ఐఈ ౮

మొన్న ఐఈ ౮ బీటా రిలీజయింది.

నిజం చెప్పాలంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మైక్రోసాఫ్టు బ్రౌజర్ల రిలీజుల పరంగా చూస్తే అంత వేగవంతం కాదు.
ఐఈ ౬ విడుదలయిన తరువాత ఎన్నాళ్ళకో గానీ ఐఈ ౭ విడుదల చెయ్యలేదు. కాబట్టి ఓ నెల రోజుల క్రితం ఐఈ ౮ గురించిన ఊహాగానాలు వచ్చినా సరే నేను ఇంత త్వరగా వస్తుందని నమ్మలేదు. (బీటా నే అనుకోండి.)

కాకపోతే మెప్పించే అంశాలు ఫీచర్ల పరంగా పెద్దగా లేవనే చెప్పాలి.

ఈ వర్షనులో కొత్తగా జోడించిన ఫీచర్లు ముఖ్యంగా ఆక్టివిటీస్, వెబ్‌ స్ప్లైసస్.

ఆక్టివిటీస్: ఇదేమిటంటే మీరు వెబ్ మీద వివిధ రకాలయిన పనులు చేస్తుంటారు. ఉదా: ఓ పదానికి అర్థం కావాలనుకోండి. మీరు బ్రౌజరులో ఆ పదాన్ని ఎంచుకుని కాపీ పేస్టు చేసి మళ్ళీ ఏ డిక్షనరీ సైటులోనో పేస్టు చేస్తారు. అలాగే ఓ ఊరి గురించి ఏ మాపులోనో వెతకాలనుకోండి దానిని ఆ మాప్స్ సైటుకి వెళ్ళి ఆ ఊరి పేరిచ్చి వెతుకుతారు. ఇలాంటి ఎన్నో పనులు చేస్తారు.

ఇలాంటి వాటిని సులభతరం చెయ్యడానికే ఈ ఆక్టివిటీస్. ఇదెలా పని చేస్తుందంటే మీరు బ్రౌజరులో ఓ పదం ఎంచుకున్నారనుకోండి దాని మీద కుడి నొక్కు నొక్కగానే మీకు వివిధ ఆప్షన్‌లు వస్తాయి. ఎలా అంటే ఆ పదాన్ని డిక్షనరీ లో వెతుకు, మాప్స్ లో వెతుకు లాంటివి. ఆ ఆప్షన్ని ఎంచుకోగానే మీకు కావలసిన అర్థం చూపించడమో, మాప్ చూపించడమో లేదా ఆ లంకెని తెరవడమో చేస్తుంది.
ఇది అంత ఇన్నోవేటీవ్ ఫీచర్ కాదని నా అభిప్రాయం. ఐఈ బ్రౌజరుకి సంబంధించి మంచి ఫీచరే అయినా ఫైర్‌ఫాక్స్ కయితే చాలా ఈజీగా ఎక్స్టెన్షనో, గ్రీజ్‌మంకీ స్క్రిప్టో రాసేసుకోవచ్చు. (ఆక్చువల్లీ ఇప్పటికే ఓ వర్షను రాసేసారు కూడా.)

వెబ్ స్ప్లైసస్: ఈ ఫీచర్ ఏమిటంటే మనం తరచుగా వెబ్‌సైట్లలో కొన్ని పోర్షన్‌లను ముఖ్యంగా చూస్తుంటాం.
ఉదా: ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ అప్డేట్లూ, ఆర్కుట్లో ఫ్రెండ్స్ అప్డేట్లూ మొదలయినవి. మొత్తం పేజీలో అదే అన్నిటికన్నా ఇంటరెస్టింగ్ అయుంటుంది.

అలాంటి వాటిని ఈజీగా ట్రాక్ చేసేందుకే ఈ వెబ్ స్ప్లైసస్ అనే కొత్త ఫీచరు. వెబ్ డెవెలపర్లు వెబ్ పేజీలో వారికి కావలసిన పోర్షనుని వెబ్ స్ప్లైస్ కంటెయినరులో ఉంచుతారు. మీరు ఆ వెబ్‌ సైటుకి వెళితే మీకు ఓ చిన్న ఐకాన్ కనబడుతుంది ఆ స్ప్లైసు కి. దానిని నొక్కగానే మీ బ్రౌజరులో చేరిపోతుంది. ఇక ఇప్పటి నుంచి ఈ చిన్న లంకెని నొక్కగానే మీకు ఆ వెబ్‌ పేజీ లోని స్ప్లైసు పోర్షను చటుక్కున వచ్చేస్తుంది. ఆ పేజీ తెరవక్కర్లేకుండానే.
ఇది బాగుంది.

