డిసెంబర్ 6, 2008

దస్విదానియా – ఒక చూడదగిన సినిమా !

Posted in దస్విదానియా, వినయ్ పాఠక్, సినిమా, సినిమాలు వద్ద 5:47 సా. ద్వారా Praveen Garlapati

జూన్ 22, 2008

రెఢీ బాగుంది …

Posted in రెఢీ, సినిమా, సినిమాలు వద్ద 5:21 సా. ద్వారా Praveen Garlapati

చాన్నాళ్ళ తర్వాత థియేటరులో ఒక తెలుగు సినిమా చూసాను. “రెఢీ

హీరో రామ్‌, హీరోయిన్ జెనీలియా. ఇక కమేడియన్లు బ్రహ్మానందం, సునీల్, ఇంకా చాలా మంది.
సరదాగా ఉంది. కామెడీ బాగుంది. రామ్‌ డాన్సు చక్కగా చేసాడు.

కథలో పెద్ద నావెల్టీ గురించి చూడకండి. ఎందుకంటే కొంత ఢీ, దిల్ లాంటి సినిమాల టైపులో ఉంటుంది.
కానీ బాగుంది. సరదా సరదాగా చూసి ఆనందించడానికి అనువయిన సినిమా.

ముఖ్యంగా కామెడీ చక్కగా ఉంది. వల్గారిటీ లేదు.
సునీల్ పాత్ర కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నా, అసభ్యంగా అయితే లేదు.

కథ గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. హీరో అమ్మాయిలను లెపుకెళ్ళి స్నేహితులతో పెళ్ళి జరిపించే బాపతు.
అలా పొరపాటున ఇంకెవరి బదులో మన “జెనీలియా” ని ఎత్తుకొచ్చి కష్టాల్లో పడతాడు. అక్కడ నుంచి దిల్, ఢీ స్టయిల్లో ఎలా నెట్టుకొచ్చాడో అన్నదే కథ.

రామ్‌ నటించిన దేవదాసు అయితే నేను చూడలేదు కానీ జగడం చూసాను. ఆ సినిమా పెద్ద నచ్చకపోయినా యాక్షన్ బానే ఉంది అనిపించింది. ఈ సినిమాలోనూ బాగుంచి యాక్షన్.
అలాగే డాన్సు బాగా చేసాడనిపించింది. ఫైట్లు షరా మామూలే కొంత గాల్లోనూ, కొంత జారడంలోనూ.

పాటలు సుమారుగా ఉన్నాయి. పెద్దగా చెప్పుకునేందుకేమీ లేదు.

హాయిగా చూసి మరచిపోయే సినిమా. “పాండురంగడు” మహత్యానికి జడిసిన సినీ జనాలకి ఊరటనిస్తుంది.

రేటింగు: 3.5/5

జూన్ 8, 2008

ఖుదా కే లియే …

Posted in ఖుదా కే లియే, సమీక్ష, సినిమా, సినిమాలు వద్ద 5:10 సా. ద్వారా Praveen Garlapati

ఖుదా కే లియే” అన్న పాకిస్తానీ సినిమా భారతంలో విడుదలయిందని విన్నాక చూద్దామనుకున్నాను. అదీ సినిమా బాగుందని కొందరు చెప్పడంతో ఎదురు చూసాను చూడడానికి.

ప్రదీపు సమీక్ష చదివిన తరువాత ఇక ఎలాగయినా చూడాలనుకుంటే ఆఖరికి నిన్న కుదిరింది.
నాకు బాగా నచ్చింది సినిమా. పాకిస్తానీ సినిమా అనగానే పెద్ద అంచనాలు లేకుండా చూసాను (ముందే ఏర్పరచుకున్న అభిప్రాయం పాకిస్తానీ సినిమాలు బాగుండవని.)

ఇది నేను చూసిన మొదటి పాకిస్తానీ సినిమా. సినిమాలో పాకిస్తానీ యువకులు టెర్రరిజం వైపు ఎలా మొగ్గు చూపుతారో, 9/11 తర్వాత అమెరికాలో పరిస్థితులు ఎలా మారాయో, పరదేశాన ఉన్న ఎనారై కుటుంబాలు తమ ఐడెంటిటీ కోల్పోకుండా ఉండడానికి ఎలా మథన పడతారో వివరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

సినిమా ఒక మెంటల్ అసైలం లో మొదలవుతుంది. ఆ పేషెంటు ఇక బాగుపడే పరిస్థితి లేదనీ, డిపోర్టు చెయ్యబడుతున్నాడనీ చెబుతారు. అక్కడ నుంచి ఫ్లాష్ బాకులో సినిమా నడుస్తుంది. సినిమా ఒక ముగ్గురి జీవితాలని వివిధ కోణాలలో చూపుతుంది.

మొదటిది సర్మద్ అనే ఒక పాప్ సింగర్ గురించి. బాగా పేరు సంపాదించుకుంటున్న ఆ యువకుడు ఎలా ముస్లిం ఎక్స్ట్రీమిస్టుల వైపు ఆకర్షితమయ్యాడో చూపుతాడు. మత ప్రబోధకుని వేషంలో జనాల మదిలో విష బీజాలను నాటే కుహనా వాదుడయిన ఒక మౌల్వీ అతడిని బాగా ప్రభావితం చేస్తాడు. సంగీతం అనేది చెడు అని, ఇస్లాం దానిని అనుమతించదని, ఇంకా తెల్ల వాళ్ళ మీద, జిహాదీ మీద చెడు ఆలోచనలనూ అతడి మెదడులో నాటుతాడు.
ఇక అక్కడి నుంచి ఆ యువకుడు వారితో చేరి ఎలా తన జీవితాన్ని పాడుచేసుకుంటాడో మనకు చూపిస్తాడు దర్శకుడు. మతం పేరిట జనాలను ఎలా రెచ్చగొట్టి తీవ్రవాదులుగా మారుస్తారో మనకు చూపిస్తాడు.

తర్వాత అతని అన్న మన్సూర్ ది ఇంకో కథ. సంగీతం నేర్చుకోవడానికి అమెరికా వెళతాడు అతను. అతను అక్కడున్నప్పుడే‌ 9/11 సంభవిస్తుంది. ఆ తరువాత అక్కడి జనాలు పాకిస్తానీలను ఎలా విలన్లు గా చూసారో, ఏమీ తెలీని అమాయకులను కూడా ఎలా వేధించారో చెబుతాడు.
జనాలను ఒకే గాటన కట్టి అందరు పాకిస్తానీలు తీవ్రవాదులేననీ, అందరూ చెడ్డవాళ్ళనీ చూడకూడదని చూపిస్తాడు.

There are bad people in Pakistan and there are good people.
There are bad people in America and there are good people.
But because of a few bad people you can’t blame everybody.

అదీ దర్శకుడు ఈ కథ ద్వారా చెప్పదలచుకున్నది.

ఇక మూడో కథ మేరీ అనే ఒక అమ్మాయిది. ఆమె తండ్రి ఎనారై, ఒక ఇంగ్లీషు అమ్మాయితో కలిసి జీవిస్తుంటాడు. పెద్ద హిపోక్రట్. తను చేస్తే తప్పు లేదు కానీ తన కూతురు ఒక తెల్లవాడిని ప్రేమిస్తే మాత్రం తన పాకిస్తానీ కమ్యూనిటీ లో పేరు పోతుందని భయపడతాడు.
అందుకని తన కూతురిని నమ్మించి భారతానికి తీసుకువచ్చి బలవంతంగా సర్మద్ తో పెళ్ళి చేసేస్తాడు. వదిలించేసుకుంటాడు. సర్మద్ మతం ముసుగులో తను పెళ్ళి చేసుకుంటే ఒక యువతిని ముస్లిం కుటుంబంలో నుంచి బయటకు వెళ్ళకుండా కాపాడుతున్నాననే భ్రమలో ఉంటాడు. ఇక ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.

