జిమ్ముకెళ్ళరా… కండ పెంచరా…

శీర్షిక చూస్తునే మీకర్థం అయుంటుంది… కాసేపలాగే ఉండండి. నా జిమ్ము బాడీ కండలు చూపించి టపా రాస్తాను. ఊ…హుం…. కళ్ళు తిరిగినియ్యా ? మరదే…

అసలు ఈ పరంపర ఎప్పుడు మొదలయిందో తెలియాలంటే మీరు నా ఇంజినీరింగు రోజులలోకి వెళ్ళాలి. అది ఏదో సెమిస్టరు (అసలు ఎప్పుడేమి చదివామో గుర్తుంటే కదా ?). నేను హ్రితిక్ రోషను “ఎక్ పల్ కా జీనా …” అంటూ అవసరం లేకపోయినా కండలు చూపించే డాన్సు చూసాను.
అంతే ఎన్నో వేల మంది “యూతు” (బూతు అని వినిపిస్తే నా బాధ్యత కాదు) లాగా నాకూ వెంటనే కండలు పెంచేసి మా కాలేజీలో అమ్మాయిలని పడగొట్టెయ్యాలనే తీవ్రమయిన కోరిక కలిగింది.

మా కాలేజీలో నాలాంటి బకరాల కోసమే అన్నట్టు ఓ జిమ్ము ఉండేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కానీ బానే ఉండేది లెండి. ఇక నేను ఆల్మోస్టు అక్కడ ఇరగదీసాను. ఏమిటనుకున్నారు, నా వెన్నెముకని. మొదటి రోజే మరి కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో యాభై కేజీల వెయిట్ లిఫ్టింగు చేస్తే ఇంకేమవుతుంది మరి ?

ఓ నెల రోజుల రెస్టు తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం అన్నమాట. ఈ సారి జాగ్రత్తగా పాపం తలో ఐదు కేజీల డంబెల్స్ ఎత్తి నా మానాన నేను జిమ్ము చేసుకుంటుంటే ఆ రోజే కాలేజీలో ఏదో “ఆటల దినమంట” అమ్మాయిలంతా బిలబిలా జిమ్ముకొచ్చేసారు (అబ్బ. మన ఖర్మ కాకపోతే జిమ్ములోనే బాడ్‌మింటను కోర్టు పెట్టాలనే బుద్ధిలేని అయిడియా ఎవరిచ్చారో మా కాలేజీ వారికి.) అసలే నా పక్కన హల్క్ లాంటి “బ్రెస్టు లాంటి చెస్టు” ఉన్న వీరుడొకడు తలా పన్నెండు కిలోల డంబెల్స్ ఎత్తుతున్నాడు.
మరి ఆ పక్కనే నేను ఐదు కిలోల డంబెల్సు, అదీ అమ్మాయిల ముందు (మీకు సీను అర్థమయింది కదా…) వెంటనే నా చేతిలో పది కిలోల డంబెల్సు ప్రత్యక్షం.

సీను కట్ చేస్తే పది కిలోల డంబెల్ ఒకటి నా కాలు పచ్చడి చెయ్యడం. కుంటలేక, ఏడవలేక నోరు కట్టేసుకుని హాస్టలు చేరడం నెక్స్టు సీనులు.

ఇలా కాదని ఎవరూ లేకుండా చూసి మధ్యాహ్నం పూట జిమ్ము కెళ్ళడం మొదలెట్టా… అప్పుడేమయిందా ? హు… మీరు నన్ను అవమానిస్తున్నారు. ఏదో అయే ఉంటుందని డిసైడయిపోయినట్టున్నారు. ఇక చెప్పక తప్పుతుందా ?
సంగతేమిటంటే మా కాలేజీలో వెయిట్ లిఫ్టింగు వీరుడొకడు ఉండేవాడు. భారీ పర్సనాలిటీ, మా యూనివర్సిటీలోనే గోల్డు మెడలిస్టు వంటి స్థాయి. ఏదో ఒక పోటీలో ఇతగాడు ఎత్తగలిగినంత వెయిట్లు లేక బాబ్బాబూ ఇక చాలు ఆపెయ్యి అన్నారని ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది అప్పట్లో…
నేను వెళ్ళే మధ్యాహ్నం టయిమునే నా అదృష్టం ?? కొద్దీ ఇతగాడు ఎంచుకున్నాడు. నా పక్కనే నిలబడి పదుల కిలోలు అమాంతంగా ఎత్తేస్తుండేవాడు. అప్పటికే ఇలాంటి అవమానాలకి అలవాటు పడిపోయానేమో పక్క నా ఏడున్నర, అప్పుడప్పుడు పదీ కిలోలతో కానిచ్చేవాడిని.
ఇలా ఉండగా ఒక రోజు పాపం ఏ కళనున్నాడో కానీ నేను ఎక్సర్సయిజు చేస్తున్న సమయంలో ఆ వంద కేజీల వెయిటు జస్టు నా తలకి పదించిల దూరంలో డభేల్మని కింద పడింది. ఓ పది నిముషాలు అవాక్కయ్యానన్నమాట. తేరుకున్నానుకున్నారా ? లేదు జిమ్ము మానేసా 🙂 అదీ సంగతి.

