రైలు ప్రయాణంలో పదనిసలు …

నాకు రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం. రైలు ఓ మినీ సొసయిటీ అంటే అతిశయోక్తి కాదేమో. రైలులో జనరల్ క్లాసు నుండి, ఫస్ట్ క్లాసు వరకూ అన్ని క్లాసులలోనూ ప్రయాణించాను నేను. ఒక్కో ప్రయాణం నాకు జీవితంలో మరచిపోలేని అనుభూతులని మిగిల్చింది.

కన్నెపిల్లల వెంట పడే కొంటె పిల్లల నుండి, బాదరాయణ సంబంధాల గురించి ఊసుపోకు కబుర్లు చెప్పుకునే అమ్మలక్కల నుండి, సూటుకేసుల పేకాటరాయళ్ళ వరకూ ఒక్కోరిదీ ఒక్కో స్టయిలు మరి.

రైలు నాకు పరిచయమయింది చిన్నప్పుడే. మా అమ్మ వాళ్ళది కాస్త పెద్ద కుటుంబం. జస్ట్ ఓ ఎనిమిది మంది అంతే. కాబట్టి చిన్నప్పుడు ప్రతీ ఏడాది ఓ మామయ్య పెళ్ళి ఉండేది. ఇక అమ్మమ్మ ఇంటికెళ్ళకుండా ఎలా ఉంటాము చెప్పండి , అదీ ఏడాది మధ్యలో స్కూలెగ్గొట్టి. నాన్నేమో బ్యాంకీ వారాయె. ప్రతీ మూడేళ్ళకూ ఓ ఊరు మారుతూండేవాళ్ళము. అదీ ఏడాది మధ్యలో పది రోజులు సెలవు పెట్టి రావాలంటే ఆయనకెక్కడ కుదురుతుంది ? అందుకే చాలా మటుకు మేము మాత్రమే అంటే అమ్మా, అక్కా, నేనూ ముందెళితే ఆయన తీరగ్గా పెళ్ళికి ఓ రెండు మూడు రోజుల ముందొచ్చేవారు.

ఇక ఆ ప్రహసనం నాన్న మమ్మల్ని స్టేషన్లో దింపే దగ్గర నుండీ మొదలవుతుంది. స్టేషనుకెళ్ళగానే ముందు రైలెక్కడా అని కాకుండా బాలమిత్ర, చందమామ, వండర్ వరల్డ్ ఎక్కడా అని వెతుక్కునేవాళ్ళము మా అక్కా, నేనూ. ఇంకా రైలు రాకుండానే చెరో సూటుకేసు మీద బైఠాయించి ఆ పుస్తకాలను నమలడం మొదలు.

ఇక బయల్దేరిన దగ్గరనుండీ అమ్మకు కష్టాలు మొదలే. రైలు ప్రయాణం అంటే మా ఇద్దరికీ ఎంతో ఇష్టం. ఎంచగ్గా ప్రయాణమంతా ఏదోటి కొనుక్కుంటూనే ఉండవచ్చు. జాంకాయల దగ్గరనుండి తేగలు, వేరుశనగపప్పులు, చిక్కీలు, కాఫీలు కాదేదీ తినడానికి అనర్హం అని తెగ తినే వాళ్ళము. ఇవన్నీ ఇంటి నుండీ తీసుకెళ్ళిన పులిహోరో, మామిడికాయ ఉప్పుడుపిండో కాకుండా.

అప్పుడు చిన్నోళ్ళమేమో రైలులో ఆడించేవారూ తెగ ఉండేవారు. కాసేపు ముద్దు చేసేవారు. తరవాత ఆరాలు తీసేవాళ్ళు. ఏదోటి తినిపించేవాళ్ళు. ఎక్కడనుంచో ఓ బీరకాయపీచు చుట్టరికం ఓటి కలిస్తే ఇక అంతే సంగతులు. మేమిద్దరమూ ఓ చేట చేరి గుసగుసలాడేవాళ్ళము. కాసేపయాక చెరో బెర్తు మీదెక్కి నిద్దరోయేవాళ్ళము.