ఈ మూడు కథలు ఎలా అంతమయ్యాయన్నదే ఈ సినిమా…

తరాల అంతరం, మత మౌఢ్యం, ఎనారైల హిపోక్రటిస్ట్ మెంటాలిటీ ఈ సినిమాలో ఆద్యంతం చక్కని అల్లికలో కనిపిస్తుంది. కొన్ని చోట్ల మనల్ని ఆలోచింపజేస్తుంది.

ఉదా: మనలో చాలా మందికి పాకిస్తాన్ అంటే చెడు అనే భావనే. ఆ దేశాన్నీ, ప్రజల్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తాము. (ఆ దేశంలో భారతాన్నీ అంతే). కానీ కొందరు చెడ్డవాళ్ళ వల్ల అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నామా ? అసలు మంచే చూడలేకున్నామా ?

మతం అనే పేరిట కొన్ని చెడు సాంప్రదాయాలను, మౌఢ్యాన్నీ సమర్థిస్తున్నామా ?

మన వరకూ సరయిన కొన్ని మన భావి తరాలకు సరిగా అన్వయించలేకపోతున్నామా ?

ఇలా అనేక ప్రశ్నలను ఈ సినిమా లేవదీస్తుంది. కొన్ని విషయాలు ఆలోచించదగ్గవి. నవతరంగంలో మహేష్ అన్నట్టు సినిమాలో కొన్ని సందర్భాలని మన భారతానికీ అన్వయించుకోవచ్చు. సినిమాకి తప్పకుండా పాకిస్తాన్ లో చిక్కులు ఎదురయుంటాయి.

చూడదగిన సినిమా. చక్కని నటన, సంగీతం, దర్శకత్వం. సంగీతం పరంగా ఫ్యూజన్ లో రూపొందించిన “బందియా హో” అనే పాట నన్ను అమితంగా ఆకట్టుకుంది. చక్కని సంగీతం సినిమాకి ప్లస్సయింది. ఇంకా సూఫీలో ఉన్న మరొక పాట కూడా బాగుంది.

కుదిరితే తప్పకుండా చూడండి…

ఏప్రిల్ 18, 2008

మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

Posted in వర్గాలు, సరదా, సినిమా, హాస్యం వద్ద 5:27 సా. ద్వారా Praveen Garlapati

సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు.
ఇక చూసుకోండి మీరెందులో ఇముడుతారో ?

సినిమా సినిమానే:

వీరు అందరి కంటే ఎక్కువగా సినిమాలను ఎంజాయ్ చేస్తారేమో. సినిమా అంటే వీరికి ఒక వినోద సాధనం. అంతే. అంతకన్నా అందులో లాజిక్కులు పట్టవు, కథ ఉందా ? వేల మందిని ఆలోచింపచేస్తుందా ? అసలు సినిమా తీయడానికి దర్శకుడికి ఒక కారణం ఉందా ? లాంటి ప్రశ్నలు వీరిని వేధించవు.

కావలసినంత వినోదం ఉందా, డాన్సులు కత్తిలా ఉన్నాయా, హీరోయిను బాగా చూపించిందా, హీరో వంద మందిని ఇరగదీసాడా, నాలుగు పంచి, మాసు డయిలాగులు చెప్పాడా ?
వీరు సినిమాని చక్కగా ఆనందించేస్తారు.

కృష్ణ, శివాజీ లాంటి సినిమాలు చూసినా వీరు దానిని హిట్టనగలరు. సుఖ పురుషులు.
ఓ తమిళమ్మాయిని/మళయాళమమ్మాయిని పెట్టి, దానిని ఒసే, ఏమే, నీకు పొగరే… అని పిలిపిస్తే ఉంటుంది నా సామిరంగా.

పాతొక వింత కొత్తొక రోత:

వీరు పురాతన కాలంలో మాత్రమే నివసిస్తుంటారు. వీరికి సినిమా అంటే పాత సినిమాలు మాత్రమే. కొత్త సినిమా బాగుందని వీరికి చెప్పండి. ఛా! అలా కుదరదు అని అనేస్తారు.

ఆహా! మిస్సమ్మ, గుండమ్మ కథ, రాముడు భీముడు. మిగతావన్నీ అసలు సినిమాలేనా ?

సినిమాలు వివిధ రకాలు, కాలంతో పాటు అవి తీసే తీరు మారతాయని వీరికి చెప్పండి. ఊహూ…
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ! అని మాత్రమే వీరికి తెలుసు. కాలంతో పాటు మార్పులని వీరు అందుకోలేరు. వీరి కాలం వీరిదే.

లాహిరి లాహిరి లాహిరిలో… ఉండండి ఎక్కడో మాయాబజారు వస్తున్నట్టుంది.

ఏవీ మంచి సినిమాలు ?

ఇంగ్లీషా ? తెలుగా ? హిందీనా ? ఏదయితే నాకే మంచి సినిమానా ? నేను చూస్తాను.
వీరు ఈ రకం. భాష గానీ, కాలం గానీ, మార్పు గానీ వీరికి అడ్డంకి కాదు.

వీరికి కావలసిందల్లా ఒక మంచి సినిమా. సరయిన కథ, మంచి నటన, దర్శకత్వం, కెమేరా పనితనం ఉన్నాయా ? అయితే ఆ సినిమా చూసి తీరాల్సిందే.

ఐఎం డీబీ టాప్ 250 లిస్టులు, రాటెన్ టొమేటోస్ బెస్టాఫ్ లిస్టులూ వీరి పట్టుగొమ్మలు.

మంచి సినిమా రాగానే టారెంట్లు వెతకడం వీరు చేసే మొదటి పని, ఎందుకంటే అన్ని సినిమాలూ థియేటర్లో చూడలేము కదా !

ఓ ఇవాళ ఆదివారం కదూ, నేను రోడ్డు పక్కన డీవీడీల వేట మొదలెట్టాలి. ఇక ఉంటాను.

నా భాషా ?

సినిమా నా భాషా కాదా ?

వేరేదయినా అయితే ఆ… అప్పుడే ఆవలింతలొచ్చేస్తున్నాయేంటి ?

హు. జనాలకి అసలు మన భాషంటే ఇష్టం పోయింది. చక్కగా డయిలాగులూ అవీ అర్థమవుతుంటే ఇవి చూడక వచ్చీ రాని ఇంగ్లీషు, చైనీసు ఎందుకో ? ఏమి చెప్తాము ? అని వాపోతుంటారు.

శనివారం, ఆదివారం మా టీవీ, ఈ టీవీ, జెమిని, తేజ ఎప్పుడు ఎందులో ఏ సినిమా వేసినా, ఖాళీగా ఉంటే ఆ సినిమా చూడాల్సిందే.

అరె! ఇక్కడేదో “పోరంబోకు పెంట నాయాల” సినిమా మొదలయింది. తర్వాత మాట్లాడుకుందాం.

క్రిటిక్ని/విశ్లేషకుణ్ణి మాత్రమే నేను:

సినిమాలో కెమేరా ఏ కోణంలో పెట్టి తీసాడు ? అసలు లైటింగు ఈ కాంతిలో మాత్రమే ఎందుకుంది ?
దర్శకుడు ఈ సీను ఇలా ఎందుకు తీసాడు ? ఇలా తీస్తే బాగుండేదే ?

ఎబ్బే… ఈ హీరో అసలు సుమోలని గాలిలో ఎగరెయ్యడం ఏమీ బాగోలేదు. ఏమన్నా నాచురాలిటీ ఉందా అందులో ?

సినిమా అన్నాక నిజానికి దగ్గరలో ఉండొద్దూ. ఒక క్లాసికల్ టచ్ ఉండొద్దూ. దర్శకుడి ప్రతిభ, కెమెరా పనితనం కనబడొద్దూ ?

