జూన్ 21, 2008

ఫైవ్ పాయింట్ సమ్‌వన్, ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ – చేతన్ భగత్

Posted in చేతన్ భగత్, పుస్తకం, పుస్తకాలు వద్ద 7:53 సా. ద్వారా Praveen Garlapati

కొన్ని పుస్తకాలు చదవడానికి కారణం అవసరం లేదు. అంటే అది చదవడానికి అది ఏదో పెద్ద రచయితది అవనవసరం లేదు. ఇంకేదో మంచీ, చెడూ చెప్పనక్కర్లేదు.
ఇవేవీ లేకపోయినా వీటికి ఎంటర్టెయిన్‌మెంట్ వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక రెండు పుస్తకాలు ఈ మధ్య చదివాను. రెండూ ఒక రచయిత రాసినవే.

ఇవి మన యువ బ్లాగు మిత్రులలో చాలా మందే చదివి ఉంటారు. నేను చెప్పేది చేతన్ భగత్ గురించి. అతను రాసిన “ఫైవ్ పాయింట్ సమ్‌వన్”, “ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” పుస్తకాల గురించి.
వీటిని నవలలనలేము, అలాగని స్వగాతలనీ అనలేము. కొంత నిజం, కొంత కల్పితం, కొంత ఆటో బయాగ్రఫీ ని మేళవించి చెప్పిన కథలు.

ముఖ్యంగా ఈ పుస్తకాలలో మనని ఆకట్టుకునేది సాఫీగా సాగిపోయే పదజాలం, మనకి తెలిసనట్టే ఉండే సన్నివేశాలు, ఏదీ బోధించని తత్వం. (అంతర్గతంగా కథలో భాగంగా కొంత నేర్చుకోదగింది ఉంటుందనుకోండి)

ఉదా: అతని “ఫైవ్ పాయింట్ సమ్‌వన్” పుస్తకం తీసుకుంటే అది ఐఐటీ లలో జీవితం గురించి. అక్కడ రాగింగు, స్నేహితులతో జల్సాలు, చదువు అనే ఒక చట్రం, ఆ సంకెళ్ళని తెంచుకుని బయటపడడానికి జరిపే ప్రయత్నం, లవ్ స్టోరీలు వగయిరా వగయిరా.

ఓ ముగ్గురు ఐఐటీ విద్యార్థుల కథ ఇది (అందులో రచయిత ఒకడు). అక్కడ చేరినప్పటి నుంచీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, అక్కడ కష్టాలని ఎలా ఎదురుకున్నారో, అర్థం లేని చదువులను కెరీర్ కోసమే బట్టీయం వేయలేక ఎలా తికమక పడ్డారో చెబుతాడు.
అలానే చిన్న చిన్న సరదాలు, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పట్టించుకోని తనం, వారు చేసే తప్పులు, వాటిని సరిదిద్దుకోవడానికి పడే పాట్ల గురించీ ఉంటుంది కథలో.

పైన చెప్పిన వాటన్నిటినీ ఒక చక్కని సరదాగా సాగిపోయే కథలా చెప్పడంలో విజయం సాధించాడు చేతన్. పుస్తకానికి ముందే చెబుతాడు అతను ఈ పుస్తకం ఐఐటీలో ప్రవేశించడానికి కాదనీ, అక్కడ జరిగే సంగతుల గురించి చెప్పటానికి మాత్రమేననీ. చెప్పినట్టే ఉంటుంది పుస్తకం.

సరదాగా ఏ ప్రయాణంలోనో టైం పాస్ కి అద్బుతమయిన పుస్తకం ఇది. నేను అలానే చదివాను దీనిని 🙂

ఇక రెండో పుస్తకమూ ఇతనిదే. మొదటి పుస్తకం నచ్చి ఇది కూడా కొన్నాను.

ఈ కథ ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన మూడు తప్పుల గురించి స్వగతంలా చెప్పుకునే కథ. జీవితంలో వ్యాపారం చేసి కోట్లు గడించాలనుకునే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, అతను ఏం తప్పులు చేసాడు, అతనిని ఆత్మహత్యకి ప్రయత్నించేలా చేసిన సందర్భాలేంటి అనేది పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.