అప్పటితో నా సల్మాన్ ఖాను లాగా షర్టు విప్పడాలు, కండలు ఫ్లెక్సు చెయ్యడాలు కట్టయ్యాయన్నమాట. (ఏం చేస్తాం. ఐఎస్‌ఐ కుట్ర జరిగింది)

ఇక ఏదో నా ఇంజినీరింగు పూర్తిచేసి “జనాల ప్రకారం” తీరిగ్గా తిని కూర్చుని చేసే ఉద్యోగంలో చేరాను. ఇక షరా మామూలే. ఏముందీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కదలకుండా పని చేసి ఒళ్ళొంచకుండా ఇంటి నుంచి ఆఫీసుకీ, ఆఫీసు నుంచి ఇంటికీ. ఈ మధ్యలో జిమ్ముకెళ్ళాలి అనే ఆలోచన నేను చెయ్యలేదు. ఎందుకంటే నాకంటే ముందే నా సహోద్యోగులు మాంచి ఉత్సాహంతో రెండు రోజులు జిమ్ముకెళ్ళి విజయవంతంగా పది రోజుల పండగ పూర్తి చేసుకుని వేలు సమర్పించుకున్నారు.

ఇక అలా హాయిగా సాగిపోతున్న జీవితంలో కాంపసు మారడం అనే ఒక విషాద సంఘటన జరిగింది. బిగ్గర్, బెటర్ పాలసీలో భాగంగా ఓ ఆట్టహాసమయిన జిమ్మొకటి మా కాంపసులో కొచ్చింది.
“కుక్క తోక వంకర” లాంటి సామెతలు ఎవరికయినా గుర్తుకొస్తే చెప్పకుండా వారిదగ్గరే పెట్టుకోమని మనవి.

మళ్ళీ మొదలు. అక్కడున్న నాలుగయిదు ట్రెడ్ మిల్లులని చూసి మనసాగలేదు. వెంటనే అవెక్కి రన్నడం అదే పరుగెత్తడం మొదలెట్టాను. మీకప్పుడే “ఫారెస్టు గంపు” గుర్తొస్తుంటే నేనేమీ చెయ్యలేను. మరీ అలా పరిగెట్టలేదు కానీ, ఎందుకో పరిగెడుతుంటే నాకేదో చెప్పలేని ఆనందం కలుగుతుండేది. నేనేదో మారథాన్ పరిగెడుతున్నట్టు, పూర్తి చేసి చేతులు పైకెత్తి ఆనందపడిపోతున్నట్టూ కళ్ళు తెరిచి కలలుగనే వాడిని.

ఇంకే రోజుకి దాదాపు నాలుగుతో మొదలెట్టి ఎనిమిది కిలోమీటర్ల దాకా పరిగెత్తడం మొదలుపెట్టాను. జిమ్ములో నా వెనక చకోర పక్షుల్లా వేచి చూసే వారు లేకపోతే ఇంకెన్ని కిలోమీటర్లు పరిగెత్తేవాడినో తెలీదు మరి. దాని ఫలితం నెలలోగా నాలుగు కేజీల బరువు తగ్గడం. కనిపించిన వాళ్ళందరూ ఏమయింది అని అడగడం మొదలుపెట్టారు. మా మేనేజరు పిలిచి బాబూ నువ్వు ఆ జిమ్ము ఆపకపోతే మన టీములోకి జనాలెవరూ రారు, కనీసం నా గురించయినా ఆపెయ్యి నాయనా అన్నాడు.
నాకు మంచి హైకు ఇస్తానని ఒట్టేయించుకుని ఆపేసాను. (నేను ఆయన గదిలో నుంచి బయటకు రాగానే ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం నేను చూడలేదు)

