కుబుంటు హార్డీ హెరాన్ …

ఉబుంటు/కుబుంటు మరో సరికొత్త రిలీజుతో ఆకట్టుకుంది. సరికొత్తగా విడుదలయిన రిలీజు పేరు “హార్డీ హెరాన్“.

ఉబుంటు/కుబుంటు గురించి తెలియని వారికి, ఇది ఒక లినక్సు డిస్ట్రిబ్యూషను. డెబియన్ డిస్ట్రిబ్యూషను నుంచి వచ్చినది. ప్రతీ ఆరు నెలల రిలీజుతో “యూజబిలిటీ” మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ దూసుకుపోయే ఒక మంచి డిస్ట్రిబ్యూషను ఇది.
గత కొద్ది ఏళ్ళుగా డేస్క్‌టాప్ పైన విండోసుకి బలమయిన ఉచిత ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఆపరేటింగ్ సిస్టం ఇది.

అన్నట్టు ఇది ఒక ఎల్టీఎస్ (Long Term Support) రిలీజు. అంటే ఒక మూడేళ్ళ వరకూ సపోర్టు ఉండే రిలీజన్నమాట. అదీ ఉబుంటు సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తుందో వాడిన వారందరికీ తెలిసే ఉంటుంది.

ఈ రిలీజుతో పాటు ఎన్నో చక్కని ఫీచర్లు వచ్చాయి. కొన్ని ఈ కింద.

అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది

వుబీ ఇంస్టాలర్: ఎందుకంటారా ? దీని ద్వారా ఇప్పుడు విండోసులోనే ఉబుంటు ని స్థాపించుకోవచ్చు. అంటే మీకు మరో పార్టీషను లేకపోయినా ఫరవాలేదు. మీరు చెయ్యవలసిందల్లా ఈ ఉబుంటు/కుబుంటు సీడీ దొరకబుచ్చుకుని విండోసులో తెరవండి. మీకు ఒక చిన్న విజర్డ్ ని చూపిస్తుంది. దానినుపయోగించి ఉబుంటుని విండోసులో ఒక అప్లికేషనులాగా ఇంస్టాల్ చేసుకోవచ్చు.

ఈ కింది బొమ్మ చూడండి.

ఉబుంటు కి ఎంత స్థలం కేటాయించాలనుకుంటున్నారో చెప్పండి. అంతే. ఒక సారి రీబూట్ అవగానే మీ సిస్టమ్‌ లో ఉబుంటు స్థాపితమయిపోతుంది.
కంప్యూటరు బూటవుతున్నప్పుడు ఉబుంటు/కుబుంటు ఎంచుకోండి. ఝామ్మని వాడెయ్యండి.

ఇప్పుడర్థమయిందా ? నాకెందుకు నచ్చిందో. విండోసు వాడుకదారులని లినక్సుకి మరల్చడంలో ఇదెంతో సహాయపడుతుందని నా నమ్మకం. అంత రూఢిగా ఎలా చెబుతున్నానంటారా ? ఇప్పటికే నలుగురిని ఇలా మార్చా కాబట్టి 🙂 (అందులో మన రానారె ఒక్కడు)

ఇంకా ఈ రిలీజులో కేడీయీ ౪ ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉంది. అదేంటంటారా ? నా ఇంతకు ముందు టపా ఓ సారి చదవండి.

కేడీయీ ౪ సరికొత్త రూపం. కొత్త ప్రయోగం. ఇప్పుడిప్పుడే విడుదలవుతుంది గనుక రఫ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడే ఇలా ఉంటే రేప్పొద్దున్న ఎంత ఎక్సైటింగుగా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.

విడ్జెట్లు, ఎఫెక్ట్లతో తప్పకుండా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే కాంపిజ్ కి చెందిన డెస్క్‌టాప్ ఎఫెక్ట్లు ఇప్పుడు కేడీయీలో సులభంగా ఎంచుకోవచ్చు.

