హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్ …

హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్… రిలీజ్ అయ్యింది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది.
నేను చదివిన పుస్తకాలన్నింటిలోనూ నన్నెంతగానో ఆకట్టుకున్న హారీ పాటర్ ఇక ఉండదంటేనే నాకెంతో బాధగా ఉంది.

ఆప్పటికీ ఈ పుస్తకం చదవకుండా కొన్ని గంటలు వాయిదా వేసాను. ఊహూ… కుదిరితేగా. ఒక్క అదాటున మొత్తం చదివేశా.

అంతా బాగానే ఉన్నా ఎండింగ్ మాత్రం ఏదో మన తెలుగు సినిమాల్లోలా తీసినట్టు అనిపించింది. ట్విస్ట్లు కూడా ఎక్కువయ్యాయి.
అయినా బాగానే ఉంది.

నాకు అన్నిట్లోనూ నచ్చిన హారీ పాటర్ – హారీ పాటర్ అండ్ ద గోబ్లెట్ ఆఫ్ ఫైర్. ఇందులో అద్భుతమయిన సాహసాలు చేస్తూ ఉర్రూతలూగించే సన్నివేశాలు చాలా ఉన్నాయి.
అయితే నిరాశపరిచిందేమిటంటే వీటి ఆధారంగా తీయబడిన ఏ సినిమాలోనూ పుస్తకం లో ఉన్నట్టుగా చూపించలేకపోవడం. అది కుదరదు కూడా అనుకోండి.

పుస్తకం చదవని జనాలు హారీ పాటర్ అంటే కేవలం మాజిక్కు, మాయలు, మంత్రాలు మాత్రమే అనుకుంటారు. కానీ నాకు ఇందులో నచ్చేదేమిటంటే హారీ పాటర్ ని ఎప్పుడూ రచయిత ఓ మామూలు అబ్బాయిగానే చూపించింది కానీ హీరో లా కాదు. అవును ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి కానీ మిత్రుల పట్ల చూపించే బాధ్యత, వాళ్ళ మీద నమ్మకం, అన్నిటికీ నేనే అనే అహంభావం లేకపోవడం, నిజాయితీ, ప్రేమ ఇలాంటి భావాలు పుస్తకం నిండా కనిపిస్తాయి.

నాకయితే అన్నిటికన్నా స్నేహమే ఇందులో ఎక్కువగా హత్తుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కష్టాలు వచ్చినా ఒకరికొకరు అన్నట్టు ఉంటారు ముగ్గురు స్నేహితులు హారీ పాటర్, హెర్మియానీ, రాన్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినూత్నమయిన శైలిలో ఉంటారు కానీ అందరూ కలిసి సాధించే విజయాలే ముఖ్యం గా కనిపిస్తాయి. హెర్మియానీ అయితే ఎంతో తెలివి గల పిల్ల. చటుక్కున పట్టేసి లటుక్కున చేసేస్తుంది ఏదయినా సరే. ఎన్నో పుస్తకాలు చదువుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంది. రాన్ అయితే హారీ కి ఎంతో దగ్గరగా ఉండే స్నేహితుడు. కొద్దిగా మూర్ఖత్వం ఉన్నా ఎన్నో సార్లు హారీ ని రక్షిస్తాడు. ఇక హారీ అన్నిటిలోనూ సామాన్యంగానే ఉన్నా దుడుకుగా ఉంటూ, నిజం కోసం పోరాడుతూ, ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తుంటాడు.

ఇక ఈ కొత్త పుస్తకం లో ముగ్గురూ కలిసి వాల్డెమార్ట్ కి సంబంధించిన హార్క్రక్స్ లను ఎలా నాశనం చెయ్యగలిగారో అనేది కథ. తప్పు చేసినా తప్పు ని ఒప్పుకుని, స్నేహితులలో తప్పులను మన్నించి, అందరినీ కలుపుకుని చెడు మీద ఎలా పోరాడుతాడో పుస్తకం చదవాల్సిందే. ఇంకా అందరూ చదివి ఉండరు కాబట్టి నేను కథ గురించి చెప్పను.

ఇలాంటి కథ ముగుసిపోయిందంటే మీకు కూడా బాధగా లేదూ ???
హారీ మళ్ళీ కొనసాగితే బాగుండు. ప్చ్….