ఆటోమాటిక్ క్రాష్ రికవరీ: ఇది అన్నిట్లోకీ నాకు నచ్చిన ఫీచరు. ఏమిటంటే ఐఈ ౮ వర్షనులో ఒక్కో టాబునీ ఒక్కో ప్రాసెసుగా ఉండేటట్లుగా ఆర్కిటెక్చరుని మార్చారు. దీనివల్ల ఉపయోగమేమిటంటే ఒక వేళ ఒక టాబులోని వెబ్ పేజీ మీ బ్రౌజరు క్రాషుకి కారణమయిందనుకోండి దానిని మాత్రమే రీకవర్ చేస్తే సరిపోతుంది.

ఉదా: మీరు జీ మెయిలు పేజీని తెరిచి పెట్టుకున్నారు. అలాగే దాని పక్క టాబులో ఆర్కుట్ ని తెరిచి ఉంచుకున్నారు. ఇప్పుడూ ఆర్కుట్ టాబులో సమస్య వల్ల క్రాష్ అయిందనుకోండి ఫైర్ఫాక్సులో మొత్తం బ్రౌజరు క్రాష్ అయి మళ్ళీ ఆ సెషంలని రీకవర్ చేస్తుంది.
అదే ఐఈ ౮ లో అనుకోండి క్రాష్ అయిన ఆ ఒక్క టాబునే రీకవర్ చేస్తే సరిపోతుంది. దాని వలన ఇతర టాబుల్లోని సమాచారం సురక్షితం. చాలా బాగుంది (అప్పుడే నాకు చాలా సార్లు ఉపయోగపడిపోయింది ఎందుకంటే అన్ని క్రాషులు చవి చూసింది కనుక ;))

ఇవి కాక సెక్యూరిటీ పరంగా ఫిషింగ్ ని పట్టుకోవడాన్ని మెరుగుపరచారని వారు చెబుతున్నారు.

ఇక నాకు నచ్చిన ఇంకో విషయానికొస్తే ఈ రిలీజులో వారు తీసుకున్న స్టాండర్డ్స్ కాంప్లియంస్ నిర్ణయం.
వివిధ బ్రౌజర్లలో కంపాటిబిలిటీ సమస్యలు ఉండడం మనకు తెలిసిందే. అన్నిటికన్నా ఎక్కువగా ఐఈ తో ఈ చిక్కులు ఎందుకంటే కొన్ని సార్లు వారు w3c స్టాండర్డ్సు ని తుంగలో తొక్కారు. దాని వల్ల ఒక సారి రాసిన కోడుని ఐఈ కోసం ప్రత్యేకంగా మళ్ళీ రాయాల్సి వచ్చేది. ముఖ్యంగా సీఎసెస్, జావాస్క్రిప్టు వగయిరాలలో.

ఈ రిలీజులో వారు స్టాండర్డ్స్ కాంప్లియంసు కి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ప్రకటించారు. అంటే చాలా మటుకు అన్ని బ్రౌజర్లకూ ఒకే కోడు పని చేస్తుంది అన్నమాట. చాలా మంచి నిర్ణయం.
మామూలు వెబ్ వాడుకదార్లకి ఇందులో పెద్ద ప్రత్యేకత కనిపించకపోవచ్చు కానీ వెబ్ డెవలపర్లకి మాత్రం సంతోషకరమయిన వార్త.

అలాగే వెబ్ డెవలపర్లకి ఉపయోగకరమయిన డెవెలపర్ టూల్సుని కూడా విడుదల చేసారు బ్రౌజరులో. జావాస్క్రిప్టు డీబగ్గింగ్ మొదలయిన వాటికోసం. (ఫైర్‌ఫాక్స్ కి ఫైర్బగ్ లాగా.)

ఇంకా హెచ్టీఎమెల్ ౫.౦, సీఎసెస్, అజాక్స్, వంటి వాటిల్లో కూడా మంచి సపోర్టు ని ఇస్తుందని అంటున్నారు.
కానీ ఈ బ్రౌజరు ఇప్పటికి ఆసిడ్ ౨ మాత్రమే పాసయింది, ఆసిడ్ ౩ ఇంకా పాస్ అవలేదు. (ఈ ఆసిడ్ టెస్టులు ఏమిటంటే బ్రౌజరు స్టాండర్డ్సు ప్రకారం పని చేస్తుందో లేదో టెస్టు చేసేందుకు తయారు చెయ్యబడిన విధానం.) ఫైర్‌ఫాక్స్, ఓపెరా బీటాలు పాసయ్యాయి.

కానీ ఇది ఇంకా ఐఈ ౮ మొదటి బీటా కనుక ఇది కూడా త్వరలోనే పాస్ కావచ్చేమో.

ఏది ఏమయినా ఫైర్‌ఫాక్స్ దెబ్బకి మైక్రోసాఫ్టు బ్రౌజరుని తేలిగ్గా తీసుకోవడం మానేసింది. చక చకా రిలీజులు చేస్తూ, కొత్త ఫీచర్లు జోడీంచడానికి ప్రయత్నిస్తుంది. అలాగే స్టాండర్డ్సుని పాటించడానికి ప్రయత్నిస్తుంది. ఇది మంచిదే…