ఇక మధ్యలో కిటికీ పక్కన సీటు కోసం పోట్లాడుకోవడం మామూలే. నాదంటే నాదని జుట్టూ జుట్టూ పీక్కునే వరకూ వచ్చి ఆఖరికి సరే ఇద్దరమూ చెరో గంట అని ఓ ఒప్పందానికొచ్చేవాళ్ళము. ఇక ఆ కిటికీలోంచి బయటకు చూస్తుంటే పచ్చని పొలాలు, టెలిఫోన్ స్థంభాలు, కరెంటు వైర్లు, విండు మిల్లులు అన్నీ అలా వెనక్కెళ్ళిపోతుండేవి. అలా వాటిని చూస్తూ చల్ల గాలిలో మెల్లగా నిద్రలోకి జారిపోయేవాళ్ళము. ఇంకో గంట తరవాత మళ్ళీ పేచీ. చిన్నోడిని కాబట్టి నా మాటే నెగ్గేది చాలాసార్లు. అక్క భలే ఉడుక్కునేది లెండి.

ఎంచగ్గా అలా వెళ్ళి తాతగారి ఊళ్ళో దిగగానే ఏ మామయ్యో వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు. స్టేషన్ వచ్చే పది నిముషాల ముందు నుంచే వచ్చేసింది, వచ్చేసింది అని తెగ సంబరపడిపోయేవారము. ఇక స్టేషన్లో ఆగీ ఆగగానే మామయ్యొకరు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. లటుక్కున దిగి మేమూ పరిగెత్తేవాళ్ళము. అమ్మొకత్తే రైల్లో రెండు సూటుకేసులూ మోసుకుంటూ దిగేది.

అలా చిన్నప్పటి అనుభవం. ఆ తరవాత అనుభవాలు ఎల్టీసీ వి. నాన్న కి ప్రతీ నాలుగేళ్ళకు ఎల్టీసీ వెళ్ళేందుకు బాంకు డబ్బులిచ్చేది. ఇక ఆ ఎల్టీసీలో మొత్తం ఆంధ్ర దేశం అంతా చుట్టివచ్చేవాళ్ళము. అంతే కాక ఓ సారి కలకత్తా వెళ్ళాము. ఇంకో సారి కాశీ వెళ్ళాము. అలా తిరగని ఊరు లేకుండా పైన ఢిల్లీ నుండి కింద కన్యాకుమారి వరకూ ఎన్నో ఊళ్ళు చూసాము. ఆఖరిగా నాకు గుర్తుండి మేమెళ్ళింది ఢిల్లీ, బదరీనాథ్, కేదార్నాథ్ (ఇంకో సారి తీరిగ్గా ఈ విశేషాలు). అబ్బో అదో పెద్ద ట్రిప్పండీ బాబూ. మేము వైజాగ్ లో ఉండే వాళ్ళము. అక్కడ నుండి ఢిల్లీ ప్రయాణం ఓ మూడురోజులు దగ్గరదగ్గరగా రైల్లో.

అసలే నీట్‌నెస్ చాలా ఎక్కువ నాకు. రోజుకి కనీసం రెండు సార్లు స్నానం చేసేవాడిని నేను. అలాంటిది ఆ చెమట తో మూడు రోజులుండాల్సి వచ్చేసరికి అసలు భరించలేని చిరాకొచ్చింది. అయినా వెళ్ళబోయే ప్రదేశాలు తలచుకుని తెగ ఎదురుచూసేవాడిని. ఆ ప్రయాణం కూడా ఓ మరపురాని అనుభూతి.

అన్నట్టు ఈ రైలు ప్రయాణంలో అనేక పదనిసలండీ బాబు.

