక్కొక్క చాక్లెట్టూ గుర్తే…

చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే దానిని చప్పరిస్తూ ఉంటే ఆహా! (జెండా వందనాల స్పెషలు ఇదే)
క్లాసురూములో కూడా దాచుకుని చివరి బెంచీలలో కూర్చుని మరీ తినేవాడిని.

తర్వాత నెమ్మదిగా అసలయిన చాక్లెట్టులు అలవాటయ్యాయి. అంటే “కాడ్బరీ ఎక్లయిర్స్” అన్నమాట. దానిని తప్ప ఇంక దేనినీ ఇప్పటికీ నేను చాక్లెట్టుగా అంగీకరించలేను. (రాపర్లలో ఉన్న చాక్లెట్లలో అన్నమాట)
ఆ రుచి మరిగిన తరువాత అసలు ఇంక ఏ ఇతర చాక్లెట్టు తినబుద్దయ్యేది కాదు. అసలు అవి తింటేనే మహా పాపం అనుకునేవాడిని. కాఫీ బ్రేకులూ, న్యూట్రినులూ ఎన్ని తిన్నా తృప్తిగా ఉంటేగా ?

కానీ విధి ఆడిన వింత నాటకంలో నేను బలయినట్టు రోజూ నాకు అర్థ రూపాయి ఇవ్వరుగా అందుకే “ఆశ” లాంటి చాక్లెట్లు తినలేక, చాక్లెట్లు తినకుండా ఉండాలేక ఎంత మధనపడ్డానో నాకే తెలుసు.
కొన్ని సార్లు కష్టపడి రెండు రోజులకి ఆ పావలా దాచుకుని మరీ ఎక్లయిర్సే కొనుక్కునేవాడిని.

అలాగే ఇంటికెవరొచ్చినా బిస్కెట్లు, స్వీట్లు గాక నాకోసం ఎవరయినా చాక్లెట్లు పట్టుకొస్తే వాళ్ళు నాకు అత్యంత ఆప్తులన్నమాట. వాళ్ళ కోసం స్పెషలుగా మంచినీళ్ళు తెచ్చివ్వడం, ఫలహారాల ప్లేట్లు అందివ్వడం లాంటివి చేసేవాడినన్నమాట. అవి తేనివాళ్ళకు మాత్రం నన్ను పలకరించినా మొహం తిప్పుకునే వాడిని.

దాని సైడెఫెక్టు ఏమిటంటే నాచేత పని చేయించుకోవడమెలాగో జనాలకు తెలిసిపోయింది. ఇంట్లో అమ్మకి కందిపప్పో, మినప్పప్పో కావాలంటే ఓ రూపాయెక్కువిచ్చేది కావాలనే. అమ్మకి తెలుసు ఆ రూపాయి వెనక్కి రాదని. అదే కదా మరి మర్మం.

ఎక్లయిర్స్ ఎలా ఉన్నా ప్రత్యేక సందర్భాలకి మాత్రం పెద్ద చాక్లెట్లు ఉండాల్సిందే. అంటే నా పుట్టిన రోజు, అక్క, అమ్మ, నాన్న ఎవరి పుట్టిన రోజులయినా నాకు పండగే. మరి నన్ను సంతృప్తి పరచాలంటే నాకు “ఫైవ్ స్టార్” ఇవ్వాల్సిందే. ఏ స్వీటూ, హాటూ దానికి సాటి రాదు. దానిని పిసర పిసరంత కొనుక్కుని తిని ఆనందిస్తే ఆ మజానే వేరు. నాది తినడం అయిపోయిన తర్వాత మరి అక్కది వదిలేస్తే ఎలా ? దానినీ హాం ఫట్టు.
ఇక అమ్మా, నాన్నలదయితే డీఫాల్టుగా నాదే. అంటే నాలుగు చాక్లెట్లు కొని తేగానే మూడు నా చేతిలో. అవి తిన్న తర్వాత అక్కది కూడా నాదేనన్నమాట. అక్క తింటున్నా సరే అందులో సగం నా వాటానే.

