సెప్టెంబర్ 3, 2008

గూగుల్ క్రోమ్ – విహరిణుల విపణిలో సరికొత్త ఎంట్రీ …

Posted in క్రోమ్, గూగుల్, టెక్నాలజీ, విహరిణి, సాంకేతికం, technology వద్ద 5:42 సా. ద్వారా Praveen Garlapati

ఇన్నాళ్ళూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ మధ్య సాగుతున్న విహరిణుల పోటీ నిన్నటితో సరికొత్త మలుపు తిరిగింది.

కొంత మంది ఊహించినట్టు, ఇంకొంత మంది ఊహించనట్టూ గూగుల్ నిన్న క్రోమ్ అనే ఒక సరికొత్త ఓపెన్ సోర్స్ విహరిణిని విడుదల చేసింది.

దీనికి ప్రేరణ గూగుల్ చెబుతున్న ప్రకారం ఒక సరికొత్త విహరిణిని స్క్రాచ్ నుంచి తయారు చెయ్యడం. అంటే దీని డిజైన్, ఆర్కిటెక్చరు అన్నీ కొత్తగా దేని మీదా ఆధారపడకుండా తయారు చెయ్యడం. (ఫైర్‌ఫాక్స్ నెట్‌స్కేపు కోడు బేసు నుంచి తయారయిందని అందరికీ తెలుసనుకుంట)
అలాగే ఇప్పటి విహరిణులలో ఉన్న సమస్యలని అధిగమించడానికీ, ఇప్పటి వెబ్ కి తగినట్టూ తీర్చిదిద్దటం.

ఇక దీంట్లో ప్రత్యేకంగా ఏమున్నాయో చూద్దాము:

౧. లుక్స్ : అన్నిటికన్నా మొదటిగా ఇందులో నేను గమనించింది విహరిణిలో ఎంత ఎక్కువ స్థలం ఉపలబ్ధంగా ఉందో. క్రోమ్ లో టూల్‌బార్ లేదు, స్టేటస్‌బార్ లేదు. ఉన్నదల్లా టాబులు మాత్రమే.
ప్రతీ టాబుకీ విడివిడిగా వాటికి సొంతమయిన యూఆర్‌ఎల్ బారు, పేజీకల బారు ఉంది. దానితో మనకి ఎక్కువ స్క్రీను స్పేసు కనిపిస్తుంది.
అనవసరంగా ఎక్కువ స్థలాన్ని ఉపయోగించకుండా, జాజీగా కాకుండా గూగుల్ స్టైల్లో దీనిని సింపుల్ గా తీర్చిదిద్దారు. అయితే మరీ ప్లెయినుగా ఉండి కొందరికి నచ్చ్కపోవచ్చు కూడా.

. టాబులు: టాబులలో కొత్తేముంది. అన్ని విహరిణులలోనూ ఉన్నాయి. ఐఈ ౭ తో దాంట్లోనూ వచ్చి చేరాయి. ఇక ఓపెరా, ఫైర్‌ఫాక్స్ లలో అయితే మొదటి నుంచీ ఉన్నాయి.
మరి ఇందులో ప్రత్యేకత ఏముంది ?
మీరు వాడే విహరిణులలో మీరు అప్పుడప్పుడూ గమనించి ఉంటారు. ఒక టాబులో చూపించే వెబ్‌పేజీ గనక భారంగా ఉండి స్టక్ అయితే మొత్తం విహరిణినే మూసి మళ్ళీ తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే క్రోమ్‌లో దీనిని కొంత మేరకు మార్చగలిగారు.
ఇందులో మొత్తం విహరిణి ఒక ప్రాసెసుగా కాక, ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా డిజైని చేసారు. అందుకని ఒక టాబులో గనక సమస్య తలెత్తితే దానిని మాత్రమే మూసివేసి మిగతావాటిని అలాగే ఉంచుకోవచ్చు.

