పుట్టినరోజు విశేషాలు …, మినీ బెబ్లాస

నా పుట్టినరోజు అమ్మా నాన్నలతో జరుపుకోవడం ఓ సంతోషం. అదే కాక ఓ మినీ బెబ్లాస జరగడం ఇంకో సంతోషం. 🙂 (వివరాలు తొందర్లోనే వస్తాయి లేండి)

పుట్టినరోజు పొద్దున్న అమ్మ శుభాకాంక్షలతో లేవడం కంటే అదృష్టం ఏమన్నా ఉంటుందా ?
పొద్దున్నే లేపి నాన్నా లెగు, తల స్నానం చెయ్యి, దేవుడికి దణ్ణం పెట్టుకో అని చిన్నప్పటి నుంచీ చెబుతున్నట్టే ఇంకా అమ్మ చెబుతుంది మరి.

లేచి, స్నానం చేసి కొత్త బట్టలేసుకుని వచ్చేసరికి చక్కెర పొంగలి చేసింది అమ్మ. నాకిష్టం మరి.
అది తింటూ అంతర్జాలం లోకి బయల్దేరగానే మిత్రులందరి దగ్గరి నుంచీ శుభాకాంక్షలందాయి. ఇంత మంది అభినందనలకు, ఇంత మంది ఇంకా గుర్తు పెట్టుకున్నందుకూ సంతోషమేసింది.

నవీన్ అన్న క్రితం రోజు చెప్పారు తొమ్మిదిన్నరకు వస్తానని. నాకెలాగూ తెలుసు వీకెండ్ కాబట్టి లేట్ అవుతుందని అందుకనే మరి నేను కూడా తొమ్మిది పదిహేను కి కష్టపడి లేచాను.
స్నానం గట్రా చేసినా ఇంకా నవీన్ గారు రాకపోవడం తో నాకేదో డౌట్ కలిగింది. ఆయన కి కాల్ చేస్తే అది తీరింది. ఆయనింకా నిద్ర లేవలేదు మరి 🙂 పాపం అప్పుడు ఆయన లేచి స్నానం చేసి ఇంటికొచ్చారు. ఇద్దరం మాట్లాడుకుంటూండగా పక్క వీధిలోనే ఉండే ప్రదీప్ గారిని పిలిస్తే ఎలా ఉంటుంది అననుకొని ఆయనకి కాల్ చేస్తే ఆయన వస్తానన్నారు. ఆహా ఎలా వర్కవుటయిపోతుంది అని ఆనందించి దీనిని బెబ్లాస గా కన్వర్ట్ చేసెయ్యాలనే నిర్ణయానికొచ్చేసాము. అంతలోనే ఆయన కాల్చేసి ఆయన స్నేహితుడిని కూడా తీసుకొస్తున్నానని చెప్పారు. అంతకంటేనా…

ఇంకో గంట లో అందరమూ మా ఇంట్లొ, నా రూములో సెటిల్ అయ్యాము. అంతకు ముందు మా మేనల్లుడు (రెండున్నరేళ్ళు) వారికి షేక్ హాండిచ్చి స్వాగతం పలికాడనుకోండి 🙂
ఇక మొదలెట్టాము మా డిస్కషన్లు, ఒకటనేంటి అన్ని విషయాల మీదకూ చర్చ మళ్ళింది. రవి గారని ప్రదీప్ గారి దోస్తు, ఆయన కొత్త కొత్త అవిడియాలు అవీ పంచుకున్నారు. ఇక అక్కడ ఇద్దరు వికీ గురువులు ఉండే సరికి చర్చ అధిక శాతం వికీపీడియా మీదకి మళ్ళింది. అందులో లోటు పాట్లు, ఇబ్బందులు, ఇంప్రూవ్మెంట్లు మీద చర్చ బాగా సాగింది.

అలా మాట్లాడుకుంటూంటేనే భోజనం సమయం ఆసన్నమయింది. తృప్తి గా భోంచేసి అందరం మళ్ళీ కాసేపు సెటిల్ అయ్యాం. ఈ సారి కొంత లినక్స్ మీద, సినిమాల మీద కీ చర్చ మళ్ళింది. మాటల్లో ప్రదీప్ గారి దగ్గర ఓ సినిమా భాండాగారం ఉందని తెలిసింది. అప్పటి నుంచి నాకు పీకడం మొదలయింది. కాసేపు ఉబుంటు తో ఆడి ఇక ప్రదీప్ గారి రూముకెళ్ళి సినిమాలు తెచ్చుకోవాలని బయల్దేరాము.

రెండడుగుల్లోనే ఆయన రూము. అందరం అక్కడ సెటిల్ అయి ఉన్న జీబీల సినిమాల నుంచి కొన్ని ఎన్నుకుని కాసేపు టైం పాస్ చేసి ఇంటికి బయల్దేరాము.

ఎంచగ్గా రోజంతా గడిపినందుకు భలే సంతోషం గా ఉంది. అన్నట్టు రవి గారి స్కేట్ బోర్డ్ భలే ఉంది. దాని మీదెక్కి ప్రయత్నించగానే నేనూ,నవీన్ గారు  కింద పడ్డంత పనయ్యింది. ఇక ఎందుకులే అని ఊరుకున్నాం 🙂

 

* బెబ్లాస విషయాలు ప్రదీప్ గారు టపా రాస్తారు లేండి.