“పెద్ద” చాక్లెట్లు తినడం మొదలుపెట్టిన తర్వాత నాకు పిచ్చపిచ్చగా నచ్చింది “ఫైవ్ స్టారే”. డెయిరీ మిల్కులూ, క్రాకిల్ లూ, కిట్ కాట్ లూ దాని తర్వాతే.

అలా చిన్నప్పటి నుంచే వందలాది (వేలాది ??) చాక్లెట్లు తిని చాక్లెట్టు ఫాక్టరీలను పోషించడంలో కీలక పాత్ర పోషించానన్నమాట.

పెద్దయ్యాక స్నేహితులందరూ బేకరీలలో పఫ్ లూ, కేకులూ కొనుక్కుని తింటుంటే నేను మాత్రం చాక్లెట్టులే తినేవాడిని. వారికేమో అదో చిత్రం. ఇంకా చిన్నపిల్లాడిలా చాక్లెట్లు తినడమేంట్రా అని ?
అయినా నాకు తెలియక అడుగుతాను చాక్లెట్లు తినడానికి వయసుతో సంబంధం ఏమిటండీ ?

నేను పొరపాటున కేకులు గట్రా కొనాల్సి వచ్చినా చాక్లెట్టు ఉన్న కేకులే కొనేవాడిని. అందుకే ఇప్పటికీ ఎవరయినా నన్ను కొనమని చెప్పడానికి సందేహిస్తారు.

సరే ఎలాగో రెండు రోజులకి ఒక చాక్లెట్టు తింటూ ఇంజినీరింగు వరకూ గడిపేసాను.

ఇక నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే వెంటనే ఒక వంద రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనుక్కుని తినేసాను. అన్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా స్వీట్లు బదులు చాక్లెట్లే… 🙂

నా జీతంలో ఓ పావు వంతు చాక్లెట్లకి కేటాయింపన్నమాట. మా అమ్మ కూడా ప్రతీ నెలా సరుకులతో పాటూ ఓ పది రకాల చాక్లెట్లు కొంటుంది ఇప్పటికీ… నాలుగు రాత్రులు కూడా దాటకుండానే వాటికి కాలం చెల్లిపోతుందనుకోండి.

ఇక మన లెవెలు పెరిగింది. ఇప్పటి దాకా దేశీ చాక్లెట్లే తినే నాకు విదేశీ చాక్లెట్లు పరిచయమయ్యాయి. హెర్షీసూ, ఘిరాడెల్లీలు, ఫెర్రెరో రోషర్‌లూ, మార్సు బారులూ, లిండ్ట్ లూ అన్నీ ఒకటొకటిగా నా చిట్టాలో చేరాయి.
ఆఖరికి నా పిచ్చి ఎంత వరకూ వచ్చిందంటే నా స్నేహితులు ఆన్సైటు నుంచి తిరిగొచ్చేటప్పుడు నా కోసం ఓ పాకెట్టు చాక్లెట్లు ప్రత్యేకంగా తెచ్చేవారు. అవి లేకపోతే వారితో మాటలుండవు మరి.

నా ఇష్టాన్ని ఉపయోగించుకుని జనాలు నాతో ఆడుకున్నారు కూడా… ఓ సారి మా స్నేహితులతో కలిసి వెళుతుంటే ఓ చాక్లెట్టు చాపారు నా ముందు. నా సంగతి ఎలాగూ తెలిసిందే. మరు క్షణంలో గబుక్కు. అది కొరికిన తర్వాత చేదుగా ఏదో ద్రవం వచ్చింది దాంట్లోంచి. అప్పుడు గానీ చెప్పలా వాళ్ళు అదేదో వోడ్కా నింపిన చాక్లెట్టంట. యాక్…
అప్పుడు గానీ నాకు తెలీలేదు నే తినని చాక్లెట్టు కూడా ఉంటుందని. (ఆఖరికి చేదుగా ఉండే చాక్లెట్లు కూడా నే తింటాను మరి)