. ప్రతీ టాబూ ఒక కొత్త ప్రాసెసు: మొత్తం విహరిణి ఒకే ప్రాసెసుగా కాక ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా చూడడం వల్ల లాభాలున్నట్టే నష్టాలూ ఉండవచ్చు. వాడుకలో నేను గమనించిందేమిటంటే మెమురీ వాడకం ఎక్కువగా ఉంది.
ఉదా: అవే వెబ్‌సైట్లు వివిధ టాబులలో ఫైర్‌ఫాక్స్, ఓపెరా, క్రోమ్, ఐఈ లో తెరిస్తే క్రోమ్ అన్నిటికన్నా ఎక్కువగా మెమొరీ వాడుతుంది నా సిస్టంపైన.
అందుకని డిజైను పరంగా ఇది మంచి నిర్ణయమే అయినా నిజానికి మీ సిస్టముని నెమ్మది చేయవచ్చు.

. జావాస్క్రిప్టు: జావాస్క్రిప్టు మరీ అంత స్ట్రక్చర్డ్ లాంగ్వేజీ కాదు. కాబట్టి దానికి సంబంధించి చాలానే సమస్యలు ఉన్నాయి. అయితే క్రోమ్ లో v8 అనే జావాస్క్రిప్టు ఇంజనుని వాడుతున్నారు. ఇది ఒక VM. జావాస్క్రిప్టుని కంపైల్ చేసి మెషీన్ లాంగ్వేజీలోకి తర్జుమా చెయ్యడంవల్ల వెబ్‌పేజీలు త్వరగా లోడవుతాయని గూగుల్ ఉవాచ.

. వేగం: క్రోమ్‌లో చాలా ఆప్టిమైజేషన్లు చేసామనీ ఇంకా కొత్త జావాస్క్రిప్టు ఇంజిను వాడటం వల్ల పేజీలు వేగవంతంగా లోడవుతాయనీ చెబుతున్నారు. ఇది కొంతవరకూ నిజంలగే ఉంది. నే వాడినంతలో పేజీలు వేగంగానే లోడవుతున్నాయి. దాదాపు ఓపెరాలో అయినంత వేగంగానో, అంతకంటే వేగంగానో లోడవుతున్నాయి.

. అన్నిటికీ ఒకే అడ్రసు బారు: ఫైర్‌ఫాక్స్ ౩ తో మొదలయింది ఆసం పట్టీ. (ఇది మీరు ఇంతకు ముందు వెళ్ళిన వెబ్‌పేజీలనీ, వాటి కంటెంటునీ, మీ పేజీకలనీ అన్నిటినీ కలిపి వెతుకుతుంది) క్రోమ్ ఇవన్నీ చేస్తుంది. అలాగే దానితో పాటు దీనిని గూగుల్ సజెస్ట్‌తో అనుసంధానించారు. కాబట్టి మీరు దేనికోసమయితే వెతుకుతున్నారో దానికి సంబంధించిన సజెషన్లను గూగుల్ సజెస్టు నుంచి అందిస్తుంది.
అలాగే ఇది కొంత తెలివయిన సెర్చ్ ఏర్పాటుని కూడా కలిగుంది. మామూలుగా అయితే మీరు యూఆర్‌ఎల్ బారులో టైపు చేసిన టెక్స్టుని గూగుల్‌లో చెతుకుతుంది. అయితే మీరు ఏదయినా వెబ్‌సైటుకి వెళ్ళి దానికో సెర్చ్ బాక్సు ఉంటే మాత్రం దానిని వాడే ఏర్పాటు ఇందులో ఉంది.

ఎలాగంటే ఉదాహరణకి మీరు cnn.com కి వెళ్ళారనుకోండి. ఆ వెబ్‌సైటులో ఒక సెర్చ్ బాక్సు ఉంటుంది వెతకడానికి. అందుకని మీరు మీ యూఆర్‌ఎల్ బారులో cnn.com అని టైపు చేసి టాబు కొడితే మీరు గూగుల్ కి బదులుగా cnn.com లో సెర్చ్ చెయ్యవచ్చు.

