ఆగస్ట్ 12, 2007

స్నేహమెంత మధురం….

Posted in అనుభవాలు, స్నేహం వద్ద 11:09 ఉద. ద్వారా Praveen Garlapati

కదూ… నిన్న అమ్మ ఇంట్లో లేకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. నాన్న ఏమో ఆఫీసుకెళ్ళిపోయారు. ఒక్కడినే ఉండడంతో అంతర్జాలం మీద పడ్డాను ఏమీ లేక.
అప్పుడే గుర్తొచ్చింది. నిన్న రమేష్ కి కాల్ చేస్తానని చెప్పానుగా అని. మళ్ళీ ఉత్సాహంతో రమేష్ కి కాల్ చేసాను. హహహ … వాడి ఇంట్లో మైనస్ వైఫ్ అంట. ఇంకే వచ్చెయ్యమని చెప్పా. ఇంకో గంటలో ఇంట్లో ఉన్నాడు.
అటూ ఇటూ మాట్లాడుతూ కాసేపు ఆనంద్ సినిమా చూసి, ఏదో తిన్నామనిపించి కాసేపు సినిమాలు, బ్లాగుల గురించి మాట్లాడుకుని సమయం గడుపుతుండగా పద అలా బైకు మీద మైసూర్ హైవే మీద వెళ్ళొద్దాము అన్నాడు. సరే పద అని ఇద్దరమూ బైకులు తీసుకుని బయల్దేరాము. అలా నడుపుకుంటూ వెళుతూనే ఉన్నాము. సుమారు ఓ నలభై యాభై కిలోమీటర్లు వెళ్ళి ఓ డాబా లాంటి హోటల్లో సగం బిర్యాని తిని ఓ లస్సీ తాగి వెనక్కి బయల్దేరాము.

జనాలు నన్ను అడుగుతుంటారు ఎందుకు US కి వెళ్ళట్లేదు అని. వారికి నేను సమాధానం చెప్పను. నవ్వి ఊరుకుంటాను. అమ్మా నాన్నల లాంటి స్నేహితులను వదిలి, ఇంత మంచి స్నేహితులను వదిలి అక్కడికి వెళ్ళి నేను సాధించేదేమిటి ? నాలుగు డబ్బులు అంతేగా ?

అలా ఇంటికొచ్చిన తరవాత రమేష్ వెళ్ళిపోవడంతో ఆలోచనల్లో పడ్డాను. మన స్నేహాలు ఎలా చిన్నప్పటి నుంచి ఎలా ఆవిర్భవిస్తాయో అని.

చిన్నప్పుడు మనం అమాయకులం. ఆలోచనలన్నీ ఎలా ఆడాలి పాడాలి అని. మన మొదటి స్నేహం అమ్మతోనే. ఎందుకంటే మనలని ఆడి పాడించి, జోల పాడి మనతోనే సమయం గడిపేది అమ్మే కాబట్టి. తరవాత కొద్ది కొద్దిగా వివిధ వ్యక్తులు పరిచయం అవడంతో వారితో ఆటపాటల కోసం జతకడతాము. అలా ఆ స్నేహాలు సరదాగా గడుస్తాయి. అవి నిలుస్తాయా అనేది వారితో పాటు పెరుగుతామా లేదా అనేదాని మీద ఆధారపడి ఉంటాయి.

కొద్దిగా పెద్దయ్యాక స్కూలుకెళ్ళడం మొదలవుతుంది. అక్కడ క్లాసులో బెంచిలో పక్కన కూర్చునేవారితో, క్రికెట్టాడే పక్కింటివారితో, హోంవర్కు కలిసి చేసే వారితో, లంచ్ చెయ్యడానికి కలిసి వెళ్ళేవారితో స్నేహం కుదురుతుంది. అది కూడా సరదా వయసే. కానీ ఈ కాలం వారికోసం అదే చెహ్ప్పలేను. మొబైల్స్, వీడియో గేంస్, బండెడు చదువులు వారి స్నేహితులవుతున్న ఈ కాలంలో ఆ వయసులో సరదా కూడా తగ్గిపోతుందనుకోండి. డబ్బున్నప్పుడు ఖర్చుపెట్టడంలో తప్పు లేదనుకోండి. కానీ ఆ వయసులో సమానత గురించి సరయిన బీజం పిల్లల్లో పడకపోతే పెద్దయ్యక తప్పు దారిలో పయనించే అవకాశముంది. రెండు వేల షూ, పదివేల మొబైల్, క్రెడిట్ కార్డ్ తో తిరిగితే పక్కన అది అఫర్డ్ చెయ్యలేని వారు అసూయపడే అవకాశం ఉంది. దానికి పరిష్కారం అడగకండి. అది మీకే వదిలేస్తున్నా.

