ఆగస్ట్ 30, 2008

Ubiquity – ఒక విభిన్నమయిన మంటనక్క జోడింపు …

Posted in టెక్నాలజీ, మంటనక్క, సాంకేతికం, firefox, technology, Ubiquity వద్ద 7:38 సా. ద్వారా Praveen Garlapati

మంటనక్క అద్భుతాలు మనకి తెలియనివి కాదు. ఒక విహరిణిగా ఎంత చక్కగా పనిచేస్తుందో అసలు చెప్పనక్కర్లేదు.

అన్నిటికన్నా ఇందులో మిన్న దీని జోడింపులు (Addons). ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను… కొత్తగా మంటనక్క వారు ఒక జోడింపును విడుదల చేసారు. Ubiquity అని.
మనం అంతర్జాలం విహరించే పద్ధతిని ఇది సమూలంగా మార్చేస్తుందని నాకనిపిస్తుంది. అద్భుతంగా డిజైను చేసారు దీనిని.

ఉదా: మీరు ఒక ఈ మెయిలు పంపుతున్నారు స్నేహితుడికి మనం రేపు ఫలానా ప్రదేశంలో కలుద్దామని. దానికి జతగా ఒక మాపు పంపుదామనుకున్నారనుకోండి. ప్రస్తుతం జరిగే తంతు ఇది:

౧. ఒక కొత్త టాబుని లేదా విండోని తెరుస్తాము
౨. అందులో http://maps.google.com కి వెళతాము
౩. అక్కడ మనకు కావలసిన ప్రదేశాలు, ఎక్కడ నుంచి ఎక్కడకి వెళ్ళాలో వెతుకుతాము
౪. తర్వాత అందులో నుంచి మాపుని ఎంబెడ్ చేయాల్సిన కోడుని తీసుకువచ్చి మన మెయిల్లో పెట్టడమో లేదా దానికి లంకె వేయడమో చేస్తాము

మరి దీనిని కొత్త టాబు/విండో తెరవకుండా సులువుగా చేయగలిగితే ? అద్భుతంగా ఉండదూ….

పైన చెప్పిన దాన్ని ఈ Ubiquity జోడింపుతో ఎలా చెయ్యచ్చంటే

౧. విండోసులో అయితే Ctrl + space నొక్కడం
౨. Ubiquity లో “map ” టైపు చెయ్యడం. ఉదా: map hyderabad అని టైపు చెయ్యండి
౩. దాంట్లోనే ఉన్న insert లంకెని ఉపయోగించి మాపుని మీకు కావలసిన చోట ఎంబెడ్ చెయ్యడమే

సింపుల్ గా లేదూ ?

ఇంకో ఉదాహరణ చూద్దాము

మీరు ఒక పదం చూసారు. దానికి అర్థం కావాలనుకోండి ఏ “dictionary.com” కో వెళ్ళి ఆ పదాన్ని టైపు చేసి వెతకాలి.
అలాగే దేని గురించయినా సమాచారం కావాలంటే వికీకి వెళ్ళి ఆ పదాన్ని శోధించాలి.

ఇవన్నీ ఇంకో వెబ్ పేజీ తెరవకుండానే చేయగలిగితే ?

define అని Ubiquityలో టైపు చేస్తే దాని అర్థం మీకు అక్కడికక్కడే చూపిస్తుంది.
ఉదా: define tecnology

wiki అని Ubiquityలో టైపు చేస్తే ఆ పేజీ ప్రివ్యూని అక్కడికక్కడే చూడవచ్చు.
ఉదా: wiki animation

ఇలాంటివింకెన్నో Ubiquity తో సాధ్యం.

ప్రస్తుతం ఉన్న ఫీచర్లే కాకుండా అదనంగా ఫీచర్లని జోడించడం కూడా చాలా సులువు. వెబ్‌ మాషప్ లని చాలా సులభంగా చెయ్యవచ్చు.

