ఏప్రిల్ 4, 2007

యూజబిలిటీ అంటే ఏంటి ?

Posted in టెక్నాలజీ, యూజబిలిటీ వద్ద 6:27 సా. ద్వారా Praveen Garlapati

యూజబిలిటీ అని అప్పుడప్పుడూ చూస్తుంటాము. అసలు యూజబిలిటీ అంటే ఏంటి ??

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అప్లికేషన్ గానీ ప్రోడక్ట్ గానీ వాడటానికి అనువుగా ఉందో లేదో అనేదే యూజబిలిటీ. ఇది ఎందుకంత ముఖ్యమంటె ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. మరి అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఒక ప్రోడక్ట్ రూపొందించాలంటే ఎంతో కష్టం. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ యూజబిలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తాయి.

మీరు ఎంతో కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసారు. దాంట్లో ఎన్నో మంచి ఫీచర్లు పెట్టారు. కానీ ఇంటర్ఫేస్ ది ఏముందిలే నేనింత బాగా తయారు చేసాను అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఐటీ ఇండస్ట్రీ లో ఎన్నో ప్రోడక్ట్‌లు ఈ ఇంటర్ఫేస్ సరిగా లేక నే ఫెయిల్ అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఉదాహరణ చెబుతాను. మీరు ఒక టీనేజర్లకి ఉద్దేశ్యించిన వెబ్సైట్ కి వెళ్ళారు. అక్కడ మంచి హిప్ హాప్ కంటెంట్ ఉంది. ఆ వెబ్సైట్ ని బ్లాక్ అండ్ వైట్ లో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది ? ఒక్కడయినా తిరిగి వస్తాడా. చచ్చినా రాడు.

అందుకనే ఒక సాఫ్ట్వేర్ విషయంలో ప్రాడక్ట్ ఎంత ముఖ్యమో దానిని వాడటానికి ఉపయోగించే ఇంటర్ఫేస్ కూడా అంతే ముఖ్యం.

నేను ఇంతకు ముందు పని చేసే కంపెనీ లో యూజబిలిటీ కి ఒక ప్రత్యేక టీం ఉండేది. అబ్బా దానికో ప్రత్యేకమయిన టీం అవసరమా, నాలుగు మంచి కలర్లు నేను తగిలించలేనా ఆ మాత్రం అనుకోమాకండి. యూజబిలిటీ అంటే ఉత్త కలర్లు వాడటం, కంటికింపయిన కంట్రోల్స్ వాడటం అంటివే కాదు, ఇంకా ఎంతో ఉంది.

ఉదాహరణకి ఏ రకమయిన ఎండ్ యూజర్స్ ని మీ ప్రోడక్ట్ టార్గెట్ చేస్తుంది ? వాళ్ళు ఈ సాఫ్ట్‌వేర్ నుంచి ఏమి ఆశిస్తారు ? వాళ్ళ ఆవరేజ్ వయసేంటి ? వాళ్ళు ఏ రీజియన్స్ నుంచి వస్తారు ? ఎలాంటి జీవన విధానం వారిది ? మొదలయినవన్నీ కూడా యూజబిలిటీ కోసం గమనించాలి.

ఉదాహరణకి మీరు చైనా లో ఏదన్నా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నారనుకోండి, దానిని లోకలైజ్ చెయ్యకపోతే ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అయినట్టే. అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలయిన dialects వాడతారు. వాటికి తగిన లాంగ్వేజ్ వాడకపోతే వారు offend అయ్యే ప్రమాదం ఉంది. అందుకని భాష కి సంబంధించిన పద్ధతులు కూడా యూజబిలిటీ లో భాగమే.

యూజబుల్ గా ఉండే ప్రోడక్ట్స్ ని తయారు చేస్తుందని ఆపిల్ కి పేరు. అంటే వాటిని వాడటానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదన్నమట. దానికో ఉదాహరణ ఐపాడ్. అలాగే మాక్. (విండోస్ ఇంటర్ఫేస్ దీని నుండే ఇన్స్‌పైర్ అయింది అని అంటారు.)

విండోస్ అంటే కూడా యూజర్ ఇంటర్ఫేస్ కి పేరు. ఆపరేటింగ్ సిస్టంస్ లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కి ఎక్కువ ప్రచారం కల్పించింది విండోసే. పీసీ ని ఇంట్లోకి తేవడం లో ఎంతో ముఖ్య పాత్ర వహించింది.