ఓ సారి చిన్నప్పుడు అక్కా నేనూ చెరో మిడిల్ బర్తులో సెటిలయ్యాము. మధ్య రాత్రిలో డబ్బు మని చప్పుడు. ఏంటని చూస్తే అక్క కింద ఉంది నేల మీద. నాకర్థం కాలా నిద్రలో. అర్థమయ్యేసరికి ఒకటే నవ్వు నేను. లెంపకాయ కొద్దిలో తప్పిందనుకోండి. అది వేరే విషయం.

ఇంకో సారి నేను ఇంజినీరింగు చదివేటప్పుడు. అది ఒకటో సెమిస్టరో లేక రెండో సెమిస్టరో. కర్ణాటకలో ఇంజినీరింగు వెలగబెట్టాను. అక్కడ నుంచి వైజాగ్ రావాలంటే బెంగుళూరులో రైలు మారి వచ్చేవాడిని. ఏం చేసానంటే బెంగుళూరులో దిగినప్పుడూ ఆ ఆన్‍గోయింగ్ టికెట్టు (అంటే మొదటి స్టాపు నుండి బెంగుళూరుకీ, అక్కడ నుండి వైజాగు కీ ఒకటే టికెట్టు అన్నమాట. కాకబోతే రెండు చీటీల్లాగా ఉండేవి.) సర్లే ఈ జర్నీ అయిపోయిందిగా అని బెంగళూరు స్టేషన్ నుండి బయటకెళ్ళేటప్పుడు అక్కడ టీసీ కి ఆ టికెట్టిచ్చి వెళ్ళిపోయా ఇంకోటి ఉందిగా అని. తరవాత వైజాగెళ్ళే ట్రెయినెక్కా.

ఎదురుగా మాంచి అందమయిన అమ్మాయి. నా మనసు ఎటో వెళ్ళిపోయింది. అక్కడక్కడా దొంగ చూపులు చూస్తున్నా బుద్ధిమంతుడిలా ఆక్టు చేస్తున్నా. అంతలో టీసీ వచ్చాడు. టికెట్టడగగానే తీసి చూపించా ఇంకేముంది. ఇంకో సగమేది నాయనా అని అడిగాడు. ఇంకోటేంటీ ఇదేగా ని ఏడుపుమొహమెట్టా. కాదు బాబూ ఇంకో సగముంటుంది అది కూడా కావాలి అన్నాడు. ఫైను కట్టు నాయనా అని బిల్లు బుక్కు తీయగానే ముచ్చెమటలు. నా దగ్గర డబ్బులు లేవాయే. ఓ నూటయాభయ్యో ఎంతో ఉంది. ఎలాగయితే నా మీద జాలి తలిచి వచ్చే స్టేషన్లో జనరల్ టికెట్టు తీసుకుని ఆ కంపార్టుమెంటులోకి మారిపొమ్మన్నాడూ ఆ దయగల టీసీ. అప్పటికీ బిక్కమొగమేసేసరికి ఎదురుగా కూర్చున్న ఆ అమ్మడు పక్క సైడు లోవర్ బర్తులో కూర్చున్న అన్నని పిలిచింది (ఆ అని అవాక్కయ్యా. తొందరపడ్డాను కాదు).

ఆ అబ్బాయి పాపం ఇంకో స్టేషను రాగానే నా సూటుకేసు తీసుకుని నే కిందుంటాను. ఒకవేళ నువ్వు టికెట్టు తీసుకుని రా, రాలేకపోతే సూటుకేసు కిందే ఉంచేస్తా అని భరోసా ఇచ్చాడు. ఆ స్టేషను రాగానే పరుగో పరుగు టికెట్టు కవుంటర్ దగ్గరికి. ఎలాగయితే టికెట్టు సంపాదించి మళ్ళీ రయిలెక్కా. కాకపోతే పరువంతా గంగపాలు. పాపం వాళ్ళిద్దరే రాత్రి వరకూ అక్కడే ఉండనిచ్చి తరవాత ఆ అబ్బాయే జనరల్ కంపార్టుమెంటులో ఓ బర్తు వెతికి నే పడుకోవడానికి వెళ్ళాడు. బతుకు జీవుడా అని ఆ ఆపద్భాంధవుడికి ఓ నమస్కారం పెట్టి ఓరచూపయినా అతని చెల్లి కేసి చూసినందుకు చెంపలేసుకున్నా 🙂