ఇదిగో మళ్ళీ ఇప్పుడు దురద మొదలయింది. ఈ సారి కేవలం కండలు పెంచి, ఛాతీ వెడల్పు చేద్దామని మళ్ళీ మొదలెట్టాను. గత నెల రోజులుగా ఠంచనుగా వెళుతున్నాను (అంటే వారానికి రెండు రోజులు). ఈ సారి రికార్డు ఏమన్నా మారుతుందేమో చూడాలి మరి …

మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు.
ఇక చూసుకోండి మీరెందులో ఇముడుతారో ?

సినిమా సినిమానే:

వీరు అందరి కంటే ఎక్కువగా సినిమాలను ఎంజాయ్ చేస్తారేమో. సినిమా అంటే వీరికి ఒక వినోద సాధనం. అంతే. అంతకన్నా అందులో లాజిక్కులు పట్టవు, కథ ఉందా ? వేల మందిని ఆలోచింపచేస్తుందా ? అసలు సినిమా తీయడానికి దర్శకుడికి ఒక కారణం ఉందా ? లాంటి ప్రశ్నలు వీరిని వేధించవు.

కావలసినంత వినోదం ఉందా, డాన్సులు కత్తిలా ఉన్నాయా, హీరోయిను బాగా చూపించిందా, హీరో వంద మందిని ఇరగదీసాడా, నాలుగు పంచి, మాసు డయిలాగులు చెప్పాడా ?
వీరు సినిమాని చక్కగా ఆనందించేస్తారు.

కృష్ణ, శివాజీ లాంటి సినిమాలు చూసినా వీరు దానిని హిట్టనగలరు. సుఖ పురుషులు.
ఓ తమిళమ్మాయిని/మళయాళమమ్మాయిని పెట్టి, దానిని ఒసే, ఏమే, నీకు పొగరే… అని పిలిపిస్తే ఉంటుంది నా సామిరంగా.

పాతొక వింత కొత్తొక రోత:

వీరు పురాతన కాలంలో మాత్రమే నివసిస్తుంటారు. వీరికి సినిమా అంటే పాత సినిమాలు మాత్రమే. కొత్త సినిమా బాగుందని వీరికి చెప్పండి. ఛా! అలా కుదరదు అని అనేస్తారు.

ఆహా! మిస్సమ్మ, గుండమ్మ కథ, రాముడు భీముడు. మిగతావన్నీ అసలు సినిమాలేనా ?

సినిమాలు వివిధ రకాలు, కాలంతో పాటు అవి తీసే తీరు మారతాయని వీరికి చెప్పండి. ఊహూ…
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ! అని మాత్రమే వీరికి తెలుసు. కాలంతో పాటు మార్పులని వీరు అందుకోలేరు. వీరి కాలం వీరిదే.

లాహిరి లాహిరి లాహిరిలో… ఉండండి ఎక్కడో మాయాబజారు వస్తున్నట్టుంది.

ఏవీ మంచి సినిమాలు ?

ఇంగ్లీషా ? తెలుగా ? హిందీనా ? ఏదయితే నాకే మంచి సినిమానా ? నేను చూస్తాను.
వీరు ఈ రకం. భాష గానీ, కాలం గానీ, మార్పు గానీ వీరికి అడ్డంకి కాదు.

వీరికి కావలసిందల్లా ఒక మంచి సినిమా. సరయిన కథ, మంచి నటన, దర్శకత్వం, కెమేరా పనితనం ఉన్నాయా ? అయితే ఆ సినిమా చూసి తీరాల్సిందే.

ఐఎం డీబీ టాప్ 250 లిస్టులు, రాటెన్ టొమేటోస్ బెస్టాఫ్ లిస్టులూ వీరి పట్టుగొమ్మలు.

