వేగంగా మారుతున్న మొబైలు విపణి …

మొబైలు మనకి కేవలం మాట్లాడుకునేందుకు కాక మరెన్నో చేసేదిగా ఎప్పుడో మారిపోయింది.

మొదట మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగించేవాళ్ళం. తర్వాత ఎసెమెస్ లు వచ్చిన తర్వాత టెక్స్టింగ్ మొదలయింది. తర్వాత మొబైలుని పాటల కోసం వాడడం మొదలుపెట్టారు. ఇంకొంత కాలానికే అందులో కెమెరా, వీడియో వచ్చి చేరాయి.

కానీ ఇవే కాకుండా మోబైలు రంగాన్ని మార్చింది దీంట్లోంచి అంతర్జాలానికి అనుసంధానం కాగలగడం. ఇక అప్పటి నుంచీ మొబైలు వాడుకదారులలో అంతర్జాలం వాడకం విపరీతంగా పెరిగింది. మొదట్లో అంత వేగంగా లేకపోయినా ఇప్పుడు 3జీ (మూడో జనరేషన్) టెక్నాలజీ సహాయంతో చక్కని డాటా రేట్లను సాధించడం సాధ్యమయింది. ముందు ముందు వచ్చే 4జీ టెక్నాలజీ వల్ల ఇంకా అద్భుతాలు సాధ్యం కానున్నాయి. గిగాబిట్ దగ్గర వరకూ వేగాలు సాధించవచ్చు కూడా.

భారతంలో ఇంకా జీపీఆరెస్, ఎడ్జ్ ఉన్నాయి కానీ ఇంకా 3జీ రాలేదు. కాబట్టి ఆ వేగాలు అందుబాటులో లేకపోవచ్చు ఇప్పటి వరకూ. కానీ తొందర్లోనే ఆ పరిస్థితి మారనుంది.

ఇక ఈ వేగాల వల్ల వచ్చిన మార్పులేమిటంటే అప్పటి వరకూ మొబైలుని కేవలం ఇత్యాది పనులకు ఉపయోగించిన వారు ఇప్పుడు సర్ఫింగు, ఛాటింగు, సోషల్ నెట్వర్కింగు, మాప్స్ మొదలయిన వాటికోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. అలాగే స్మార్టు ఫోన్ల ఉపయోగం పెరిగింది (బ్లాక్ బెర్రీ, ఐఫోను వంటివి)

ఆఫీసుకి సంబంధించిన మెయిళ్ళు, డాక్యుమెంట్లు ఫోనులోనే చూసుకునేలా ఏర్పాట్లున్నాయి ఇప్పుడు. ఎక్స్చేంజ్ వంటి ప్రొప్రయిటరీ ప్రోటోకాల్స్ వాడే మెయిల్ సర్వర్లకి కూడా అనుసంధానమయేట్టు వీలు ఉంది ఇప్పటి ఫోన్లలో.

దానికి తగ్గట్టు వాప్ ఆధారిత వెబ్‌సైట్లు చాలానే ఉన్నాయి. అలాగే మొబైలుకి తగ్గట్టుగా వెబ్‌సైట్లని డిజైన్ చెయ్యడం కూడా ఇప్పుడు సర్వ సాధారణం అయింది. (ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మామూలు మానిటర్ల రిజల్యూషనుకి డిజైన్ చెయ్యబడిన పేజీలు మొబైలు లాంటి చిన్న స్క్రీను మీద సరిగా కనబడే అవకాశాలు తక్కువ.)
కాబట్టి దానికి తగ్గట్టు సింపుల్ డిజైన్‌లు తయారు చేస్తున్నారు.

ఉదా: గూగుల్ వాడివి చాలా సైట్లు మొబైలుకి సరిపడా రూపొందించబడ్డాయి.

గూగుల్ ముఖ పుఠ – http://m.google.com
జీమెయిల్ – http://m.gmail.com
గూగుల్ మాప్స్ – http://m.google.com/maps

పై లంకెలని సందర్శిస్తే మీకే అర్థమవుతుంది ఎలా కస్టమైజ్ చెయ్యబడ్డాయో. అవసరమయిన దానికంటే ఏ మాత్రం ఎక్కువ సమాచారం ఇందులో ఉండదు.