. స్పీడ్ డయల్: ఓపెరాలో స్పీడు డయల్‌లు ఉంటాయి. ఇవేమిటంటే మీరు ఒక కొత్త టాబుని గనక తెరిస్తే మీకు ఒక తొమ్మిది స్పీడు డయళ్ళు కనిపిస్తాయి. దాంట్లో మీరు తరచూ వాడే వెబ్‌సైట్లు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్త టాబు తెరవగానే సమయం వృధా కాకుండా వాటిని నొక్కితే వెంటనే ఆయా సైట్లకి వెళ్ళిపోవచ్చు.
ఇలాంటిదే క్రోమ్‌లో కూడా ఉంది. అయితే ఇందులో స్పీడు డయళ్ళు ఆటోమేటిగ్గా మీరు తరచూ వెళ్ళే వెబ్‌సైట్లుగా సెట్ చెయ్యబడి ఉంటాయి. మీరు సెట్ చేసుకోలేరు. మీరు ఇంతకు ముందు బ్రౌజ్ చేసిన చరిత్రని బట్టి వీటి ఎంపిక ఉంటుంది.

. ప్రైవేటు బ్రౌజింగు: కొన్ని సార్లు మీరు వెళ్ళిన వెబ్‌సైట్ల వివరాలు బ్రౌజరులో నిక్షిప్తం కాకుండా ఉండాలని మీరు కోరుకోవచ్చు. (ఉదా: పోర్న్ కోసం చూసేవారు) ఎందుకంటే మీ ఆసం పట్టీలో లేదా స్పీడు డయళ్ళలో ఆయా సైట్లు కనిపిస్తే మీకు ఇబ్బంది కలగవచ్చు. సాధారణంగా అయితే మీరు మీ విహరిణి కాష్ (cache) ని తుడిచివెయ్యడమో లేదా చరిత్రని తుడిచివెయ్యడమో చేస్తుంటారు. అయితే దానివల్ల మిగతా చరిత్ర వివరాలన్నీ కూడా తుడుచుకుపోతాయి.
అలా కాకుండా మీరు ప్రస్తుతం బ్రౌజ్ చేస్తున్న టాబుని మాత్రమే విహరిణి చరిత్రలో రాకుండా “Incognito” అనే ఒక కొత్త మోడ్‌ని క్రోమ్ లో ప్రవేశపెట్టారు. మీ దానిని ఎంపిక చేసుకుంటే ప్రైవేటుగా బ్రౌజ్ చెయ్యవచ్చన్నమాట.

. సెక్యూరిటీ: ఇతర విహరిణులలో ఉన్నట్టే ఇందులోనూ సెక్యూరిటీ బాగుంది. మీరు “ఫిషింగ్” లేదా స్పైవేరు ఉన్న వెబ్‌సైట్లకి వెళితే క్రోమ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
అలాగే సర్టిఫికెట్లు ఎక్స్పైర్ అయిన లేదా సరిపోలని వెబ్‌సైట్లకి వెళ్ళినా ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

౧౦. దిగుమతులూ, అప్లికేషన్లూ: ఇక క్రోమ్ లో దిగుమతులూ సులభమే. ప్రస్తుతం అవుతున్న దిగుమతిని “పాజ్” చేసి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి కానివ్వచ్చు. అలాగే దీనికి స్టేటస్ బార్ ఉండదు కానీ దిగుమతి అవుతున్న ఫైలుని అవుతున్నంత సేపూ ఆ స్థలంలో చూపిస్తుంది. పూర్తయిన తర్వాత ఆ ఫైలుని మీకు కావలసిన ప్రదేశానికి మార్చుకోవచ్చు.
అలాగే ఫైర్‌ఫాక్స్ “ప్రిజ్మ్” లాగా దీనినుంచి ఒక్క టాబు మాత్రమే ఉండే అప్లికేషన్లూ కూడా సృష్టించుకోవచ్చు.