మంచి సినిమా రాగానే టారెంట్లు వెతకడం వీరు చేసే మొదటి పని, ఎందుకంటే అన్ని సినిమాలూ థియేటర్లో చూడలేము కదా !

ఓ ఇవాళ ఆదివారం కదూ, నేను రోడ్డు పక్కన డీవీడీల వేట మొదలెట్టాలి. ఇక ఉంటాను.

నా భాషా ?

సినిమా నా భాషా కాదా ?

వేరేదయినా అయితే ఆ… అప్పుడే ఆవలింతలొచ్చేస్తున్నాయేంటి ?

హు. జనాలకి అసలు మన భాషంటే ఇష్టం పోయింది. చక్కగా డయిలాగులూ అవీ అర్థమవుతుంటే ఇవి చూడక వచ్చీ రాని ఇంగ్లీషు, చైనీసు ఎందుకో ? ఏమి చెప్తాము ? అని వాపోతుంటారు.

శనివారం, ఆదివారం మా టీవీ, ఈ టీవీ, జెమిని, తేజ ఎప్పుడు ఎందులో ఏ సినిమా వేసినా, ఖాళీగా ఉంటే ఆ సినిమా చూడాల్సిందే.

అరె! ఇక్కడేదో “పోరంబోకు పెంట నాయాల” సినిమా మొదలయింది. తర్వాత మాట్లాడుకుందాం.

క్రిటిక్ని/విశ్లేషకుణ్ణి మాత్రమే నేను:

సినిమాలో కెమేరా ఏ కోణంలో పెట్టి తీసాడు ? అసలు లైటింగు ఈ కాంతిలో మాత్రమే ఎందుకుంది ?
దర్శకుడు ఈ సీను ఇలా ఎందుకు తీసాడు ? ఇలా తీస్తే బాగుండేదే ?

ఎబ్బే… ఈ హీరో అసలు సుమోలని గాలిలో ఎగరెయ్యడం ఏమీ బాగోలేదు. ఏమన్నా నాచురాలిటీ ఉందా అందులో ?

సినిమా అన్నాక నిజానికి దగ్గరలో ఉండొద్దూ. ఒక క్లాసికల్ టచ్ ఉండొద్దూ. దర్శకుడి ప్రతిభ, కెమెరా పనితనం కనబడొద్దూ ?

రోషొమోన్ , సెవెన్ సమురాయ్, గాడ్ ఫాదర్ చూడు. అవీ అసలు సినిమాలంటే.

ఈ జనాలకు అసలు టేస్టు లేకుండా పోతుంది. ఏ చెత్త సినిమా మొహాన పడేయి చూసేస్తారు. నాలుగు పాటలు, ఆరు ఫైట్లు, ఓ ప్రేమ కథ వీళ్ళ మొహాన పడేయి. సినిమాని సూపరు హిట్టు చేసేస్తారు. ఇలాగయితే అయినట్లే. మన *లీవుడ్, హాలీవుడ్ గట్రాని అందుకునేదెప్పుడు అని ఓ మథన పడిపోతారు.

వీరు సినిమాని సరిగా ఆనందించలేరేమో కూడాను అనిపిస్తుంది. అంత తీక్షణంగా గమనిస్తే సినిమా బదులు సీన్లు మాత్రమే కనిపిస్తాయేమో ?

అన్నట్టు గురూ ఎక్కడయినా “సైకో” కలెక్టర్సు ఎడిషను దొరుకుతుందా ?

ఇక ఆఖరు

నా సినిమా హీరో, ఆహా ఓహో …:

వీరి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు.

మన అభిమాన సినిమా హీరో నటించాడా ? అయితే జల్సా కూడా సల్సానే.
*రెడ్డి, *నాయుడు అన్నీ అద్భుతమయిన కళాఖండాలు. ఈ హీరో తప్ప ఇంకెవరూ ఏ కాలంలోనూ వేయలేని కారెక్టర్లు.

అరె… బ్లాగులలో కూడా నా హీరో అభిమాన సంఘాలున్నాయా ? నేను వెంటనే అందులో చేరిపోవాలి.
జై ఫలానా! జై జై ఫలానా !!

రే ఎవడ్రా అక్కడ నా అభిమాన హీరో సినిమా బాగాలేదని రాసింది. వేలి గోటితో నరికేస్తా….

