వెబ్ హోస్టింగ్, సాఫ్ట్ వేర్లు, వగైరా…

వెబ్ హోస్టింగ్ పెద్ద కష్టమేమీ కాదు. దానికి కావలసిందల్లా ఒక స్టాటిక్ ఐపి అంతే. మీ సొంత కంప్యూటర్ పైనే మీ వెబ్ సైట్ హోస్ట్ చేసుకోవచ్చు. కానీ మీ వెబ్ సైట్ ని ఐపి తో కాకుండా ఒక పేరు తో చేరుకోవాలంటే మీకు డొమైన్ నేం, DNS కూడా కావాలి.

మీకు ఒక వెబ్ సైట్ హోస్ట్ చెయ్యడానికి కావలసిన వి ఒక డొమైన్ నేం, వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్, DNS service (జనరల్ గా డొమైన్ నేం సర్విస్ తో పాటు DNS కూడా వస్తుంది.)

ఇందులో డొమైన్ నేం అంటే మీ వెబ్ సైట్ ని చేరుకోవడానికి ఉపయోగించే పేరు అన్నమాట. ఉదాహరణకి (koodali.org).

వెబ్ హోస్ట్ ప్రొవైడర్ మీ ఫైల్స్ ని పెట్టుకోవడానికి స్పేస్ కల్పిస్తుంది. ఉదాహరణకి (symonds.net)

DNS ఎందుకంటే, ఉదాహరణకి మీకో స్టాటిక్ IP ఉందనుకోండి, దానిని మీ డొమైన్ నేం కి మాప్ చెయ్యడానికోసం అన్నమాట. అంటే ఎవరయినా మీ డొమైన్ నేం టైప్ చేస్తే అది మీ IP కి చేరుతుందన్నమాట.

(ఇప్పుడు కొన్ని బ్రాడ్ బాండ్ ప్రొవైడర్లూ స్టాటిక్ ఐపి లు ఇస్తున్నాయి కాబట్టి మీరు మీ సొంత సిస్టం మీద హోస్ట్ చెయ్యాలనుకుంటే మీకు కావలసిందల్లా డొమైన్ నేం, DNS మాత్రమే. FreeDNS లాంటివి ఉపయోగిస్తే మీకు కావలసిందల్లా ఒక డొమైన్ నేం మాత్రమే.)

నేను నా సొంత వెబ్ సైట్ హోస్ట్ చెయ్యను కాబట్టి ఇందులో సాధ్యా సాధ్యాలు మరీ ఎక్కువగా చెప్పలేను, కానీ దీంట్లో కొన్ని చిక్కులు ఏమిటి అంటే Up Time. మీ సొంత సిస్టం, మీ బ్రాడ్ బాండ్ ఎంత వరకు Up Time కలిగి ఉంటాయి ? అదీ కాక మీరు infrastructure మీద కూడా invest చెయ్యాలి. అంటే మీకు కావలసిన హార్డ్ డిస్క్ స్పేస్, మెమోరీ, మొదలయినవి అన్నమాట, ఇక మీరు హోస్ట్ చేసేందుకు కావలసిన వెబ్ సర్వర్, డాటాబేస్ మొదలయినవి కూడా మీరే సెటప్ చేసుకోవాలి. అందుకే ఎక్కువ మంది third party సర్వీసులను ఉపయోగించుకుంటారు. అదీ కాక క్రాకర్లు, వైరసుల నుంచి మీ సిస్టం ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. (firewall మొదలయినవి సెటప్ చేసుకోవాలి.)

సరే ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే వీవెన్ ని సంప్రదించండి :):):)

ఇకపోతే నేను చిన్న చిన్న వెబ్ అప్లికేషన్లు రాస్తాను. సరదా కోసం. అదీ కాక కొన్ని ఇంట్రానెట్ వెబ్ ఆప్స్ హోస్ట్ చేస్తాను. కొన్ని నా కోసం, కొన్ని అందరి కోసం. అందుకు నేను వాడే సెటప్ గురించి ఇప్పుడు చెబుతాను. నేను ఎంతో పేరొందిన LAMP stack వాడతాను.

LAMP అంటే

L – Linux
A – Apache
M – MySQL
P – PHP

ఇది ఎంతో effective అయిన కాంబినేషను. వెబ్ లో అన్నిటికంటే ఎక్కువగా వాడే కాంబినేషను ఇదే. Yahoo! లాంటి ఎంతో high traffic ఉన్న అప్లికేషన్లు కూడా వీటిని వాడతాయి అంటే ఇది ఎంత నమ్మకమయినదో అర్థం చేసుకోవచ్చు.