రోషొమోన్ , సెవెన్ సమురాయ్, గాడ్ ఫాదర్ చూడు. అవీ అసలు సినిమాలంటే.

ఈ జనాలకు అసలు టేస్టు లేకుండా పోతుంది. ఏ చెత్త సినిమా మొహాన పడేయి చూసేస్తారు. నాలుగు పాటలు, ఆరు ఫైట్లు, ఓ ప్రేమ కథ వీళ్ళ మొహాన పడేయి. సినిమాని సూపరు హిట్టు చేసేస్తారు. ఇలాగయితే అయినట్లే. మన *లీవుడ్, హాలీవుడ్ గట్రాని అందుకునేదెప్పుడు అని ఓ మథన పడిపోతారు.

వీరు సినిమాని సరిగా ఆనందించలేరేమో కూడాను అనిపిస్తుంది. అంత తీక్షణంగా గమనిస్తే సినిమా బదులు సీన్లు మాత్రమే కనిపిస్తాయేమో ?

అన్నట్టు గురూ ఎక్కడయినా “సైకో” కలెక్టర్సు ఎడిషను దొరుకుతుందా ?

ఇక ఆఖరు

నా సినిమా హీరో, ఆహా ఓహో …:

వీరి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు.

మన అభిమాన సినిమా హీరో నటించాడా ? అయితే జల్సా కూడా సల్సానే.
*రెడ్డి, *నాయుడు అన్నీ అద్భుతమయిన కళాఖండాలు. ఈ హీరో తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ వేయలేని కారెక్టర్లు.

అరె… బ్లాగులలో కూడా నా హీరో అభిమాన సంఘాలున్నాయా ? నేను వెంటనే అందులో చేరిపోవాలి.
జై ఫలానా! జై జై ఫలానా !!

రే ఎవడ్రా అక్కడ నా అభిమాన హీరో సినిమా బాగాలేదని రాసింది. వేలి గోటితో నరికేస్తా….

జనవరి 14, 2008

నక్షత్రాలు భూమి మీద …

Posted in అమీర్ ఖాన్, తారే జమీన్ పర్, సినిమా, సినిమాలు, cinema, movie, taare zameen par వద్ద 8:38 సా. ద్వారా Praveen Garlapati

నక్షత్రాలు భూమి మీద…

అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా…
ఎంతో బాగుంది. నాగరాజు గారి బ్లాగులో నా వ్యాఖ్య చూస్తేనే నాకు సినిమా బాగా నచ్చిందని తెలుస్తుంది 🙂

ఈ కాలంలో సినిమాలు ఎంచుకోవడం లో, నిర్మించడంలో విభిన్నంగా ఉన్నాడంటే అది ఒక్క అమీర్ ఖానే. నేను అతనికో పెద్ద పంఖాని.

అమీర్ ఖాన్ సినిమాలన్నిటిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. విషయముంటుంది. (ప్రత్యేకమయిన విషయం లేని “దిల్ చాహ్తా హైన్ ” నా ఫేవరెట్టనుకోండి)
లగాన్, రంగ్ దే బసంతీ, ఇప్పుడు తారే జమీన్ పర్…

ఈ సినిమా “డిస్లెక్సియా” ఉన్న ఒక కుర్రాడి గురించి. కానీ ఈ సినిమా కేవలం దాని గురించే కాదు.
డిస్లెక్సియా వల్ల చదవడంలోనూ, విషయాలను ఆకళింపు చేసుకోవడంలోనూ ఇబ్బందులెదురవుతాయి. కానీ అది నయం కాని వ్యాధి కాదు.
డిస్లెక్సియా ఉన్న వారు మిగతావారికంటే ఎక్కువ సమయం తీసుకుంటారు అంతే.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఒక చిన్న కుర్రాడు ఈ వ్యాధి వల్ల ఎలాంటి పరిస్థితులెదురుకున్నాడు, దానిని జయించి ఎలా విజయం సాధించాడు అనేదే.
కానీ వ్యాధి విషయం పక్కన పెట్టినా సినిమా అర్థవంతంగానే ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో పిల్లల మీద ఉన్న ఒత్తిడి అలాంటిది.

మొదటిది కాలంతో పాటూ పరిగెత్తడం. ఒక్క నిముషం లేటయితే, ఆగితే మిగతా వారు ముందుకెళ్ళిపోతారు.
అలా జరగకూడదని తల్లిదండ్రులు పిల్లలను అలా తోస్తూనే ఉంటారు. అది ఆ పిల్లలు సహించగలరా ? లేదా ? అనేది పట్టట్లేదు.
అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొంత మంది బ్రిలియంట్లు ఒక్కసారి చదవగానే పట్టెయ్యగలుగుతారు. కొంత మంది పది సార్లు చదివి మననం చేసుకుంటే గానీ ఎక్కించుకోలేరు.
మరి రెండో వాడిని నువ్వు మొదటివాడిలా ఎందుకు లేవు ? అలా తయారవు అని తోస్తే ?
శక్తికి మించిన దానికోసం అనవసర ఒత్తిడి తెస్తే అది చిన్న వయసులోనే వారికి డిప్రెషను వంటివి కలిగిస్తుంది.

ఆ… ఇదంతా ట్రాష్ అని కొట్టి పారెయ్యడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్య వచ్చే వార్తలు చూడండి ఒకసారి.
రాంకులు రాకపోతే ఆత్మహత్య. మార్కులు తక్కువొస్తే ఆత్మహత్య. ఇంకొన్ని సార్లు ఆ కోపం ఇతరుల మీద చూపించడం.
వాడి వల్లనే కదా నాకు తిట్లు పడుతున్నాయి. వాడే లేకుండా చేస్తే ? ఇలాంటి విపరీతమయిన ఆలోచనలు పిల్లల్లో కలుగుతున్నాయి.

అలాగని పిల్లలను చదవకుండా గారాలు చెయ్యమని ఎవరూ అనట్లేదు. కాకపోతే దేనికయినా ఓపిక అవసరం.
అదీ ముఖ్యంగా పిల్లలతో. వారికి నచ్చచెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాలి కానీ, దండించి కాదు.

ఇంత అద్భుతమయిన తల్లిదండ్రులు అండగా ఉంటేనే నాకు అప్పుడప్పుడు ఆ ఒత్తిడి ఉంటుంది.
ఇక మరి అలా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులుంటే ?? ఆ పిల్లల సంగతి ?

“పీర్ ప్రెషర్” అనేది కేవలం పెద్ద వారికే కాదు. పిల్లలకీ ఉంటుంది.
కాబట్టి వీటన్నిటినీ జయించి ఒక మంచి మనసున్న మనిషిగా ఎదగాలంటే పిల్లల మీద తల్లిదండ్రుల పాత్ర ఎంతయినా ఉంది.

ఆ విషయమే అమీర్ ఖాన్ ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు.
చాలా మటుకు సఫలమయ్యాడు.

పైన చెప్పిన వాటన్నిటితో పాటూ ప్రస్తుతం ఉన్న ఇంకొక సమస్య ఆల్టర్నేట్ కెరీర్స్ లేకపోవడం. (ఈ విషయం గురించి ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడాను నా బ్లాగులో…)
ఒకవేళ మనం మాథ్స్, సైన్సులలో పూరుగా ఉండి ఆర్ట్సు లో బాగా రాణిస్తున్నామనుకోండి. అయినా మనకు వేరే దిక్కు లేదు.
చివరికి వచ్చి కెరీరు ఆ రెండిటిలోనే. నీకు నచ్చింది చెయ్యడం కాదు. అవసరం ఉన్న దానికోసం నిన్ను నువ్వు మార్చుకోవడం.
అదే జరుగుతోంది ప్రస్తుత పరిస్థితులలో.

