జనవరి 1, 2008

కొత్త సంవత్సరం….పాత సంవత్సరం

Posted in ఆలోచనలు, కొత్త సంవత్సరం, పాత సంవత్సరం వద్ద 3:27 సా. ద్వారా Praveen Garlapati

ఇంకో కొత్త సంవత్సరం వచ్చింది…
పాత సంవత్సరం గురించి ఆలోచన చేయడం, కొత్త సంవత్సరానికి ప్రణాళికలు తయారు చెయ్యడం అందరూ చేసేదే.

నాకు ఎప్పుడూ ప్లాన్ చేసుకోవటం అలవాటు లేదు. చేసుకోవాలని ఉంటుంది, కానీ అంత ఆలోచించడానికి బద్ఢకం.
ఎప్పటికయినా రిజల్యూషను చేసుకోవాలని ఒక రిజల్యూషను చేసుకోవాలేమో 🙂

ఒక సారి గుండ్రాలు గుండ్రాలు తిప్పితే క్రితం సంవత్సరం ఎలా జరిగింది అని ఆలోచిస్తే అంత సంతృప్తి ఇవ్వలేదనే చెప్పాలి.
ఇవి సాధించాలి అనుకోలేదు కానీ, సాధించినవి మాత్రం సరిపోవు అని అనిపించింది.
కొత్తగా నేర్చుకున్నవి పరంగా అంత సంతృప్తిని ఇవ్వలేదు నాకు. ఇంకా చాలా చెయ్యచ్చు అనిపించింది.

అన్నిటికన్నా ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది మాత్రం తెలుగు బ్లాగులనే చెప్పచ్చు.
క్రితం సంవత్సరం నవంబరు నెలలో మొదలుపెట్టిన ఈ బ్లాగు, దీని ద్వారా నేను ఏర్పరచుకున్న స్నేహాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి.

బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో నాకంటే నా సహ బ్లాగర్లూ, పాఠకులే బాగా చెప్పగలరు.
అందరిలాగే ముందర అత్యుత్సాహం ఫేజు దాటి స్టెబిలైజేషన్ ఫేజు కి చేరింది.

కంటెంటు పరంగా సంతృప్తిని ఇచ్చింది. కొలబద్దలను పక్కన పెడితే నాకు సంతోషం కలిగించింది.
ఇక ఈ సంవత్సరం పరంగా బ్లాగుని ఇలా మెయింటెయిన్ చేయగలిగితే సంతోషమే.

ఈ సంవత్సరం వెబ్సైట్ల పరంగా, అగ్రిగేటర్ల పరంగానూ మంచి అభివృద్ఢి కలిగింది. కూడలి, తెలుగుబ్లాగరు, జల్లెడ, తేనెగూడు వంటి ఎన్నో ఆప్షన్లు వచ్చాయి తెలుగు వాడకందార్లకి.
ఇక నాకు నచ్చిన తెలుగు వెబ్ ఉపకరణం వీవెన్ ఈ మధ్య సృష్టించిన కబుర్లు. (కొత్త కూడలి కొంత నిరాశపరచింది)
ఇక్కడ రానారె, వీవెన్, శ్రీనివాస, చదువరి, నాగరాజు, కొత్త పాళీ, పరుచూరి, జ్యోతి, శ్రీధర్ ఇంకా ఎందరో బ్లాగు రాయని మహామహులను కూడా నేరుగా కలవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది.

ఈ సంవత్సరం నేను చూడాలనుకున్నవి ఇంకా ఎక్కువ మంది తెలుగు కి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం.
ప్రతీ ఒక్కరూ వారు చేయగలిగిన పరిధిలో ఏదో ఒకటి చేసి తెలుగు వ్యాప్తికి తోడ్పడాలి. వికీ, బ్లాగు, తెలుగీకరణ పనులలో తలో చేయి వేసి తోడ్పాటునందించాలి.

ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, తెలుగు దశదిశలా వ్యాపించాలని కోరుకుందాము.