ఇంకోసారి ఇలాగే ఇంజినీరింగ్ కాలేజీ సెలవలకి ఇంటికెళుతున్నా. క్రితం సారి బుద్ధి రావడంతో ఈ సారి అందరితో కలిసి అంటే నా నార్తీ స్నేహితులందరూ వైజాగు మీద నుండే తమ తమ ఊళ్ళకు వెళతారు. నాకు మన వారితో కంటే వారితోనే స్నేహమెక్కువ ఎలాగూ కాబట్టి వాళ్ళతోనే కలిసి వెళ్ళేవాడిని. నాదేమో సైడు లోవర్ బర్తు. వాళ్ళందరిదీ పక్క కంపార్టుమెంటు. ఇక చెప్పేదేముంది రైలులో మాకు పని ఆ పక్కనుండి ఈ పక వరకూ తెగ తిరగడమే. ఎక్కడన్నా అమ్మాయిలు కనిపిస్తే అక్కడ కాసేపు స్టాపన్నమాట. జనరల్గా అదీ పద్ధతి. కానీ ఆ రోజు నేను ఆ రవుండ్లకి వెళ్ళలా.

ఎందుకబ్బా అని వారికి డవుటొచ్చి చూస్తే ఇంకేముంది నా ఎదురు సీట్లో ఓ బెంగుళూరులో చదువుతున్న నార్తీ పాప 🙂 ఇక నా పనయిపోయింది. నేనెలాగూ బుద్ధూనే. మాట్లాడేంత ధైర్యం ఎలాగూ లేదు. ఆ అమ్మాయే ఒకట్రెండు సార్లు మాట్లాడించింది ఏ కాలేజీ, ఏం చదువుతున్నావు అని. అప్పటికే నాలుక పిడచగట్టుకుపోయింది. మా వాళ్ళకయితే తెగ ఈర్ష్యొచ్చేసింది నా మీద, కోపం కూడా. ఎందుకంటే మంచి ఛాన్సు నేను వేస్టు చేస్తున్నానని. ఇక నిముషానికోసారి నా సీటు దగ్గరికి రావడం, ప్రతి ఒక్కడినీ నేను ఆ అమ్మాయికి పరిచయం చెయ్యడం. ఇక నావల్ల కాదని నే నిద్రపోయా. తరవాత ఎదురుగా అమ్మాయిని పెట్టుకుని నిద్రపోయానని తెగ వెక్కిరించారు లెండి.

అలాగే ఓ సారి ఇంటర్‍సిటీ పాసింజరు ఎక్కాము నేనూ, నా స్నేహితుడూ. మధ్యలో ఓ స్టేషనులో ఆగితే కూల్ డ్రింకు తాగి ఆ ట్రెయిన్ కాక ఇంకో ట్రెయినెక్కి ఎక్కిన స్టేషనుకే వెనక్కొచ్చాము.

ఇంకో సారి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ ఆసామి ఎవరో చెప్పులు పేపర్లో చుట్టి తలకింద పెట్టుకుని నిద్రపోవడం చూసి తెగ నవ్వుకున్నాము నేనూ నా దోస్తూ. తెల్లారి లేస్తే ఏముంది (నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు) మా ఇద్దరి షూసూ హూష్ కాకి. ఇక నేను నా సూటుకేసులో ఉన్న హవాయి చెప్పులూ, మా వాడు స్టేషనులో ఓ జత వంద రూపాయలు పోసి కొత్తవి కొనీ వెళ్ళాల్సొచ్చింది.