లినక్సు లో ఇంటర్ఫేసు కి హంగులు లేవని అనే వారికి ఇవి చూసిన తరువాత దిమ్మతిరుగుతుంది. కాంపిజ్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్లు మీకు లభ్యమవుతాయో మచ్చుకు ఈ లంకెలో ఉన్న తెరచాపలను చూడండి.

ఇవి కొన్ని ఫీచర్లూ, మార్పులూ మాత్రమే. ఉబుంటు ని స్థిర పరచడానికి, ముందు ముందు చక్కని రిలీజులు చెయ్యడానికి మన కంటికి కనిపించని ఎంతో పని ఈ రిలీజు మీద జరిగింది.

పూర్తి ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ లంకె చూడండి.

అన్నట్టు మీకు తెలియకపోతే ఉబుంటు/కుబుంటు సీడీలు మీకు ఉచితంగా పంపిణీ చెయ్యబడతాయి. ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడకెళ్ళి అడగొచ్చు. అందరికీ పంచగలిగినన్ని సీడీలు తెప్పించుకుని అందరికీ ఇవ్వవచ్చు. అంత వరకూ ఆగలేకపోతే దీనిని ప్రయత్నించి చూడడానికి మీకయ్యే ఖర్చల్లా ఒక్క సీడీ మాత్రమే. ఇక్కడ నుంచి ఐఎస్‌ఓ ని తెచ్చుకుని సీడీ తయారు చేసుకోండి. అంతే.

కుబుంటు ని ఎలా వాడాలో కొత్తగా వాడేవారికి నా ఈ టపా ఉపయోగపడవచ్చు.

మరోసారి జై బోలో కుబుంటు కీ !

విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.

ఎట్టకేలకు నా లాపుటాపు ని కూడా కుబుంటు తో లోడు చేసాను. దానికి ఇన్నాళ్ళు తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి.
మొదటిది మా కంపెనీ వారు లాపుటాపుల మీద లినక్సు ని సపోర్టు చెయ్యరు. వారు చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ కొన్ని అప్లికేషన్ల కోసం విండోస్ కావాల్సిందే. ఎలాంటివంటే “ఐపీ కమ్యూనికేటరు” వంటివి. కాబట్టి రెండూ ఉండేలా “డ్యూవల్ బూట్” చెయ్యాలి.

ఈ క్రమంలో నే పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు సాధ్యమయింది.

ఇది సాధించడానికి నే చేసినవి ఈ క్రమంలో:

నా లాపుటాపు లో ఒకే పార్టీషనుంది. లినక్సు ఇన్స్టాలు చెయ్యాలంటే ఇంకో పార్టీషను కావాలి. కానీ ఫార్మాట్ చేస్తే ఇంతవరకూ విండోస్ లో ఉన్న డాటా, ఇన్స్టాలు చేసిన అప్లికేషన్లూ పోతాయి. అందుకని రీపార్టీషన్ చెయ్యాలి. కానీ డాటా లాస్ కాకుండా. FAT, FAT32 వంటి ఫైల్ సిస్టంలైతే పెద్ద కష్టం కాదు కానీ NTFS కి సపోర్టు తక్కువే.
మొదట కుబుంటు “లైవ్ సీడీ” లో ఉన్న QTParted టూల్ ని ఉపయోగించి రీసైజు చెయ్యడానికి ప్రయత్నించాను. కానీ ఫెయిలయింది. ఎందుకంటే డిస్కు ని నేను దాదాపు ఎన్నో నెలలుగా “డీఫ్రాగ్” చెయ్యలేదు.

* మన హార్డు డిస్కు ఉపయోగించిన కొద్దీ అందులో స్టోర్ చేసే ఫైళ్ళు చెల్లా చెదురుగా పడుంటాయి. ఎందుకంటే కొన్నాళ్ళుగా మనం ఇన్స్టాలు, అనిన్స్టాలు, క్రియేటు, డిలీటు వంటివి మన ఫైళ్ళతో చేస్తుంటాము. కాబట్టి ఫైళ్ళన్నీ హార్డు డికులో అక్కడా ఇక్కడా ఉంటాయి. దానినే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దానిని తొలగించే విధానాన్ని డీఫ్రాగ్మెంటేషన్ అంటారు.

