విండోసు ఉపకరణాలకి లినక్సు ప్రత్యామ్నాయాలు …

లినక్సు గురించీ, ఉబుంటు గురించీ నా ఇంతకు ముందు టపాలలో కొన్ని సార్లు చెప్పాను.

ఎంత కాదనుకున్నా ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే విండోసు, మాక్ లాంటి కమర్షియల్ ఆపరేటింగు సిస్టమ్‌ లనే జనాలు ఎక్కువగా వాడతారు.

జనాలు ఎందుకు లినక్సు ఉపయోగించరు అని ప్రశ్నించుకుంటే మామూలుగా వచ్చే సమాధానాలు చాలా వరకూ అపోహలనే అనిపిస్తుంది. ఒకప్పుడు వాడుకరులకి అనుకూలంగా కాక గీకులు మాత్రమే ఉపయోగించే విధంగా లినక్సు ఉండేది. అది నిజం.
ఏ పని చెయ్యాలన్నా కమాండు లైను నుంచి చెయ్యాల్సి వచ్చేది. ఆ తరువాత దానికి జోడింపులు వచ్చి ఎక్స్ విండో సిస్టం వచ్చినా ఆ ముద్ర మాత్రం వదలలేదు.

అందుకని జనాలకు మామూలుగా ఉండే కొన్ని అపోహలను దూరం చేసి, లినక్సులో రోజువారీగా వాడుకోడానికి కావలసిన ఉపకరణాలు కొన్నింటి గురించి ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తాను.

౧. చూడడానికి బాగుండాలి:

విండోసు వాడిన వారందరికీ ముఖ్యంగా నచ్చే విషయం అది చూడడానికి బాగుంటుంది. కంటికింపుగా ఉంటుంది. నాకయితే “విండోస్ ఎక్స్పీ” ముందు వరకూ విండోసు నచ్చేది కాదు. ఎక్స్పీ మాత్రం నన్ను చూపులతో ఆకట్టుకుంది. విస్టా ఏరో ఎఫెక్టులతో దానిని ఇంకో ముందంజ ?? వేయించినా దానిని ఉపయోగించాలంటే ఒక జీబీ పైన రామ్‌ అవసరమవుతుంది.

మరి లినక్సు చూడడానికి బాగుంటుందా ?

దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే ఇది అభిరుచికి సంబంధించినది. (నాకు విస్టా కంటే ఎక్స్పీ నే బాగుందనిపించింది.)
కాకపోతే ఇక్కడ కొంత వివరిస్తాను. కొన్ని తెర పట్టులు చూపిస్తాను. మీరే నిర్ణయించుకోవచ్చు.

స్థూలంగా చూస్తే లినక్సులో ఉండే ముఖ్యమయిన విండో సిస్టములు రెండు. గ్నోమ్‌, కేడీయీ (ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కువ మంది వాడేది ఇవే). సింపుల్ గా, పని చేసే వ్యవస్థ కావాలనుకునే వారు గ్నోమ్‌ వాడతారు. మంచి చాక్లెటీ లుక్సూ, చూడడానికి బాగుండాలి అనుకునే వారు కేడీయీ వాడతారు.

గ్నోమ్‌ (ఉబుంటు మీద)

కేడీయీ (కుబుంటు మీద)

నా మటుకు నేను ఎక్కువగా కేడీయీ వాడతాను. (మీరూహించినందుకు కాదు 😉 )

ఇంకో విషయమేమిటంటే లినక్సుని మనం అద్భుతంగా కస్టమైజు చేసుకోవచ్చు.

ఉదా: గ్నోమ్‌ ని మాక్ లాగా ఇలా మార్చుకున్నాను నేను.

వీటన్నిటికీ మించి కాంపిజ్ ఎఫెక్ట్లు చేతనం చేసిన ఈ తెరపట్టులు చూడండి.

మీకు ఇంకా లినక్సు చూడడానికి బాగుండదనే అనిపిస్తుందా ???