ఇక ఆఖరుది భారతం బయట అనుభవం లెండి .

నాకసలే ఇల్లొదిలి వెళ్ళాలంటే పెద్దగా ఇష్టముండదు. అలాంటిది క్రితం సంవత్సరం ఓ సారి చావరా అని ఓ నెల రోజులు అమెరికా గెంటారు నన్ను (ఆ ప్రయాణ ప్రహసనం ఇంకోసారి). ఇక వచ్చిన తరవాత ఎలాగూ తిరగాలి కదా. నాకేమో కారు డ్రయివింగు రాదు. ఇంకో స్నేహితుడున్నాడు, వాడికీ రాదు. సరే అని చెప్పి సానోసే నుండి సాన్‌ఫ్రాన్‌సిస్కో కి అదేదో వీటీయే నో ఏదో ట్రెయినుంటది. దాంట్లో వెళదామని నిర్ణయించుకున్నాము. డాలర్లూ, కాయిన్లూ తీసి ఎలాగో ఓ డే పాస్ తీసుకున్నాము. మొదటి అంతస్తులో ఎక్కి నేను ముందూ, నా స్నేహితుడు వెనకా కూర్చున్నాము.

వాడిది ఆఖరి సీటు. అన్ని సీట్లూ ఒక్క వరసే ఉండి ఆ ఆఖరి సీటు మాత్రం రెండు సీట్లున్నాయి. వాడు నన్ను చూస్తుండమని చెప్పి బాత్రూముకి వెళ్ళాడు. నేను అప్పుడే కొన్న నా MP3 ప్లేయరుతో కుస్తీ పడుతున్నా. ఇంతలో ఎవడో ఒకడొచ్చి నా స్నేహితుడి పక్క సీటులో కూర్చున్నాడు. వాడి బాగు జిప్పులు తెగ తెరిచి చూసుకుంటున్నాడు. సర్లే నాదేం పోయే అని నే నా పని చూసుకుంటున్నా. ఇంతలో మా వాడు వచ్చాడు బాత్రూము నుండి. నా బాగేదీ అన్నాడు. నాకర్థం కాలా. అక్కడే ఉండాలే అని తిరిగి చూస్తే బాగు లేదు, అప్పుడే నన్ను దాటుకుని అక్కడ కూర్చున్నోడు ఆ అంతస్తు మెట్ల దాకా వెళ్ళిపోయాడు. నేను గబ గబా చెప్పా వాడు బాగు జిప్పులు తెగ తెరిచాడురా అని.

మావోడు నార్తీ, మంచి దూకుడున్నోడు ఉన్నపళంగా వెళ్ళి వాడి బాగు లాక్కొని జిప్పు తెరిచేసాడు. అందులో బుజ్జిముండ వాడి బాగు మడతపెట్టి ఉంది. “వై ఆర్యూ టేకింగ్ దిస్ ? ఇటీజ్ మైన్” అనగానే. ఓ ఈజ్ దిస్ యువర్స్ అని అక్కడనుంచి జారుకున్నాడు స్టేషన్ రావడంతో. ఓ పది నిముషాలు మేమిద్దరమూ ముఖ ముఖాలు చూసుకోవడమే. అప్పటికి కానీ ఈ లోకంలోకి రాలేకపోయాము. వాడి దగ్గర ఏ గన్నుంటుందో అని చెప్పి వాడిని ఆపను కూడా ఆపలేదు. పోన్లే మన బాగు దొరికింది కదా అని నిట్టూర్చాము. అలా ఉంటాయి మరి…

మొత్తనికెలా అయితే ఇలాంటివెన్నో ప్రహసనాలు ఈ రైలు ప్రయాణంలో నాకెదురయ్యాయి. అవన్నీ రాస్తే ఓ పుస్తకమే అవుతుంది. ఇప్పటికే ఈ టపా చేతాడంత తయారయింది. ఉంటా ఇక సెలవు…