మైక్రోబ్లాగింగు… – కుచించుకుపోతున్న సమాచారం

అసలు మన సంభాషణలు రానురానూ ఎంత కుచించుకుపోతున్నాయో అనిపిస్తుంది నాకు…

ముఖాముఖి మాట్లాడుకునే రోజులనుండి మెల్లగా ఉత్తరాలు, ఫోనులు, ఈమెయిళ్ళూ, ఎసెమెస్సులు.
ఈ ట్రెండుని చూస్తే మీకనిపించట్లేదూ రాను రానూ మాటలు తక్కువయిపోతున్నట్టు.

అన్నట్టు ఈ పద్ధతి కేవలం మన మాటలకే కాదు, అన్ని రకాల సాధనాలకీ వర్తించడం మొదలయింది.
భాష కూడా స్పష్టంగా చెప్పగలిగే పదాల నుంచి పొడి పొడి మాటల వైపు సాగుతుంది అనిపిస్తుంది.

ఉదా: “Can I see you tomorrow ?” ఈ వాక్యం రాయాలనుకోండి ఇప్పట్లో అయితే జనాలు ఇలా రాస్తున్నారు “cn i c u tmrw ?”

అసలు మరీ ఇంత పొదుపేంటో ??
కొన్ని సార్లయితే నాకు తెలిసిన డీక్రిప్షన్ టెక్నిక్కులు కూడా ఉపయోగించి మరీ చదువుకోవాల్సి ఉంటుంది.
(ఇంకొన్ని సార్లు గూగుల్ లో వెతకాల్సి ఉంటుంది)

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే బ్లాగులు రాయడం నుంచి ప్రపంచం ఇప్పుడు “మైక్రోబ్లాగింగ్” వైపు సాగుతుంది. (కవితల నుండి హైకూల వైపు సాగినట్టు).

మన తెలుగు లోకంలో బ్లాగులంటే కొత్త మోజులో బాగున్నాయి గానీ ఆంగ్లంలో బ్లాగులు ఇప్పటికే “ఫాటిగ్” వైపు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ (ఇంకా రాస్తున్నారు అనుకోండి) ఎంతో ఓపికతో రాసిన వారు ఇప్పుడు ఓపిక లేక కొత్త ట్రెండుని మొదలుపెట్టారు. అదే మైక్రోబ్లాగింగ్.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటారా ? లైన్ల కొద్దీ, పేజీల కొద్దీ రాయక్కర్లేకుండా కేవలం కొద్ది మాత్రం పదాలతోనే మనం చెప్పాలనుకున్నది చెప్పడం అన్నమాట.

ఈ పద్ధతిని బాగా ప్రాచుర్యం లోకి తెచ్చింది ట్విట్టర్. దీని గురించి ఒక మైక్రో బ్లాగు లాగా ఊహించుకోండి. కాకపోతే ఇందులో మీరు నూట నలభై పదాలకన్నా ఎక్కువ రాయలేరు. అంటే మీరనుకున్నదాన్ని సరిగా చెప్పడానికి క్రియేటివిటీ ఉపయోగించాలన్నమాట.

ఈ అప్లికేషను రాత్రికి రాత్రే పెద్ద హిట్టయిపోయింది. జనాలు విపరీతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇందులో నిమిష నిమిషానికీ ఏం చేస్తున్నారో రాసేసే వాళ్ళూ ఉన్నారు, తమకు తెలిసిన లంకెలను ఇతరులతో పంచుకునే వాళ్ళూ ఉన్నారు, తమ ఉత్పత్తులకి ప్రచారం చేసుకునే వాళ్ళున్నారు, తమ బ్లాగు టపాలకి ఇందులో లంకెలిచ్చి హిట్లు పెంచుకునే ప్రబుద్దులూ ఉన్నారు.

