హైదరాబాదు లో పేలుళ్ళు …

ఎంత ఘోరం జరిగింది. లుంబినీ పార్కులో, గోకుల్ చాట్ దగ్గర జరిగిన బాంబు పేలుళ్ళలో నలభై మంది దాకా చనిపోయారు.
అసలు ఏమిటిది ? వరసగా ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ఏ పెద్ద నగరం లో చూసినా బాంబు పేళుళ్ళు జరుగుతూనే ఉన్నాయి గత సంవత్సరంగా.
ఐఎస్ఐ చేసింది అని వార్తలు వస్తున్నాయి.

అసలు మన దేశంలో సెక్యూరిటీ ఇంత కరువయిందా ? ఇంటెలిజన్స్ సరిగా పని చెయ్యటంలేదా ?
అసలు ఎక్కడికయినా వెళ్ళాలంటేనే ఆలోచించేలా తయారవుతుందేమో ?

ఎంతయినా అన్ని చోట్లా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. కనీసం ఇప్పుడయినా ప్రభుత్వం కొంత మేల్కొని అప్రమత్తం కాకపోతే హైదరాబాదు ఇలా టెర్రరిస్టులకు, ఐఎస్ఐ వారికీ బలయిపోవడం జరుగుతూనే ఉంటుంది.

ఇకపోతే న్యూస్ చానళ్ళలో పార్టీల స్పందన చూస్తుంటే వెగటు వస్తుంది. జనాలను ఆదుకోవడం పోయి ప్రభుత్వం విఫలమయింది లాంటి షరా మామూలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరెప్పుడు బాగుపడతారో ?

ఈ సంఘటనలో చనిపోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను.

ఉబుంటు "ఫియెస్టీ ఫాన్" …

మన ఉబుంటు/కుబుంటు వాడకందారులందరూ ఇక మీ మీ ఆప్ట్-గెట్ లకి పని చెప్పండి. ఉబుంటు కొత్త రిలీజ్ “ఫియెస్టీ ఫాన్” వచ్చేసింది.

అద్భుతంగా ఉంది, ఇన్నాళ్ళూ నేను ప్రీ రిలీజ్ వర్షన్ వాడుతున్నాను. ఇది లినక్స్ ని డెస్క్‌టాప్ కి చేరువ చెయ్యడంలో ఎంతో పాత్ర పోషిస్తుందని ఆశిద్దాము.

ప్రతి ఆరు నెలలకీ ఒక మేజర్ రిలీజ్ తో అప్రతిహతంగా కొనసాగుతున్న ఉబుంటు ని ప్రయత్నించని వారందరూ తొందరలో ప్రయత్నించి చూడండి. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ ల కొత్త వర్షన్లను ఇంటిగ్రేట్ చేస్తూ కటింగ్ ఎడ్జ్ లో ఉంటుంది ఈ డిస్ట్రో.

దీనిని మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకునే ముందు ప్రివ్యూ లాగా చూడాలనుకుంటే ఇప్పుడు ఉబుంటు ఇన్స్టాలేషన్ లైవ్ సీడీ ద్వారానే సాధ్యం, కాబట్టి వాడి, నచ్చితే ఇన్స్టాల్ చేసేసుకోండి. కావాలనుకుంటే విండోస్ తో పాటూ డ్యువల్ బూట్ కూడా చెయ్యచ్చు. కానీ అవసరం రాదనుకుంట 😉

అంతే కాదు మీరు కుబుంటు సీడీ లను వారి వెబ్‌సైట్ నుంచి ఉచితంగా పొందవచ్చు (పోస్టల్ చార్జీలు ఏమీ వర్తించవు, మీ అడ్రస్ ఇస్తే చాలు). నేను ఇప్పటికే ఇంతకు ముందు రెండు వర్షన్లు ఇలా తెప్పించుకుని కొంత మందిని లినక్స్ కి పరిచయం చేసాను, మీలో కూడా ఎంతో కొంత మంది దీనిని వాడి చూస్తారని ఆశిస్తున్నా.