౨. ఆఫీసు ఉపకరణాలు:

లినక్సుకి మారాలనుకున్న వారికి ఇంకో పెద్ద సమస్య ఆఫీసు ఉపకరణాలు. అంటే వర్డు, ఎక్సెలు, పవర్‌పాయింటు లాంటివి.

దీనికి లినక్సు ప్రత్యామ్నాయం “ఓపెన్ ఆఫీస్“.






మొత్తం కావలసిన ఉపకరణాలు అన్నీ ఇందులో ఉంటాయి. వర్డు ప్రాసెసరు, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషను వగయిరా అన్నీను.
ఇంకొక విషయమేమిటంటే మైక్రోసాఫ్టు ఆఫీసు అన్ని అప్లికేషన్లతోనూ ఇది కంపాటిబుల్. అంటే మీ .doc, .xls, .ppt వంటి వాటినన్నిటినీ ఓపెన్ ఆఫీసులో తెరవవచ్చు, మార్చవచ్చు, కొత్తవి సృష్టించవచ్చు.

౩. మెయిలు

మామూలుగా జనాలు తమ కార్పొరేట్లలో “మైక్రోసాఫ్టు ఎక్స్చేంజు” వాడతారు. దానికి క్లయింటుగా “అవుట్‌లుక్” వాడతారు. ఎందుకంటే వారు ప్రొప్రయిటరీ ప్రోటోకాల్ వాడతారు.

దానికి లినక్సులో ప్రత్యామ్నాయం “ఎవల్యూషన్“.

ఇది అన్ని రకాల ప్రోటోకాల్స్ తో (పాప్, ఐమాప్ వగయిరా…) పాటు “ఎక్స్చేంజు” ప్రోటోకాల్ ని కూడా సపోర్టు చేస్తుంది. దీనితో మీ కాలెండరు కూడా పని చేస్తుంది. మీటింగులు గట్రా అన్నీ దీని ద్వారా పని చేస్తాయి.

అలాగే మీకు తెలిసిన “థండర్‌బర్డ్” ఎలాగూ ఉండనే ఉంది.

౪. మల్టీమీడియా:

నాకయితే పని చేస్తున్నంత సేపూ పాటలు చెవిలో మోగాల్సిందే. అలాంటప్పుడు మంచి సంగీతం పాడే ప్లేయరు చాలా అవసరం.
అలాగే రోజూ ఒక సినిమా చూడాల్సిందే. అందుకని అన్ని రకాల ఫార్మాట్ల సినిమాలనూ చక్కగా ప్లే చేసే ప్లేయరు కూడా చాలా అవసరం.

విండోసులో అయితే విన్ ఆంప్, విండోసు మీడియా ప్లేయరు, వీఎల్సీ లాంటివి ఉంటాయి. మరి వాటికి లినక్సు ప్రత్యామ్నాయాలో ?

పాటలకి “అమరాక్” అనే ఒక అద్భుతమయిన ప్లేయరు ఉంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లేయరు. దాదాపు అన్ని రకాల ఫార్మాట్లనూ ప్లే చేస్తుంది. నాకయితే ఇది లేనిదే రోజు గడవదు. (ఇది పాటలు పాడుతుంది. స్ట్రీమ్‌ లను అర్థం చేసుకుంటుంది. ఐపాడ్, సాన్‌డిస్క్ లాంటి మీ మ్యూజిక్ ప్లేయర్లను గుర్తించగలుగుతుంది. వాటిని సింక్ చేయగలుగుతుంది.)

ఇంకా రిథమ్‌ బాక్స్, టోటెమ్‌, కెఫీన్ లాంటి ఎన్నో ప్లేయర్లు ఉపలబ్ధం.