వీటిని వాడడం ఎంతో తేలిక… ఆగండి అప్పుడే అబ్బా చాలా కష్టం అని వినిపిస్తున్నాయి. కొద్దిగా ఓపిక పట్టండి. మీకే తెలుస్తుంది, వీటితో పని చెయ్యడం ఎంత తేలికో.

ఫైన చెప్పిన దాంట్లో మీరు మీకు తగినట్టు అందులో L ని అంటే లినక్స్ ని విండోస్ తో కూడా replace చెయ్యవచ్చు. ( WAMP అవుతుంది 😉 ).

మొదట మీరు వీటన్నటినీ విడి విడిగా ఇన్స్టాల్ చేసి, configure చేసుకోవచ్చు(Apache, PHP, MySQL). కానీ నేను మీకు సులభమయిన విధానం చూపిస్తాను.

మీరు సింపుల్ గా XAMPP అనే పాకేజీ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. విండోస్, లినక్స్, మాక్ అన్నిటికీ విడి విడిగా పాకేజీలు ఉన్నాయి.

అసలు ఇది ఏమిటి అంటే మనకు కావలసిన *AMP stack ఇంకా దానితో పాటూ ఇంకొన్ని యుటిలిటీస్ ని కూడా పాకేజ్ చేసి మనకు అందిస్తుంది అన్నమాట రెడీగా configure చేసి. (మెయిల్, FTP సర్వర్ మొదలయినవి చేర్చి. cgi స్క్రిప్టుల కోసం Perl కూడా ఇందులో చేర్చబడింది). మీరు అసలు ఏమీ చెయ్యనక్కర్లేదు. సింపుల్ గా ఇన్స్టాల్ చేస్తే పని అయిపోయినట్టే.

ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. అసలు నేను php, mysql కాంబినేషనే ఎందుకు ఎంచుకున్నానని. ఒకటి అది ఎంతొ సింపుల్. రెండోది వీటిని base చేసుకుని వచ్చిన Content Management Systems ఎన్నో. అందుకని ఇవి వాడితే మన పని ఎంతో సులువు. మీకు మీరుగా రాసుకోవలసిన అవసరం లేకుండా రెడీ మేడ్ గా ఎన్నో అప్లికేషన్లు దొరుకుతాయి.

సరే ఇక ఇన్స్టాల్ చేసిన తరవాత మీరు విండోస్ వాడుతుంటే గనక సాధారణంగా ఇది C:\Program Files\xampp డైరెక్టరీలో ఉంటుంది. ఇక మీరు చెయ్యవలసిందల్లా మీకు కావలసిన php స్క్రిప్టులన్నీ C:\Program Files\xampp\htdocs అనే డైరెక్టరీలో ఉంచడమే. మీరు ఒకవేళ test.php ని అక్కడ ఉంచారనుకోండి ఒకసారి http://<server ip address>/test.php కి వెళ్ళి అది సరిగా పని చేస్తుందో లేదో చూసుకోండి. సాధారణంగా ఇబ్బందులు ఎదురవకపోవచ్చు. మీకు ఇబ్బంది ఎదురయేది ఒకే సందర్భంలో, అది well known ports అయిన 80 లేదా 8080 పోర్టులలో ఆల్రడీ ఏదన్నా అప్లికేషను రన్ అవుతుంటే. సాధారనంగా అది IIS అవుతుంది విండోస్ అయితే. లినక్స్ అయితే అపాచీ సర్వర్ అల్రెడీ ఇన్స్టాల్ అయుందేమో చూసుకోండి. ఉంటే గనక ఎదొ ఒక దాని పోర్టు నంబర్లు మార్చండి. సరిపోతుంది.

పైన చెప్పిన దానితో మీ సెటప్ పూర్తి అయినట్టే. ఇక మీకు గనక డాటాబేస్ లో చిన్న చిన్న కమాండ్స్ తెలిసుంటే చాలు. అంటే డాటాబేస్ సృష్టించడం, టేబుల్స్ సృష్టించడం, లాంటివి అన్నమాట. అవి తెలీకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే XAMPP లో phpmyadmin అనే mysql మనగెమెంత్ టూల్ కూడా జత చెయ్యబడింది. దానిని మీరు http://<server ip address>/phpmyadmin అనే URL కి వెళ్ళి access చెయ్యచ్చు. దీని ద్వారా మీకు కావలసిన డాటాబేస్ activities అన్నీ GUI ద్వారా చెయ్యవచ్చు.