మీకు తెలీదేమో నా చాక్లెట్టు పిచ్చి ఎంతంటే ఆఖరికి ఐస్ క్రీం తిన్నా చాక్లెట్టుదే… చాక్లెట్టు ఫడ్జ్‌లూ, సండేలూ. అన్నిటికన్నా ప్రియమైనది కార్నర్ హౌజ్‌లో “డెత్ బై చాక్లెట్”.
హహ… పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా…
వెనిల్లా స్కూపుల మీద పెద్ద పెద్ద చాక్లెట్టు కేకులూ, దాని మీద ఓ బకెట్టుడు చాక్లెట్ సాసు. నాలాంటి వారికి అది చాలదూ ???

అన్నట్టు ఫ్రిజ్‌లో “పర్క్” పిలుస్తుంది కానీ మళ్ళీ కలుస్తా !

ఇండియా నెగ్గింది…. హాకీ ఆ తూచ్…

ఈ రోజు పొద్దున్న నుంచే ఆఫీసులో మొదలయ్యాయి ఎవరు గెలుస్తారు ? ఇండియా నా ? పాకిస్తానా ?
ముందు బాటింగా బౌలింగా ? ఇప్పటి వరకూ ఫస్ట్ బాటింగ్ పని చేసింది, మరి ఈ సారి కూడా పని చేస్తుందా ?

నేనూ నా శక్తి మేరకు నేనూ పాల్గొన్నా ఆ చర్చల్లో. ఇక పొద్దున్న నుండి ఒకటే “ఇంటి నుండి పని” మెయిళ్ళు. మా ఇల్లు ఓ కిలోమీటర్ దూరం మాత్రమే ఉండడంతో నేను సాయంత్రం బయల్దేరవచ్చులే అని ఊరకున్నా. మూడున్నర నుండి నాలుగున్నర వరకూ మీటింగు. తరవాత ఓ టీ తాగి హస్కు కొట్టే సరికి అయిదయింది. అయిదు పదిహేనుకి సిస్టం షట్డవున్ చేసి మేనేజరుకేసి ఓ వంకర నవ్వు నవ్వి బయల్దేరా. నా క్యూబ్ పక్కనుండే మేనేజర్ అప్పుడే తన సరంజామా వేసుకుని బయల్దేరుతున్నాడు. నా పక్క క్యూబతను టాసయిపోయింది ఇండియా బాటింగ్ అన్నాడు. ఇంక ఆ మేనేజరు పరిగెత్తాడు. వెనక నేనూ.

అయిదు నిమషాల్లో ఇంట్లో ఉంటాననుకున్నా. మా ఆఫీసు బిల్డింగ్ దాటే వరకే పది నిముషాలు పట్టింది. ఈ డొక్కు మేనేజర్ల కార్లన్నీ అడ్డంగా ఉన్నాయి. వాటి సందుల్లోంచి ఎలాగో దూర్చి నా బైకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి (కారు కొననందుకు శభాషిచ్చుకుని) రయ్యి మని వెళ్ళిపోదామని ఆక్సిలరేటర్ మీద చెయ్యి పోనిస్తూ ఓ సారి రోడ్డు కేసి చూసి అవాక్కయ్యారా లో ప్రైజొస్తే అవాక్కయినట్టు స్టన్నయ్యా. ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఒకటే ట్రాఫిక్కు. నే కుడి వేపుకు తిరగాల్సిన సందు రెండు ఫర్లాంగులు మాత్రమే. అక్కడికి చేరుకుంటే అసలు ట్రాఫిక్ ఉండదు.

