అడ్వెంచర్స్ ఆఫ్ సాలీ – పీ జీ వోడెహౌజ్

ఇతర వ్యాపకాలు ఎక్కువవడంతో ఈ మధ్య చదవడం తగ్గింది కానీ ఒకప్పుడయితే విపరీతంగా చదివేవాడిని. నవలలు, అందులో ఎక్కువగా ఫిక్షన్, ఫాంటసీ నాకు ఎక్కువ ఇష్టం. అవి కాక రొమాన్స్… 🙂

నాకిష్టమయిన హారీ పాటర్ కాక నాకెదురయిన సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, షెర్లాక్ హోంస్, రాబిన్ కుక్ ఏదీ వదిలిపెట్టను.

సహజంగా అయితే ఏక బిగిన మొదలుపెట్టిన నవల పూర్తి చెయ్యడం నాకిష్టం. లీజర్ గా ఓ వారం పది రోజులు నేను చదవలేను. అలా ఉంచానంటే అది పూర్తి చెయ్యలేనన్న్నమాట. దానికో ఉదాహరణ నే మొదలుపెట్టిన అయాన్ రాండ్ “ఫౌంటెయిన్ హెడ్”. అద్భుతంగా నచ్చింది నాకు చదివినంత వరకు. ఎందుకో తెలీదు కానీ రెండు రోజులు చదివిన తర్వాత బ్రేకిచ్చాను. ఇప్పటి వరకూ మళ్ళీ కుదరలేదు.

ఇకపోతే నేను చదవడం విశ్లేషణాత్మకంగా ఉండదు. చదువుతున్నంత సేపూ అందులో లీనమయి చదువుతా గానీ ఆ శైలిని గుర్తించడం, దానిని వడపోయడం, అందులో తప్పొప్పుల గురించి బేరీజు వెయ్యడం ఎందుకో అలవాటు లేదు.

సాఫీగా సాగిపోయే కథలంటే నాకెంతో ఇష్టం. అలాంటి వాటిలో నేను ఈ మధ్య చదివిన “పీ జీ వోడెహౌజ్” రాసిన “ద అడ్వెంచర్స్ ఆఫ్ సాలీ” నాకు బాగా నచ్చింది. హార్డు కవర్ పుస్తకాలు ఈ మధ్య కొనడం తగ్గింది అనిపించి అటు ప్లాట్ఫాం మీద చూడగానే నాకు ఈ పుస్తకం కనిపించింది. ఎప్పటి నుంచో పీ జీ వోడెహౌజ్ పుస్తకం ఒక్కటయినా చదవాలని అనుకుంటున్నాను. వెంటనే కొన్నా.

పుస్తకాలను కంప్యూటర్ పైన చదవడం బాగా అలవాటయింది కానీ నాకు చేలో పట్టుకుని చదివిన పుస్తకంలో వచ్చిన ఆనందం నాకు అందులో రాదు.

సరే ఇక నేను శనివారం ఓ వైల్డు లైఫు ట్రిప్ కోసం వెళుతుంటే ప్రయాణంలో పనికొస్తుందని తీసుకెళ్ళా. స్నేహితుడితో కలిసి వెళ్ళాను, మాట్లాడుకోవడం లోనే తెలీకుండా సమయం గడిచిపోయింది. ఇక పుస్తకాన్ని తీసే సమయమే రాలేదు. వైల్డు లైఫు లో నాకు లైఫేమీ పెద్దగా కనబడకపోవడంతో బాగా నిరుత్సాహపడ్డాను. ఇక రాత్రి పన్నెండింటికి ఇంటికి తిరిగొచ్చి సరే ఈ పుస్తకాన్నయినా తిరగేద్దామని తీసుకుంటే ఎంచగ్గా పేజీలు అలా తిరిగిపోతూనే ఉన్నాయి. అలా నాలుగయిపోయింది.
అమ్మ నాలుగు చీవాట్లు పెట్టడంతో పుస్తకం బలవంతం మీద మూసేసా. ఇక ఆదివారం లాపుటాపు పట్టకుండా పుస్తకం పట్టాను. సాయంత్రం కల్లా ముగించా…

నవల చాల బాగుంది. వోడెహౌజ్ స్టైలు నాకు నచ్చింది. ఇంతకీ క్లుప్తంగా కథ ఏమిటంటే సాలీ అనే ఒక పడుచమ్మాయికి అనుకోకుండా కొంత డబ్బు కలిసొస్తుంది. అప్పటి నుంచీ సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇక్కట్లు మొదలవుతాయి. సరదా సరదాగా సాగిపోతుంది కథ. అందులో కారెక్టర్లు కూడా చక్కగా ఉంటాయి.

ఇందులో థీం నా మనసుకు చాలా దగ్గరది. ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే చిన్న చిన్న ఆనందాలు, మన మనుషులు ఎక్కువ సంతోషం కలిగిస్తాయని నమ్మే వాడిని నేను. ఈ నవలలో సాలీ కూడా అంతే… డబ్బు వచ్చిందన్నమాటే కానీ ఆ డబ్బు పెద్ద తేడా కాదు తనకి. కానీ చుట్టుపక్కల వారికి దానితో అవసరం.
నచ్చిన మనుషులకు దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. అలా సాగిపోతుంది కథ.

కథలో వివిధ కారెక్టర్లు మనకు తారసపడతాయి. స్నేహితులు, బంధువులు, సాలీ ని కోరుకుంటున్న వాడు, సాలీ కోరుకుంటున్న వాడు… ఇలా.
హాయిగా జీవించాలంటే మనసుకు నచ్చిన వాడు కావాలి కానీ, డబ్బున్న వాడూ, పరపతి ఉన్నవాడూ కాదనీ నమ్ముతుంది. అలా కథ ముగుస్తుంది.

మీకు ఆహ్లాదంగా ఉండే రచన చదవాలనిపిస్తే ఈ పుస్తకం చదవండి. కథలో ట్విస్టులు, థ్రిల్లర్లూ ఏమీ ఉండవు. ఒక మామూలు కథ. సున్నితమయిన హాస్యంతో బాగుంటుంది.

మీరు దీనిని ఆన్‌లైనులో చదవాలనుకుంటే ఇక్కడ చదవచ్చు. ఇతర వోడెహౌజ్ పుస్తకాల కోసం కూడా గుటెన్‌బర్గ్ చూడచ్చు.