ఉదా: మీరు వెబ్ పేజీలో ఒక పదాన్ని బ్రౌణ్యం లో వెతకాలనుకున్నారనుకోండి. దానికి షార్టుకట్ ఇందులో ఏర్పాటు చేసుకోవచ్చు.

chrome://ubiquity/content/editor.html అనే లంకెని మీ url bar లో టైపు చెయ్యండి.

అక్కడ వచ్చిన ఎడిటరులో ఈ కింది కోడుని ఉంచండి. అంతే

makeSearchCommand({
name: “telugu”,
url: “http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query={QUERY}&display=utf8&table=brown”,
icon: “http://dsal.uchicago.edu/favicon.ico”,
description: “Search for telugu words.”
});

ఇప్పుడు మీరు Ctrl + space నొక్కి telugu టైపు చేసారనుకోండి అదెళ్ళి బ్రౌణ్యంలో వెతుకుతుంది. అలాగే telugu this అని టైపు చేస్తే మీ వెబ్ పేజీలో హైలైట్ చేసిన పదాన్ని బ్రౌణ్యంలో వెతుకుతుంది.

అలాగే తెవికీలో ఏదయినా పదం వెతకాలనుకోండి.

makeSearchCommand({
name: “tewiki”,
url: “http://te.wikipedia.org/wiki/{QUERY}”,
icon: “http://te.wikipedia.org/favicon.ico”,
description: “Search తెవికి.”
});

భలేగా లేదూ…

అలాగే ఒక పేజీ మీద మీరు ఎంచుకున్న టెక్స్టుని తెలుగు యూనీకోడు నుంచి ఆర్టీఎస్ కి మార్చుకునేలా లేదా ఆటీఎస్ నుంచి తెలుగులోకి మార్చుకునేలా కూడా రాసుకోవచ్చు. లేదా మీరు ఎంచుకున్న ఆంగ్ల టెక్స్టుని ఆటోమేటిగ్గా తెలుగులోకి మార్చుకునేలా ఏర్పరచుకోవచ్చు.

దీనికే సంబరపడిపోతే ఎలా ? ఇది దీనికున్న సామర్థ్యంలో వెయ్యో వంతు మాత్రమే…
మంటనక్క స్టయిల్లో దీనిని ఎక్స్టెండబుల్ గా తీర్చిదిద్దినందున దీంతో లెక్కలేనన్ని పనులు చేయించవచ్చు.

వికీలో, గూగుల్లో, మరే ఇతర శోధన యంత్రంలో నయినా వెతకవచ్చు. వికీలో నుంచి ఒక వ్యాసాన్ని ప్రివ్యూ చూడవచ్చు. ఒక పదం యొక్క అర్థం వెతకొచ్చు, మీ కాలెండరుకి ఒక కొత్త టాస్కుని జోడించుకోవచ్చు, ట్విట్టర్ లో ట్వీట్ చెయ్యచ్చు, ఒక పెద్ద లంకెకి టైనీ యూఆరెల్ ని సృష్టించవచ్చు, ఒకటనేంటి ఏ పనినయినా చేయించవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే అన్ని జోడింపులనూ కలిపే ఒకే పెద్ద జోడింపుగా దీనిని చూడవచ్చు. కాకపోతే ఇందులో మనం కొత్తగా ఏదయినా జోడించాలనుకుంటే మీ విహరిణిని మూసి తెరవాల్సిన అవసరం లేదు. మీ స్క్రిప్టుని Ubiquity ఎడిటరులో పెట్టగానే వాడేసుకోవచ్చు.

దీనిని డెస్కుటాపు ఉపకరణాలతో పోల్చాలంటే లాంచీతో కానీ, కాటాపల్ట్‌తో కానీ, క్విక్ సిల్వర్‌తో కానీ పోల్చవచ్చు. కాకపోతే అవి మీ కంప్యూటరు కోసం, ఇది మీ అంతర్జాలం కోసం.

Ubiquity గురించి మరింత తెలుసుకోవాలంటే ఇది చదవండి. ఈ కింది వీడియో చూడండి.

Ubiquity for Firefox from Aza Raskin on Vimeo.

మరి మీరు దీనిని ఉపయోగించి ఏం చెయ్యబోతున్నారో ?