షిట్! అని మనసులో ఓ వంద సార్లనుకుని కార్ల మధ్యలో నుంచి దూర్చి అడుగూ అడుగూ ముందుకు వేస్తూ నా వాచీ ఓ పది నిముషాలు ఫాస్టని గుర్తొచ్చి ఓ నవ్వు నవ్వా. నా పక్క అతను సాఫ్ట్‌వేరతనే మ్యాచా ? అన్నాడు. అవునన్నట్టు తలూపా. ఈ మధ్యలో ఓ పది సార్లు ఇద్దరమూ వాచీ కేసి చూసుకున్నాము. మధ్యమధ్యలో చిరునవ్వులు… షిట్లూ… ఇంకో పది నిముషాల్లో ఇంటికి చేరుకోకపోతే ఇండియా పాకిస్తాన్ అదీ ఫైనల్ మాచ్ మొదటి బాల్ మిస్సయ్యే ప్రమాదముంది.

అంతలో ఓ కారు కొద్దిగా ఎడమ పక్కకి జరగడంతో నా బైకు మొదటి చక్రం అందులో దూర్చడం ఆ తరవాత ఒంటె మాదిరి బైకు మొత్తం దూర్చడం , తరవాత బస్సు పక్కన నుండి కట్టు కొట్టి ట్రాఫిక్ పోలీసు కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది. అక్కడే నే రైట్ టర్న్ తీసుకోవాల్సింది. చెయ్యి అలా చూపించాడో లేదో ఓ నలభై బైకులు , కార్లూ రివ్వు రివ్వున దూసుకుపోయాయి. అందులో నాదీ ఒకటి. మళ్ళీ బిల్డింగ్ లో పార్క్ చేసే వరకూ ఆగలేదు. వాచీ కేసి చూసుకున్నా. అయిదున్నర అయింది. అమ్మయ్య టైముకి వచ్చేసా అనుకుని లిఫ్టు బటను నొక్కి పైకెళ్ళా. అంతలో పెద్ద గోల వినిపించింది. ఇంటి తలుపు నా కోసమే అమ్మ తెరిచుంచింది. యువరాజు కాచ్ కోసం డైవ్ చేసినట్టు డైవ్ చేసి బవుండరీ దాటి పడుతున్న బంతిని చూసేసా. యస్ బవుండరీ మిస్సవలేదు.

ఇక నా బాగు అలా దీవాను మీద పడేసి పక్కనున్న సోఫాలో ఒదిగిపోయాను. కళ్ళు మళ్ళీ రెప్ప వేస్తే ఒట్టు.
మా అమ్మకు తెలుసు ఇంక ఈ ఘటం కదలదు అని (మా ఇంట్లో మా మూడేళ్ళ మేనల్లుడితో పాటు అందరూ క్రికెట్టు తెగ చూసేస్తారు). అందుకే డిస్టర్బ్ చెయ్యకుండా నా బాగులోంచి టిఫిన్ బాక్సు తీసి బాగుని నా గదిలో పెట్టేసింది. అది రోజూ నే చేసే పని మరి. ఆ మాత్రం ఎక్సర్సైజు చేస్తా లేండి.

ఇక వికెట్లు పడటం మొదలవ్వడంతో బూతులొస్తున్నాయి. ఇంట్లో ఉండడంతో షిట్ తప్పితే ఇంకేదీ వాడలేదు. తెగ ఆవేశానికి గురయ్యా. గంభీరుడు ఓ నాలుగు ఫోర్లు కొట్టేసరికి శాంతించా. యువరాజు క్రీజులోకొచ్చాడు. కళ్ళు చేటలంత చేసుకుని తెగ చూస్తున్నా. మరీ అంత టీవీలోకి దూరకురా అంది అమ్మ. సర్లే అని విసుక్కుని చూసేస్తున్నా. ఒక్క షాటూ కొట్టడే. ఒరే ఎదవ.. ఏమయిందిరా నీకు మొన్నటి వరకూ బానే ఆడావుగా అని తిట్టుకుంటున్నా. ఒక్క షాటూ కొట్టట్లా. ఓవర్లు తరిగి పోతున్నాయి. అవుటన్నా అవరా అనుకున్నా. అడిగిందే తడవగా వరమిచ్చేసాడు. పక్కనే హే అంటూ కిల కిలలు వినిపించాయి. మా మేనల్లుడు తెగ అరుస్తున్నాడు. వాడికేం తెలుసు. అవతలోడవుటయ్యాడో మనోడవుటయ్యాడో. నే కొర కొరా చూసేసరికి ఎక్కడ కందిపోతాడో అని అక్క వచ్చి ఒరే మనోడురా అవుటయింది అంది. మళ్ళీ ఓ హే కొట్టాడు మనోడు. ఆ… అని జుట్టు పీక్కున్నా.