అది ఎంత మాత్రం మంచిది కాకపోయినా ప్రస్తుత పరిస్థితిలో అంతకన్నా ఏర్పాటు లేదు.
మరి నచ్చినదాన్ని చెయ్యకపోతే మరి ఆ పనిని సరిగా ఎలా చేయగలుగుతాము ? మొక్కుబడిగా తప్ప.

ఇలాంటి సొసయిటీలో వీటితో పాటు చదవటం, రాయడంలో ఇబ్బందులు ఎదురయితే ?? మరి అప్పుడు ఆ పిల్లాడిలో కలిగే మానసిక సంఘర్షణ ఊహాతీతం.
“ఇషాంత్ అవస్తీ” అనే అలాంటి ఒక కుర్రాడిని ప్రోత్సాహించి, అతనిలో ఉన్న కళను వెలికి తీసే “నికుంభ్”. వీరిద్దరి కథ ఈ “తారే జమీన్ పర్”.

సినిమా కథ కాబట్టి చివరికి ఎలాగో ఆ అబ్బాయి విజయం సాధిస్తాడనుకోండి. కానీ నిజ జీవితంలో అలా సాధించగలిగే వారు ?
లేరని కాదు. సినిమాలో చెప్పిన ప్రఖ్యాతి గాంచిన వారే గాక ఇంకెందరో దీని బారిన పడ్డారు. కానీ జీవితంలో పోరాడి గెలిచారు.
మామూలు వ్యక్తులకి సాధించలేనిది సాధ్యం చేసి చూపించారు.

దేనికయినా పట్టుదల అవసరం. ప్రోత్సాహం అవసరం.
ఆ రెండూ కలిస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు.

ఈ నిజాన్నే చెప్పిన సినిమా “తారే జమీన్ పర్” ని తప్పకుండా చూడండి.

మరికొన్ని విషయాలు:

కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము.
కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం.
అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి.

సినిమాలో నటన పరంగా “దర్శీల్ సఫరి” అద్భుతంగా నటించాడు.
“అమీర్ ఖాన్” గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ఇంట్రడక్షనే ఇంటర్వెల్ తర్వాత అవుతుందంటే మీరు ఊహించుకోవచ్చు. ఈ సినిమా అమీర్ ఖాన్ కంటే పెద్దదని.
ఈ సినిమాలో హీరో అంతర్లీనంగా చూపిన నిజాలు….

నిజంగా భూమి మీద వెలసిన నక్షత్రం ఈ సినిమా…

డిసెంబర్ 29, 2007

12 angry men …

Posted in 12 angry men, సినిమా, సినిమాలు, cinema వద్ద 8:23 సా. ద్వారా Praveen Garlapati

నిన్న 12 angry men అనే అద్భుతమయిన సినిమా చూసాను.
చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమా ఒక కోర్టు కేసులో జూరీ యొక్క వాదోపవాదాలకి సంబంధించినది.

సినిమా కథ గురించి చెప్పుకునే ముందు జూరీ పద్ధతి గురించి కొంత చెప్పుకోవాలి.
జూరీ అంటే ఒక పన్నెండు(కొన్ని దేశాలలో పదిహేను) మందితో కూడిన ఒక టీము. కొన్ని కోర్టు కేసులలో తీర్పు వెలువరించడానికి జూరీ సహాయం కోరుతుంటారు.
జూరీ లో ఉండడానికి జనాల ఎంపిక జరుగుతుంది. అందులో ఎలాంటి ఒపీనియనేటెడ్ కాకుండా, ప్రీజుడిస్ లేకుండా ఉన్న జనాలను ఎంచుకుంటారు.
ఏదయినా కేసులో జూరీ ని ఉపయోగించాలనుకున్నప్పుడు అలా ఎంచుకున్న వారిలోంచి పన్నెండు మందిని రాండం గా పిలుస్తారు.
వీరి నుండి ఆశించేది అన్‌బయాస్డ్ గా తీర్పు వెలువడించాలని.

కొన్ని తీర్పులకు జూరీ ఏకమొత్తంగా గిల్టీ (నిందితుడు తప్పు చేసాడు), నాట్ గిల్టీ (నిందితుడు తప్పు చెయ్యలేదు) అనే ఉండాలి. మధ్యస్తంగా ఉండకూడదు అంటే పది మంది గిల్టీ, ఇద్దరు నాట్ గిల్టీ అని ఉండకూడదు. అలా ఉంటే ఇంకో జూరీ ని నియమించి మళ్ళీ విచారణ జరిపిస్తారు.

అసలు ఈ జూరీ ఉండడానికి కారణం జనాలకు ఒక రిజర్వు బెంచ్ మెంబర్ల మీద నమ్మకం లేకపోవడమే. ఇలా జూరీ ని ఎంపిక చేసి వారి చేత తీర్పు వెలువడిస్తే అది నిజాయితీ గా ఉంటుందని ఒక భావన. ఎంత వరకూ సక్సస్ అయిందో అనేది నాకు తెలీదు.
కానీ ఈ జూరీ లలో ఎంపిక చేసిన జనాలు అన్ని వేళలా హానెస్టుగా ఉండరు.

జూరీ కి ఒక నిబంధన ఏమిటంటే వారికి సంపూర్ణంగా విశ్వాసం కలిగితే కానీ ఒక నిర్ణయానికి రాకూడదు, ఎందుకంటే ఇది ఒక మనిషి జీవితానికి సంబంధించినది కాబట్టి.

* భారతం లో కూడా జూరీ పద్ధతి ఉండేదని, ఒక కేసు తరవాత ఆ పద్ధతి నిలిపివేయబడిందని తెలుసుకుని ఆశ్చర్యం కలిగింది.

అదీ జూరీ గురించి.

ఇక సినిమా సంగతికొస్తే సినిమా మొదట్లో ఒకతను తన తండ్రి ని చంపిన కేసులో నిందితుడిగా విచారింపబడుతుంటాడు.
దానికి జూరీ నియమింపబడుతుంది. ఆ జూరీ హంగ్ నిర్ణయం ఒప్పుకోబడదని జడ్జీ చెబుతాడు.
అక్కడ నుంచి ఆ పన్నెండు మంది జూరీ ఒక గదిలో ఉండి ఒక తీర్పుకి రావడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.

మొదట సాక్ష్యాలు చూసి ఆ పన్నెండు మందిలో ఒక్కరు తప్ప అందరూ గిల్టీ అని నిర్ణయిస్తారు.
అక్కడ నుంచి ఎలా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు అనేదే సినిమా కథ.

ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం లాజికల్ రీజనింగ్.
రెండోది పొరపాటున కూడా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అని ఒక్కడు పడే తపన.
ఆ ఒక్కడు కోర్టు అంటే గౌరవం, లా పట్ల నిబద్ధత చూపించి మిగతా వారిని తన రీజనింగుతో కన్విన్సు చెయ్యడం.

చూడదగిన సినిమా.

డిసెంబర్ 8, 2007

మన సినిమాలు, తారల డాన్సులు …

Posted in డాన్సు, సినిమా, సినిమాలు వద్ద 7:34 సా. ద్వారా Praveen Garlapati

మన సినిమాలలో ఎంత లేదన్నా నాకు నచ్చేది డాన్సులు పాటలు. ఇతర భాషలలో వచ్చే సినిమాలలో కథ, కథనం, ఆక్షన్ అన్నీ ఉన్నా డాన్సులు, పాటలు మాత్రం ఉండవు. అవన్నీ కావాలంటే వారు ఏ రాక్ షో కో, పాప్ షో కో వెళ్ళాలి. కానీ మనకవి మన సినిమాలలో పాకేజీ అయి వస్తాయి.

మంచి కాలక్షేపం కోసం సినిమాకి వెళ్ళే వారికి (అందులో నేనూ ఉన్నా) డాన్సులు, పాటలు ఎంతో ముఖ్యం.
నాకు మంచి డాన్సులున్న పాటలు చూడడమంటే ఎంతో ఇష్టం. డాన్సులను దగ్గరగా ఫాలో అవు ఎవరెలా చేస్తారో.

