ఈ జనరేషన్ తప్పేంటి ?

నాకు ఈ పత్రికలు ప్రచురించే “ఈ జనరేషన్” వ్యాసాలంటే ఎంతో చిరాకు. వీళ్ళు ఈ జనరేషన్ అంటే ఒట్టి వెధవలు, అతిగా దుబారా చేస్తారు, ఖర్చు పెడతారు అని, డబ్బు అంటే లెక్క లేదు అని, ప్లానింగ్ లేదు అని ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు.

అవును నిన్నటి జనరేషన్ కంటే ఎక్కువ డబ్బులు వస్తుండవచ్చు, అది ఈ జనరేషన్ తప్పా ? వచ్చిన డబ్బుని తగినట్టు ఖర్చు పెట్టాలనుకుంటారు, లైఫ్ ని కొద్దిగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. అది కూడా తప్పయితే ఇక ఏమి చెప్పాలి ?

ఈ జనరేషన్ అంటే ఇంత చులకనా ? ప్రతి ఒక్క పత్రిక, మ్యాగజైను IIT, IIM ల విద్యార్థులకు ఇంతొస్తుంది, అంతొస్తుంది. ఇప్పుడు జీతలు ఇంతున్నాయి, అంతున్నాయి అని అవేదో వీరికి అక్కరగా వస్తున్నట్టు చెబుతున్నాయి. ఏ వీరికి వర్త్ లేందే ఎందుకు వస్తున్నాయి ?

ఏ ఇక్కడ రాసే తెలుగు బ్లాగర్లలో ఎంత మంది ఈ జనరేషన్ వారు లేరు, మరి అందరికీ తెలుగు మీద అభిమానమే కదా ? ఎంత మంది ఇంతకు ముందు జనరేషన్ వారి కంటే ఎక్కువగా భాష గురించి తెలుసుకోవాలని తపిస్తున్నారు. ఎంతగా లోతుగా ఆలోచించి వివిధ విషయాల మీద కూలంకషంగా రాస్తున్నారు. మరి వీరంతా ఈ జనరేషన్ అని ఎందుకు గుర్తించరో ?

ఏ జనరేషన్లో చూసినా మంచి వారు, చెడు వారు ఇద్దరూ ఉన్నారు. బాగు పడిన వారు, చెడిపోయిన వారు ఉన్నారు. కాకపోతే ఇవాళ కొత్తగా వచ్చిన opportunities వల్ల ఎక్కువ మంది కి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, లైఫ్ లో త్వరగా సెటిల్ అవగలుగుతున్నారు. అవును ఒప్పుకుంటాను ఇప్పుడు పెరిగిన జీతాల వల్ల అఫర్డబిలిటీ పెరిగింది, అందుకని కొన్ని దుబారా ఖర్చులు చేస్తూ ఉండవచ్చు, కొందరు చెడిపోతూ ఉండవచ్చు కూడా. అంత మాత్రాన అందరినీ ఒకే గాటిన ఎలా కట్టేస్తారు ?

వారి జీతాలు చూసి రియల్ ఎస్టేట్ మొదలయిన రంగాల వారు దానిని అలుసుగా తీసుకుని తెగ పెంచేస్తే అది ఈ జనరేషన్ తప్పెలా అవుతుంది. అయితే పెరిగింది అని కొనకుండా ఎలా ఉండగలం ? ఇవాళ x ఉన్నది రేపు y అవుతుంది. అదీ కాక ఇప్పుడు కొనకుండా ఒక పదేళ్ళు పోయిన తరవాత నేను ఎంజాయ్ చెయ్యలేనప్పుడు కొనాలా ? పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవాడానికా నేను సంపాదించేది ?

అవును ఇప్పటి వరకూ అన్ని జనరేషన్లూ ఇలాగే ఆలోచించారు. నా పిల్లలకి, వారి పిల్లలకి అంటూ. అలా చెయ్యడం నాకు ఇష్టం లేదు. అలాగని వారి కోసం ఏదీ చెయ్యవద్దు అని కూడా కాదు. దేనికయినా ఒక బాలన్స్ ఉండాలి. ఎప్పటికీ దాస్తూనే ఉంటే ఇక ఎంజాయ్ చేసేది ఎప్పుడు ?