ట్రాఫికాసుర హతః …

ఓ రోజు బైకు తీసి ఇంటి నుంచి బయలుదేరా.

అలా రోడ్డు మీదకి వచ్చానో లేదో పక్కన నుంచి జూమ్మని ఓ శబ్దం వినిపించింది. అదేంటబ్బా రాకెట్లని ఈ మధ్య రోడ్డు మీద కూడా నడిచేలా చేస్తున్నారా అని అబ్బురపడుతుంటే కనబడింది దూరంగా, అదేదో “లప్సర్” అంట ఆ బండి మీద ఎవడో రెండు కాళ్ళతోనూ చాలా పొందిగ్గా తోలుతున్నాడని.

పక్కన ఓ నాలుగు కార్లకి సొట్టలు పడి, పది మందికి బొక్కలిరిగి పడున్నారు. వాడు ఓ సాడిజం కలగలసిన విలన్ నవ్వు నవ్వి క్లచ్ మీద నుంచి ఓ కాలు తీసి ఇంకో కాలు మీద వేసుకున్నాడు. ఓ చేతిలో మొబైలు, ఇంకో దాంట్లో ఐపాడు మోగుతున్నాయి.

వామ్మో ఎందుకొచ్చిన గొడవ అని పక్కనే కనిపించిన సందులోకి దూరా ఇలాంటి ట్రాఫిక్కుని తప్పించుకోవడానికి. కొంత సేపు ఏదో ఫ్రీ రోలర్ కోస్టర్ రైడు అనుభవం కలిగింది ఖర్చు లేకుండానే. అక్కడెక్కడో ఒయాసిస్సులా రోడ్డు కనిపిస్తుంటే దానిని అందుకోవడానికి జెయింటు వీళ్ళు ఎక్కి దిగుతున్నా బైకు సహాయంతో. సడన్‌గా ఏంటో పదడుగులు లోతులో ఉన్నా. నా బైకు ఈదుతోంది పాపం. ఇదేంటా అని ఆలోచిస్తే ఓ దీనిని “మనిషిరంధ్రం” అంటారని అర్థమయ్యింది. పాపం నిన్న డ్రైనేజీ క్లీను చేసేవాడెవడో చెయ్యక చెయ్యక పని చేసి అలసిపోయి మూత మూయకుండా వెళ్ళిపోయుంటాడు అని జాలిపడి ముక్కుతూ మూల్గుతూ పైకొచ్చా.

అలా వస్తూనే రోడ్డు కి మూడు సైడులా వెళ్ళడానికి వీలు లేదు అనే బోర్డులున్నాయి. అదేంటబ్బా మూడు వైపులా వెళ్ళడానికి వీలులేకపోతే ఇప్పుడెలా అని ఆలోచించి, అరే ఇంత వెధవాయిని ఎలా అయ్యానో ఇంకా ఓ సైడు వదిలారుగా అని వచ్చిన సైడునే వెనక్కి తిప్పా బైకుని. మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకొచ్చేసరికి అదేంటో ఓ రెయిల్ కంపార్టుమెంటుని మోసుకెళుతూ ఓ లారీ కష్టపడుతోంది. దాని కింద ఓ రెండు మూడు కార్లు, దాని పైన ఓ పది బైకులూ డ్రైవ్ చేసుకుంటున్నాయి. అబ్బో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అని కాసేపు నడుం నెప్పొచ్చి బైకు దిగి నడిపించడం మొదలెట్టా.

నడుస్తుంటే అక్కడ పాపం ఇంతకు ముందు వెళ్ళిన టాంకరులోంచి నీళ్ళు పడి బురదలా తయారయింది. కాలందులో వేసి అరెరే అనుకుంటుండగానే ఓ కారు పాపం అక్కడ బురద ఉండకూడదని దాని మీద నుంచి సర్రున వెళ్ళి దాన్ని నా వంటి మీదకి ట్రాన్స్ఫరు చేసింది. “అడుసు తొక్కనేల…” అని గుర్తొచ్చి ఎందుకొచ్చిన గొడవ అని మళ్ళీ బైకు మీద ఎక్కా.