జై ఉబుంటూ, జై జై ఉబుంటు…

బొమ్మరిల్లు స్పూఫ్ మరికొన్ని వీడియోలు …

బొమ్మరిల్లు సినిమా స్పూఫ్ ని ఇక్కడ చూడండి.
embed చెయ్యకుండా నిషేధించడం వల్ల ఇక్కడ ఉంచట్లేదు. ఈ లంకెను వెంబడించండి. (http://www.youtube.com/watch?v=7jZMguuWWhw)

వీరి నుండే ఇంకొన్ని వీడియోలు ఇక్కడ చూడవచ్చు. (http://www.youtube.com/profile?user=vijayamcreations)

 

జనాలకి సృజనాత్మకత బాగా ఎక్కువయిపోయింది కదూ 🙂

బంతితో మలింగ గారడీ…

శ్రీ లంక, సౌత్ ఆఫ్రికా మాచ్ లో మొన్న మలింగ బండార నాలుగు బంతుల లో నాలుగు వికెట్లు తీసాడు. అద్భుతమయిన బౌలింగ్.

శ్రీ లంక 209 పరుగులు చేసింది, సౌత్ ఆఫ్రికా గెలవడానికి నాలుగు పరుగులు కావాలి, అయిదు వికెట్లు చేతిలో ఉన్నాయి. పొలాక్, కలిస్ బాటింగ్ చేస్తున్నారు. ఇంకెంత ఒక ఫోర్ కొడితే అయిపోయింది అనుకున్నారు.

అప్పుడే మలింగ బౌలింగ్ కి వచ్చాడు. నాలుగు బంతులయిపోయాయి, వికెట్లేమీ రాలేదు. అయిదో బంతి సర్రున దూసుకు పోయి పొలాక్ వికెట్లు పడగొట్టింది. బౌల్డ్ …
తర్వాత బాట్స్‌మన్ హాల్ వచ్చాడు. మొదటి బంతి, కాచ్. అవుట్.

ఓవరయిపోయింది.

మళ్ళీ బౌలింగ్ కొచ్చాడు మలింగ. అందరిలో ఒక్కసారే ఉత్కంఠ. ఎమవుతుందో అని. మొదటి బాల్ కలిస్. డ్రైవ్ చేసి కీపెర్ కి నిక్ చేసాడు. మలింగ హాట్రిక్.

అంతలో మలింగ తరవాతి బాల్ వెయ్యటానికి వచ్చాడు. ఎన్‌తిని బాటింగ్. మలింగ యార్కర్ వేశాదు. క్లీన్ బౌల్డ్.

ఇక ఒక్క బాట్స్‌మన్ మిగిలాడు. శ్రీ లంక గెలుస్తుందేమో అని అందరూ చూస్తున్నారు. మలింగ బాల్ వేసాడు. పీటర్సన్ బాట్ ఎడ్జ్ తీసుకుని బౌండరీకి వెళ్ళిపోయింది. సౌత్ ఆఫ్రికన్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

 

ఆ ఘట్టం మళ్ళీ చూడండి.

 

 

నువ్వెంత ?? నేనెంత ??

జనాలకి తమ మీద కంటే పక్క వారి మీద ధ్యాస ఎక్కువ. ఎందుకో అర్థం కాదు.

ఉదాహరణకి మొన్న ఇండియా ఓడిపోయినప్పుడు చూడండి జనాలకి ఇండియా ఓడిపోయినా పాకిస్తాన్ కూడా ఓడిపోయినందుకు సంతోషం. అంటే పాకిస్తాన్ ఓడిపోతే ఇండియా ఓడిపోయినా పర్వాలేదన్నమాట.

మన దైనందిన చర్యలో ఇతరులతో పోల్చుకోవడం ఒక భాగమయిపోయిందనుకుంట. ఒక ఉదాహరణ చెబుతాను. నేను నా స్నేహితులను కలుస్తుంటాను అప్పుడప్పుడూ. ఒక పది నిముషాలు గడిస్తే చాలు ఇక మొదలు ఏంట్రా ఎంతొస్తుంది నీకు ? ఆ ప్రశ్న అడిగి ఒక పది క్షణాలు ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తుంటాడు ఎంతని సమాధానం చెబుతానో అని. ఒక వేళ వాడికంటే తక్కువయితే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు లేక పోతే ఇక టెన్షన్ స్టార్ట్ అన్నమాట. అవసరమా ? ఏ నీకొచ్చేదాంతో నువ్వు సంతొషంగా ఉన్నావో లేదొ చూసుకుంటే చాలదా ? ఎప్పుడూ పక్క వాడితొ పోలిక అన్నమాట.