అలాగే సినిమాలు ప్లే చెయ్యడానికి నాకు అన్నిటికన్నా నచ్చేది “క్సైన్“. ఇది ఒక అద్భుతమయిన ప్లేయరు. దాదాపు అన్ని రకాల ఫార్మాట్లనూ ప్లే చేస్తుంది. చక్కని క్వాలిటీ చిత్రం అందిస్తుంది. ఇంకో సంగతేమిటంటే‌ మనకెంతో ఇష్టమయిన వీఎల్సీ ప్లేయరు లినక్సులో కూడా లభ్యం.

౫. ఇంటర్నెట్ మెసెంజరు:

విండోసులో మనం ఎక్కువగా యాహూ మెసెంజరు, గూగుల్ టాక్, ఎమెసెన్ మెసెంజరు వాడతాము. వాటన్నిటికీ ఒక్కో మెసెంజరు తెరిచి ఉంచాలి, లేదా “పిడ్జిన్” లాంటి ఓపెన్ సోర్స్ క్లయింటు వాడి అన్నిటికీ అనుసంధానం కావచ్చు.

పిడ్జిన్ మొదటగా లినక్సు కోసం రూపొందించిందే. అద్భుతమయిన క్లయింటు ఇది. యాహూ, గూగుల్ టాక్, ఏఓఎల్, ఎమెసెన్, జాబర్ వంటి ఎన్నో ప్రోటోకాల్స్ ని ఇది సమర్థిస్తుంది.

ఇంకా “కోపీటె” లాంటి ఇతర క్లయింటులు కూడా ఉన్నాయి.

౬. ఇమేజింగు:

ఎక్కువగా విండోసు మీద జనాలు ఫోటోలకీ, వాటితో పని చేయ్యడానికీ ఫోటోషాపు, పెయింట్.నెట్, కోరెల్ డ్రా లాంటివి వాడతారు.

దానికి లినక్సులో ప్రత్యామ్నాయాలు గింప్, ఇంక్‌స్కేప్ వాడవచ్చు.

౭. విహరిణి:

లినక్సు మీద ఎన్నో విహరిణులు లభ్యం. మన మంట నక్క లినక్సు మీద ఉంది. అలాగే ఓపెరా, కాంక్వరర్, లింక్స్ లాంటి ఎన్నో విహరిణులు లినక్సు మీద లభ్యం.

తెలుగులో రాయడం:

తెలుగులో రాయడానికి విండోసులో బరహ, అక్షరమాల లేదా ఇన్‌స్క్రిప్టు వాడతాము.

దానికి బదులుగా లినక్సులో స్కిమ్‌ లేదా మన భాష కీబోర్డు వాడవచ్చు.

ఇవన్నీ మనం రోజువారీ ఉపయోగించే ఉపకరణాలు. ఇవి కాక మనకు కావలసిన పనులన్నిటికీ ఉపకరణాలు లినక్సులో లభ్యం.

మీకు ఇంకో వార్త. ఇప్పటి వరకూ లినక్సులో మాత్రమే లభ్యమయిన కేడీయీని ఇక పైన విండోసు మీద కూడా పరిగెత్తించవచ్చు. QT అనే క్రాస్ ప్లాట్ఫాం మీద రూపొందించడం వల్ల కేడీయీని తేలికగా విండోసు మీదకి కూడా పోర్టు చెయ్యడం కుదురుతుంది. ఇప్పటికే దీని బీటా వర్షన్లు కూడా లభ్యం. అంటే ఇక పైన మీకు ఇష్టమయిన “అమరాక్” లాంటి ఉపకరణాలు విండోసు మీద కూడా లభ్యమవుతాయి అన్నమాట.

మరి ఇంత పరిపూర్ణమయిన ఆపరేటింగ్ సిస్టం ని వాడకుండా ఎలా ఉండగలరు ? 🙂

ఇది చూడండి: ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు అన్నీ నావి కావు. కొన్ని ఆయా సైట్ల నుంచి తీసుకోవడం జరిగింది. వాటిపై హక్కులన్నీ వారివే.