వైవిధ్య భరితమయిన అవసరాలకు ఇప్పుడు దీనిని జనాలు వాడడం జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ కాంపెయిన్ కి ఆఖరికి ఒబామా, హిల్లరీలు కూడా దీనిని వాడారు.

అలాగే ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదలలు, వాటి మీద తగ్గింపులు గట్రా ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. ఉదా: డెల్ అవుట్‌లెట్.

ఇక ట్విట్టర్ బాగా ప్రాచుర్యం పొందడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని సర్వీసులూ మొదలయ్యాయి.

జైకూ (దీనిని ఇప్పుడు గూగుల్ అక్వైర్ చేసింది)

టంబ్లర్ (ఇది ఇంకో రకమయిన మైక్రోబ్లాగింగ్ లంకెలు, ఫోటోలూ, చిన్న చిన్న మెసేజీలు అంటే మల్టీమీడియాతో సహా అన్నమాట.), పౌన్స్ మొదలయినవి… దాదాపు ఇలాంటి వంద సైట్లు ఇప్పటి వరకూ మొదలయ్యాయని ఒక అంచనా.

అసలు ఇవి ఎంతగా ప్రాచుర్యం పొందాయి అంటే వీటి కోసం, వీటి మీద ఆధారపడి ఇంకొన్ని స్టార్టప్పులే తయారయ్యాయి.

ఉదా: ట్విట్టర్‌లో ట్వీట్ లను వెతకడం కోసం సమ్మైజ్ అనే ఒక స్టార్టప్ మొదలయింది (ఇప్పుడు ట్విట్టర్ దీనిని కొనేసిందనుకోండి). అలాగే దీంట్లో రాయడం కోసం ప్రత్యేకంగా ఎన్నో క్లైంటులను తయారు చేసారు. మంటనక్క జోడింపుగా, అడోబ్ ఎయిర్ ఆప్ గా, కేడీయీ విడ్జెట్టుగా, చెప్పలేనన్ని క్లయింటులు దీని కోసం రాయబడ్డాయి.

ఈ ధాటిని తట్టుకోలేక ట్విట్టర్ ఇప్పుడు స్కేలబులిటీ సమస్యలని కూడా ఎదురుకుంటోంది.

ఈ కాన్సెప్టు ఇంతగా హిట్టయితే ఇక దీనిని వేరే వాటికి ఆపాదించకుండా ఉంటారా ? వెంటనే ఇలాంటివే అప్లికేషన్లు తెగ మొదలయినియ్యి.

ఈ మధ్యే 12seconds.tv అనే కొత్త సైటు ప్రారంభమయింది. ఇది కూడా ట్విట్టర్ లానే కానీ వీడియో కోసం. పన్నెండు సెకెండ్లలో మీరు రికార్డు చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి. (ఇంతకు ముందే ఫ్లికర్ లో కూడా తొంభై సెకండ్లు మాత్రమే కనిపించగలిగే వీడియో మొదలుపెట్టారు)

అలాగే ఇదే కాన్సెప్టు మీద ఫ్రెండ్‌ఫీడ్ అనే సైటు కూడా మొదలయింది. ఇది మీ పర్సనల్ అగ్రిగేటర్ అన్నమాట. మీ అన్ని అకౌంట్లలో నుంచీ మీరు ఎప్పుడే తాజీకరణ చేసినా వెంటనే ఇది పట్టేస్తుంది. అన్నిటినీ ఒక దగ్గర చూపిస్తుంది. గూగుల్ లో ఇంతకు ముందు పని చేసే వాళ్ళచే మొదలుపెట్టబడిన కంపెనీ ఇది. ఈ మధ్య కాలంలో బాగా పేరు పొందుతూంది.

ఇవన్నీ కొద్దిగా ఎగస్ట్రాగా అనిపించడం లేదూ… ఎగస్ట్రానే… ఏం చేస్తాం. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు మరి. ఈ బుడగా ఎప్పుడో‌ పేలుతుంది.