చక్కని యువ రచయితగా తనను తాను స్థాపించుకున్న చేతన్ పుస్తకాలు సినిమాలుగా కూడా మారబోతున్నాయి. అన్నట్టు అతను రాసిన ఇంకో పుస్తకం కూడా ఉందండోయ్… “వన్ నైట్ ఇన్ కాల్‌సెంటర్”. అది క్యూలో ఉంది 🙂

ఫిబ్రవరి 9, 2008

బ్లాగు పుస్తకానికి టపాల ఆహ్వానం …

Posted in ఆహ్వానం, పుస్తకం, బ్లాగు, సూచనలు వద్ద 7:22 ఉద. ద్వారా Praveen Garlapati

ఈ టపా నా ఇంతకు ముందు టపాకు కొనసాగింపు. ముందు బ్లాగు పుస్తకం గురించిన ఈ టపా చదవగలరు.

ఇక ఈ పుస్తకం గురించి, లక్ష్యాల గురించి కొంత:

౧. తెలుగుకీ, తెలుగు బ్లాగులకీ తగినంత ప్రచారం కల్పించడం.

౨. జనాలను రాయడానికి ప్రోత్సాహించడం.

౩. మంచి బ్లాగులను, టపాలను అభినందించి ప్రోత్సాహం అందించడం.

ప్రస్తుతానికయితే ఈ పుస్తకం ముద్రితం కాదు. ఈ-పుస్తకం మాత్రమే (పీడీఎఫ్ ఫార్మాటులో). అమ్మడానికి కాదు.

ఇక ఈ పుస్తకం లో టపాలను పొందు పరచే విధానం ఇది:

౧. బ్లాగరులు వారి బ్లాగులోంచి ఐదు అత్యున్నతమయిన టపాలు (తక్కువయినా ఫరవాలేదు) ఎంచుకుని ఈ టపాకి వ్యాఖ్య గానో, తెలుగుబ్లాగు గుంపులోనో, తెలుగుబ్లాగుపుస్తకం గుంపులోనో, నాకు మెయిలు (telugublogbook@gmail.com) గానీ చెయ్యాలి. పుస్తకంలో ఉంచడానికి అనుమతిచ్చే టపాలను మాత్రమే పంపండి. (టపాకి లంకె, వర్గం తప్పకుండా పంపండి)

౨. మన బ్లాగరులలో మేటి అయిన వాళ్ళు ఈ టపాలలోంచి కొన్ని టపాలను పుస్తకం కోసం వివిధ వర్గాలలో ఎంచుకొంటారు.

౩. మొత్తం దగ్గరగా ఓ యాభై టపాలకి ఇందులో చోటు ఉంటుంది. (సంఖ్య పరిమితం కాదు. అవసరాన్ని బట్టి.)

౪. ఇందులో వర్గాలు ప్రస్తుతానికి ఇవి

  • హాస్యం
  • రాజకీయం
  • కథ
  • వ్యాసం
  • సాంకేతికం
  • కవిత
  • వ్యక్తిగతం/ఆలోచనలు

వీటిలో మార్పులు ఉండవచ్చు.

౫. ఈ పుస్తకంలో ప్రచురించబడే టపాలను బ్లాగు ఓనర్ల అనుమతితోనే చేరుస్తాను.

౬. మీరు టపాలను ఈ పుస్తకం కోసం పంపే ముందు అది ఏ వర్గంలోకో కూడా రాస్తే సహాయంగా ఉంటుంది.

౭. ఈ నెలాఖరు వరకు మాత్రమే టపాల ఎంపిక ప్రక్రియ.

ఇక దీని పరంగా నాకు కావలసిన సహాయం మీ నుంచి:

౧. దీనికి ఒక కవరు పేజీ తయారు చేయాలి ఎవరయినా ఆకర్షణీయంగా, మంచి డిజైనుతో. ఎవరయినా చెయ్యడానికి ముందుకు వస్తే వారితో ఎలా చేస్తే బాగుంటుందో చర్చించగలను.

౨. ఒక చిన్న వ్యాసం లాంటిది ఈ పుస్తకానికి జత చెయ్యాలని నా ఆలోచన. ఎవరయినా స్వీట్ అండ్ సింపుల్ గా బ్లాగుల గురించి ఒక చిన్న వ్యాసం రాసి పంపగలరు.

