కాదు ఏ సమాచారమూ భద్రం …

సెక్యూరిటీ గురించి నా ఇంతకు ముందు టపాలలో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చెప్పాను.

వెబ్ అప్లికేషన్లలో సెక్యూరిటీ సమస్యలు కేవలం చిన్న సంస్థలకే అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

A chain is only as strong as its weakest link.

అన్న సూత్రం అచ్చంగా సెక్యూరిటీకి వర్తిస్తుంది. ఎంత పటిష్ఠంగా రూపొందించిన సిస్టం లేదా వెబ్‍సైటయినా ఒక చిన్న పొరపాటు వల్ల క్రాకర్ల బారిన పడవచ్చు. ఒక పెద్ద సంస్థ రూపొందించింది కదా అని మనం భరోసాగా ఉండలేము. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొన్నీ మధ్యే నాకు తారసపడిన ఒక ఉదంతం వల్ల.

బ్లాగరు ఈ మధ్యే “Followers” అనే ఒక కొత్త ఫీచరు/విడ్జెటుని విడుదల చేసింది. మీరు ఏ బ్లాగులయితే తరచుగా చదువుతారో వాటిని మీ బ్లాగరులో చేర్చుకోవచ్చు. అలా చేర్చిన బ్లాగుల ఆరెసెస్ ఫీడ్లు ఆటోమేటిగ్గా మీ గూగుల్ రీడర్ లో చేర్చబడతాయి. ఈ విడ్జెటు వల్ల ఉపయోగాలు మీరు మీ బ్లాగుని తరచూ చదివే వారి జాబితాని మీ బ్లాగులో ప్రదర్శించుకోవచ్చు. అలాగే మీరు తరచూ చదివే బ్లాగుల ఆరెసెస్ ఫీడ్లను మిస్సవకుండా గూగుల్ రీడరులో ఎంచగ్గా చదువుకోవచ్చు.

అంతా బానే ఉంది మరి సమస్య ఎక్కడ ఉంది ?

బ్లాగరులోకి లాగిన్ అవగానే మన “Followers” లంకెని మనకి చూపిస్తుంది మనకి. దాని మీద నొక్కితే మన “Followers” జాబితాని మనకి చూపిస్తుంది. వారి పక్కనే “Block” అనే ఒక బటన్ ని కూడా చూపిస్తుంది. దానిని నొక్కితే మన బ్లాగు “Followers” చిట్టాలో వారిని చూపించదు. ఇదీ సమంజసంగానే ఉంది. మరి సమస్య ఇంకెక్కడుంది ?

మీ బ్లాగు “Followers” ని మీరు మాత్రమే మేనేజ్ చేసుకోగలగాలి కదా ? బ్లాగరు వాడు ఎంత అందంగా తయారు చేసాడంటే ఎవరి బ్లాగుకి సంబంధించిన “Followers” ని అయినా చిన్న హాక్ ద్వారా మీరు మేనేజ్ చేసెయ్యవచ్చు.

“Followers” ని మేనేజ్ చేసే లంకె

http://www.blogger.com/manage-followers.g?blogID=xxxxxxxx

పై లంకెలో xxxxxxxx అనేది మీ బ్లాగు ఐడీ.
(మీరు సృష్టించే ప్రతీ బ్లాగుకీ ఒక ఐడీ ఉంటుంది. మీరు బ్లాగరులోకి లాగిన్ అయి అది మీరు తెలుసుకోవచ్చు.)

ఇప్పుడు మీరు పై లంకెని

http://www.blogger.com/manage-followers.g?blogID=xxxxxxxx+1

గా మారిస్తే ఎంచగ్గా పక్కవాడి బ్లాగుని మేనేజ్ చేసెయ్యచ్చు.

మరి అలా లంకె మార్చినప్పుడు మన సంకేత పదం (password) అడగాలి కదా. ఊహూ… ఏమీ అక్కర్లేకుండానే మీకు వారి సమాచారాన్నంతా చూపించేస్తుంది. దానిని మార్చడానికి అవకాశం కూడా కల్పిస్తుంది.

ఉదా:

ఈ కింది చిత్రం నా బ్లాగుకి సంబంధించినది.

నేను పైన చెప్పిన విధంగా లంకెని మారిస్తే వచ్చిన ఇంకొక తెలుగు బ్లాగరు యొక్క సమాచారం ఈ కింది చిత్రంలో చూడవచ్చు.

వారి “Followers” ని నేను “Block” చెయ్యగలిగాను. (నన్ను నేనే అనుకోండి)

మళ్ళీ “Unblock” చేసేసాననుకోండి.

ఇంతకు ముందు ఈ టపాలో నేను చెప్పిన “URL Rewriting” అనే పద్ధతికి పర్ఫెక్టు ఉదాహరణ ఇది.

అదన్నమాట సంగతి ! 🙂

ఇంతకీ ఈ సంగతి నేనెలా కనుగొన్నానంటారా ? టాప్ సీక్రెట్ 😉

మీ బ్లాగరు బ్లాగుని వర్డుప్రెస్సు లోకి మార్చుకోవడం ఎలా ?

మన తెలుగు బ్లాగర్లలో ఎక్కువ మంది బ్లాగరు లేదా వర్డుప్రెస్సులో బ్లాగుతుంటారు.

