ఫైవ్ పాయింట్ సమ్‌వన్, ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ – చేతన్ భగత్

కొన్ని పుస్తకాలు చదవడానికి కారణం అవసరం లేదు. అంటే అది చదవడానికి అది ఏదో పెద్ద రచయితది అవనవసరం లేదు. ఇంకేదో మంచీ, చెడూ చెప్పనక్కర్లేదు.
ఇవేవీ లేకపోయినా వీటికి ఎంటర్టెయిన్‌మెంట్ వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక రెండు పుస్తకాలు ఈ మధ్య చదివాను. రెండూ ఒక రచయిత రాసినవే.

ఇవి మన యువ బ్లాగు మిత్రులలో చాలా మందే చదివి ఉంటారు. నేను చెప్పేది చేతన్ భగత్ గురించి. అతను రాసిన “ఫైవ్ పాయింట్ సమ్‌వన్”, “ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” పుస్తకాల గురించి.
వీటిని నవలలనలేము, అలాగని స్వగాతలనీ అనలేము. కొంత నిజం, కొంత కల్పితం, కొంత ఆటో బయాగ్రఫీ ని మేళవించి చెప్పిన కథలు.

ముఖ్యంగా ఈ పుస్తకాలలో మనని ఆకట్టుకునేది సాఫీగా సాగిపోయే పదజాలం, మనకి తెలిసనట్టే ఉండే సన్నివేశాలు, ఏదీ బోధించని తత్వం. (అంతర్గతంగా కథలో భాగంగా కొంత నేర్చుకోదగింది ఉంటుందనుకోండి)

ఉదా: అతని “ఫైవ్ పాయింట్ సమ్‌వన్” పుస్తకం తీసుకుంటే అది ఐఐటీ లలో జీవితం గురించి. అక్కడ రాగింగు, స్నేహితులతో జల్సాలు, చదువు అనే ఒక చట్రం, ఆ సంకెళ్ళని తెంచుకుని బయటపడడానికి జరిపే ప్రయత్నం, లవ్ స్టోరీలు వగయిరా వగయిరా.

ఓ ముగ్గురు ఐఐటీ విద్యార్థుల కథ ఇది (అందులో రచయిత ఒకడు). అక్కడ చేరినప్పటి నుంచీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, అక్కడ కష్టాలని ఎలా ఎదురుకున్నారో, అర్థం లేని చదువులను కెరీర్ కోసమే బట్టీయం వేయలేక ఎలా తికమక పడ్డారో చెబుతాడు.
అలానే చిన్న చిన్న సరదాలు, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పట్టించుకోని తనం, వారు చేసే తప్పులు, వాటిని సరిదిద్దుకోవడానికి పడే పాట్ల గురించీ ఉంటుంది కథలో.

పైన చెప్పిన వాటన్నిటినీ ఒక చక్కని సరదాగా సాగిపోయే కథలా చెప్పడంలో విజయం సాధించాడు చేతన్. పుస్తకానికి ముందే చెబుతాడు అతను ఈ పుస్తకం ఐఐటీలో ప్రవేశించడానికి కాదనీ, అక్కడ జరిగే సంగతుల గురించి చెప్పటానికి మాత్రమేననీ. చెప్పినట్టే ఉంటుంది పుస్తకం.

సరదాగా ఏ ప్రయాణంలోనో టైం పాస్ కి అద్బుతమయిన పుస్తకం ఇది. నేను అలానే చదివాను దీనిని 🙂

ఇక రెండో పుస్తకమూ ఇతనిదే. మొదటి పుస్తకం నచ్చి ఇది కూడా కొన్నాను.

ఈ కథ ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన మూడు తప్పుల గురించి స్వగతంలా చెప్పుకునే కథ. జీవితంలో వ్యాపారం చేసి కోట్లు గడించాలనుకునే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, అతను ఏం తప్పులు చేసాడు, అతనిని ఆత్మహత్యకి ప్రయత్నించేలా చేసిన సందర్భాలేంటి అనేది పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.

చక్కని యువ రచయితగా తనను తాను స్థాపించుకున్న చేతన్ పుస్తకాలు సినిమాలుగా కూడా మారబోతున్నాయి. అన్నట్టు అతను రాసిన ఇంకో పుస్తకం కూడా ఉందండోయ్… “వన్ నైట్ ఇన్ కాల్‌సెంటర్”. అది క్యూలో ఉంది 🙂