౩. టపాలు ఎంచుకోబడిన తర్వాత వాటిని తగిన రీతిలో ఫార్మాటింగు, సరయిన ఫాంటు ఎంపిక, డిజైనులలో సహాయం అవసరమవచ్చు.

ఇంకేదయినా చర్చ జరగాలంటే తెలుగుబ్లాగుపుస్తకం గుంపులో చేరి పంచుకోగలరు.

ఇక మీ వంతు. మీ టపాలను వెతకడం మొదలుపెట్టండి.

ఫిబ్రవరి 5, 2008

బ్లాగుల పుస్తకం …

Posted in తెలుగు, పుస్తకం, బ్లాగులు వద్ద 5:35 సా. ద్వారా Praveen Garlapati

బ్లాగుల నుండి ఒక పుస్తకం సృష్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం మనం. కానీ ఎవరూ చేయట్లా…
ఇక నాలాంటి బద్ధకిష్ఠు పూనుకుంటే కానీ పని జరిగేట్లు లేదు. 🙂

ఇంతకీ సంగతేంటంటే మన తెలుగు బ్లాగుల నుంచి అత్యుత్తమ టపాలను ఏరి ఒక పుస్తకం గా వేస్తే ఎలా ఉంటుందని చాన్నాళ్ళ నుంచి నానుతుంది. దానికో రూపు ఇవ్వడానికి ఇదో మంచి తరుణమని భావిస్తున్నాను.

ఇక ఇక్కడ నాకు కొన్ని సూచనలు కావాలి.

౧. ఎన్ని టపాలను పుస్తకంలో ఉంచితే బాగుంటుంది (ఒక యాభై వంద) ??

౨. నేను టపాలను వర్గాలు గా విభజించి పెడదామనుకుంటున్నా (కవితలు, వ్యాసాలు, హాస్యం, సినిమా, రాజకీయం, టెక్నాలజీ లాగా). ఇలా ఏ వర్గాలు ఉండడం బాగుంటుంది ? అసలు వర్గాలుండడం మంచిదేనా ?

౩. ఈ పుస్తకానికి టపాలను ఎలా ఎంచుకోవాలి ?? అంటే ఏ పద్ఢతి ప్రకారం. బాగా ప్రాచుర్యం పొందినవి. వాటిని ఎలా నిర్దేశించడం. ఎక్కువ సలహాలు రాకపోతే నాకు నచ్చిన టపాలతో మొదలెడతా అనుకోండి.

ఇకపోతే టపాలను పుస్తకంగా ప్రచురించాలంటే ఆయా బ్లాగులకు సరయిన లైసెన్సు ఆపాదించి ఉండాలి లేదా టపా ప్రచురణకు బ్లాగు ఓనర్ల నుంచి అనుమతి కావాలి. మరి దీనికి ఎలాంటి విధానం అనుసరిస్తే మంచిది ?

నేను అనుకోవడమేమిటంటే జనాలను తమ తమ బ్లాగులలోంచి అత్యుత్తమం అనుకున్న ఒక ఐదు టపాలను ఇమ్మని వాటిలోంచి వోటింగు ద్వారా నో మరే విధానం ద్వారానో పుస్తకానికి టపాలు ఎంచుకోవడం.

దీనికి నాకు అందరి ఆలోచనలూ కావాలి. ఎలా దీనిని చేస్తే బాగుంటుందో, ఉపయోగపడుతుందో ?
ఇకపోతే ఇందులో అందరి సహాయమూ కావాలి. ఉదా: దీనికి కవరు పేజీ తయారు చేయాలి, మంచి ఫాంటు ఎంచాలి, పీడీఎఫ్ తయారు చెయ్యాలి గట్రా.

అన్నిటినీ సమన్వయపరచడానికి నేను రెడీ. ఎవరూ సహాయం చెయ్యకపోయినా ఇది చేసి తీరుతాను 🙂
దీనికోసం ఒక గుంపు సృష్టించాను (http://groups.google.com/group/telugublogbook). ఆసక్తి గల వారు, సహాయం చేయాలనుకున్న వారు చేరగలరు.

గమనిక: పైవాటికి మొదలుగా ఈ తెలుగు వికీలో ఒక పేజీ సృష్టించాను. దీని గురించి సమాచారం అక్కడ కూడా ఉంచుదాము.