బ్లాగరు మనకు కావలసినట్టు తీర్చిదిద్దుకోవడానికి, అన్ని అమరికలు చేసుకోవడానికీ అనువయినది.
వర్డుప్రెస్సు లే మాన్ కూడా అనాయాసంగా నిర్వహించగలిగినది.

కొద్దిగా కస్టమైజేషనూ వగయిరా చేసుకోవాలంటే బ్లాగరే బాగుంటుంది. అందుకే బ్లాగరులో ఎంతో అందంగా డిజైన్ చెయ్యబడిన థీములు, జనాలు జోడించుకునే ఆరెసెస్ లంకెలు, వగయిరా అందుబాటులో ఉంటాయి.
కానీ వర్డుప్రెస్సు.కాం లో అంతగా కుదరవు (మీ సొంత ఇన్స్టాలేషనయితే కుదురుతుంది). కానీ డీఫాల్టు థీములు వర్డుప్రెస్సులోనే బాగుంటాయి, ఎన్నుకోవడానికి సులభం కూడా.

అయితే ఇక్కడ ఒక కష్టం ఏమిటంటే ఒక చోట మొదలుపెట్టిన బ్లాగు వివిధ కారణాల వల్ల అందులోనే ఉండవలసి వస్తుంది.

౧. ఒక దాని నుంచి ఇంకొక ప్రవయిడరుకి మారితే మన టపాలు, వ్యాఖ్యలు అన్నీ పోతాయి గనుక.
౨. ఇన్నాళ్ళ నుంచి మనం సంపాదించుకున్న ఒక ఐడెంటిటీ పోతుంది గనుక.
౩. సెర్చ్ ఇంజన్లలో బ్లాగు రాంకు మళ్ళీ మొదటి నుంచీ మొదలవుతుంది గనుక.

అయినా కానీ ఒక ప్రొవయిడరు నుంచి ఇంకొక దానికి మారగలిగితే బాగుంటుంది కదూ…

అలాంటి సదుపాయం వర్డుప్రెస్సులో ఉంది. మీ బ్లాగరు, ఇంకా చాలా ఇతర బ్లాగులలో నుంచి టపాలను వ్యాఖ్యల సహితంగా వర్డుప్రెస్సులోకి దిగుమతి చేసుకోవచ్చు.

అదెలాగో చూద్దాము.

(అన్నట్టు ఈ సోపానాలు మీ సొంతంగా హోస్టు చేసిన బ్లాగుకయినా, వర్డుప్రెస్సు.కాం లో ఉన్న బ్లాగుకయినా ఒకటే.)

౧. మీరు మీ వర్డుప్రెస్సు అకౌంటులోకి లాగిన్ అవండి. మీ ప్రొఫైలు అమరికలలో గనుక “తెలుగు” ని ఎంపిక చేసుకునుంటే మీకు కూడా జాబితాలూ, అవీ తెలుగులో కనిపిస్తాయి.

ఒకవేళ చేసి లేకపోతే ఇప్పుడు చెయ్యండి.

అలా చెయ్యడానికి మొదట My Account > Edit Profile కి వెళ్ళండి.

అక్కడ Interface Language ని te-తెలుగు గా ఎంచుకోండి.

౨. ఇప్పుడు నిర్వహణ అనే లంకె మీద నొక్కండి.

౩. దాని కింద దిగుమతి > బ్లాగర్ మీద నొక్కండి.

౪. అక్కడ మీ బ్లాగరు సంకేత నామం (Username), రహస్య నామం (Password) ఇచ్చి మీ బ్లాగరు బ్లాగుని జోడించండి.

౫. ఇప్పుడు బ్లాగరులో మీరు రాస్తున్న బ్లాగులన్నీ చూపించబడతాయి.

౬. మీకు కావలసిన బ్లాగు పక్కన ఉన్న “దిగుమతి” అనే బొత్తాన్ని నొక్కండి.

అంతే మీ టపాలు, వ్యాఖ్యలు బ్లాగరు లో నుంచి వర్డుప్రెస్సులోకి దిగుమతి అయిపోతాయి. అంతే…
ఇక నుండి వర్డుప్రెస్సులో బ్లాగు చేసుకోవచ్చు.

ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు మీకు బ్లాగరు నచ్చకపోతే వర్డుప్రెస్సుకి మారవచ్చు. అలాగే కావాలంటే మీ బ్లాగరు బ్లాగుకో మిర్రరు బ్లాగు ఏర్పరచుకోవచ్చు. (అలా చేసిన నా మిర్రరు బ్లాగు ఇక్కడ చూడవచ్చు.)

ఇది చూడండి:

అన్నట్టు మీరు గమనించి ఉంటారు. వర్డుప్రెస్సు తెలుగు అనువాదాలు పూర్తిగా లేవని. కొంత ఆంగ్లంలో కనిపిస్తుంది.
దానిని సరి చెయ్యాలంటే మీరు తెలుగు అనువాదంలో పాలుపంచుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చెయ్యవచ్చు.
(తెలియని వారికోసం: వర్డుప్రెస్సు ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. మీరు దానిని ఉచితంగా పొందవచ్చు, వాడుకోవచ్చు. కాబట్టి మీరు చేసే అనువాదాలు మీకు లభించే ఓపెన్ సోర్స్ వర్షనులో కూడా పొందుపరచుకోవచ్చు.)