మన స్టారుల వైపు ఓ లుక్కేస్తే

చిరంజీవి: డాన్సనగానే చిరు తో తప్ప ఇంకెవరితో మొదలెడతాము. ఆ డాన్సులో ఉన్న ఈజు ఇంకెవరికీ లేదు. పాటకు తగ్గ స్టెప్పులు వెయ్యడంలో ఆయనకి ఆయనే సాటి. తొలి నాటి చిత్రాల నుంచీ ఇప్పటి లేటెస్టు చిత్రాల వరకూ డాన్సులో తన విశిష్టత నిలుపుకుంటూ వచ్చాడు చిరంజీవి. అప్పటి బ్రేక్ డాన్సు నుంచి ఇప్పటి సరదా పాటల వరకూ డాన్సు అదరగొడుతూనే ఉన్నాడు.
అలాగే ఆయన తనకు తగిన డాన్సు డైరెక్టర్లను కూడా ఎంచుకుంటాడు. ఇప్పుడయితే లారెన్స్ కి ఫిక్సయిపోయాడు. లారెన్సు వీణ స్టెప్పు ఎంత ప్రాచుర్యం పొందిందో నే చెప్పవలసిన అవసరం లేదనుకుంట. ఈ చక్కని జోడీ ఎన్నో చక్కని స్టెప్పులని మనకందించిండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు లారెన్సు చేసే అవే స్టెప్పుల కంటే చిరంజీవి చేసిన స్టెప్పులే బావున్నట్టనిపిస్తాయి.
కాకపోతే ఈయన మీద నాకు కొన్ని కంప్లెయింట్లు ఉన్నాయి. డాన్సుకి ముఖ్యమయినవి ఒకటి ఈజు, బాడీ లాంగ్వేజీ అయినా బాడీ స్ట్రక్చర్ బావుంటే దానికి అదనపు అందం వస్తుంది. ఈ మధ్య ఫిట్నెస్ విషయంలో మాత్రం చిరంజీవి దెబ్బతినేస్తున్నాడు. ఆ అదనపు అందం రావట్లేదు.

బాలకృష్ణ: బాలకృష్ణ డాన్సు పవర్ పాక్డ్. డాన్సులో స్లీక్‌నెస్ కనిపించదు. కొంత మోటు గానూ, వేషధారణ కూడా డిఫరెంటుగా ఉంటుంది. లెదర్ పాంట్లు, ఓ కాలు గ్రీను, ఇంకోటి యెల్లో లాంటివి ఉంటాయి. కొన్ని స్టెప్పులు మోటుగా, బండగా ఉన్నా డాన్సు బాగా చెయ్యాలి అనే తపన మాత్రం తప్పకుండా కనబడుతుంది.

నాగార్జున: ఈయన డాన్సులో కంపారిటీవ్లీ వీక్. అందుకే ఈయన పాటలలో చాలా మటుకు ఏ పార్టీ లో పాటలో (మన్మధుడు లో అందమయిన భామలు… టైపు), లేక స్టెప్పులు ఎక్కువగా లేని సరదా పాటలో (బోటనీ ఆట ఉంది టైపు) వో ఎక్కువుంటాయి. మరీ
కష్టమయిన స్టెప్పులెయ్యకుండా చేసినంతలో బాగానే చేస్తాడు.

వెంకటేష్: వెంకటేష్ కూడా సూపర్ స్టెప్పులు వేయ్యగా నేను చూడలా. నాలుగు ఐదు విదేశీ మోడళ్ళను వెంట పెట్టుకుని వారి మధ్యలో నడవడం (అన్ని సినిమాల్లోనూ), ఏ పూదోటలో నడుస్తూనో చలా మటుకు పాటలు లాగించేస్తాడు. మానరిజంలు చాలా రిపీటవుతూ ఉంటాయి వెంకటేష్ పాటలలో.

అల్లు అర్జున్: నాకు ఈ టైపు డాన్సంటే ఇష్టం. ప్రొఫెషనల్ టైపు అన్నమాట. చిరంజీవి నుంచి డాన్సు ని వారసత్వంగా పుచ్చుకున్నాడు. డాడీ సినిమాలో డాన్సుని రుచి చూపినా ఆర్య సినిమాతో వెలుగులోకొచ్చింది డాన్సు ప్రతిభ. మంచి ఈజు ఉంది. కానీ చిరంజీవి లా స్టెప్పులు పాటతో పాటుగా ఉండవు, కొంత తెచ్చిపుట్టుకున్న స్టెప్పులలా ఉంటాయి.

జూనియర్ ఎన్‌టీఆర్: ఈ మధ్య ఆక్టర్లలో డాన్సు మీద కొంత పట్టున్న వారిలో ఎన్‌టీఆర్ ఒకడు. ఎక్కువ మాసు స్టెప్పులే కాకపోతే. మాసు కి అప్పీల్ కావడానికే ఈయన డాన్సులు ఓరియెంటెడ్ (నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి, షేకు షకాలా… లాంటివి). కానీ చక్కని ఈజుతో, మంచి పెర్ఫార్మెన్సు ఇవ్వగలడు.

మహేష్ బాబు: ఈయన స్టెప్పులు పరవాలేదనిపిస్తాడు. కానీ ఈయన పాటలు ఎక్కువ డ్రెస్ సెన్స్ చూపించడానికీ, హెయిర్ స్టైలు హైలైటు చెయ్యడానికీ అనిపిస్తుంది. నాకు అన్ని పాటలలోకీ ఒక్కడు సినిమాలో చెప్పవే చిరుగాలి, హరే రామ… హరే రామ… పాటకు చేసిన స్టెప్పులు నచ్చుతాయి. అటు సీరియస్ స్టెప్పులు కాకుండా అప్పీలింగుగా ఉంటాయి.

ఇక ఆ కాలం నటులలో చూస్తే. రాజుల కాలం నాటి సినిమాలు వగయిరాలు వదిలేస్తే

ఎన్‌టీఆర్: కలర్ సినిమాలలో ఈయన డాన్సు పంథా చాలా డిఫరెంటు. హావభావాల మీద ఆధారపడ్డ స్టెప్పులుంటాయి. అలాగే స్ట్రాంగు స్టెప్పులు ఈయన పాటల్లో ఉండాల్సిందే. కొంత మోటు టైపే. చేతులు, కాళ్ళు బాగా ఆడతాయి ఈయన స్టెప్పుల్లో 🙂 ఎవరయినా డాన్సులకేసిన స్టెప్పులు చూడండి, ఆ చెయ్యి ముందుకు చాచి కాలు ముందు కీ వెనకకీ కదిపే స్టెప్పు తప్పక ఉంటుంది. అలా ట్రేడు మార్కు అయిపోయింది.

నాగేశ్వరరావు: నో స్టెప్పులు. ఏ బాల్కనీలో నుంచుని పాడే పాటలో, పియానో వాయిస్తూ పాడే పాటలో, అమ్మాయి వెంట పడి ఏడిపిస్తూ పాడే పాటలో ఉంటాయి. చటుక్కున గెంతులు తప్పితే ఆక్చువల్ స్టెప్పులు పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించదు.

కృష్ణ: డాన్సు గురించి మాట్లాడి, ఈయన గురించి మాటలాడకపోవడమా ? పీటీ మాస్టరు దగ్గర డాన్సు నేర్చుకొచ్చినట్టుంటాయి ఈయన స్టెప్పులు. ఆయన డాన్సు చేస్తుంటే వన్, టూ, త్రీ లు నాకు కనబడుతూ ఉంటాయి కళ్ళ ముందు. ఎక్కడ నుంచో అమ్మాయిల మధ్య నడుచుకుంటూ రావటం, లేదా ఎక్సర్సైజులు ఈయ స్టెప్పుల్లో ఎక్కువ. చలాకీగా గెంతడం కూడా ఈయన డాన్సులో భాగమే.