ఇంకా మీకు ఎమన్నా చిన్న చిన్న tweaks కావాలంటే చేసుకోవచ్చు. ఇంతటితో మీ సెటప్ ముగిసినట్టే.

నేను వాడే ఒక రెండు మూడు అప్లికేషన్స్ ని కూడా పరిచయం చేస్తాను ఈ కింద.

గమనిక: నేను వాడే వన్నీ ఉచితమే . ఇంకా ఎన్నో మంచి, కాంప్లెక్స్ సాఫ్ట్ వేర్ లు లభ్యం కావచ్చు.

బ్లాగ్: బ్లాగ్ ని హోస్ట్ చెయ్యడం కోసం నేను ఉపయోగించే సాఫ్ట్ వేర్ వర్డ్ ప్రెస్. ఇది నా సింపుల్ మెథడాలజీ కి అతికినట్టు సరిపోతుంది. దీనిని ఇన్స్టాల్ చెయ్యడం చాలా సులభం. మీకు కావలసిందల్లా ఒక డాటాబేస్ సృష్టించడం. మీరు phpmyadmin ఉపయోగించి ఒక డాటాబేస్ సృష్టించవచ్చు. తరవాత ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన పేకేజీ ని అన్‌జిప్ చేసి ఇంతకు ముంచు చెప్పిన htdocs లో పెడితే చాలు. పెట్టిన తరవాత http://<server ip address>/<wordpress directory>/wp-install.php కి వెళ్ళండి. అంతే మీ బ్లాగుకు కావలసిన సాఫ్ట్ వేర్ సిద్ధం.

అందుకే దీనికి The Famous 5-Minute Installation అని పేరు.

డిస్కషను ఫోరం: మీకు ఒక యూజర్ ఫోరం తయారు చెయ్యాలంకున్నారనుకోండి. దీనికి PhpBB వంటి సాఫ్ట్ వేర్ వాడవచ్చు. ఇది కూడా php,mysql మీద పనిచేసేదే. మీకు కావలసిన కాటెగరీస్ లో వివిధ ఫోరం లు సృష్టించి అందులో యూజర్లకు Question/Answer టైపు డిస్కషను ఫోరంలను పది నిముషాల్లో సృష్టించవచ్చు. (SMF కూడా మంచిదే.)

కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం: కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం అంటే కంటెంట్ మేనేజ్ చేసేది. మనకు కావలసిన వివిధ రకాలయిన సాఫ్ట్ వేర్లను ఉదాహరణ కి ఫోరం, వికీ, స్టాటిక్ పేజీలు, బ్లాగ్, పోల్స్ మొదలయినవన్నీ ఒకే చోట అన్నమాట. దీని కోసం నేను ఉపయోగించేది drupal. ఇది ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం. ఇందులో పైన చెప్పినటువంటి వివిధ ఫీచర్లు లభ్యం. ఇన్స్టాల్ చెయ్యడం కూడా ఎంతో సులభం. spreadfirefox లాంటి పెద్ద కమ్యూనిటీలు కూడా drupal ని వాడతాయి. (joomla కూడా ఒక మంచి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం.)

వికీ: ఎన్నో రకాలయిన వికీ సాఫ్ట్వేర్లు లభ్యమయినా అందులో నాకు బాగా నచ్చినది wikipedia వాడే mediawiki. నేను ఒక పర్సనల్ వికీ ని ఏర్పాటు చేసుకున్నాను, నాకు తెలిసిన కంటెంట్ ని, సేకరించిన సమాచారాన్ని అందులో పెట్టుకుంటాను. బానే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.

ఫోటో గాలరీ: మీకు ఫోటోలు తీయడం గనక హాబీ అయితే మీరు ఫోటో గాలరీ సాఫ్ట్ వేర్ లు ఉపయోగించవచ్చు. ఇందులో నాకు నచ్చినవి రెండు. ఒకటి కాపర్‌మైన్, ఇంకోటి gallery2. రెండూ అద్భుతమయిన, కస్టమైజబుల్ సాఫ్ట్ వేర్లు.

చూసారా పైవన్నీ ఏర్పాటు చేసుకోవడం ఎంత సులభమో. ఇక మీ సొంత వెబ్ సైట్ కానీ మీ intranet లో మీ సొంత కమ్యూనిటీ ని గానీ సులభంగా ఏర్పాటు చేసుకోండి.