ఇక మనం మన ఊళ్ళకు వెళితే చూడాలి. ఏం బాబూ ఎక్కడ పని చేస్తున్నావు ? ఎంతొస్తుంది ? అనే ప్రశ్నలతోనే సంభాషణలు మొదలవుతాయి. ఏదో MNC పేరు చెప్పారనుకోండి, అయ్యో అవునా infosys, wipro లలో రాలేదా ? మా వాడు సత్యం లో పని చేస్తాడు. ఇక జీతం గురించి దాటేయాలని చూస్తే మా వాడికి ఇంతొస్తుంది తెలుసా ? అని ముందే చెప్పేస్తారు ఇక నీకు చెప్పక తప్పదు అని. ఇక అక్కడ నుంచి మళ్ళీ పోలికలు మొదలన్నమాట. అయ్యో నీకు అంతేనా మా వాడికి అయితే ఇంతొస్తుంది, కారు, ఫ్లాటు అన్నీ ఇస్తున్నారు. ఇక తక్కువయితే మా వాడికి ఇంతకంటే రెట్టింపు జీతం ఇస్తానన్నారండీ కానీ వాడికి పని ముఖ్యం. అందుకనే చేరలేదు. ఏవో పెద్ద జీతలొస్తాయనే మాటే గానీ వాళ్ళ పని బాగోదటండీ. (Mr. Know it alls అన్నమాట).

ఇక మొన్న మా ఇంటికి ఒకాయనొచ్చారు బంధువు. ఇక పిచ్చాపాటీ మొదలయింది. ఇక ప్రశ్నల పరంపర అన్నమాట. ఏం బాబూ US వెళ్ళలేదా ? అక్కడ నీకు ఉద్యోగం రాలేదా ? మా వాడు వెళ్ళి అప్పుడే మూడేళ్ళ పైనే అయింది. గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది, కొన్నాళ్ళలో సిటిజన్ షిప్ కూడా వచ్చేస్తుంది. ఇక మనం చెప్పనవసరం లేదన్నమాట. నే వెళ్ళలేదంటే నేనో వెధవని. అంతా బాగుంటే నువ్వింకా ఇండియా లోనే ఎందుకుంటావన్నట్టు మాట్లాడాడు. చిరాకొచ్చింది. ఇంతా చేస్తే వాళ్ళ ఇద్దరు కొడుకులూ US లోనే ఉన్నారంట, గత రెండు మూడేళ్ళ నుంచీ వారిని చూడనేలేదు, అలా ఉంటారన్నమాట. అది వాళ్ళకి సంతోషం.

ఇక పోతే ఉద్యోగంలో చూడండి. మీకు హైక్ వచ్చింది. మీ మది లో అన్నిటి కంటే మొదటిగా మెదిలేది నా కొలీగ్ కి ఎంతొచ్చింది అని. ఇక ఎలాగయినా ఆ సమాచారం లాగాలని తెగ ప్రయత్నిస్తుంటారు. అంతే గానీ నాకు కావలసినంత నాకొచ్చిందా ? అని ఆలోచించరు.

ఈ పోల్చడం మన చిన్నప్పుడు ఎల్కేజీ లో రాంక్ దగ్గర నుంచి, అరవయ్యేళ్ళప్పుడు ఎన్ని పళ్ళు మిగిలున్నాయి అనేదాకా సాగుతుంది.

అలా అని పోల్చుకోవడం తప్పు అని నేను అనను. పాజిటీవ్ గా ఆలోచించి కష్టపడి అందరికన్నా ఎత్తులో ఉండాలనుకోవడం లో తప్పు లేదు. కానీ ఏమీ చెయ్యకుండానే అన్నీ వచ్చెయ్యాలని అనుకోవడమే తప్పు.

కాలర్ ట్యూన్ పోటేసింది…

హహహ… విహారి గారి ఈ టపా చూస్తే గుర్తొచ్చింది.

ఓ సారి ఇలాగే ఓ కాండిడేట్ ని టెలీఫోనిక్ ఇంటర్వ్యూ చెయ్యడానికి ఫోను చేసాను.
కాండిడేట్ హైదరాబాదు నుంచి. అవతల పక్కనుంచి “ఎయ్ పోటు ఎయ్ పోటు” అంటూ జెమినీ చిత్రం నుంచి పాట, హెలో ట్యూన్ అన్నమాట.

ఇక నేను మా కొలీగు ఐదు నిమిషాలు ఒకటే నవ్వు.
ఆ తర్వాత పోటేసామనుకోండి 😉 అది వేరే విషయం.