తరవాత ఓ మోస్తరుగా అక్కడక్కడా ఓ షాట్ పడడంతో ఏదో స్కోరు వచ్చింది. మనసు కొద్దిగా శాంతించింది. అప్పుడు గానీ నాన్న నాకు కనబడలా. ఆయనా మునిగిపోయారనుకోండి. సర్లే మొన్న ఇలాంటి స్కోరుకే మాచ్ డ్రా అయిందిగా అని సర్ది చెప్పుకున్నా. మధ్యలో వచ్చిన ఓ పది నిముషాల్లో పదిహేను నిముషాల అడ్వర్టైజ్మెంట్లు చూసేసి ఎయ్యరా ఎదవా అన్నాను. పాపం ఈఎస్పీఎన్ వాడు మన డీడీ, సోనీ లాగా తలతిక్కోడు కాదు కాబట్టి వెంటనే టెలీకాస్టొచ్చేసింది. కమాన్ వికెట్లు తొందరగా పడాలని మనసులో తెగ జపిస్తున్నా. రెండు వికెట్లు టప టపా పడటంతో యస్ యస్ అని అరిచాను. ఎదురింటి బాచిలర్ కుర్రోళ్ళు డీటీఎస్ సౌండులో అరిచారు.

తరవాత మొదలయింది వీరబాదుడు కొంత సేపు. కళ్ళళ్ళో నీరు సుళ్ళు తిరిగాయి. ఏంటి మాచ్ పోతుందా ? స్కోరు తక్కువుందే అని. అప్పటి నుండి టప టపా వికెట్లు పడటంతో ఆనంద భాష్పాలు వచ్చాయి. హమ్మయ్య ముప్పై బంతుల్లో అరవై పరుగులు గెలిచేసాము అని తెగ సంబరపడిపోతున్నా. మా మేనల్లుడి బూరా తెగ ఊదుతున్నా. టప్ అని అటు చూసే సరికి బాల్‌తో ఆడియన్సు కాచ్ ఆడుకుంటున్నారు. ఇవ్వనంటున్నారు. మళ్ళీ ఇటే వస్తుందిగా అని అంటున్నారు. ఆ అని గుండె పోటొచ్చింది. సోఫా లోంచి లేచి నిలబడ్డా. చేతులు నులుముకుంటున్నా. చెమటలు పడుతున్నాయి.

పాకిస్తాన్ చేతిలో ఓడి పోనుందా ? అప్పటికే హర్భజన్ ఓవర్లో మూడు సిక్సులు, తరవాత ఓవర్లో ఇంకో సిక్సు వెళ్ళిపోయాయి. ఎవడ్రా ఈ మిస్బా ఎదవ నా… అని తిట్టుకుంటున్నా. అంతలోనే వికెట్ల చప్పుడు శ్రవనానందం కలిగించడంతో మళ్ళీ ఆశ. అలా ఆఖరి ఓవర్ వచ్చింది. పన్నెండు పరుగులు మాత్రమే కావాలి. మొదటి బాల్ సిక్సు. మళ్ళీ గుండె నొప్పి, కుప్ప కూలడం జరిగాయి. నరాలు తెగిపోయి రక్తం ఫాక్షన్ సినిమాలోలా ప్రవహించేస్తుంది. ఛీ ఈ జోగీందర్ వెధవని ఎందుకు తీసుకున్నారో ? అసలు బౌలింగే రాదు, పేస్ లేదు, లైన్ లేదు, లెంత్ లేదు అని పిచ్చ బూతులు తిట్టుకున్నా.

