బ్లాగులెందుకు నెమ్మదిగా లోడవుతున్నాయి ?

ఈ మధ్య Read/Write Web లో అనుకుంట ఒక మంచి వ్యాసం చూసా. జావాస్క్రిప్ట్ ఎలా వెబ్ ని నెమ్మదించేస్తుందో అని.

మనందరికీ అనుభవమే మన బ్లాగులు స్లో గా లోడవున్నాయి. మన వీక్షకులు అప్పుడప్పుడూ ఫిర్యాదు చేస్తున్నారు కూడా.
ఎందుకు మన బ్లాగులన్నీ స్లో అవుతున్నాయి ? అని పై పైన విశ్లేషిస్తే ఈ కింది విషయాలు అర్థమవుతాయి.

మనం ఉపయోగించే విడ్జెట్లు, జావస్క్రిప్ట్లు.
విపులంగా చూద్దాము. బ్లాగు మొదలెట్టగానే ముందు మనకు తెలుసుకోవాలనిపించేది ఏంటి ?
మన బ్లాగుకు ఎంత మంది వీక్షకులు అనే కదా. మనమేం చేస్తాం ? sitemeter, లేదా statcounter వంటి సైట్లకు వెళ్ళి ఓ కోడ్ (ఎక్కువగా జావాస్క్రిప్టే) తెచ్చుకుని మన బ్లాగులలో జతచెయ్యడం.
భలే ఇక మనకు అంకెల గారడీ కనిపిస్తుంది.

కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుంది ? ఆయా సైట్లకు మన వీక్షకుల గురించి ఎలా తెలుస్తుంది ?
మనం తెచ్చుకునే కోడ్ ఏం చేస్తుందంటే ఓ జావాస్క్రిప్ట్ ని మన బ్లాగులో ఉంచుతుంది. అది మన వీక్షకుల గురించి, పేజీ లోడ్ల గురించి సర్వర్ కి చేరవేస్తుంది. ఇంకొన్ని జావాస్క్రిప్టులయితే ఇంకో పెద్ద జావాస్క్రిప్ట్ ని తెచ్చుకుని మరీ ట్రాక్ చేస్తాయి.

అదే కాక statcounter లాంటివయితే మీ క్లిక్కులు మీకు కనిపించకుండా కుకీలుంచుతాయి. ఇక రిక్వస్ట్ మీ సిస్టం నుంచి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కుకీ కోసం వెతుకుతాయి. కుకీ లేకపోతే సృష్టిస్తాయి. ఇవన్నీ మీరు పేజీ లోడ్ చేసిన ప్రతీ సారి జరుగుతాయి.

ఇది కేవలం ఒక్క వీక్షకుల నంబర్ల కోసమే.

కానీ మనం కేవలం వీటితో ఊరుకోవడం లేదు. అందరికీ ఇప్పుడు వెబ్ అనలటిక్స్ గురించి తెలుసు. ఎలాంటివంటే Google Analytics, MyBlogLog, మొదలయినవన్నమాట.

ఇవన్నీ మీ వీక్షకుల నంబర్లే కాక వారు ఎక్కడ నుంచొస్తున్నారు ? ఏ బ్రౌజర్ వాడుతున్నారు ? మీ వెబ్‌సైట్లో ఏ లంకె మీద క్లిక్కుతున్నారు ? ఏ డొమెయిన్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు ? ఎలాంటి రిజల్యూషన్ ? ఏ లంకె నుంచి బయటకు వెళుతున్నారు ? లాంటి వివరాలన్నీ సేకరిస్తారు.
ఇవన్నీ చెయ్యాలంటే మరి సమయం పడుతుంది కదా ?

మళ్ళీ ఇవన్నీ మనం ఒక్క టూల్ తోనే ఊరుకోము కదా రెండు మూడు ఉపయోగిస్తాము. మరి ఇవన్నీ వాటి వాటి పనులు చెయ్యాలంటె సమయం పడుతుంది కదా.

సరే ఇవి ఒక ఎత్తయితే మనం ఉపయోగించే విడ్జెట్లన్నీ ఒక ఎత్తు. అంటే ఉదాహరణకి మీరు ఏదయినా వెబ్‌సైట్ నుంచి ఫీడ్ ని చూపించాలనుకున్నారనుకోండి, లేదా ఓ ఛాట్ విండో, లేదా ట్విట్టర్ నుంచి మీ స్టేటస్, ఫేస్‌బుక్ నుంచి మీ ప్రొఫయిల్, MyBlogLog విజిటర్లూ చూపించాలనుకున్నారనుకోండి ఇవన్నీ విడ్జెట్లన్నమాట. ఇవి ఆయా వెబ్‌సైట్ల నుంచి సమాచారాన్ని తెచ్చి మీ బ్లాగులోనో మీ వెబ్‌సైట్ లోనో చూపిస్తాయి. వీటన్నిటికీ సమయం పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మీ డొమెయిన్ లోనో లేక మీ బ్లాగు డొమెయిన్ లోనో హోస్ట్ చెయ్యబడలేదు.

ఇక ఇంకో రకమయిన భారం మనముపయోగించే బ్లాగు టెంప్లేట్లు, చిత్రాలు మొదలయినవి. మీ టెంప్లేట్లలో ఉన్న చిత్రాలు మొదలయినవి గనక ఇతర సైట్ల నుంచి లింక్ చెయ్యబడితే ఆ సైట్ల స్పీడ్ కూడా మీ సైటు స్పీడ్ పై ప్రభావం చూపుతుంది. అలాగే మన రేటింగ్ సాఫ్ట్‌వేర్, సర్వే సాఫ్ట్‌వేర్, ప్రీవ్యూ చూపించే snap preview లాంటివి కూడా బాండ్‌విడ్త్ తింటాయి.

జావాస్క్రిప్ట్ లోనే అంతర్గతంగా ఉండే సమస్యలు కూడా ఓ కారణమని చదివాను. కొన్ని విడ్జెట్లు బెస్ట్ ప్రాక్టీసులు ఫాలో అవరు. ఎలాంటివంటే మీ పేజీ లోడయిన తరవాత వారి పనులు చేసుకోవడం వంటివన్నమాట. ఇది కూడా ఆ వ్యాసంలో ఉంది. దాని లంకె ఇదుగో.

అందుకనే మరి నా బ్లాగు లో విడ్జెట్లన్నీ తొలగించాను. ఇంతకు ముందు గూగుల్ రీడర్ లో నుంచి నా షేర్డ్ ఐటెంస్ మొదలయినవి ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఇంకా అనలటిక్స్ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే నాకందుకే వర్డ్‌ప్రెస్ అంటే ఇష్టం. మన సొంత హోస్టింగ్ అయితే గానీ ఎక్కువగా జావాస్క్రిప్టులూ, విడ్జెట్లూ వగయిరా ఉంచడం వీలుకాదనుకుంట. అందుకనే అవి ఉన్నంతలో క్లీన్ గా ఉంటాయి.