౧౧. తెలుగు: క్రోమ్‌లో తెలుగుకి మద్దతు ఉంది. మీ విహరిణి ప్రధానమయిన భాషగా తెలుగుని పెట్టుకోవచ్చు. అలాగే తెలుగు యూనీకోడుని బాగానే చూపిస్తుంది. అయితే బరహ, అక్షరమాల వంటి ఉపకరణాలు ఇందులో సరిగా పని చెయ్యట్లేదు. అలాగే అక్కడక్కడా “Unjustified text” సమస్య చూసాను నేను.
ఇంకా పద్మ, indic input extension లాంటి జోడింపులు ఇందులో వాడలేము.
చిత్రంగా ఈనాడు డైనమిక్ ఖతిని ఇది బానే చూపిస్తుంది. ఆంధ్రజ్యోతిని సరిగా చూపించట్లేదు.

పైనవి స్థూలంగా ఇందులో విశేషాలు. ఇన్నొవేషను పరంగా ఫీచర్లను చూస్తే పెద్దగా కొత్తేమీ లేదు. (ఉంటే డిజైను పరంగా ఉండవచ్చు). ప్రస్తుతం ఉన్న ఇతర విహరిణులలో నుంచి మంచి ఫీచర్లన్నిటినీ ఒక దగ్గర పోగు మాత్రం చేసారు.

అయితే సరికొత్త విహరిణి తయారు చెయ్యవలసిన అవసరం గూగుల్ కి ఏముందని ప్రశ్నిస్తే దీనికి వేరే కారణాలు ఎక్కువుండచ్చనిపిస్తుంది. ముందు ముందు గూగుల్ అప్లికేషన్లని ప్రమోట్ చేసుకునేందుకు వీలుగా దీనిని తయారు చెయ్యవచ్చు లేదా మీ బ్రౌజింగు డాటాని మాకందిస్తే మీకు తగినట్టు మీరు విహరిస్తున్నప్పుడు మీకు కావలసినట్టు అంతర్జాలాన్ని కస్టమైజు చేస్తామని చెప్పవచ్చు. అలాగే మొబైలు మీద ఈ విహరిణిని ప్రస్తుతం ఉన్న ఓపెరా మినీ, ఐఈ లకి ప్రత్యామ్నాయంగా ఉంచవచ్చు.

ప్రస్తుతానికయితే ఇది ఇంకో విహరిణి మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఫైర్‌ఫాక్స్ కంటే తక్కువలో ఉంది ఇది. ఎందుకంటే దీంట్లో జోడింపుల సౌకర్యం లేదు. ఫైర్‌ఫాక్స్ బలమంతా అందులోనే ఉంది. కాబట్టి అలాంటిదేదో గూగుల్ చెయ్యాల్సిందే.
నాకయితే ఏదో బ్రౌజ్ చేసుకోడానికి బాగానే ఉన్నా ప్రస్తుతానికి ఫైర్‌ఫాక్స్ ఇచ్చిన సౌకర్యం ఇది ఇవ్వట్లేదని అనిపిస్తుంది. కానీ గూగుల్ కున్న హైపుని బట్టి దీనికి మంచి మార్కెటే ఉండవచ్చు.
అలాగే మొత్తం స్క్రాచు నుంచి తయారు చేసామని చెబుతున్నా ఆపిల్ వారి వెబ్‌కిట్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ నుంచి కోడుని వీరు వాడారు. కాబట్టి అందులో ఏమన్నా సమస్యలుంటే అవి వీటిలోకీ రావచ్చు.