తరువాత బంతి వెయ్యడానికి వచ్చాడు గురుడు. బంతి వెయ్యక ముందే పక్కకి జరిగాడు మిస్బా… బాట్ ని తన పక్కనబెట్టి స్కూప్ షాట్ ఆడాడు. అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నాను. బంతి పైకి లేచింది. సిక్సెళ్ళిపోయిందా అని కూలబడబోతుంటే శ్రీశాంత్ ఈ బంతిని నే పట్టకపోతే నన్ను రంపాలతో కోసేస్తారు అన్నట్టు ఫేసెట్టి కాచ్ పట్టాడు. మైండ్ బ్లాంక్. ఏం జరిగింది ? అంతలో పెద్ద గోల, ఎదురింటోళ్ళు డబల్ డీటీఎస్, టపాసుల చప్పుళ్ళు. యాహూ అని నా అరుపుకి నా మేనల్లుడు బేరుమన్నాడు. అయినా లెక్కచెయ్యకుండా మళ్ళీ వాడి బూరా లాక్కుని డాన్సే డాన్సు. మా నాన్న అమ్మ, అక్క ఎవరూ వాడి ఏడుపుని పట్టించుకోకుండా చప్పట్లే చప్పట్లు. అలా ఓ గంట సేపు డాన్స్ చేసి ఆఖరికి కూలబడ్డా. అమ్మ బత్తాయి రసమివ్వడంతో ఓ గుక్కలో తాగి నా గొంతు లోంచి మాటలు రావట్లేదేమిటా అని చూస్తే ఇంకెక్కడి గొంతు, ఎప్పుడో హుష్ కాకి… అదండీ ఇవాళ క్రికెట్టు మాచ్ ప్రహసనం.

ఇదేం పిచ్చి రో బాబూ అనుకుంటున్నారా… దటీజ్ మీ. రాకేశ్వరా నీకు పోటీ కాసుకో…

నేను నేనే….

నేను నేనే….

నేను ఇంకెవరినో కాదు. నాకు ఎవరయినా వారి భావాలు నా మీద రుద్దాలని చూస్తే మండుకొస్తుంది. ఏ అందరికీ వారి వారి ఆలోచనలు ఉండవా ? మనకున్న అలోచనలే ఎదుటి వారికి నచ్చాలని ఎందుకనుకుంటారు ? ఎదుటి వారి అలొచనలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వక పోతె వారు మాత్రం నీ వాటికి ఎందుకు ఇవ్వాలి ?

చిన్నప్పటి నుంచీ ఎంతో independent గా పెరిగాను నేను. నేను అనుకున్నది సరి అయితే అదే చెసెంత స్వాతంత్ర్యం ఇచ్చారు నాకు మా అమ్మా నాన్నా. వారి అలోచనలు నా మీద రుద్దాలని ఏనాడూ అలోచించలెదు. నాకేది మంచిదనిపిస్తే అదే చెయ్యమనేవారు కాకపొతే వారి అలోచనలు, నేను తీసుకునే నిర్ణయం యొక్క మంచి చెడులు మాత్రం వివరించేవారు. రెండు వైపుల నుంచీ అలొచించి చెప్పేవారు. నిర్ణయం మాత్రం నాకు వదిలెసేవారు.