అదీ టూకీగా.
ఇక నాకు సంబంధించి నేను ఎంతో అభిమానించే హీరో డాన్సులో హృతిక్ రోషన్. మొదటి సినిమా ఎక్ పల్ కా జీనా తోటే నే ఫ్లాటు. దాని తరువాత లక్ష్య లో మై ఐసా క్యో హూ… సాంగు లో డాన్సు కూడా అదురుతుంది. అన్ని సినిమాలలోనూ డాన్సు అదుర్స్.

కొసమెరుపు: ఈ టపా రాస్తుంటే టీవీలో ఈ పాటొస్తుంది హిందీది. నో కామెంట్ మీరే చూసి ఎంజాయ్ చెయ్యండి.

అక్టోబర్ 10, 2007

హాపీ డేస్…

Posted in సినిమా, సినిమాలు, హాపీ డేస్ వద్ద 7:52 సా. ద్వారా Praveen Garlapati

నిజంగానే హాపీ డేస్ ని గుర్తుకు తెచ్చింది. మొన్న వీకెండ్ శనివారం సినిమా చూద్దామని కాదు కానీ కొద్దిగా షాపింగ్ చేసి టికెట్లు దొరికితే చూద్దామని ఫోరం కి వెళ్ళాము నేనూ నా నా స్నేహితుడు రమేషూ.

కసా పిసా తొక్కేసి ఎట్టకేలకు ఓ టీషర్ట్ కొన్నాము చెరోటీనీ. తరవాత పై ఫ్లోరు లో ఉన్న పీవీఆర్ కెళ్ళి చూస్తే అనుకున్నట్టుగానే టికెట్లు అయిపోయాయి అన్ని షోలకీ. సర్లే అని పక్కనే గా ఆఫీసు, వీక్ డేస్ లో అయితేనేం హాపీ డేస్ చూడచ్చు అని బుధవారానికి టికెట్లు కొనుక్కొచ్చేసాము.

పెద్దగా అంచనాలు లేకుండానే వెళ్ళా సినిమాకి ఎందుకంటే సినిమాలలో కాలేజీ రోజులనగానే చిరాకు తెప్పించేంత, వెగటు పుట్టించేంత వెధవ సీన్లు వాడతారు కాబట్టి. అయినా ఏదో నమ్మకం ఈయన మరీ చెత్తగా తీయలేడేమో అని.

గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పను గానీ ఫ్రీ ఫ్లోయింగ్ సినిమా ఇది. ఎక్కడా బోరు కొట్టించకుండా, వెకిలి వేషాలు లేకుండా, అబ్నార్మల్ గా కాకుండా తీయగలగడంలో దాదాపు ఓ ఎనభై శాతం సఫలమయ్యాడు శేఖర్ కమ్ముల. పాటలు బాగుండడం ఓ అదనం. టెక్నికాలిటీ గురించి బ్లాగు పెద్దలకు వదిలేస్తా గానీ వినసొంపుగానే ఉన్నాయి. మికీ జె మేయర్ డిడ్ ఎ గుడ్ జాబ్…

ఇక కథ విషయానికొస్తే మన కాలేజీ లైఫే. కథలో ప్రతీ కారెక్టరునూ నేను ఐడెంటీఫై చేసుకోగలిగాను నా కాలేజీ రోజులలో నుంచి. నిజం. వేరే వారికి ఎలా అనిపించిందో తెలీదు కానీ నేను మాత్రం క్లియర్ గా ఆ ట్రెయిట్స్ ని గమనించగలిగాను. కథలో పానకం లో పుడకలాగా అనిపించేది టైసన్ అనవసర ఎక్స్పెరిమెంట్లు, కమలినీ ముఖర్జీ పాత్ర (పాత్ర అసహజం కాదు కానీ తీయడంలో ఎక్కడో సరిగా రాలేదు). అది వదిలేస్తే అంతా బాగానే ఉంది. ఓ రెండున్నర గంటల పాటు సంతోషకరమయిన మన కాలేజీ రోజులలోకి వెళ్ళిపోవచ్చు. మామూలు కథ నుంచి మంచి సినిమా రాబట్టగలగడం శేఖర్ కమ్ముల గొప్పతనమే.

ఎమోషన్స్ మీద ప్లే చేసాడనీ, సేఫ్ గేం ఆడాడనీ కొంత టాక్ ఉంది. నిజమే. ఇలాంటి ఎమోషన్స్ ని తెప్పించగలిగితే సక్సస్ రావడం నిజమయినప్పటికీ అది సరిగా చేయగలిగే సత్తా కూడా ఉండాలి. కాలేజీ స్టూడెంట్ల సినిమాలంటే బీ గ్రేడ్ సినిమాలా ఊహించుకునేటంత చెత్తగా తయారు చేసారు మన దర్శకులు. ఎప్పుడూ బీర్లు తాగుతూ, ఆంటీల వెనకాల పడుతూ, అమ్మాయిలను ఏడిపిస్తూ, చెత్త వాగుడు వాగుడుతుండడమే హీరోయిజంగా ప్రోజెక్ట్ చెయ్యబడింది. ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి కానీ సరయిన మోతాదులో, నిజమని నమ్మగలిగే మోతాదులో.

ఇక శేఖర్ ఎన్నుకున్న కారక్టరైజేషన్ అద్భుతంగా ఉంది. ఇలాంటి కారెక్టర్లు సర్వ సాధారణం కాలేజీలలో. చందు లాంటి ఇగోయిస్టు, రాజేష్ లాంటి దూకుడు టైపూ, టైసన్ లాంటి ఆల్రౌండరూ, శంకర్ లాంటి ఆపర్ట్యూనిస్టు, మధు లాంటి కాజ్యువల్, సంగీత లాంటి డిస్‌హానెస్టూ, అప్పు లాంటి టాంబాయ్ అన్నీను.

ఇకపోతే శ్రవంతి, టైసన్ కథ ని ముగించిన తీరు నచ్చింది. కథ ముగింపు కూడా బాగుంది. టైసన్ ఆబ్వియస్గా నాకు నచ్చిన పాత్ర. అలాగే రాజేష్ ది కూడా. మధు పాత్రలో తమన్నా బాగుంది. చాలా అందంగా ఉంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రకారం రెండు సినిమాల తరవాత ఎలాగూ కనిపించదు లేదా ఎక్స్పోజింగు చట్రంలో చిక్కుకుంటుంది. ప్చ్…

ఈ సినిమాలో నన్ను ఐడెంటీఫై చేసుకోగలిగాను కానీ ఏ పాత్రో చెప్పను. 🙂

మొత్తానికి మంచి సినిమా, వీలయితే తప్పకుండా చూడండి. నా కలెక్షనుకి ఆడ్ చేసుకోవాలి కుదిరితే.

అన్నట్టు కాలేజీ రోజులలో అద్భుతమయిన స్నేహాన్ని గుర్తుకు తెచ్చే ఈ సినిమాని, కాలేజీ బయట అంత స్థాయిలో స్నేహితుడితో చూడటం హైలైటు 😉

రేటింగ్: 4/5

సెప్టెంబర్ 27, 2007

చిరంజీవి నీవు చిరంజీవిగా వర్ధిల్లు గాక …

Posted in చిరంజీవి, సినిమా, సినిమాలు వద్ద 8:55 సా. ద్వారా Praveen Garlapati

నాకెంతో ఇష్టమయిన చిరంజీవి సినిమాల గురించి రాద్దామనుకుంటున్నా ఇవాళ. అసలు ఇప్పుడంటే చిరంజీవి ఇలా చీపయిపోయాడు కానీ వయసులో ఉన్నప్పుడు వైవిధ్యభరితమయిన సినిమాలు చేసినప్పుడూ, ప్రతీ సినిమాలోనూ కొత్తదనం చూపించాలనుకున్నప్పుడూ మా బాగా ఉండేవాడు.