ఇప్పుడు లినక్స్ ని జనాలకి దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నంలో కూడా ఈ యూజర్ ఇంతర్ఫేస్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దానికో చక్కని ఉదాహరణ ఉబుంటు. ఇతర డిస్ట్రో ల కంటే కూడా ఇది ఎక్కువ ప్రచారం పొందటానికి కారణం దీని UI ని తీర్చి దిద్దటంలో వహించిన శ్రద్ధే. అదే కాక ఇప్పుడు లినక్స్ లో బెరిల్, కాంపిజ్ వంటి విండో మేనేజర్లు వచ్చిన తర్వాత అది విండోస్ ని తలదన్నేదిగా ఉంది. అందులో ఎఫెక్ట్స్, త్రీ డీ వంటి ఫీచర్లు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దానిని ఇప్పుడు ఉబుంటు ఫియెస్టీ రిలీజ్ తో పాటు డీఫాల్ట్ గా ఉంచుతున్నారు.

యూజబిలిటీ ఎంతో శ్రమ తో కూడుకున్నది కూడా. దానిని తేలికగా తీసెయ్యకూడదు. అందులో పాటించే పద్ధతుల గురించి చెప్పాలంటే ఒక శాస్త్రమే అవుతుంది.

నేను ఇంతకు ముందు పని చేసిన కంపెనీ లో యూజబిలిటీ కోసం ఒక టీం ఉండేదని చెప్పానుగా. వాళ్ళు వివిధ రకాల ప్రోడక్ట్స్ ని వివిధ పద్ధతుల్లో టెస్ట్ చేసేవారు. అందులో ప్రోటోకాల్ సిములేషన్ అనే పద్ధతి గురించి చెబుతాను. అందులో ఏం చేస్తారంటే ముందుగా మీ ప్రోడక్ట్ కోసం టార్గెట్ యూజర్లెవరో ఐడెంటీఫై చేస్తారు. ఉదాహరణకి మీరు ఒక B2B పోర్టల్ తయారు చేస్తున్నారనుకోండి మీ బిజినెస్ యూజర్లు ఎవరు ? అలాగే మీరో కంపెనీ ఇంటర్నల్ సైట్ తయారు చేస్తున్నారనుకోండి దానికి యూజర్లు ఎవరు ? అలా ఐడెంటిఫై చేసిన యూజర్లూ ఒకే కాటగరీ కి చెందిన వారయి ఉండకపోవచ్చు.

ఆ యూజర్లను ఐడెంటీఫై చేసిన తరవాత వారి టెస్టింగ్ కోసం ఆయా కాటగరీలలోంచి సాంపుల్ యూజర్లకోసం వెతుకుతారు. వారిని ఒప్పించి వారితో ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేయిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఒకే పక్క నుంచి చూడగలిగే ఒక అద్దం ఉంటుంది. అవతల పక్క యూజర్ ని కూర్చోబెట్టి వారికి అప్లికేషన్ ఇస్తారు యూజర్ మాన్యువల్ లేకుండా. ఈ పక్క నుంచి వీరు గమనిస్తుంటారు యూజర్ ఎలా వాడుతున్నాడో అని. ఎక్కడన్నా తడబడుతున్నా, లేక ఇబ్బందిపడుతున్నా అది నోట్ చేసుకుంటారు. మరీ ఇబ్బంది ఎదురయితే వారికి సూచనలిస్తారు, ఇలా చేసి చూడండి అని. యూజర్ అప్లికేషన్ వాడుతున్నంత సేపూ వారి రియాక్షన్స్ ని వీడియో తో రెకార్డ్ చేస్తారు. వారి క్లిక్కులను ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి రికార్డ్ చేస్తారు, వారి ముఖంలో ఫీలింగ్స్ గమనిస్తారు, ఎక్కడన్నా విండో రీసైజ్ మొదలయినవి చేస్తున్నారా అని గమనిస్తారు. ఇంత తతంగం ఉంటుంది. అందుకనే ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు.

పైన చెప్పినవే కాకుండా మిగతా ఏ విషయాలు గమనిస్తారంటే ఆక్సెసబిలిటీ. ఈ అప్లికేషన్ ని color blindness, eye problems, blindness ఉన్న వారు వాడగలుగుతారా ? ఆ అప్లికేషన్ కంపెనీ బ్రాండ్ ని ఫాలో అవుతుందా ? అది వాడే టెంప్లేట్ మొదలయినవి మిగతా వాటితో కన్సిస్టెంట్ గా ఉన్నాయా ? ఇంకా అలాగే టాబ్స్ అవీ వాడేటప్పుడు వాటిని ఎలా ఉంచితే వాడటానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అని, దాని కోసం కార్డ్ సార్టింగ్ లాంటి పద్ధతులు మొదలయినవి కూడా.

అందుకనే మీరు కూడా ఇక నుంచి తయారు చేసే ప్రోడక్ట్స్ యూజబుల్ గా తయారు చెయ్యండి. ఎందుకంటే మీ ప్రోడక్ట్ సక్సెస్ దాని మీదే ఆధార పడి ఉండవచ్చు.