విండోస్ లో డీఫ్రాగ్మెంటు చెయ్యడానికి యుటిలిటీలుంటాయి. విండోస్ తో వచ్చే యుటిలిటీ అంత సమర్థవంతంగా డీఫ్రాగ్ చెయ్యదు. తర్డు పార్టీ యూటిలిటీలుంటాయి ఉదా: jkdefrag, Diskeeper వంటివి.

నేను jkdefrag ఉపయోగించాను. డీఫ్రాగ్ అయితే సమర్థవంతంగా అయింది కానీ అయినా పనిచెయ్యలేదు. ఎందుకంటే MBR, Pagefile వంటి వాటిని అది కూడా డీఫ్రాగ్ చెయ్యలేదు కనక. చివరికి Diskeeper అనే సాఫ్టువేరు ఉపయోగించాను. ఇది బూట్ టైం లోనే డీఫ్రాగ్ చేస్తుంది కాబట్టి వాటిని కూడా డీఫ్రాగ్ చెయ్యగలిగింది.

హమ్మయ్య… ఆఖరికి ఎలాగయితే QTParted ఉపయోగించి పార్టీషను ని రీసైజు చెయ్యగలిగాను. ఒక పది జీబీ స్పేసు తో వేరే పార్టీషను ని సృష్టించాను.

తర్వాతదంతా ఈజీనే. కుబుంటు ఇన్స్టాల్ చెయ్యడానికి అక్షరాలా పదిహేను నిముషాలు పట్టింది. తర్వాత అప్డేట్లు ఒక పది నిముషాలు. కావలసిన ఫైర్ఫాక్సు, థండర్బర్డు మొదలయినవి ఇంకో అయిదు నిముషాలు.

మొట్ట మొదట నాకు కావాల్సింది విండోసు లోని డాటా. అది ఒక్క కమాండు దూరం అంతే. ఆ పార్టీషనుని “మౌంటు” చెయ్యగానే డాటా అంతా లభ్యం. ఇంతకు ముందయితే NTFS కి రీడ్ ఓన్లీ సపోర్టు ఉండేది, కానీ ఇప్పుడు “ntfs-3g” డ్రైవరుని కుబుంటు లో ఇంటిగ్రేటు చెయ్యడంతో రీడ్ రైటు సపోర్టు వచ్చేసింది. అంటే మీ విండోసు డ్రైవు ని కూడా మౌంటు చేసి ఆ స్పేసు ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. (ఇందులో ఉన్న ఒకే చిక్కేమిటంటే ntfs-3g డ్రైవరు విండోసు హైబర్నేటు అయి ఉంటే పని చెయ్యదు.)

ఎలాగూ నాకు కావలసిన ఆఫీసు సాఫ్టువేరు “ఓపెన్ ఆఫీసు” ఇన్స్టాల్ అయే ఉంది. కాబట్టి ఇక కావలసింది మైక్రోసాఫ్టు ఎక్ష్చేంజ్ సర్వరు కి కనెక్టు కావడానికి మెయిల్ క్లైంటు. అవుట్లుక్ కి దగ్గరగా వచ్చే క్లైంటు లినక్సు లో “ఎవల్యూషన్“. అది కాలెండరింగు కూడా సపోర్టు చేస్తుంది.

తర్వాతది మెసెంజరు. పిడ్జిన్ (ఇంతకు ముందు గెయిమ్) ని మించింది ఏది ?