ఒకే ట్రాఫిక్కు లైటు ముందు నాలుగు సార్లు ఆగిన తర్వాత క్రాస్ చెయ్యడానికి నా వంతు వచ్చింది. హుర్రే అని అరుస్తూ ముందుకెళుతుంటే ఎదురు పక్కనున్నోడు కూడా వచ్చేస్తున్నాడు. అదేంటబ్బా ఆకుపచ్చ రంగు ఈ వైపున కదా ఉంది అని ఆలోచిస్తుంటే నా పక్క చూసి లైటంటే నాకో లెక్కా అని తొడగొడుతూ దూసుకెళ్ళిపోయాడు.

అబ్బో నాకింకా రూల్సు వంటబట్టలేదని తెలిసిపోయింది.

తర్వాత ఇరవై కిలోమీటర్ల అతివేగంతో వెళుతున్నానని ఓ పోలీసు బాబాయి ఆపాడు. ఆపగానే బైకు తాళాలు ఇచ్చెయ్యాలట ఆయనకి పాపం. తాళాలు కలెక్టు చెయ్యడం ఆయన హాబీ కాబోసు అని ఇవ్వగానే లైసెన్సు చూపమన్నాడు. తాళాలివ్వండీ బైకు లో ఉన్నాయి తెరిచి చూపుతా అంటే అదంతా నాకు తెలీదు ఐదొందలు ఫైను కట్టు అన్నాడు. వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకుని చెమటోడ్చి, కష్టించి, కాఫీ పోసి, టీ తాగించి సంపాదించిన డబ్బుని వాడికి స్వాహా చేసి నా తాళాలు వెనక్కి తెచ్చుకున్నా.

ఇక అసలు స్పీడుగా వెళ్ళకూడదని పది కిలోమీటర్ల స్పీడుతోనే వెళుతుంటే నా స్పీడు పెంచడానికి కంపెనీ కాబు సుమో ఒకటి వెనక నుంచి డాషిచ్చింది. అదేదో సినిమాలో చిరంజీవి గుర్రం లారీ కింద నుంచి స్లైడయినట్టు నా బైకు ఓ బస్సు కింద నుంచి జర్రున జారి మళ్ళీ పైకి లేచింది. హమ్మయ్య జీన్సూ, లెదర్ జాకెట్టూ వేసుకురావడం మంచిదయిందని అనుకుని మళ్ళీ నడపడం మొదలెట్టా.

అలా వెళుతుంటే పక్కనోడు సార్ అగ్గిపెట్టుందా అని అడిగాడు. వార్నీ బైకు మీద వీడికి అగ్గిపెట్టెతో ఏం పని అని ఆలోచిస్తుంటే పాపం ఒంటి చేత్తో ఆక్సిలరేటరు మీద చెయ్యేసి ఓ సిగరెట్టు ఊదేస్తూ గాల్లో తేలిపోతున్న వాడొకడు కనిపించాడు. వావ్ ఏం అథ్లెటిసిజం అని పొగుడుదామనుకున్నా కానీ అప్పటికే ఓ కారు పైకి ఎక్కి దిగడంలో బిజీగా ఉన్నాడు. సర్లే అని ఊరుకున్నా.

ఎదురుగా ఓ కిలోమీటరు వరసగా కార్లు, బైకులూ, లారీలు ఆగి ఉన్నాయి. ఓ కిసాన్ జామన్నమాట బ్రెడ్డు తెచ్చుకున్నా బాగుండు అనుకున్నా. ఇప్పుడు బాధపడి ఏం లాభం. సరే అని బైకు ని నిలిపేసి దాని మీద ఓ కునుకేసా. నాకు పెళ్ళయినట్టు, ఓ పిల్లాడు పుట్టినట్టూ పీడకలలు వచ్చాయి. అంతటితో ఆగితే బానే ఉండు. అదేదో స్కూలులో చేర్పించడానికి వెళ్ళినట్టు కనిపించింది. అక్కడ స్కూలు ప్రిన్సిపాలు చెబుతున్నాడు. అదేదో కొత్త కాన్సెప్టు స్కూలు అంట. అన్నీ ప్రాక్టికలుగా నేర్పుతారంట. ట్రాఫిక్కు బేస్డు పాఠాలంట. పజిల్సు ఎలా సాల్వు చెయ్యాలో నేర్పడానికి వాళ్ళకో సైకిలిచ్చి హోసూరు రోడ్డు మీద వదులుతారంట. బతికి బయటపడ్డవాళ్ళని మాత్రమే ముందు క్లాసులకి పంపుతారంట. ఇంకా ముందుకెళుతున్నకొద్దీ పేవ్‌మెంటు మీద ఒక్క టైరున్న బైకుని నడపడం, బైకుతో పాము మెలికలను రప్పించడం లాంటి పరీక్షలు కూడా ఉంటాయని ఇంకా ఏదేదో చెబుతుంటూనే “బా…” అని ఒక పెద్ద సైరను మోగింది. చూస్తే వెనక బైకు వెధవ ఏమీ తోచక హారన్ నొక్కాడు. ముందర వెధవకి గుండె పోటు వచ్చి గిల గిలా కొట్టుకుంటున్నాడు ఆ సౌండుకి అప్పుడే.