ఏదయితే ఏమిటి. మనకి దీని దయవల్ల ఇంకొక మంచి విహరిణి వస్తే సంతోషమే…

సెప్టెంబర్ 8, 2007

ఒపెరా – విహరిణి విపణిలో అండర్‌డాగ్ …

Posted in ఒపెరా, కెస్ట్రెల్, టెక్నాలజీ, విహరిణి వద్ద 6:05 సా. ద్వారా Praveen Garlapati

ఒపెరా – అంటే ఓ సంగీత నాటకం.

కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఒపెరా విహరిణి (browser) గురించి. ఈ విహరిణి అంటే నాకు ఎంతో గౌరవం.
అవును నేను మంటనక్క (firefox) వాడతాను, అది నాకిష్టం. కానీ ఒపెరా అంటే నాకు చాలా గౌరవం. దానికి కారణం కూడా లేకపోలేదు.

నేను ఒపెరా ని ఉపయోగించడం దాదాపు ఓ నాలుగయిదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను.
అప్పట్లోనే దాంట్లో టాబ్ లు ఉండేవి. ఓ మూడు సంవత్సరాల క్రితం మంటనక్క వచ్చినప్పుడు జనాలు టాబ్ ల గురించి అబ్బురపడటమే ఒపెరా మార్కెటింగ్ లో ఎంతగా విఫలమయిందో చెబుతుంది.
నిర్ద్వంద్వంగా ఒపెరా అన్నిటికన్నా వేగవంతమయిన విహరిణి. అయినా జనాల ఆదరణ ఎక్కువగా దక్కలేదు.
దానికి ముఖ్య కారణం మొదట్లో ఇది ఉచితం కాకపోవడమే. ఉచిత వర్షన్లో పైన ఓ ఆడ్ బానర్ ఉండేది. అది చికాకు కలిగించేది.

నాకు ఒపెరా అంటే ఎందుకంత గౌరవమో దీంట్లో ఉన్న ఫీచర్లు చూస్తే తెలుస్తుంది. ఎన్నో విహరిణులలో లేని ఫీచర్లు ఇందులో ఏ ఆడాన్లు లేకుండానే లభ్యం.

* మెయిల్ క్లయింట్
* న్యూస్‌గ్రూప్ క్లయింట్
* ఐఆర్సీ క్లయింట్
* బిట్ టోరెంట్ క్లయింట్
* నోట్స్ అప్లికేషన్
* విడ్జెట్లు

ఇన్ని ఫీచర్లతోనూ ఇది తక్కువ మెమోరీ తీసుకుంటుంది. వేగవంతంగా పని చేస్తుంది.
చాలా మంచి ఇన్నోవేషన్లు చేస్తారు ఈ విహరిణి తయారీదారులు.

ఏ ఇతర విహరిణి లోనూ లేని కొన్ని ప్రత్యేకమయిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఈ మధ్య విడుదలయిన కెస్ట్రెల్ అనే ఆల్ఫా బిల్డ్ లోనివి. కెస్ట్రెల్ అద్భుతంగా ఉంది.