ఇంక నాకు తలెత్తిన సమస్య ఆఫీసు వైరులెస్సు కి కనెక్టు కావడం. మా వైరులెస్సు నెట్వర్కు “EAP-FAST” ఆథెంటికేషను వాడుతుంది. కుబుంటు లో మామూలు అనాథెంటికేటెడ్, లేదా WEP ఆథెంటికేషను సపోర్టు ఉంది కానీ EAP-FAST కి సపోర్టు లేదు. wpasupplicant పాకేజీ ని openssl సపోర్టు తో కంపైల్ చేస్తే పని చేస్తుంది. ఆ పాకేజీని మార్చేంత సీను నాకు లేకపోవడంతో కంపెనీలో ఆ సీనున్న వారితో చేయించి నడపగానే వైరులెస్సు తో కనెక్టయిపోయింది.
(చూసారా “ఓపెన్ సోర్సు” తో లాభాలు. అదే ఏదయినా క్లోస్డ్ సోర్సు ఆపరేటింగు సిస్టమయితే వారు సపోర్టు చేసేదాకా ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడయితే ఎంచగ్గా మనమే సోర్సు మార్చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.)

ఇక తరవాతది వీపీఎన్ ఆక్సెసు. మా కంపెనీ ఉపయోగించే వీపీఎన్ కి vpnc ఉపయోగించి కనెక్టు కావచ్చు. కానీ వీపీఎన్ కి కనెక్టు కావడానికి వన్‌టైము పాస్వర్డు సృష్టించే ఇంకో సాఫ్టువేరు ని జతగా వాడతారు. ఆ క్లయింటు ఏమో విండోసు మీద పనిచేసేది. ఇక దానికోసం వైన్ ఉపయోగించాల్సొచ్చింది. దాని కమాండు లైను వర్షను ఈఎక్షీ కనుగొని దానికి సంబంధించిన రిజిస్ట్రీ ఎంట్రీలను వైన్ కి జోడించడంతో అది లినక్సులో పనిచెయ్యడం మొదలెట్టింది. కానీ ఇక్కడ ఇంకో సమస్య తెలెత్తింది ఏంటంటే ఈ సాఫ్టువేరు ఒక dat ఫైలు ఉపయోగించుకుంటుంది. అది వన్‌టైము పాస్వర్డు సృష్టించిన ప్రతీ సారీ మారుతుంటుంది. మరి నేను దానిని లినక్సు లో వాడితే మరుసటి సారి అది విండోసు లో పని చెయ్యదు ఎందుకంటే ఆ dat ఫైలు సింక్రనైజు అయి ఉండదు కాబట్టి. దానికి నేనేమి చేసానంటే ఇంతకు ముందు మౌంటు చేసిన విండోసు పార్టీషను లో ఉన్న ఆ ఫైలుకి ఒక సింబాలిక్ లింకు సృష్టించాను. కాబట్టి ఇక ఆ dat ఫైలు మారినా సింక్రనైజ్డు గా ఉంటుందన్నమాట.
ఇక అక్కడితో దాదాపు అన్ని సమస్యలూ తీరినట్టే ఒక్కటి తప్ప.

అదేంటంటే ఇంట్లోంచి మీటింగులు అటెండు కావడానికి మేము “ఐపీ కమ్యూనికేటరు” (సాఫ్టు ఫోను) ఉపయొగిస్తాము. కానీ మేము వాడే ప్రోటోకాలు ఓపెన్ కాదు. కాబట్టి దానికి లినక్సు లో క్లయింటు దొరకలేదు. దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం దొరికితే ఇక విండోసు లోకి బూటు చెయ్యాల్సిన అవసరమే లేదు. లేదా కనీసం క్లయింటుని వైను ద్వారా పరిగెత్తించగలిగితే సరిపోతుంది.

అదన్నమాట ఒక ప్రహసనం. ఒక రోజంతా కష్టపడినా సరే మొత్తానికి లినక్సు కి మారిపోవడం చాలా సంతోషాన్నిచ్చింది.

అన్నట్టు ఎవరయినా KDE4 ప్లాస్మా ట్రై చేసారా ? కొత్తగా తయారవుతున్నట్టుంది. మాక్ లాగా డాక్ బార్ అదీనూ… ఆల్రడీ కుబుంటు “హార్డీ” కోసం ఆల్ఫా వర్షను ఇంటిగ్రేట్ అయి ఉంది.