ఇంతలోనే ట్రాఫిక్కు జాము తొలగిపోయింది. ఆహా నా అదృష్టం ఇవాళ తొందరగా తొలగిపోయింది ట్రాఫిక్కు జాము అని మళ్ళీ సాగిపోతున్నా. అదేంటో సడనుగా వందలాది “నీనో” కార్లంట నన్ను చుట్టుముట్టేసాయి. ఎక్కడికీ కదలడానికి వీల్లేకుండా పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడిలా ఫీలవుతున్నా. పాపం ఒక నీనో ఏదో ఖర్మ కాలి రోడ్డు మధ్యలో ఆగిపోతే అక్కడ నుంచి బయటపడ్డా.
ఒకడెవడో రోడ్డుకడ్డంగా తీరిగ్గా నడిచెళుతుంటే అక్కడేదో జీబ్రా క్రాసింగుందేమో అని డౌటొచ్చి వాడినడిగా. జీబ్రా నా అది జూలో ఉంటుంది కానీ ఇక్కడెందుకుంటుంది అని పిచ్చాడిని చూసినట్టు చూసాడు.

ఏమోలే అనుకుని ఓ వన్ వే రోడ్డులో వెళుతుంటే అవతల సైడు నుంచి ఓ లారీ దూసుకొచ్చేస్తుంది. బతికుంటే బలిసాకు తినొచ్చు అని బైకొదిలేసి పరిగెత్తా. ఓ ఐదు నిముషాల తరవాత వచ్చి బైకుని లేపి పక్కనున్న ఆంబులెన్సులో నేను లేనందుకు సంతోషించి వాడికి దారిచ్చా. వెనకున్నోడు నన్ను గుర్రుగా చూస్తున్నాడు ఆంబులెన్సు కి ఎవడన్నా దారిస్తాడా ? ఈడో వెర్రి వాజమ్మ అన్నట్టు.
ప్చ్… అనుకుని ఆఖరికి పదడుగుల దూరంలో ఆఫీసు బోర్డు కనబడగానే లోపలికి బైకు తీసుకెళుతుంటే అక్కడున్న బోర్డు చూపించాడు సెక్యూరిటీ గార్డు, “పార్కింగ్ ఫుల్” అని. సర్లే అని పక్కనే ఉన్న ఇనపసామానోడికి బైకుని కిలోల్లెక్క అమ్మేసి పల్లీలు కొనుక్కుని ఆఫీసులోకెళ్ళా.

ఎదురుగా బాసుకి నమస్తే చెప్పి గడియారం చూపించి చూసావా ఇవాళ పదకొండింటి కల్లా ఆఫీసుకొచ్చేసా అని. నన్ను ఎగా దిగా చూసి నిన్నెందుకు రాలేదు ? అన్నాడు.
ఆఁ… ఇక తేరుకోలా…

* ఇంతకీ సంగతేమిటంటే నా ఆఫీసు బిల్డింగు మారి కొత్త చోటికి చేరింది. వచ్చే నెల నుంచీ ఓ పదిహేను కిలోమీటర్లు పైన చెప్పినటువంటి ట్రాఫిక్కులో వెళ్ళాలి. ఆ బాధలన్నీ ఎందుకులే అని ఆఫీసు కాబ్ కి స్వాగతం పలుకుతున్న శుభతరుణంలో….
ట్రాఫికాసుర హతః