* స్పీడ్ డయల్: ఒపెరా లో మీరు ఓ కొత్త టాబ్ తెరవగానే మీకు తొమ్మిది చిన్న కిటికీలు కనిపిస్తాయి. అందులో ఒక్కో కిటికీలో ఒక వెబ్ పేజీ ని సెట్ చేసుకోవచ్చు. ఆ కిటికీలనే స్పీడ్ డయల్ అంటారు. అందులో సెట్ చేసిన వెబ్ పేజీల స్నాప్ షాట్ ఆ స్పీడ్ డయల్ లో కనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవుతుంది. కాబట్టి మీకు కావలసిన పేజీలు ఓ క్లిక్కు దూరం మాత్రమే. అదీ కాక ఆ వెబ్ పేజీ తెరవకుండానే దానిని చూడచ్చు.
* మౌస్ జెస్చర్స్: మీ మౌస్ తో బ్రౌజింగ్ చర్యలని నియంత్రించవచ్చు. ఉదా: రైట్ క్లిక్కు, లెఫ్ట్ క్లిక్కు చేస్తే మీ ఇంతకు ముందు పేజీ కి వెళతారు.
* వాయిస్ బ్రౌజింగ్: వాయిస్ కమాండ్లతో బ్రౌజ్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు.
* కంటెంట్ బ్లాకర్/పాపప్ బ్లాకర్: ఇది మంట నక్క ఆడ్ బ్లాక్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ ఆడ్లను, అక్కర్లేని ఫ్లాష్ కంటెంటు నూ బ్లాక్ చెయ్యవచ్చు. అలాగే పాపప్ లని ఆటోమాటిగ్గా బ్లాక్ చేసేస్తుంది.
* టాబ్ ప్రీవ్యూ: మీరు ఏ టాబ్ మీదయినా మీ మౌస్ ని ఉంచితే ఆ వెబ్ పేజీ ప్రీవ్యూ కనిపిస్తుంది.
* సింక్రనైజేషన్ (కెస్ట్రెల్ ఫీచర్): ఇది గూగుల్ బ్రౌజర్ సింక్, లేదా ఫాక్స్‌మార్క్స్ లాంటి ఫీచర్. దీని ద్వారా మీ పేజీకలు (bookmarks) అన్నీ మీ ఒపెరా విహరిణుల మధ్య సింక్రనైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక సిస్టం మీద సేవ్ చేసుకున్న పేజీకలను ఎక్కడయినా సరే పొందవచ్చు. అలాగే మీ స్పీడ్ డయల్స్ కూడా.
* హిస్టరీ సెర్చ్ (కెస్ట్రెల్ ఫీచర్): మీరో వెబ్ పేజీ చూసారు. అందులో ఏదో కంటెంట్ కోసం వెతికారు. తరవాత అదే పేజీ కి మళ్ళీ వెళ్ళాలనుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ సెర్చ్ చేసో లేదా హిస్టరీ లోని పేజీలను ఒక్కోటీ వెతికో చేరుకోవాల్సుంటుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ హిస్టరీ లో కేవలం లంకెలనే కాకుండా పేజీ కంటెంటు ని కూడా ఇది గుర్తుంచుకుంటుంది. కాబట్టి మీరు వెతకాలంటే చాలా ఈజీ. కంటెంట్ ని ఇట్టే పట్టెయ్యవచ్చు. అంతే కాక మీరు మీ URL bar లో టైప్ చేసిన పదాలను కూడా అప్పటికప్పుడు వెతికేస్తుంది ఆ హిస్టరీ లో. చాలా సౌకర్యం కదూ.

మరందుకే చెప్పింది ఈ విహరిణి అంటే నాకెంతో గౌరవం అని. ఈ ఫీచర్లే కాకుండా వేగం లో దీనికి సాటి రాగలిగే బ్రౌజర్లు తక్కువే అని చెప్పాలి.

అంతా బానే ఉంది కానీ దీనితో వచ్చిన చిక్కులంటారా ?
* డెవలపర్స్ సాధారణంగా ఈ బ్రౌజర్ కోసం టెస్ట్ చెయ్యడం తక్కువే ఎందుకంటే దీని మార్కెట్ ఎక్కువ కాదు కాబటి.
* జావాస్క్రిప్ట్, అజాక్స్ తో దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి.
* దీనికి కూడా అన్‌జస్టీఫై సమస్య ఉంది.

అన్నట్టు ఇందులో తెలుగు బాగానే కనిపిస్తుంది కానీ మీకు డీఫాల్ట్ సెట్టింగులలో తెలుగక్షరాలు చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే ఇందులో డీఫాల్ట్ గా ఏరియల్ ఫాంట్ ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు ప్రిఫరెన్సస్ లో ఫాంట్స్ కి వెళ్ళీ అక్కడ ఇంటర్నేషనల్ ఫాంట్స్ లో తెలుగు ఎంచుకుని గౌతమి ఫాంట్ ని ఎంచుకోండి. చక్కగా కనిపిస్తుంది.