మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు.
ఇక చూసుకోండి మీరెందులో ఇముడుతారో ?

సినిమా సినిమానే:

వీరు అందరి కంటే ఎక్కువగా సినిమాలను ఎంజాయ్ చేస్తారేమో. సినిమా అంటే వీరికి ఒక వినోద సాధనం. అంతే. అంతకన్నా అందులో లాజిక్కులు పట్టవు, కథ ఉందా ? వేల మందిని ఆలోచింపచేస్తుందా ? అసలు సినిమా తీయడానికి దర్శకుడికి ఒక కారణం ఉందా ? లాంటి ప్రశ్నలు వీరిని వేధించవు.

కావలసినంత వినోదం ఉందా, డాన్సులు కత్తిలా ఉన్నాయా, హీరోయిను బాగా చూపించిందా, హీరో వంద మందిని ఇరగదీసాడా, నాలుగు పంచి, మాసు డయిలాగులు చెప్పాడా ?
వీరు సినిమాని చక్కగా ఆనందించేస్తారు.

కృష్ణ, శివాజీ లాంటి సినిమాలు చూసినా వీరు దానిని హిట్టనగలరు. సుఖ పురుషులు.
ఓ తమిళమ్మాయిని/మళయాళమమ్మాయిని పెట్టి, దానిని ఒసే, ఏమే, నీకు పొగరే… అని పిలిపిస్తే ఉంటుంది నా సామిరంగా.

పాతొక వింత కొత్తొక రోత:

వీరు పురాతన కాలంలో మాత్రమే నివసిస్తుంటారు. వీరికి సినిమా అంటే పాత సినిమాలు మాత్రమే. కొత్త సినిమా బాగుందని వీరికి చెప్పండి. ఛా! అలా కుదరదు అని అనేస్తారు.

ఆహా! మిస్సమ్మ, గుండమ్మ కథ, రాముడు భీముడు. మిగతావన్నీ అసలు సినిమాలేనా ?

సినిమాలు వివిధ రకాలు, కాలంతో పాటు అవి తీసే తీరు మారతాయని వీరికి చెప్పండి. ఊహూ…
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ! అని మాత్రమే వీరికి తెలుసు. కాలంతో పాటు మార్పులని వీరు అందుకోలేరు. వీరి కాలం వీరిదే.

లాహిరి లాహిరి లాహిరిలో… ఉండండి ఎక్కడో మాయాబజారు వస్తున్నట్టుంది.

ఏవీ మంచి సినిమాలు ?

ఇంగ్లీషా ? తెలుగా ? హిందీనా ? ఏదయితే నాకే మంచి సినిమానా ? నేను చూస్తాను.
వీరు ఈ రకం. భాష గానీ, కాలం గానీ, మార్పు గానీ వీరికి అడ్డంకి కాదు.

వీరికి కావలసిందల్లా ఒక మంచి సినిమా. సరయిన కథ, మంచి నటన, దర్శకత్వం, కెమేరా పనితనం ఉన్నాయా ? అయితే ఆ సినిమా చూసి తీరాల్సిందే.

ఐఎం డీబీ టాప్ 250 లిస్టులు, రాటెన్ టొమేటోస్ బెస్టాఫ్ లిస్టులూ వీరి పట్టుగొమ్మలు.

మంచి సినిమా రాగానే టారెంట్లు వెతకడం వీరు చేసే మొదటి పని, ఎందుకంటే అన్ని సినిమాలూ థియేటర్లో చూడలేము కదా !

ఓ ఇవాళ ఆదివారం కదూ, నేను రోడ్డు పక్కన డీవీడీల వేట మొదలెట్టాలి. ఇక ఉంటాను.

నా భాషా ?

సినిమా నా భాషా కాదా ?

వేరేదయినా అయితే ఆ… అప్పుడే ఆవలింతలొచ్చేస్తున్నాయేంటి ?

హు. జనాలకి అసలు మన భాషంటే ఇష్టం పోయింది. చక్కగా డయిలాగులూ అవీ అర్థమవుతుంటే ఇవి చూడక వచ్చీ రాని ఇంగ్లీషు, చైనీసు ఎందుకో ? ఏమి చెప్తాము ? అని వాపోతుంటారు.

శనివారం, ఆదివారం మా టీవీ, ఈ టీవీ, జెమిని, తేజ ఎప్పుడు ఎందులో ఏ సినిమా వేసినా, ఖాళీగా ఉంటే ఆ సినిమా చూడాల్సిందే.

అరె! ఇక్కడేదో “పోరంబోకు పెంట నాయాల” సినిమా మొదలయింది. తర్వాత మాట్లాడుకుందాం.

క్రిటిక్ని/విశ్లేషకుణ్ణి మాత్రమే నేను:

సినిమాలో కెమేరా ఏ కోణంలో పెట్టి తీసాడు ? అసలు లైటింగు ఈ కాంతిలో మాత్రమే ఎందుకుంది ?
దర్శకుడు ఈ సీను ఇలా ఎందుకు తీసాడు ? ఇలా తీస్తే బాగుండేదే ?

ఎబ్బే… ఈ హీరో అసలు సుమోలని గాలిలో ఎగరెయ్యడం ఏమీ బాగోలేదు. ఏమన్నా నాచురాలిటీ ఉందా అందులో ?

సినిమా అన్నాక నిజానికి దగ్గరలో ఉండొద్దూ. ఒక క్లాసికల్ టచ్ ఉండొద్దూ. దర్శకుడి ప్రతిభ, కెమెరా పనితనం కనబడొద్దూ ?

రోషొమోన్ , సెవెన్ సమురాయ్, గాడ్ ఫాదర్ చూడు. అవీ అసలు సినిమాలంటే.

ఈ జనాలకు అసలు టేస్టు లేకుండా పోతుంది. ఏ చెత్త సినిమా మొహాన పడేయి చూసేస్తారు. నాలుగు పాటలు, ఆరు ఫైట్లు, ఓ ప్రేమ కథ వీళ్ళ మొహాన పడేయి. సినిమాని సూపరు హిట్టు చేసేస్తారు. ఇలాగయితే అయినట్లే. మన *లీవుడ్, హాలీవుడ్ గట్రాని అందుకునేదెప్పుడు అని ఓ మథన పడిపోతారు.

వీరు సినిమాని సరిగా ఆనందించలేరేమో కూడాను అనిపిస్తుంది. అంత తీక్షణంగా గమనిస్తే సినిమా బదులు సీన్లు మాత్రమే కనిపిస్తాయేమో ?

అన్నట్టు గురూ ఎక్కడయినా “సైకో” కలెక్టర్సు ఎడిషను దొరుకుతుందా ?

ఇక ఆఖరు

నా సినిమా హీరో, ఆహా ఓహో …:

వీరి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు.

మన అభిమాన సినిమా హీరో నటించాడా ? అయితే జల్సా కూడా సల్సానే.
*రెడ్డి, *నాయుడు అన్నీ అద్భుతమయిన కళాఖండాలు. ఈ హీరో తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ వేయలేని కారెక్టర్లు.

అరె… బ్లాగులలో కూడా నా హీరో అభిమాన సంఘాలున్నాయా ? నేను వెంటనే అందులో చేరిపోవాలి.
జై ఫలానా! జై జై ఫలానా !!

రే ఎవడ్రా అక్కడ నా అభిమాన హీరో సినిమా బాగాలేదని రాసింది. వేలి గోటితో నరికేస్తా….