ఖుదా కే లియే …

ఖుదా కే లియే” అన్న పాకిస్తానీ సినిమా భారతంలో విడుదలయిందని విన్నాక చూద్దామనుకున్నాను. అదీ సినిమా బాగుందని కొందరు చెప్పడంతో ఎదురు చూసాను చూడడానికి.

ప్రదీపు సమీక్ష చదివిన తరువాత ఇక ఎలాగయినా చూడాలనుకుంటే ఆఖరికి నిన్న కుదిరింది.
నాకు బాగా నచ్చింది సినిమా. పాకిస్తానీ సినిమా అనగానే పెద్ద అంచనాలు లేకుండా చూసాను (ముందే ఏర్పరచుకున్న అభిప్రాయం పాకిస్తానీ సినిమాలు బాగుండవని.)

ఇది నేను చూసిన మొదటి పాకిస్తానీ సినిమా. సినిమాలో పాకిస్తానీ యువకులు టెర్రరిజం వైపు ఎలా మొగ్గు చూపుతారో, 9/11 తర్వాత అమెరికాలో పరిస్థితులు ఎలా మారాయో, పరదేశాన ఉన్న ఎనారై కుటుంబాలు తమ ఐడెంటిటీ కోల్పోకుండా ఉండడానికి ఎలా మథన పడతారో వివరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

సినిమా ఒక మెంటల్ అసైలం లో మొదలవుతుంది. ఆ పేషెంటు ఇక బాగుపడే పరిస్థితి లేదనీ, డిపోర్టు చెయ్యబడుతున్నాడనీ చెబుతారు. అక్కడ నుంచి ఫ్లాష్ బాకులో సినిమా నడుస్తుంది. సినిమా ఒక ముగ్గురి జీవితాలని వివిధ కోణాలలో చూపుతుంది.

మొదటిది సర్మద్ అనే ఒక పాప్ సింగర్ గురించి. బాగా పేరు సంపాదించుకుంటున్న ఆ యువకుడు ఎలా ముస్లిం ఎక్స్ట్రీమిస్టుల వైపు ఆకర్షితమయ్యాడో చూపుతాడు. మత ప్రబోధకుని వేషంలో జనాల మదిలో విష బీజాలను నాటే కుహనా వాదుడయిన ఒక మౌల్వీ అతడిని బాగా ప్రభావితం చేస్తాడు. సంగీతం అనేది చెడు అని, ఇస్లాం దానిని అనుమతించదని, ఇంకా తెల్ల వాళ్ళ మీద, జిహాదీ మీద చెడు ఆలోచనలనూ అతడి మెదడులో నాటుతాడు.
ఇక అక్కడి నుంచి ఆ యువకుడు వారితో చేరి ఎలా తన జీవితాన్ని పాడుచేసుకుంటాడో మనకు చూపిస్తాడు దర్శకుడు. మతం పేరిట జనాలను ఎలా రెచ్చగొట్టి తీవ్రవాదులుగా మారుస్తారో మనకు చూపిస్తాడు.

తర్వాత అతని అన్న మన్సూర్ ది ఇంకో కథ. సంగీతం నేర్చుకోవడానికి అమెరికా వెళతాడు అతను. అతను అక్కడున్నప్పుడే‌ 9/11 సంభవిస్తుంది. ఆ తరువాత అక్కడి జనాలు పాకిస్తానీలను ఎలా విలన్లు గా చూసారో, ఏమీ తెలీని అమాయకులను కూడా ఎలా వేధించారో చెబుతాడు.
జనాలను ఒకే గాటన కట్టి అందరు పాకిస్తానీలు తీవ్రవాదులేననీ, అందరూ చెడ్డవాళ్ళనీ చూడకూడదని చూపిస్తాడు.

There are bad people in Pakistan and there are good people.
There are bad people in America and there are good people.
But because of a few bad people you can’t blame everybody.

అదీ దర్శకుడు ఈ కథ ద్వారా చెప్పదలచుకున్నది.

ఇక మూడో కథ మేరీ అనే ఒక అమ్మాయిది. ఆమె తండ్రి ఎనారై, ఒక ఇంగ్లీషు అమ్మాయితో కలిసి జీవిస్తుంటాడు. పెద్ద హిపోక్రట్. తను చేస్తే తప్పు లేదు కానీ తన కూతురు ఒక తెల్లవాడిని ప్రేమిస్తే మాత్రం తన పాకిస్తానీ కమ్యూనిటీ లో పేరు పోతుందని భయపడతాడు.
అందుకని తన కూతురిని నమ్మించి భారతానికి తీసుకువచ్చి బలవంతంగా సర్మద్ తో పెళ్ళి చేసేస్తాడు. వదిలించేసుకుంటాడు. సర్మద్ మతం ముసుగులో తను పెళ్ళి చేసుకుంటే ఒక యువతిని ముస్లిం కుటుంబంలో నుంచి బయటకు వెళ్ళకుండా కాపాడుతున్నాననే భ్రమలో ఉంటాడు. ఇక ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.

ఈ మూడు కథలు ఎలా అంతమయ్యాయన్నదే ఈ సినిమా…

తరాల అంతరం, మత మౌఢ్యం, ఎనారైల హిపోక్రటిస్ట్ మెంటాలిటీ ఈ సినిమాలో ఆద్యంతం చక్కని అల్లికలో కనిపిస్తుంది. కొన్ని చోట్ల మనల్ని ఆలోచింపజేస్తుంది.

ఉదా: మనలో చాలా మందికి పాకిస్తాన్ అంటే చెడు అనే భావనే. ఆ దేశాన్నీ, ప్రజల్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తాము. (ఆ దేశంలో భారతాన్నీ అంతే). కానీ కొందరు చెడ్డవాళ్ళ వల్ల అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నామా ? అసలు మంచే చూడలేకున్నామా ?

మతం అనే పేరిట కొన్ని చెడు సాంప్రదాయాలను, మౌఢ్యాన్నీ సమర్థిస్తున్నామా ?

మన వరకూ సరయిన కొన్ని మన భావి తరాలకు సరిగా అన్వయించలేకపోతున్నామా ?

ఇలా అనేక ప్రశ్నలను ఈ సినిమా లేవదీస్తుంది. కొన్ని విషయాలు ఆలోచించదగ్గవి. నవతరంగంలో మహేష్ అన్నట్టు సినిమాలో కొన్ని సందర్భాలని మన భారతానికీ అన్వయించుకోవచ్చు. సినిమాకి తప్పకుండా పాకిస్తాన్ లో చిక్కులు ఎదురయుంటాయి.

చూడదగిన సినిమా. చక్కని నటన, సంగీతం, దర్శకత్వం. సంగీతం పరంగా ఫ్యూజన్ లో రూపొందించిన “బందియా హో” అనే పాట నన్ను అమితంగా ఆకట్టుకుంది. చక్కని సంగీతం సినిమాకి ప్లస్సయింది. ఇంకా సూఫీలో ఉన్న మరొక పాట కూడా బాగుంది.

కుదిరితే తప్పకుండా చూడండి…