అందుకే నాకభిమాన నటుడయ్యాడు. చిరంజీవి సినిమాలంటే పడి చచ్చేవాడిని. ఆ వేష భాషలను అనుకరించాలని ప్రయత్నించేవాడిని చిన్నప్పుడు. కొంత పెద్దయ్యాక చిరంజీవి డాన్సు చూసిన ప్రతీ సారీ ఫ్లాటయిపోయేవాడిని. ఎన్నో సార్లు చేద్దామని బొక్క బోర్లా పడ్డాను కూడా. ఆ స్టెప్పులు భలే మజాగా ఉండేవి. డిస్కో, బ్రేక్ మొదలయినవి అద్భుతంగా చేసేవాడు.

అలాగని కమర్షియల్ మూసలోనే కాకుండా వైవిధ్యభరితమయిన చంటబ్బాయి, రుద్రవీణ, ఆపధ్భాంధవుడు మొదలయిన సినిమాలలో నటించాడు. కొండవీటి దొంగ, కొదమ సింహం, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, మరణ మృదంగం, స్టేట్ రౌడీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, ఖైదీ నంబర్ 786, గాంగ్ లీడర్, స్వయంకృషి, దొంగ మొగుడు, మగ మహారాజు, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, రాజా విక్రమార్క, బావగారు బాగున్నారా, ఠాగూర్, శంకర్ దాదా MBBS, ఇంద్ర అబ్బో చెప్పుకుంటే ఎంత వైవిధ్యభరితమయిన నటనా చరిత్ర ఉంది చిరంజీవికి. అలాంటి సత్తా ఉన్న వ్యక్తి టాలెంటు ఇప్పుడు వేస్టవుతుందే అని కొద్దిగా (చాలా) బాధగా కూడా ఉంటుంది నాకు. కానీ ఏం చేస్తాం. విధి రాత.

ఇక నేనిప్పుడు ఆయన సినిమాలలో నా ఛాయిస్ అయిన వాటి గురించి మాట్లాడతా:

చిరంజీవి నట జీవితంలో ప్రత్యేకమయిన ప్రస్తావన తేవలసిన సినిమాలు ఉన్నాయంటే నాకయితే రెండు స్వయంకృషి, రుద్రవీణ. మిగతా సినిమాలెన్నో నచ్చినవి నాకున్నా ఇవి మాత్రం ఎంతో ప్రత్యేకం. నా హృదయానికి దగ్గరగా ఉంటాయి ఎప్పటికీ. అసలు వీటిని ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు.

స్వయంకృషి:
ఈ సినిమా గురించి తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. అద్భుతమయిన కథ/కథనం, అంతకన్నా అద్భుతమయిన నటులు కలిస్తే ఈ సినిమా. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తయారయిన మణిపూస ఇది. ఈ సినిమాలో ఎన్నో హైలైట్లు. మొదటిది కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్పులు కుట్టే చిరంజీవి స్వయంకృషితో పైకొస్తాడు. ఎదురు దెబ్బలు తగిలినా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. సినిమా అక్కడితో ఆగితే ఇందులో గొప్పతనం ఉండేది కాదు ఎందుకంటే ఆ తరువాత జరిగే సంఘటనలే ఈ సినిమాకు ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చెడు దారిన పడతాడు ఐశ్వర్యం తో. ఆ పిల్లాడిని తిరిగి ఎలా దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడో, ఆ దారిలో నచ్చచెప్పడం, భయపెట్టడం, బుజ్జగించడం, ప్రేమించడం అన్నీ ఆకట్టుకుంటాయి.

చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రం పాటిస్తాడు. మనం “పెద్ద” అయినంత మాత్రాన సరిపోదు మన మనసు కూడా పెద్దదవాలి అని కథ చెబుతుంది. చెడు వైపుకి లొంగడం, క్షణిక సుఖాల కోసం మొగ్గడం సులభం. కానీ కృషి వల్ల వచ్చే సంతోషం దాని వల్ల రాదు అని ఎంత చక్కగా చెబుతుందో ఈ సినిమా. నేను నమ్మే సూత్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. ఓ మనిషిని అతని హోదాతోనో, అతని డబ్బుతోనో, పదవితోనో, పేరుతోనో అంచనా వెయ్యకూడదు. కృషి, పట్టుదల ముందు అన్నీ దిగదుడుపే.

ఈ సినిమాలో “సిగ్గూ పూబంతి” పాట నాకు ఇష్టమయినది.

రుద్రవీణ:
కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంకో వజ్రం ఈ సినిమా. నటనకి ఎంతో ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రలు ఈ సినిమా సొంతం. అలాంటి పాత్రలలో ఎప్పటీకీ గుర్తుండిపోయే పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఇందులో ఎన్నో అంశాలు స్పృశిస్తాడు దర్శకుడు. సంగీతం అనేది కొందరికి చెందినదిగానే మిగిలిపోకూడదు అందరికీ చెందినప్పుడే దాని గొప్పతనం అనీ, అంటరానితనం / ఉన్నత కులం, నీచ కులం అనే అసమానత రూపుమాపాలనీ, తాగుడుకి బానిస కాకూడదనీ ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు.
చిరంజీవి నటన ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళుతుంది. సూర్యం పాత్రలో ఒదిగిపోయి అసమాన నటనా ప్రావీణ్యంతో ఎన్నో భావాలు ఒలికిస్తాడు చిరంజీవి. అలాగే బిళహరి పాత్రలో సూర్యం నాన్నగా నటించిన పాత్ర కూడా ఎంతో అద్భుతమయిన పాత్ర. తన తండ్రి బిళహరి గణపతి శాస్త్రి కి పూర్తి వ్యతిరేకం సూర్యం పాత్ర. వారిద్దరి మధ్య జరిగే ఘర్షణ హైలైటు.

ఈ సినిమాలో “కదలిరాద తనే వసంతం…” నాకెంతో ఇష్టమయిన పాట. అలాగే “రండి రండి దయచేయండి…” పాట కూడా చాలా బాగుంటుంది. (పెంటమ్మ ఘట్టం గుర్తుందా అందరికీ ?)

చంటబ్బాయి:
హీరోయిజం ఉన్న చిరంజీవితో డాన్సులు, ఫైట్లు మాత్రమే కాకుండా కామెడీ చేయించిన వినూత్న చిత్రం ఇది. దీంట్లో చిరంజీవి కి ఉన్న కామెడీ టైమింగ్ స్పష్టమవుతుంది. (తన నటనలో ఉపయోగించుకోవలసినంతగా ఉపయోగించుకోలేదని నా విమర్శ). అసలు సినిమా అంతా నవ్విస్తూనే ఉంటుంది. జంధ్యాల గారి చేతిలో రూపు దిద్దుకున్న హాస్య గుళిక ఇది. “పాండ్ జేంస్ పాండ్” గా చిరంజీవి “పాండు” కారెక్టర్ తెగ నవ్విస్తుంది. అదీనూ చిరంజీవి ని చావబాదే కారెక్టర్లో అల్లు అరవింద్… హహహ.. నవ్వుల పండగే.

ఈ సినిమాలో “అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను…” పాట హిలేరియస్…

ఛాలెంజ్:
యండమూరి నవలల ఆధారంగా రూపొందించిన చిరంజీవి సినిమాల్లో ఇదొకటి. నిరుద్యోగుల మీద ప్రాక్టికల్ జోకు ప్లే చేసిన రావు గోపాల్ రావు తో చిరంజీవి యాభై లక్షలు సాధిస్తానని చాలెంజ్ చేసి గెలుస్తాడు. కథ పాతదే అయినా బాగుంటుంది.
ఆఖరి సీనులో చిరంజీవి “రామ్మోహనరావు నేనే గెలిచాను…” అరుపు నాకెప్పుడూ గుర్తుంటుంది.