ఇదొక్కటే కాదు దాదాపు పెద్ద సైట్లన్నిటికీ మొబైలు కి సరిపడే వెబ్‌పేజీలు ఉన్నాయి.

యాహూ – http://in.m.yahoo.com/
జోహో – http://m.zoho.com
ఫేస్‌బుక్ – http://m.facebook.com/

ఫోన్లలో విహరించడానికి ప్రత్యేకించి విహరిణులు ఉంటాయి. అన్నిట్లోకీ ఎక్కువగా వాడబడేది ఓపెరా మినీ (డెస్కుటాపు విపణిలో పెద్దగా శాతం దక్కించుకోలేకపోయినా మొబైలులో మాత్రం అధిక శాతం ఓపెరాదే). విండోస్ వాడే మొబైల్ మీద ఐఈ ఉంటుంది. అలాగే ఐఫోన్ లో సఫారీ. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్ కూడా మొబైలు కి తగ్గట్టుగా కొత్త విహరిణి ఒకటి సృష్టించే పని మొదలుపెట్టింది.

ఈ విహరిణులను ఉపయోగించి తేలికగా వెబ్‌సైట్లను సర్ఫ్ చేసుకోవచ్చు.

ఇవి ఇలా ఉంటే ఇంకో రకం మార్పులు కూడా మొదలయ్యాయి మొబైలు విపణిలో… అవి మొబైలు కోసం అప్లికేషన్లను సులభంగా తయారు చెయ్యడం కోసం SDK (Software Development Kit) లను విడుదల చెయ్యడం. మైక్రోసాఫ్టు వాడికి సొంత కిట్ ఉంది. అలాగే గూగుల్ ఈ మధ్యనే ఆండ్రాయిడ్ అని ఒక SDK ని రిలీజు చేసింది. (దీని ద్వారా మొబైల్స్ కోసం ఎన్నో రకాల అప్లికేషన్లు సృష్టించుకోవచ్చు. ఐఫోను కి ధీటుగా దీనినుపయోగించి అప్లికేషన్లను సృష్టించవచ్చని ఉవాచ.)
అలాగే ఆపిల్ కూడా ఐఫోను కోసం వాడి SDK ని విడుదల చేసింది.

(ఐఫోను కూడా ఐపాడ్ లాగా అద్భుతమయిన మార్కెట్టు సృష్టించుకుంది కానీ కొంత మంది సర్వీసు ప్రొవయిడర్లతో మాత్రమే టై అప్ అయింది. అయినా సరే ఐఫోను కోసం ప్రత్యేకమయిన వెబ్‌సైట్ ఇంటర్‌ఫేసులని కంపెనీలు సృష్టిస్తున్నాయంటేనే అది సాధించిన విజయం తెలుస్తుంది.)

వీటివల్ల ఏం జరిగుతుందంటే ఇప్పటి వరకూ ఊహించని అధ్బుతమయిన అప్లికేషన్లని చాలా సులభంగా తయారు చెయ్యవచ్చు (ఎన్నో మాషప్స్). అందుకని మొబైలు వాడకం ఇంకా ఆసక్తి కలిగించనుంది.

వెబ్ వాడకం ఎలాగయితే పెరిగిందో అలాగే మొబైలు మార్కెట్టు కూడా పెరుగుతుందని అంచనాలు వేస్తున్న కంపెనీలు చక్కని ప్రణాళికలతో వారి SDK లను ఉపయోగించి మొబైలు మార్కెట్టు మీద పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. (దీని వల్ల ముందు ముందు ప్రకటనలు గట్రా చొప్పించడానికి వీలు కల్పించుకోవడం అన్నమాట.)

పనిలో పనిగా మంచి మొబైళ్ళు కూడా కొనగలిగే ధరకి లభిస్తుండడంతో (అఫర్డబులిటీ కూడా పెరగడంతో) ఎక్కువ మంది జనం ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.