అందుకనే నేను అలాగే పెరిగాను. ఎవరు నన్ను, నా అలోచనలని అనవసరంగా నియంత్రించాలని చూసినా నాకు మా చెడ్డ చిరాకు. ఎవరయినా ఒక విషయం చెబితే విని వాటిలో మంచి చెడు అలొచించి నా నిర్ణయం తీసుకుంటాను. అంతే కానీ ఇదే చెయ్యి అంటే మాత్రం నాకు నచ్చదు. ఇదే అందరికీ అని నా అభిప్రాయం. కాబట్టి ఎవరయినా ఓ ఉచిత సలహా పాడెసె ముందు కొద్దిగా ఆలోచించి మరీ ఇవ్వాలని నా అభిప్రాయం.

అదే కాదు ఎవరన్నా ఏ కారణం లెకుండా అబ్బో ఇప్పటి తరం వారు అసలు చాలా చెడిపోతున్నారు అండి అనో, లెక ఈ క్రికెట్ ఉంది చూసారూ అందులో పడి జనాలు అసలేమి పట్టించుకోకుండా పోతున్నారు అనో లాంటివి అంటె కూడా. ఏ నాకు నచ్చినవి నేను చెయ్యడం కూడా తప్పేనా. ఇందువల్ల నేను ఎవరికయినా హాని చెస్తున్నానా ? ఎవరినయినా అగౌరవ పరుస్తున్నానా ? మరి ఏదీ లేనప్పుడు ఎందుకంత బాధ ?

నిజానికి చెప్పాలంటె నేను చూసినంతలో ఈ generation వారికి ఎంతో awareness పెరిగింది. చదువుకోవాలని, బాగా పైకి రావాలని, ఎదో సాధించాలి అని వీరిలో పట్టుదల ఎక్కువ.ఎక్కడ ఏమయినా విపరీతాలు జరిగినా, ప్రమాదాలు జరిగినా ధన రూపేణా నో లెక శ్రమ రూపేణానో మొదట సహయం అందించేది వీరే. ఎన్నో social activities లో పాలు పంచుకుంటూ, తాము సంపాదించిన డబ్బులలొ నుంచి ఎంతో కొంత వేరే వారికి ఇవ్వాలన్న అలోచనలూ ఎక్కువే. అంతే కాదు పర్యావరణం మీద అవగాహనా ఎక్కువే.

పెద్దలని గౌరవించట్లేదా అంటె అదీ నేను ఒప్పుకోను. ఇది వ్యక్తి ని బట్టి కానీ ఒక generation మొత్తం గా కాదు.

ఇక్కడ గుర్తించాల్సింది ఎమిటంటె మారుతున్న generation తో అలోచనలు మారుతుంటాయి , మీకు నచ్చిన సినిమాలు, మీకు నచ్చిన భావాలు నచ్చక పోవచ్చు. అంత మాత్రాన అదేదో తప్పు అని చూడకండి.

ఒక మచ్చుతునకగా బొమ్మరిల్లు సినిమా చూసిన వారికి అర్థమయ్యె ఉంటుంది. generations మధ్య gap ఉండడం సహజమే. మీరే అలొచించుకోండి మీ తల్లిదండ్రుల generation తో పొల్చుకుంటే మీలో ఏ మార్పూ లేదా ? మరి అలాంటప్పుడు మీరు మీ తరువాత generation నుంచి ఏ మార్పూ ఉండకూడదు అనుకొవడం ఎంత వరకూ సమంజసం ?

మీరు ఇప్పటికే reasonable గా ఉంటె ఏ సమస్యా లేదు లేకపోతే ఒకసారి అలొచించండి.

అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా ఇవళ మా ఇంటికి ఒకరు వచ్చారు. ఆయన వాళ్ళ అబ్బాయి ఏం చెయ్యలో తనే నిర్ణయించేసి ఇప్పుడు అతను అది కాక వేరే ఏదో చెస్తానంటే అదేదో తప్పయినట్టు చెబుతున్నారు. నాకు కోపం వచ్చినా పెద్దవారయిపొయారు ఎమీ అనలేకపోయాను అదిగో అందుకే ఇలా.