ఇక మోడర్న్ సమయానికి వస్తే

జగదేక వీరుడు అతిలోక సుందరి:
అప్పటికే మెగాస్టార్ స్టేటస్ ఉన్న చిరంజీవికి జనాలలో ఇంకా ఎంతో క్రేజ్ పెంచిన సినిమా ఇది. ఫాంటసీ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి నటన అబ్బో. ఇంద్రుడి కుమార్తె అయిన శ్రీదేవి తన అంగుళీయకం భూలోకంలో పోగొట్టుకోవడం, అది మానవుడయిన చిరంజీవి కి దొరకడం, ఆ అంగుళీకాన్ని చిరంజీవి నుండి వెనక్కి తీసుకురావడం కోసం శ్రీదేవి తంటాలు బహు బాగు ఈ సినిమా. మానవా అంటూ చిరంజీవి ని సంబోధిస్తున్న శ్రీదేవి సంభాషణలు భలే ఉంటాయి.
ఈ సినిమాలో నాకు నచ్చిన పాట “అబ్బ నీ తియ్యని దెబ్బ…” 😉

ఇక ఆపుతా నోస్టాల్జిక్ మూడులోకెళ్ళిపోయా…. తీరికున్నప్పుడు మరిన్ని చిరంజీవి సినిమాల గురించి రాస్తా. చిరంజీవి పైన లాంటి చిత్రాల్లోనే నటిస్తే ఎంత బాగుండును ప్చ్…
నాకు తెలుసు చిరంజీవి ఘరానా మొగుడూ, మృగరాజు, స్టాలిన్ లాంటి చెత్త సినిమాల గురించి ఎందుకు రాయలేదు అని అడుగుతారని. ఇంత మంచి మూడు ని పాడుచేసుకోవడం ఇష్టం లేదు నాకు 🙂

ఆగస్ట్ 23, 2007

చక్ దే ఇండియా…

Posted in చక్ దే ఇండియా, షారూఖ్ ఖాన్, సినిమా వద్ద 7:17 సా. ద్వారా Praveen Garlapati

ఓకే మొదటి లైన్లోనే తీర్పు చెప్పేస్తా. మంచి సినిమా.

ముందు ఇక్కడ చెప్పుకోవాల్సింది నాకు షారూఖ్ ఖాన్ అంటే ఇష్టం లేదు. ఆ చెత్త సినిమాలు, వెధవ వేషాలు, ఫామిలీ డ్రామా అని చెప్పి కరణ్ జోహర్ వేయించే చెత్త వేషాలు అన్నీ కలిసి నాకు షారూఖ్ అంటే విముఖత కలిగించాయి. అలాగని టాలెంట్ లేదా అంటే ? ఉందీ…

మొత్తానికి అలా విసుగెత్తిన నాకు షారుఖ్ టాలెంట్ మొదటి సారిగా స్వదేశ్ లో కనిపించింది. చాలా మంచి సినిమా అది. మొదటి సారి ఓ అర్థవంతమయిన సినిమాలో నటించాడు అనిపించింది. దాని తరవాత మళ్ళీ షరా మామూలే అయినా మళ్ళీ “చక్ దే ఇండియా” సినిమాతో నే వెనక్కొచ్చా అని చెప్పాడు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇంతకు ముందు ఇలాంటి కథతో సినిమాలు వచ్చాయి. సినిమా కబీర్ ఖాన్ అనే ఓ హాకీ ఆటగాడు/కోచ్ కథ.
సినిమా ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ హాకీ మాచ్ తో మొదలవుతుంది. అందులో ఆఖరి నిముషంలో వచ్చిన పెనాల్టీ ని మిస్ చేసి కబీర్ ఖాన్ దేశ ద్రోహవుతాడు. కొద్దిగా నాటకీయంగా చూపించినా ఈ నాడు మన వార్తా చానళ్ళు చాలా మటుకు ఆ కోవకి చెందినవే. చిలువలు పలువలు చేసి చూపించడం, నోటికే చెత్త వస్తే ఆ చెత్త వాగడం, చిన్న విషయాలను పెద్దవి చెయ్యడం, అనవసర డిబేట్లు పెట్టడం మొదలయినవి. ఇవన్నీ చేసి కబీర్ ఖాన్ ని ఓ దేశ ద్రోహి లా చిత్రీకరిస్తారు.

కట్ చేస్తే ఓ ఏడేళ్ళ తరవాత కబీర్ ఖాన్ మళ్ళీ తెర మీదకొస్తాడు. అదీ ఇండియా మహిళా హాకీ టీం కోచ్‌గా పనిచెయ్యడానికి. అంత వరకూ రాష్ట్రాల వారీగా ఆడే ఆ జట్టుని ఓ తాటి మీదకి తీసుకొచ్చి, డిసిప్లిన్ నేర్పించి, అదేలేండి ఆఖరికి వరల్డ్ కప్ నెగ్గేలా చేస్తాడు. అవును కొద్దిగా ఎక్సాజరేటెడ్ గానే ఉంటుంది కథ, కానీ దానిని నడిపిన తీరుని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ కి ప్రాధాన్యత ఏమిటో నాకింతకు ముందు వరకూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలిసింది. సీన్లన్నీ చక్కగా కుదిరాయి. పాటలు లేవు. అవును నిజం. అదే కాక ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న క్రికెట్ పిచ్చి తప్ప ఇంకేదీ పట్టించుకోకపోవడం, అందులోనూ మహిళలు ఆడుతున్నారంటే దానిని చిన్న చూపు చూడడం, సెలెక్టర్ల అతి చేష్టలు, వంటి నిజాలెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అంతే కాదు వ్యక్తిగత రికార్డుల కోసం ఆట ఆడే ఆటగాళ్ళ గురించి కూడా సరిగ్గా చూపించాడు.

కానీ ఈ సినిమా ఓ డ్రీం అని చెప్పవచ్చు. ఎందుకంటె ఈ దేశంలో అలాంటి కోచ్ రానూ లేడు, అలాంటి మార్పులు జరగనూ లేవు, బాగు పడే అవకాశాలూ కనిపించట్లేదు.

మొత్తానికి ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు:

1. ఏ క్రికెట్ నో ఎంచుకోకుండా మన జాతీయ క్రీడ అయిన హాకీని కథాంశంగా ఎంచుకోవడం. (అవును ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ అని కూడా జనాలు మర్చిపోయారేమో.)

2. ఆటగాళ్ళు రాష్ట్రం తరఫున కాదు దేశం తరఫున ఆడుతున్నారు అని ఎన్నో చోట్ల గుర్తు చెయ్యడం

3. ఏ క్రీడలోనయినా సీనియర్ ఆటగాళ్ళు ఇప్పుడు టీం లో ఎలా చెలాయిస్తున్నారో చూపించడం

4. దేశం తరఫున ఆడేటప్పుడు ప్రైడ్ ఉండాలి అని చెప్పడం

5. మన మీద మనం నమ్మకం పెంచుకుని, సాధనతో, కఠోర శ్రమతో విజయం సాధించగలం అని చెప్పడం

6. సొంత రికార్డుల ఆట కాదు, ఏ ఆట అయినా జట్టు లాగా ఆడాలి అనే పాయింట్ ని పదే పదే స్ట్రెస్ చెయ్యడం

సినిమాలో ఎగస్ట్రాలు లేవా ? ఉన్నాయి. కానీ మొత్తం మీద అంతర్లీనంగా ఉన్న థీం సినిమా లో అతి ని డామినేట్ చేస్తుంది. నాకయితే నచ్చింది. కుదిరితే తప్పకుండా చూడండి. “చక్ దే ఇండియా…”

తర్వాతి పేజీ