హైదరాబాదు ట్రాఫిక్ కో దణ్ణం …

ఓ నెల రోజుల క్రితం హైదరాబాదు వచ్చాను. అక్కడ ట్రాఫిక్ చూసి వామ్మో అనిపించింది. బెంగుళూరులోనే అనుకుంటే అక్కడ ఇంకా విపరీతంగా ఉంది. ఏమో నే వెళ్ళిన ఏరియా అలాంటిదేమో మరి. బేగంపేట్ ఏరియా దగ్గర పుల్లారెడ్డి షాపు దగ్గర. అక్కడేదో ఫ్లై ఓవర్ కడుతున్నారు. అక్కడ నుంచి ఎయిర్‌పోర్టు ఎంత దూరం అని అడిగితే అబ్బే దగ్గరే ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అని చెప్పాడో దారిన పోయే దానయ్య.

సరే చాన్నాళ్ళ తరవాత వచ్చాను కదా హైదరాబాదు కి, కాస్త నడుచుకుంటూ వెళదాములే అనుకుని నడక మొదలెట్టా. కొద్ది దూరం వెళ్ళి చూస్తే అక్కడ ఏదో సగం కట్టిన ఫ్లై ఓవర్ కనిపించింది. దాని మీద నుంచి నడిచి వెళ్ళే ఆస్కారం లేకపోవడంతో కింద నుంచి వెళదామని అతి తెలివి ప్రదర్శించాను. కొద్ది దూరం వెళ్ళగానే దారి ఆగిపోయింది. సరే అని అక్కడ ఇంకో దానయ్యను అడిగితే ఓ సందులో దూరమని సలహా ఇచ్చాడు. సరే పదమని దాంట్లో దూరి వెళుతున్నా. ఎంత దూరం వెళ్ళినా రాదే. ఇక ఇలా కాదని ఇంకోడిని అడిగితే ఎబ్బే.. ఈ వైపు కాదు అనేసాడు. గుండె ఝల్లు మంది. చాలా లోపలికి నడిచేసా మరి. అక్కడ ఆటోలు గట్రా కూడా లేవు. ఇక మళ్ళీ వెనక్కి బయల్దేరా. ఎట్టకేలకి సందు మొదటికి వచ్చి రోడ్డు దాటదామంటే ట్రాఫిక్ ఆగదే.

సరే నా ఫ్లైట్ టైం అయిపోతుందని ఆటో ని అడిగితే ఒక్కడూ రాడే. పది మందిని అడిగి ఇక లాభం లేదనుకుని నడక మొదలెట్టా.

ఉండడానికి అక్కడో సిగ్నల్ ఉంది. అది ఎర్ర రంగొచ్చినా, పచ్చ రంగొచ్చినా జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. అడుగు ముందుకేద్దామంటే కుదరదే. ఇక తప్పదు రా అని నడుద్దామంటే ఫుట్పాత్ లేదు. రోడ్డు మీద నడుస్తుంటే జనాలు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు బైకుల మీద. ఎలాగో చచ్చీ చెడి ఫ్లై ఓవర్ మొదటికి చేరుకున్నా. ఇక ఎక్కడం మొదలెడితే దాని మీద కూడా కొంత మేర ఫుట్పాత్ లేదు. ఇక బైకుల మీద కొట్టుకుంటూ వెళ్ళడం షరా మామూలే.

అలా నాకు టెన్షన్ మొదలయింది. ఫ్లయిట్ టైమయిపోతుంది మరి. అలా నడుస్తూ ఉంటే ఎంతకూ రాదే. పక్కనే ఉందని చెప్పిన ఆ దానయ్య మీద తెగ కోపం వచ్చింది. ఏమో చాలా నడిచి నాకే అలా అనిపించిందో. మధ్యలో ఆగి ఓ చెరుకురసం తాగి మళ్ళీ నడక సాగించా. ఎట్టకేలకు అలా ఓ అరగంట పాటు నడిచిన తరవాత సరిగ్గా టైముకి ఎయిర్పోర్టు చేరుకున్నా. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.

హైదరాబాదు కి ఉద్యోగం మారదామా అన్న నా కోరికని అక్కడే కప్పెట్టేసా. బెంగుళూరే బెటరేమో అనిపించింది. అదీ ఎంచగ్గా అమ్మా, నాన్నా దగ్గరున్నారు. నా వల్ల కాదు బాబో అని ఓ దణ్ణం పెట్టేసా.

మొత్తం హైదరాబాదు అంతా అంతేనా లేక నే చూసిన ఏరియానే అంతా ??? బాబో అక్కడున్న వాళ్ళకు పేషన్సు చాలా ఎక్కువే.
బెంగుళూరు లో ట్రాఫిక్ తక్కువేమీ కాదు కానీ ఇంత దారుణం మాత్రం నాకు ఎదురవలేదు.