ఇక పదో క్లాసు, కాలేజీ వయసు వచ్చేటప్పటికి యవ్వనంలో ఉన్న మనకు రక రకాల స్నేహాలు మొదలవుతాయి. ఈ వయసులో మంచీ, చెడూ రెండు వైపులకి వెళ్ళేందుకు ఆస్కారం ఉండేది ఎక్కువగా స్నేహాల వలనే. సిగరెట్లు, మందు, చెత్త సినిమాలు, డ్రగ్స్ వంటి వాటి ప్రభావం పడవచ్చు. అందుకని ఈ వయసులో మన భవిష్యత్ మార్గం డిసైడ్ చెయ్యబడుతుంది స్నేహాల వల్ల. ఓ పక్క అలా ఉంటే ఇంకో పక్క సరయిన స్నేహాల వల్ల మంచి చదువు, పోటీ తత్వం, ఆటల లో మంచి ప్రదర్శన వంటివి కుదురుతాయి. ఇది దిశా నిర్దేశం చేసే వయసు.

తరవాత ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సులలో చేరడంతో అక్కడ కొన్ని స్నేహాలు బలవంతంగా, కొన్ని సహచరులతో, కొన్ని అలా అలా మొదలవుతాయి. స్నేహాలన్నీ ఒకేలా ఉండవు. అందరినీ ఒకేలా నమ్మకూడదు అని నిరూపిస్తాయి కొన్ని స్నేహాలు ఈ వయసులో. నిజం అప్పుడప్పుడు చేదుగా కూడా ఉంటుంది అని చెబుతాయి. సరయిన స్నేహాలు అవసరమని తెలిసివస్తుంది. ఇంకొన్ని స్నేహాలు ఆకర్షణ తో మొదలవుతాయి. అంటే మగ, ఆడ మధ్య స్నేహం ఒక్కటే కాకుండా ఇంకేదో ఉండవచ్చనే భావనలు ఈ వయసులో కలుగుతాయి. స్నేహమే దానికి పునాది అవుతుంది. ఇంకా కొన్ని జీవితకాలం నిలిచిపోయే స్నేహాలు మొదలవుతాయి. ప్రాణ స్నేహితులు కూడా లభిస్తారు ఎందుకంటే మన అభిరుచుల మీద, అలవాటుల మీద మెచ్యూరిటీ వచ్చే వయసు ఇది. అవి కలిసే వారితో స్నేహ సుమగంధాలు విరిసి ఎంతో కాలం గుర్తుండిపోయేలా, మన మీద ఓ ముద్ర వేసే దిశలో ఉంటాయి.

ఇక ఆ తరవాత జీవితంలో స్థిరపడే రోజులు. ఈ కాలంలో ఉండే స్నేహాలు అంతా ఎక్కువగా పైపైన స్నేహాలే అని నాకనిపిస్తుంది. మంచి స్నేహితులు దొరకరని కాదు కానీ ఎక్కువ ఆఫీసు స్నేహాలే ఉంటాయి.ఇంకా ఈ కాలం జనాలలో ఆఫీసు తప్ప స్నేహాలకి సమయం ఎక్కడుంటుంది ? చాలా మటుకు పాత స్నేహాలు మరుగున పడతాయి. ఏవో కొన్ని ప్రత్యేకమయినవి తప్ప. ఇక పని స్థలంలో మనకు తారసపడేవారితో జత కుదురుతుంది. వారిలో ఏ ఒకరో ఇద్దరో మనకు స్నేహితులుగా స్థిరపడతారు. వారితో సంభాషనలు మనకు మన పని అలసట నుంచి ఒయాసిస్సులుగా ఉంటాయి. కలిసి వెళ్ళే లంచ్, కాఫీ సమయంలో జరిగే ఈ సంభాషణలు కొంత ఉపశమనాన్నిస్తాయి . మన అదృష్టం బాగుంటే మనకు మన వ్యక్తిత్వం కలిసే వ్యక్తులు స్నేహితులుగా దొరుకుతారు.

నేను ఈ వయసు వరకే స్నేహం అనుభవించాను కాబట్టి ఇంతవరకూ చెప్పగలను.

స్నేహంలో అసూయ, కోపం లాంటివి ఉండవని జనాలు ఉంటారు. నా అనుభవం ప్రకారం అవన్నీ ఉంటాయి. కానీ వెంటనే అరే నేను ఎవరి గురించి కోపం/అసూయ పడుతున్నాను. నా సొంత మనిషి గురించా ? అనే ఆలోచన మీకు వెంటనే వచ్చిందంటే అది నిజమయిన స్నేహమని మీరు అర్థం అనుకోవచ్చు.

ఇన్ని స్థాయిలను దాటి వచ్చిన నేను ఎంతో మందితో స్నేహం చేసాను. ప్రాణ స్నేహితులు ఓ నాలుగయిదు మంది మాత్రమే ఉండి ఉంటారు. అంటే వారితో ఏ విషయమయినా మాట్లాడగలను. ఎలాంటి పరిస్థితిలోనయినా వారు నా పక్కన ఉంటారు. ఇంకా ఎక్కువ మంది లేరనే బాధ నాకు లేదు. వీరున్నారనే సంతోషం మాత్రం ఉంది.

స్నేహాన్ని నేను వివరించలేను. దాని గురించి అశువుగా కవితలు చెప్పలేను కానీ ఆ మాధుర్యాన్ని నేను అనుభవించాను. స్నేహమెంత మధురం….