నాకు ఉద్యోగం రాగానే మా నాన్న గారికి నేను మొదట చెప్పింది ఇక నుంచి నా కోసం ఏదీ దాచవద్దు. ఇప్పటి వరకూ చేసింది చాలు, ఇక లైఫ్ ఎంజాయ్ చెయ్యండి అని. ఆయన లో నాకు నచ్చింది ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్. అందరికీ అన్నీ సమకూర్చి లైఫ్ లో అన్నీ ఎంజాయ్ చేసారు. నా కోసం నేను సంపాదించుకోగలను. నేను స్థిరపడేంత వరకూ నన్ను సపోర్ట్ చేసారు చాలు. ఇక కూడా నేను నా అంతట బతకలేకపోతే ఎందుకు ? కానీ ఇప్పుడు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. డబ్బు ఉంది. ఖర్చులూ ఉన్నాయనుకోండి. కానీ కొద్దిగా సర్ప్లస్ ఉన్నవాళ్ళు దాన్ని కొంత ఆనందం కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదంటాను. దానితో పాటూ సేవింగ్స్ కూడా చెయ్యాలి. స్థిరాస్తులు కొనుక్కోవాలి. రేపటి కోసం ఆలోచించాలి. ఆలోచిస్తున్నారు.

కాబట్టి అనవసరంగా ఎవరినీ నిందించవద్దు.

రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుందా ?

రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుంది అంటే నేను అసలు ఒప్పుకోను. అది ఎప్పటికయినా చెడే చేస్తుంది. ఎప్పుడో ఎన్నాళ్ళ క్రితమో కులాల, మతాల ప్రాతిపదికన చేసిన రిజర్వేషన్లను మన దగా రాజకీయ నాయకులు ఇంత వరకూ వాడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో వర్తించిందని ఇప్పుడు కూడా వర్తిస్తుందని అనుకోవడం ఎంత వరకూ సమంజసమో నాకు తెలీదు. ఒక వేళ అలాగే అనుకున్నా ఇంత కాలం ఆ రిజర్వేషన్ల వల్ల జరగని మంచి ఇక ముందు మాత్రం జరుగుతుందని నమ్మకమేంటి. ఒక సారి రిజర్వేషన్లు వర్తింపచెయ్యడమే కానీ, అది తీసేసే దమ్ము ఎవరికీ లేదు.

మంచి రాంకు వచ్చి కాలేజీలో సీటు కోసం ప్రయత్స్నిస్తుంటే పక్కన రాంకు రాని వారూ, అన్నీ ఎక్కువగానే ఉన్నా (రాంకు తప్ప) రిజర్వేషను ఉంది అన్న ఒక్క సాకుతో మన ముందే సీట్లు తన్నుకుపోతుంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.

మహిళా బిల్లో, రిజర్వేషన్లో అంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు బిల్లు తెస్తే సరిపొతుందా ? వారికి తగిన క్వాలిఫికేషన్స్ అక్కర్లేదా ? ముందు వారిని సరయిన మార్గాన పైకి తేవడం గురించి అలోచించకుండా రిజర్వేషన్లు తెస్తే సరిపోతుంది అన్నట్టుగా అందరూ మాట్లాడటం నాకు చిరాకు తెప్పిస్తుంది.

రేపటి నుంచి టికెట్ దక్కని ప్రతీ రాజకీయ నాయకుడి అక్షరమ్ముక్క చదవని భార్యలు కూడా అసెంబ్లీ లో కూర్చుంటారు. వారు చేసేది దేశానికి మంచా ??

దళితుల మీద అన్యాయం జరిగింది, జరుగుతుంది ఒప్పొకుంటాను, కానీ రిజర్వేషన్ల వల్ల దాంట్లో ఏ మార్పు వచ్చింది ? అంటే ఈ విధానం సరిగా పని చెయ్యట్లేదనే గా ? మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం అలోచించాలిగా ?

అలాగని ఇక్కడ నేను రిజర్వేషన్లు ఉన్న వారినీ, మహిళలని కించపరచట్లేదు. ఎంతో మంది ఉన్నతంగా ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు, దక్షతా కలిగి ఉన్నారు. వారిని రానీండి, దానికోసం దారులు వెతకండి.

సమానం సమానం అంటూనే ఎంత సేపూ ప్రత్యేకంగా చూడాలనటమే మనం చేసే మొదటి తప్పు అని నా అభిప్రాయం.

నేను అనుకున్నది చెప్పాను, ఎవరినయినా బాధిస్తే నేనేమీ చెయ్యలేను. క్షమించమని అడగను.