బెంగుళూరు బార్‌కాంప్…

బెంగుళూరులో ఉండే బ్లాగు మిత్రులకు:

ఈ నెల మార్చ్ 31, ఏప్రిల్ 1 న బెంగుళూరు బార్‌కాంప్ ఆర్గనైజ్ చెయ్యబడుతున్నది. బార్‌కాంప్ గురించి తెలియని వారు ఇక్కడకు ( http://barcampbangalore.org/wiki/Main_Page ) వెళ్ళి చూడండి.

ఒక చిన్న ఇంట్రడక్షన్ ఈ కింద:

Barcamp is an adhoc gathering, an open event for people to meet up, share, exchange ideas and possibilities. We turn around the notion of a formal conference by eliminating the distinction between speakers and delegates. Everyone is just a participant, and is equally welcome to propose a discussion, moderate it, or speak up on a topic they are familiar with.

ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి ఇక్కడ. ఇంతకు ముందు నేను అటెండ్ అయ్యాను. మీకు వీలుంటే మీరూ ప్రయత్నించండి.

కుదిరితే తెలుగు బ్లాగుల గురించి, localization గురించి మాట్లాడుదాము.

మహిళా దినోత్సవం…

ఇక్కడున్న మహిళలందరికీ “మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”.

అందరికీ ఓ దినం ఉన్నప్పుడూ పురుషుల కీ ఓ దినం ఉంటే పోయేది. ఎందుకు లేదో ?
పురుషులతో సమానం అయినప్పుడు వారికి ప్రత్యేకించి ఒక దినం ఎందుకో ?

ఓకే! తప్పుదారి పడుతున్నట్టున్నాను. సెలవు.

పాడాలని ఉంది…

అవసరమయినంత వరకు విమర్శలు ఎంతో అవసరం అని భావించే వారిలో నేను ఒకడిని. ఒక సద్విమర్శ కలిగించినంత మేలు మనకు ప్రశంస కూడా కలిగించదేమో…

కానీ నాకు నచ్చనిదేమిటంటే విమర్శలు మాత్రమే చెయ్యడం. ఉదాహరణకి ప్రతి ఆదివారం మా నాన్నగారు పాడాలని ఉంది అనే కార్యక్రమం చూస్తారు. (మా టీవీ లో అనుకుంట.)

నాకు ఈ ప్రోగ్రాం అంటే చిరాకు, కారణం బాలసుబ్రమణ్యం. ఇందులో ఆయన ఏ నాడూ ఎవరినీ పొగడగా నేను చూడలేదు. తప్పులని సరి చెయ్యడం ఎంతో ముఖ్యం, కాదనను. కానీ తప్పులు ఎంచడం మాత్రమే పనిగా పెట్టుకుంటే ??

ఎంచగ్గా ఈనాటి పిల్లలు, యూత్ అంతా చక్కని పాటలు ఎంచుకుని పాడుతుంటే కూడా అందులోని మంచిని ఏ నాడూ చూడలేకున్నారు ఆయన. ఆయన ఎంత మంచి గాయకుడయినా అది ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించింది. మరి ఇప్పుడిప్పుడు పాడుతున్న కొత్త వారినుండి ఆ స్థాయిలోనే ఆశించడం ఎంత వరకు సమంజసం. ఆ కొత్త గాయనీ గాయకులకు విమర్శ ఎంత ముఖ్యమో ప్రశంస కూడా అంతే ముఖ్యం. ఆయన వారి confidence ని పటా పంచలు చేస్తే వారికి నేర్చుకోవాలనే ఉద్దేశ్యమే పోయే అవకాశం ఉంది.

అదీ కాక ప్రతి ఎపిసోడులోనూ నేను సంగీతం నేర్చుకోలేదు, అయినా కష్టపడి ఈ స్థితి కి చేరుకున్నాను అంటూ సెల్ఫ్ డబ్బా ఒకటి.

ఆయనే గనక మరి అంత ఐడియల్ అయితే ఆయన జీవిత కాలంలో ఎంత మంది యువ గాయనీ గాయకులని ప్రోత్సాహించాడో చెప్పమనండి.

ఆయనేదో తప్పు చేసాడని, ఆయన మంచి గాయకుడు కాదు అని నా ఉద్దేశ్యము కాదు. కానీ ఆయన చక్కని సూచనలిచ్చి దానితో పాటు వారికి ప్రశంసలూ అందిస్తే అది చక్కగా చేరవలసిన చోటుకి చేరుతుంది అని నా అభిప్రాయం.